గుత్ప మర్లేసిన బాటల పాటలు

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం – పాట

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ప్రారంభానికి ఈ జూలై 4కు డెబ్బై ఐదేళ్లు. హైదరాబాద్ రాజ్యంలో తెలంగాణ ప్రాంతంలో ప్రజా చైతన్య వికాసానికి, ధిక్కారభావనకు మూలాలు తవ్వినకొద్దీ వెనక్కి వెళ్లగలిగిన ఆధారాలు దొరుకుతున్నాయి గాని ఆధునిక తెలంగాణ చరిత్రలో దానికి ఒక కొండగుర్తు 1857 అనుకుంటే మరొక ప్రధానమైన మలుపు 1946 జూలై 4. అప్పటికి నాలుగైదు దశాబ్దాలుగా విద్యావంతులలో, వర్తకులలో, రైతాంగంలో పెల్లుబుకుతున్న అసంతృప్తి 1946 జూలై 4న కడివెండిలో రైతుకూలీల ఊరేగింపు మీద విసునూరు దేశముఖ్ గూండాలు జరిపిన కాల్పులతో, దొడ్డి కొమరయ్య అమరత్వంతో సాయుధ ప్రతిఘటనా మార్గాన్ని చేపట్టింది. ఆ రోజు నుంచి 1951 అక్టోబర్ 20న కమ్యూనిస్టు పార్టీ అధికారికంగా పోరాట విరమణ ప్రకటించే దాకా గడిచిన ఐదు సంవత్సరాల మూడున్నర నెలలు, దాదాపు రెండు వేల రోజులు తెలంగాణలో ముఖ్యంగా తొలిరోజుల్లో నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఆ తర్వాత క్రమంగా అటు ఆసిఫాబాదు నుంచి ఇటు అమరాబాద్ దాకా తెలంగాణ వ్యాప్తంగా రోమాంచకారి చరిత్ర నిర్మాణమైన రోజులు.

తెలంగాణ రైతాంగ పోరాటం సాధించిన విజయాలు అపూర్వమైనవి. మూడు వేల గ్రామాలు భూస్వామ్య పీడన నుంచి విముక్తమయ్యాయి. భూస్వాముల చెరలో ఉన్న పదిలక్షల ఎకరాల భూమి దున్నేవారికి దక్కింది. ఈ దేశ ప్రజ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎంచుకోవలసిన మార్గమేమిటో తెలంగాణ రైతాంగం చూపింది. అది అప్పటివరకూ భారత ఉపఖండ చరిత్రలో జరిగిన విడివిడి, వ్యక్తిగత, సామూహిక రైతాంగ తిరుగుబాట్లకు ఒక సంఘటిత సైద్ధాంతిక పునాదిని అందించింది. దేశంలో ఆ తర్వాత జరిగిన జరుగుతున్న ప్రజా ఉద్యమాలన్నిటికీ వెలుగు దివ్వెగా నిలిచింది.

పోరాటం జరుగుతున్నప్పుడు పాటలు, కవిత్వం, కథల రూపంలో వెలువడిన తెలంగాణ పోరాట సాహిత్యంలో గడిచిన ఏడు దశాబ్దాలలో ఆ ప్రక్రియలతో పాటు ఆత్మకథలు, అనుభవాలు – జ్ఞాపకాలు, జీవితచరిత్రలు, నవలలు, సామాజిక, రాజకీయార్థిక, చారిత్రక, సాహిత్య విశ్లేషణల రూపంలో రెండు వందలకు పైగా పుస్తకాలు చేరాయి. తెలుగులోనూ, ఇంగ్లిష్ లోనూ సాహిత్యం, అర్థశాస్త్రం, చరిత్ర, సామాజిక శాస్త్రం, రాజనీతిశాస్త్ర శాఖల్లో దాదాపు ఇరవై ఎం ఫిల్, పి ఎచ్ డి సిద్ధాంత వ్యాసాల పరిశోధన జరిగింది. ఆ పోరాట విశిష్టతకు తగినట్టుగా కనీసం ముప్పైవేల పేజీల సాహిత్యం వెలువడి ఉంటుంది.

అయితే ఇంత విశేష కృషి జరిగినా, ఆ పోరాటం గురించి ఇంకా రాయవలసిందీ, విశ్లేషించవలసిందీ ఎంతో ఉంది. కొన్ని రంగాలలో లోతైన పరిశోధన జరిగినప్పటికీ, విశ్లేషణ అలా ఉంచి ఇంకా కనీస సమాచారం కూడ పూర్తిగా అందుబాటులోకి రాని రంగాలు కూడ ఎన్నో ఉన్నాయి. ఒక కచ్చితమైన కాలక్రమ సందర్భ పట్టిక, ఒక సమగ్రమైన గ్రంథసూచి, ఉద్యమం జరిగిన గ్రామాల సంపూర్ణ జాబితా, నాలుగు వేల నుంచి ఆరు వేల దాకా వేరు వేరు అంకెలు చెపుతున్న తెలంగాణ పోరాట అమర యోధుల జాబితా, వారి వివరాలు, ఆ గత ఉద్యమ గమనం గురించి వర్తమాన అభిమాన దురభిమాన ప్రయోజనాలకు అతీతమైన చరిత్ర రచన, ఆ ఉద్యమ ప్రాసంగికత, కనీసం భావి తరాల పరిశోధన కోసం అవసరమైన నిష్పాక్షికమైన సమాచారాన్ని పోగు చేసే కృషి వంటి ఎన్నో పనులు ఇంకా చేయవలసే ఉన్నాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లేవనెత్తిన, లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలను ఇంకా అన్వేషించవలసే ఉంది.

అటువంటి కృషి అసంపూర్ణంగా మిగిలిపోయిన రంగాలలో  తెలంగాణ పోరాట పాట ఒకటి. ఇప్పటికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పాటలను వేరు వేరు సంపాదకులు, ప్రచురణకర్తలు ఐదు సంపుటాలు ప్రచురించినప్పటికీ, రెండు మూడు సమగ్రమైన పరిశోధనలు జరిగినప్పటికీ ఇంకా అప్పుడు పాడుకున్న పాటలన్నీ పుస్తకాలకు ఎక్కలేదనీ, ఇంకా విశ్లేషించవలసిన అంశాలు మిగిలే ఉన్నాయనీ గుర్తించవలసి ఉంది.

తెలంగాణ సమాజం అప్పటికి ప్రధానంగా నిరక్షరాస్య సమాజం. తెలంగాణ రైతాంగ సాయుధపోరాట ప్రారంభానికి ముందు హైదరాబాద్ రాజ్యంలోని ఎనిమిది తెలంగాణ జిల్లాలలో 1941 జనగణన ప్రకారం అక్షరాస్యత 6.8 శాతం, పోరాట విరమణ సమయానికి 1951 జనగణన ప్రకారం అది 9.2 శాతానికి పెరిగింది. ఈ అంకెలు కూడ హైదరాబాద్ – అత్రఫ్ బల్దా జిల్లాలో 19.2 శాతం, 25.2 శాతంగా ఉన్నాయి గనుక మొత్తం తెలంగాణ అంకెలు మెరుగ్గా కనబడుతున్నాయి గాని గ్రామీణ తెలంగాణను మాత్రమే చూస్తే అవి మరీ ఘోరంగా ఉంటాయి. అటువంటి స్థితిలోనే అత్యల్ప సంఖ్యాకులుగా ఉన్న విద్యావంతులు గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో, జిల్లా కేంద్రాల్లో గ్రంథాలయాలు తెరిచారు. పూర్తి స్థాయి గ్రంథాలయోద్యమమే నడిపారు. గ్రామీణ గ్రంథాలయాలైతే నిరక్షరాస్యులకు పత్రికలు, పుస్తకాలు చదివి వినిపించే చైతన్యకేంద్రాలుగా రూపు దిద్దుకున్నాయి. తెలంగాణ సమాజమంతటినీ పట్టి పీడిస్తున్న అసమ భూసంబంధాలు, వెట్టి దోపిడీ, సాంఘిక పీడన సమస్యల గురించీ, ఆ సమస్యలను ఎదిరించే పోరాటం గురించీ ప్రజల అవగాహన పెరిగింది. వెట్టి, దొరల పీడన వంటి నిత్యజీవిత అనుభవం నుంచి భూమి-భుక్తి-విముక్తి పోరాటం అనే సైద్ధాంతిక విస్తరణ ప్రాచుర్యంలోకి వచ్చింది. తమ భూమి ఎన్ని ఊళ్లలో, ఏయే ఊళ్లలో ఉన్నదో కూడ తెలియని, ఎన్నడూ మట్టి పిసకని లక్షలాది ఎకరాల భూస్వాముల చెర నుంచి భూమిని విడిపించి దున్నేవారికే భూమి దక్కాలనే నినాదం తెలంగాణ అంతటా పెల్లుబికింది. ఊళ్లో తమకు కనబడుతున్న దొరలు, వారి మీద మక్తెదార్లు, దేశముఖ్ లు, జాగీర్దార్లు, ఆ పైన నిరంకుశ ప్రభువు, ఆ పైన వలసవాదులు ఈ నిచ్చెనమెట్ల దోపిడీ పీడక వ్యవస్థను కూల్చకుండా తమకు విముక్తి లేదని ప్రజలు భావించారు.

ముందే చెప్పిన నిరక్షరాస్యత ప్రాబల్యం వల్ల ఈ పోరాట అవగాహన నోటిమాట ద్వారా విస్తరించవలసిందే తప్ప రాత ద్వారా కాదు. మాట కూడ కేవలం ఉపన్యాసానికే పరిమితమైతే ఆశిస్తున్న విశాల ప్రయోజనం నెరవేరదు. తప్పనిసరిగా ఆ మాట ఆ ప్రజలకు తెలిసిన, నిత్యమూ శ్రమలో, తీరికలో, వేడుకలో, కలయికలో ఉపయోగిస్తున్న పాట కావాలి. అప్పటికే ప్రజలు తమ నిత్యజీవితంలో పాటలు పాడుకుంటున్నారు. అవి తమ శ్రమను మరిచిపోవడానికి కావచ్చు, వేడుకలో కావచ్చు, ఆ పాటల్లో అంతర్లీనంగా భూస్వామ్య, ఆధిపత్య భావజాలాన్ని, దైవభావనను, మానవాతీతశక్తులను సమర్థించే భావజాలమే ఉండవచ్చు. కాని ఆ మనుషులే, ఆ సహజమైన కవిగాయకులే, వాగ్గేయకారులే, పాటల సృష్టికర్తలే తెలంగాణ రైతాంగ సాయుధపోరాట కార్యకర్తలుగా మారిన తర్వాత వారి పాటలలోకి కొత్త వస్తువు వచ్చి చేరడం మొదలైంది. పాత పాటలు కొత్త పాటలుగా మారాయి. దొరతనాన్ని, దొరపీడనను వివరించే పాటలు, తమ తిరుగుబాటును ప్రకటించే పాటలు, ఆ తిరుగుబాటు నాయకుల అమరత్వాన్ని తలచుకునే పాటలు, ఆంధ్ర మహాసభ రోజుల పాటలు, నిజాం పోలీసు నిర్బంధాన్ని వ్యతిరేకించే పాటలు, యూనియన్ సైనికుల బీభత్సాన్ని వివరించే పాటలు, ఆశయాన్ని ప్రకటించే పాటలు – ఆ ఐదు సంవత్సరాల్లో పోరాటం తిరిగిన మలుపులన్నీ, పోరాటం ప్రవేశించిన గ్రామాలన్నీ, పోరాటం చేపట్టిన సమస్యలన్నీ, ఆ పోరాటాన్ని నడిపిన నాయకులందరూ, పాల్గొన్న ప్రజలందరూ, పోరాటం దరిజేరిన గ్రామీణ గాయకులందరూ ఆ పాటల్లో కనబడతారు, వినబడతారు.

పాటల బాటల మీదనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర పునర్నిర్మించడానికి, లిఖించడానికి కూడ అవకాశం ఉంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పాటల మీద విశేష కృషి చేసిన, పి ఎచ్ డి సిద్ధాంత వ్యాసం రాసిన జయధీర్ తిరుమలరావు తానే 500 పాటలు సేకరించానని రాశారు. ఒక మౌలికమైన పాట ఉండి, గ్రామగ్రామానికీ స్థానిక దొరల పేర్లు, సమస్యలు చేర్చిన పాఠాంతరాలు కూడ ఎన్నో ఉన్నాయి గనుక అంతకన్న ఎక్కువ పాటలు కూడ వెలువడి ఉండవచ్చు.

పన్నెండో ఆంధ్రమహాసభ (1945, ఖమ్మం – చివరిదీ, చీలిక తర్వాతదీ, సాయుధ పోరాట ప్రారంభానికి ముందుదీ) సందర్భంగా ‘ప్రబోధ గేయాలు’ పేరుతో ఒక చిన్న పాటల పుస్తకం వచ్చినట్టు తెలుస్తున్నది. సాయుధ పోరాటం సాగుతున్నప్పుడే ప్రజాశక్తి పత్రికలో కొన్ని పాటలు అచ్చయ్యాయి. అప్పుడే ప్రజాశక్తి ప్రచురణాలయం ఒకటి రెండు చిన్న పాటల పుస్తకాలు ప్రచురించింది. కాని 1951 పోరాట విరమణ తర్వాత కనీస ఆ పోరాట స్ఫూర్తిని నిలిపి ఉంచడానికైనా అప్పటి ఉద్యమ నాయకులు గాని, పార్టీ గాని (1964 తర్వాత పార్టీలు గాని) పాటలను సేకరించాలనీ, సంపుటాలుగా ప్రచురించాలనీ అనుకోలేదు. అసలు పాటల సేకరణ మాత్రమే కాదు, తెలంగాణ పోరాట అనుభవాన్ని తలచుకోవడం కూడ జరగలేదు. వ్యక్తులుగా ఆ కాలపు తమ కవిత్వం, పాటలు అచ్చువేసుకున్న కవులు నలుగురైదుగురున్నారు గాని మొత్తంగా తెలంగాణ పోరాట కవిత్వమూ, పాటలూ మరుగున పడిపోయాయి. తెలంగాణ సాయుధ పోరాటంతో సహా ఆధునిక తెలంగాణ చైతన్య వికాసాన్ని మూడు నవలలుగా రాయదలచిన వట్టికోట ఆళ్వారుస్వామి మినహా పోరాట నాయకులెవ్వరూ ఆ పోరాటం గురించి రాయాలనీ, దాని అనుభవాలు భావితరాలకు తెలియజేయాలనీ అనుకోలేని స్థితిలో దాదాపు ఇరవై ఏళ్లు – 1950లు, 60లు – గడిచిపోయాయి. ఆ ఉజ్వల చరిత్రకు స్వయంగా నాయకత్వం వహించినవారికే అది ఒక మరిచిపోదగిన అనుభవంగా మిగిలిపోయింది. 

నక్సల్బరీ ప్రజ్వలనం జరిగి, ఆ నేపథ్యంలో తెలంగాణ రైతాంగ సాయుధపోరాట అనుభవాలను వర్తమాన పోరాటంతో అనుసంధానించడానికి చండ్ర పుల్లారెడ్డి రాసిన వీర తెలంగాణ విప్లవ పోరాటం 1968లో వెలువడిన మొదటి పుస్తకం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని ప్రకటిస్తున్న నక్సలైట్ ఉద్యమాన్ని విమర్శించడానికి, అప్పటికే ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని పనిలో పనిగా విమర్శించడానికీ హఠాత్తుగా రెండు పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీల నాయకులూ అనుభవాలు, గుణపాఠాలు, జ్ఞాపకాలు, స్మృతులు రాయడం మొదలుపెట్టారు. ఆ సాయుధపోరాట చరిత్ర విస్మరణ – స్మరణ చర్చకు ఇది సందర్భం కాదు గాని, పాటల విషయానికే వస్తే ఆ పదిహేడేళ్లలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పాటల సేకరణ గాని, ప్రచురణ గాని జరగలేదు.

మొట్టమొదటిసారిగా 1972 అక్టోబర్ లో విప్లవ రచయితల సంఘం ‘తెలంగాణ పోరాట పాటలు’ (1946-51 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పాటలు) ప్రచురించింది. ఆ పుస్తకం పైనే మొదటి సంపుటి అన్నారంటే అది ప్రచురించే నాటికే మరొక సంపుటమో, మరికొన్ని సంపుటాలో ప్రచురించాలని నిర్ణయించుకున్నారనుకోవాలి. సంపాదకుల పేరు లేదు గాని ‘ముందుమాట’ అనే ప్రచురణకర్తల నోట్ (వరవరరావు రాసినట్టుంది), ‘వారసత్వం’ అనే ముందుమాట (కెవిఆర్ రాసినట్టుంది) ఉన్నాయి. మొత్తం 42 పాటలు ఉన్న ఈ సంకలనం చివర ‘అమరవీరుల పరిచయాలు’ పేరుతో ఉన్న ఎనిమిది పేజీల వివరణకు చివర తంగిరాల వెంకట సుబ్బారావు అని రచయిత పేరుంది. ప్రచురణ వివరాలు పేజీలోనే “సేకరణ: చార్వాక, ప్రభాకర్, జనసేన, చింజీవి, కె వి రమణారెడ్డి, డాక్టర్ తంగిరాల వెంకట సుబ్బారావు తదితరులు” అని ఉంది.

ఈ పుస్తకం వెలువడి ఏడాది పైగా గడిచాక, 1973 డిసెంబర్ లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన ‘తెలంగాణా పోరాట గేయాలు’ (వివిధ కవుల గేయ సంకలనం) వెలువడింది. 28 పాటలతో ఉన్న ఈ సంకలనానికి కూడ సంపాదకుల పేరు లేదు గాని, ‘పరిచయం’ పేరుతో భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ సమితి కార్యదర్శి తమ్మారెడ్డి సత్యనారాయణ రాసిన ముందుమాట (అందులో కూడ ఆయన “..ఈ మధ్య కొంతమంది అవకాశవాదులు, పదవీకాంక్షాపరులు తెలుగు వాళ్లందరూ ఒక జాతి కాదని, తెలుగు జాతిని రెండుగా చీల్చాలని విచ్ఛిన్నకర ఆందోళనలు లేవదీశారు. కాని అనేక త్యాగాలు చేసి, రక్తం ధారవోసి సాధించిన తెలుగు జాతిని చీల్చడం ఎవరి తరమూ కాదని చరిత్ర రుజువు చేసింది” అని రాశారు), ‘నేను సైతం కవిని అయ్యాను’ అని తిరునగరి రామాంజనేయులు రాసిన పదమూడు పేజీల జ్ఞాపకాలు ఉన్నాయి.

విప్లవ రచయితల సంఘం తన రెండో సంపుటాన్ని జూన్ 1975లో ప్రచురించదలచిందనీ, ఎమర్జెన్సీ విధింపు వల్ల అది సాధ్యం కాలేదనీ నోట్ తో అది జూన్ 1977లో వెలువడింది. ఇందులో 21 పాటలతో పాటు ‘ఈ సంపుటి గురించి’ అనే ఐదు పేజీల ముందుమాట, కెవిఆర్ రాసిన ‘తెలంగాణ పోరాట సాహిత్యం’ అనే 43 పేజీల ముందుమాట (అది 1974 జనవరిలో కర్నూలు విరసం మహాసభలో చదివిన ప్రసంగ వ్యాసం అనే నోట్ తో), తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి పది పేజీల వివరణలు ఉన్నాయి.

1980ల మధ్యలో ‘తెలంగాణ రైతాంగ పోరాటం – ప్రజా సాహిత్యం’ అంశం మీద ఉస్మానియ విశ్వవిద్యాలయ తెలుగుశాఖ నుంచి పి ఎచ్ డి పరిశోధన చేసిన జయధీర్ తిరుమలరావు ఆ పరిశోధనలో భాగంగా విస్తృతంగా క్షేత్ర పర్యటనలు చేశారు. 310 గ్రామాలు తిరిగాననీ, దాదాపు 600 మంది వ్యక్తులను ఇంటర్వ్యూ చేశాననీ, ఆయన సిద్ధాంతపత్రం అచ్చయినప్పుడు రాశారు. ఆ క్షేత్రపర్యటనలో భాగంగా ఎందరో కవులు, గాయకులు పోరాట పాటలు పాడి వినిపించారనీ, అలా మొత్తం 500 పాటలు సేకరించాననీ ఆయన రాశారు. వాటిలో వస్తువును బట్టి ఆరు విషయాలుగా విభజించి 193 పాటలను ‘తెలంగాణ పోరాట పాటలు’ పేరుతో, సాహితీ సర్కిల్ , హైదరాబాద్ ప్రచురణ గా 1990 జనవరిలో వెలువరించారు. ‘త్యాగాల రక్తధారల్లోంచి ఉబికిన ప్రజాబాణీల జీవధాతువులు’ అనే పన్నెండు పేజీల ముందుమాట రాశారు. అంతకు ముందే 1987లో సంకలనం చేసిన ‘ప్రజా కళారూపాలు’లో, 1988లో ప్రచురించిన సిద్ధాంతపత్రంలో కూడ కొన్ని పాటల, కళారూపాల ప్రస్తావన ఉంది. (ఎస్ వి సత్యనారాయణ పి ఎచ్ డి సిద్ధాంతపత్రం ‘తెలుగులో ఉద్యమగీతాలు’ (1991) లో కూడ తెలంగాణ సాయుధ పోరాట గీతాలు అనే అధ్యాయం ఉంది. ‘తెలంగాణ సాయుధ పోరాట సాహిత్యం’ (1999) మీద ఆయనే చేసిన ప్రసంగవ్యాసంలో కూడ తెలంగాణ పోరాట పాటల ప్రస్తావన ఉంది.)

ఆ తర్వాత పదహారు సంవత్సరాలకు 2006 జూలైలో తెలంగాణ రైతాంగ సాయుధపోరాట అరవైయవ వార్షికోత్సవాలు జరుపుతూ ప్రజాశక్తి బుక్ హౌస్ ‘బండెనక బండి కట్టి…’ (వీర తెలంగాణా పోరాట పాటలు) ప్రచురించింది. 85 పాటలున్న ఈ సంకలనంలో ‘మనవి’ అని తెలకపల్లి రవి రాసిన రెండు పేజీల ముందుమాట, ఆరుద్ర రాసిన ‘తెలంగాణా సమర సాహిత్యం’ అనే 22 పేజీల ముందుమాట ఉన్నాయి.

ఈ ఐదు సంకలనాలూ కలిపితే మొత్తం 369 పాటలు అచ్చుకెక్కాయనిపిస్తుంది గాని, కొన్ని పాటలు అన్ని సంకలనాల్లోనూ ఉమ్మడిగా ఉన్నాయి. కొన్ని కవితలు కూడ పాటలుగా లెక్కించారు. కనుక మొత్తంగా ఇప్పటికి పుస్తకరూపంలో వచ్చిన పాటలు 250-300 కావచ్చు. పుస్తకాల్లోకి రాకుండా పత్రికల్లో మిగిలిపోయినవీ, విడిగా ఆయా కవుల సంపుటాల్లో వచ్చినవీ మరొక యాబై పాటలు ఉండవచ్చు. అయినా ఇంకా సేకరించవలసినవీ, పుస్తకరూపంలో తేవలసినవీ రెండు వందలైనా ఉంటాయి. ఇప్పటికే తెలంగాణ రైతాంగ సాయుధపోరాటంలో పాల్గొన్న తరం గడిచిపోయింది. ఇంకా సజీవంగా ఉన్నవారు ఎనబయ్యో పడి చివరిలోనో, తొంబయ్యో పడిలోనో ఉండి ఉంటారు గనుక వారి జ్ఞాపకాల మీద సేకరణ కష్టం కావచ్చు. అలా మిగిలిన పాటలు దొరికే అవకాశం ఇక లేదనుకున్నా, ఇప్పటికి ఈ ఐదు సంపుటాల్లో వచ్చిన పాటలనైనా సమగ్ర విశ్లేషణ చేయవలసే ఉంది. పోరాట చరిత్ర పునర్లేఖనానికి ఈ పాటల బాటలను ఉపయోగించుకోవలసే ఉంది.

*

ఎన్. వేణుగోపాల్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు