గుడి లైటు

తమిళ మూలం:టి. జానకిరామన్

            తెలుగు:దాము

మిళులు తీ.జా. అని ప్రేమగా పిలుచుకొనే టి.జానకిరామన్(1921-1982)తమిళ సాహిత్యంలో వొక ముఖమైన రచయిత. ఆయన్ను ఫెమినిస్టు రచయిత అని కూడా కొందరు పిలుస్తారు. 1940ల, 50ల నాటి సమాజంలో స్త్రీ పరిస్థితుల్ని తన రచనల్లో విమర్శనాత్మకంగా పరిశీలించి, వారి పట్ల వున్న వివక్షతని బలంగా ప్రశ్నించారు. ఆయన రచనల్లోని స్త్రీ పాత్రలు యమున, అలంకారమ్మళ్, స్వర్ణాంబ వంటివి తమిళ సాహిత్యంలో, సంస్కృతిలో స్థిరంగా నిలచిపొయాయి.

ఆయన తంజావూరు జిల్లాలో దేవన్‌కుడి గ్రామంలో వొక తమిళ బ్రాహ్మణ (అయ్యర్) కుటుంబంలో జన్మించారు. చాలా కాలం వుపాధ్యాయులుగా పని చేసి తర్వాత వొక సివిల్ సర్వెంట్‌గా పదవీ విరమణ చేశారు.

ఆయనా 10 నవలలు, 6 నవలికలు, 140కి పైగా కథలు, నాటికలు, యాత్రా కథనాలు, వ్యాసాలు రాశారు. ఆయన నవలలు మోహ ముల్(మోహ ముల్లు), మర పశు(కొయ్య ఆవు),అమ్మా వంధాల్(అమ్మ వచ్చింది)వంటివి యిప్పటీకీ ఆదరణ పొదుతున్నాయి. మొహ ముల్లు సినిమాగా కూడా వచ్చింది. ఆయన రచనలు ఇంగ్లీషుతో సహ అనేక భాషల్లోకి అనువాదమయ్యాయి.

జెక్లోస్లొవేకియాకు చెందిన ప్రముఖ తమిళ స్కాలర్ కమిల్ జ్వెలెబిల్(Kamil Zvelebil)’జానకిరామన్ వొక వాస్తవ వాద, మానవ వాద, అభ్యుదయ వాద రచయిత’ అని చెప్పాడు.

ప్రస్తుతం తీ.జా.శతజయంతిని తమిళనాడు ప్రభుత్వం, ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు.

*

 ఠాత్తుగా నా కళ్ళకు గంతలు కట్టినట్టుంది. అంత చీకటి. ఇప్పటి దాకా తూర్పు వీధి వెలుతురులో వున్నానేమో, వున్నట్టుండి కమ్ముకొన్న చీకటి వొక గుహపు చీకటిలా నా కాళ్లను చుట్టుకుంది. వీధినంతా వెలిగించే గుడి మీది మెర్క్యురీ లైటు వెలగడం లేదు. నక్షత్రాల మసక వెలుతురులో గుడి గోపురం చీకటి స్థంభంలా నిటారుగా నిలచి వుంది.  గుడి చుట్టూ వలయంలా వెలిగే బల్పులన్నీ ఆరిపోయి వున్నాయి. బహుశా గుడిని మూసేసినట్టున్నారు. యే వీధి కుక్క మీదయినా కాలు పెడతానేమోనని భయపడుతూ మా ఇంటి గుమ్మం ముందుకెళ్ళాను.

ఎదురింటి వసారాలో వొక గొంతు వినబడుతోంది, “పూజ లేకపోతే గుడిని మూసేశారంటే అర్థముంది. కానీ, గుడి లైటును కూడా ఆర్పేయాలా?”

“పంచాయితీ వాళ్ళని అడిగే నాథుడే లేదు. వీధికి వుండేదే ఒక బల్పు. అది కూడా ఫ్యూజు పోయి వారమైంది, పట్టించుకునే నాథుడే లేదు.” అని దిగువ ఇంటి  వాకిలి నుండి నాటు వైద్యుడి గొంతు వాపోతున్నది.

“గుడి బల్పు కూడా ఫ్యూజు పోయి వుంటుంది. ఆ పంచాయితీ బల్పు నా మొగుడు కూడా పనికి పోతున్నాడు చూడు అన్నట్టు మిణుకు మిణుకుమంటుంది. పగటి పూట వెలిగే చంద్రుడి లాగా. ఈ దినం సూర్యుడే కనిపించకుండా పోయాడు. గుడి మేనేజరు లైటార్పకుండా వుండాల్సింది. యెవరైనా వచ్చి చెప్పనీ చూద్దాం అని చూస్తున్నాడేమో…”

ఆ ‘యెవరైనా’కు అతను తప్ప యింకెవరైనా అని అర్థం. యీ అల్పమైన విషయానికి మేనేజర్‌ను కలిసే బాధ్యతను అతను నెత్తికెత్తికోడు! నాటు వైద్యుడు అతనికంటే పెద్ద మనిషి. నాటు వైద్యం అతనికి కాలక్షేపం. శునస్సేపుడ్ని నేనున్నా కదా? నాకు ఇంతకంటే యింకేం పని? చూస్తే పోలా?

సాయంకాల పూజ సమయం. గుడిలో మేళం, శంకు, వాయిద్యాలతో మారుమోగాల్సిన సమయం. యీ రోజు నిశ్శబ్దం తాండవిస్తూంది. యెవరైనా టికెట్ తీసుకున్నారా?

తలుపు తట్టాను. గౌరి తీసింది.

“గుడి యెందుకు మూసేసుంది?”

“విశేషం వుంది కాబట్టే” అంది తలుపు గొళ్ళెం పెడుతూ.

“యేంటి…?”

“తేరు వీధిలో యెవరో చనిపోయారంట.”

“యెవరంట?”

“యింకెవరు? మీ కథానాయికే.”

“నా కథానాయికా? అట్లా యెవరూ లేరే!”

“చనిపోయినాకే కదా యిట్లాంటి మనుషులంతా మీ కథల్లో కథానాయికయ్యేది?”

“యెట్లాంటి మనిషి?”

“ధరుము లాంటి”

“ధరుము యెవరు?”

” దుర్గమ్మ దగ్గర వరం అడిగిందని చెప్పారే, ఆ ‘జిల్ ‘లే”

“ఆ! ఆమెనా!”

“యేంటి మూర్చ పోయారా?”

మూర్చ పోయే సంగతే యిది… ధరుమా చనిపోయింది? మొన్న కూడా గుళ్ళో చూశానే. నన్ను చూడగానే సిగ్గుతో, భయంతో గబ గబా నడుచుకుంటూ వెళ్ళిపోయింది! యిప్పటికీ కళ్ళముందున్నట్టుంది.

“మొన్న రాత్రి కూడా గుళ్ళో చూశానే?”

“చూస్తే యేంటి? నాలుగు గంటలకు చూసినోళ్ళను నాలుగుంపావుకు చూడలేము. ఠక్కున పడి ప్రాణాలు విడుస్తున్నారు.”

“జబ్బేంటి?”

“యేం జబ్బు వుంటుంది యిలాంటి దానికి? పాములాడించే వాడికి పామే యముడు. పులిని ఆడించే వాన్ని మింగేది పులే.”

నేను చేష్టలుడిగి పోయి కూర్చుండి పోయాను. ధరుము బక్క పల్చటి రూపం కళ్ళముందు నీడలా ఆడుతూ వుంది.

మొన్న సాయంకాల పూజ పూర్తయ్యాక, గుడికి వెళ్ళినప్పుడు, ఆమె ధగ ధగా మెరిసిపోతూ సాన పెట్టిన కత్తిలా నడచిపోతూ వుంది. గుడి నిర్జనంగా వుంది. నేను గుడి లోపలికి అడుగు పెట్టగానే, వెలుపలి ఆవరణo నిర్మానుష్యంగా దర్శనమిచ్చింది.

నంది విగ్రహం దగ్గర నడిఝాము పూజ కోసం ఎదురు చూస్తున్న యిద్దరు ముసలమ్మలు నిద్ర ముఖాలతో కునికిపాట్లు పడుతూ కూర్చొని వున్నారు. బోడి గుళ్ళను చెంగుతో కప్పుకొని వున్నారు. వెలిసి పోయిన తెల్ల చీరలు. నెత్తిన విబూది. కృషించి పోయి, పళ్ళు కనిపిస్తున్న ముఖాలు. ముడతల చర్మం. ఆకలితో కడుపులు యెండబెట్టుకొని దేహాల్ని శుష్కింప చేస్తున్నారేమో. లేకపోతే, యాభై యేళ్ళు నిండకుండానే వాళ్ళెందుకిలా కునికిపాట్లు పడుతున్నారు? యింత అలసట, నిస్సత్తువ యెందుకొస్తుంది?

మనిషి పుటక పుట్టి, ఆవగింజంత సుఖం కూడా చవి చూడని జన్మలు యిద్దరివి. వయసుకు రాకముందే విధవలైపోయారు. పరస్పర సానుభూతిలో నుంచి యిద్దరి మధ్య వొక స్నేహం. యిద్దరూ కలిసే వస్తారు, కలిసే పోతారు. ప్రేమలూ ద్వేషాలూ లేని మోడువారిన చెట్లు. భావోద్వేగాలు మతిమరుపులోకి  మాయమైపోయాక, కాటికి కాళ్ళు చాచి, చావు కోసం యెదురు చూస్తున్న వృద్ధ నారులు.

వాళ్ళని దాటీ దాటగానే, శివుడి విగ్రహం దగ్గర నిల్చున్న ధరుము కన్పించింది. “నీ కంటే ఈ ముసలమ్మలిద్దరూ యెంతో అదృష్టవంతులు. వాళ్ళకు విధవలయ్యే భాగ్యమన్నా దొరికింది. నువ్వు వట్టి సుమంగళి కట్టెవి.” అని ధరుముని చూసి నా హృదయం విలపించింది.

నేను లోపలికి అడుగుపెట్టగానే, తల తిప్పి నన్ను చూసింది ఆమె. వెంటనే బాధనీ, సిగ్గునీ వొక చిరు నవ్వులో దాచేసి, ఆ చోటు నుంచి చర్రున వెళ్ళిపోయింది. ముడివేసిన జుత్తు విడివడి మెడ వెనుక పరుచుకున్నాయి వెంట్రుకలు. రెండు ముంగురులు ఆమె నుదుటి మీద పడి, ఆమె నడుస్తుంటే గుమ్మడి పాదులోని నులి తీగల్లా నాట్యం చేస్తున్నాయి.

ఆమె నలుపే కానీ, కారు నలుపు కాదని చెప్పచ్చు. పొడవాటి శరీరం. చేతులకు నాలుగైదు జతల నీలమూ కాషాయమూ కలిసిన రంగుల రబ్బరు గాజులు. మెడలో బంగారు పూత పోసిన గొలుసు. పూత వెలిసిన చోట అది జిగేలుమని మెరుస్తూంది. పూల పూల వాయిలు చీర. బంగారు రంగులో తళ తళ మంటూ, చేతికి మెత్తగా తగిలే పట్టు రవికె. ఆమె యావత్తు దేహం వొక కొత్త మెరుపుతో నిగనిగలాడుతూంది.

ఆమె నన్ను చూసి సిగ్గుతో పారిపోవడానికి ఒక కారణముంది. రెండు నెలలకు ముందు సాయంకాల పూజ తర్వత గుడికి వెళ్ళినప్పుడు జరిగిందది. ప్రాకార ప్రదక్షిణం కోసం వెళ్ళాను. దుర్గమ్మ విగ్రహం ముందు నిలబడి ఈ ధరుము యేడుపు గొంతుతో వేడుకొంటూ వుంది. నా రాకను గమనించలేనంత దుఃఖం ఆమె మనస్సునూ, ఇంద్రియాల్నీ కమ్మేసిందనుకుంటాను.

“యీశ్వరీ, రెండు రోజులుగా కడుపు కాలిపోతూంది. యీ రోజైనా కళ్ళు తెరచి చూడు. ధారాళమైన మనస్సున్న ఒక్కడ్ని పంపించచ్చు కదా?” అడుగుతూనే వుంది. రెండు నిమిషాల తర్వాత గబుక్కున నన్ను చూసి యేమీ తోచక నిలబడి పోయింది. యేం చేయాలి? నేనేం కావాలని వినలేదే?

“యీశ్వరీ, మా చెల్లెల్ని కాపాడు. ధారాళమైన మనస్సున్న ఒక్కడ్ని చూసి దానికి ముడిపెట్టు తల్లీ” అని తత్తరపాటుతో ప్రార్థన ముగించింది. యిదే నిజమైన వేడుకోలు అయితే, గొంతులో ఆ వణుకెందుకు? అలా భయపడి పారిపోవడం యెందుకు?

“మహిషాసురుడ్ని మర్ధించిన నాకు ఈ వుద్యోగం కూడానా? ఈ ప్రార్థనను ఆమోదించేద్దామా? చివర్లో చెల్లి గిల్లి అని చెప్పింది నిన్ను యేమార్చడానికే, నన్ను యేమార్చడానికి కాదు…కానీ, నువ్వు కూడా యేమార లేదు కదా?”

నా హృదయం నొప్పితో కుమిలిపోయింది. కోపం పొంగింది. యెవరి మీదో తెలియదు. గొంతు పూడుకపోయింది. బయట ఈ వేడుకోలు గురించి యెవరూ పట్టించుకున్నట్టు లేదు. దుర్గమ్మ ముందు వెలుగుతున్న దీపం నిశ్చలంగా జ్వలిస్తూంది. దక్షిణామూర్తి మౌనముద్ర దాల్చాడు. గుడి మేనేజర్ వీటన్నిటికీ అతీతంగా లెక్కలు చూసుకుంటున్నాడు. ఆయన తలకు పైనున్న పంజరంలోని చిలుక కళ్ళు మూసుకొని తపస్సు చేస్తూ వుంది.

యింటికొచ్చి, గౌరీతో చెప్పాను.

“దేవత మంచి బుద్ధి యిస్తుంది, జ్ఞానం యిస్తుంది, వివేకాన్నిస్తుంది. యిప్పుడు, యిది కూడా యిస్తుందని తెలుస్తూంది.” అని నా ఆందోళనను యెగతాళి చేసింది గౌరి.

“యేం? యివ్వకూడదా?”

“యివ్వచ్చనే చెబుతున్న. యే కార్యానికైనా దైవ బలం కావాలి. దొంగకు కూడా వొక దేవుడుంటాడు. అదే విధంగా వేశ్యలకు కూడా వొక దేవుడు వుండొద్దా? మంచి వాడిని చూసి తీసుకొచ్చి యివ్వమంటే, ఆ దేవత యివ్వాల్సిందే కదా?”

“ఆ పిల్ల యేడుస్తూనే వేడుకొంది. కొంచెం మనసు లోపల వేడుకోవచ్చు కదా? తనకు తెలియకుండానే బాధను తట్టుకోలేక యేడ్చేసింది. అది నా చెవిలో పడి, నీ చెవిలోనూ పడి నవ్వులాటగా మారాలని వుందేమో”

“మీరొచ్చేది చూసి పైకి వేడుకొందో యేమో?”

“అట్లా వుండుంటే విషయం నీ దాకా వచ్చేదా యేంటి?”

“భేష్! అంతటి ఘనులా తమరు? నిజమేలే. మీది ధారాళమైన మనసే. చేతిలో డబ్బు మాత్రమే లేదు. అందువల్లే కదా సానుభూతి యిక్కడికొచ్చి జలపాతం లాగా దూకుతూంది!”

“యింక చాలు. నీ మాటలు అవసరం లేదు. మంచీ చెడూ లేకుండా యేం మాటలవి?”

“యెవరా పిల్ల?”

“యెవరో తెలియదు. నల్లగా, పొడుగ్గా, రింగుల జుత్తుతో వుంది. ముఖం కళగా వుంది…”

“నల్లగా, పొడుగ్గానా!”

“అవును”

“పళ్ళు కొంచెం వంకర టింకరగా వుంటాయా?”

“యేమో. పళ్ళని నేను చూళ్ళేదు.”

“యెవరయి వుంటాది? తమాషాగా వుందే!”

“అప్పుడప్పుడూ మన యింటి ముందు నుంచి కూడా వెళ్తుంటుంది.”

మరుసటి రోజు ఆ అమ్మాయి యింటి ముందు నుంచి వెళ్తోంది. వెంట వాళ్ళమ్మ పోతూ వుంది. వెంటనే గబ గబా గౌరిని పిలిచాను. గౌరి వచ్చేలోగా కిటికీ దాటి వెళ్ళిపోయారు. బయటికెళ్ళి చూడమన్నాను.

ఒక నిమిషం తర్వాత గౌరి వచ్చింది.

“యిదా? చాలా చెడ్డ పేరుంది యీ పిల్లకి. దీనికోసమా యింత మొత్తుకుంటున్నారు?”

“యెవరది? నీకు తెలుసా?”

“తెలిసేదేంది? చెరువు, చౌరస్తా, అంగడి వీధి-యెక్కడ చూసినా ఆ పిల్లే నిలబడి వుంటాది. వొక వేళా పాళా లేదు. మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు. అపకీర్తి నెత్తికెత్తుకున్న కుటుంబం.”

“అది కనిపిస్తూనే వుందిలే. ఆ పిల్ల యెవరని అడిగాను”

” యెవరంటే? మునక్కాయంటే మునక్కాయే- యే వూరు? యే తోట?-యివన్నీనా అడుగుతారు?”

” యిది మునక్కాయ్ అంటావ్?”

“అవును. మునక్కాయే. కావాలంటే మీరు పోయి తెలుసుకోండి. యీ చెత్తంతా రాసి మీరు డబ్బు చేసుకోవాలనుకుంటారు కదా? అందుకే కదా శీను మామ వున్నాడు? పుకార్ల ఆఫీసరు. ఆయన్నడిగితే చెప్తారు.”

నాలుగైదు రోజుల తర్వాత, శీను అయ్యర్ అంగడిలో కూర్చిని వున్నపుడు, ఆ తల్లీ కూతురు వొకరి వెనుక వొకరు పోతుంటే, చూపించి అడిగాను.

“యెవరు సార్ వీళ్ళు?”

“దక్షిణపు వీధిలో వుంటారు. ఒక ‘సరుకు’లే!”

”అట్లంటే?”

“నేను నేరుగా చూళ్ళేదు సార్. చెప్పుకుంటారు.”

“యేం చెప్పుకుంటారు?”

“ఒకటంటే పది చెప్తుంది వూరు-నేను మాత్రం యేదీ తెలుసుకోకుండా చెప్పను.”

“మీరింకా యేమీ చెప్పలేదే?”

“యేమి చెప్పాలి? అంతా ‘అదే’ కదా. యింకేముంటుంది?”

“అదే అంటే యేది?”

“మంత్ర సామా అని ఒకాయన వుండే వాడు. పంచాంగం చూడటంలో దిట్ట. అంత మంచోడేం కాదు. కానీ, సహాయం కూడా చేసే వాడు. లోతు పాతులు తెల్సినోడే. మంచి మాటకారి. ఆర్భాటానికి మాత్రం తక్కువ లేదు. మిల్లు కోమటి శెట్లకు అతడి మాటంటే వేద వాక్కు. ఆయన కూతురే ఈ పిల్ల. ఆ ‘విడో’ ఆయన భార్య.

ఆయన జోస్యం చెప్పాడంటే అదింక ఋషి వాక్కే. ఫలానా సంవత్సరం, ఫలానా నెల, ఫలానా తేదీ, ఫలానా సమయానికి యిది జరుగుతుందని బ్రహ్మాండాన్ని నెత్తి మీద పెట్టుకున్నట్టు చెప్పేవాడు. వొక క్షణం కూడా తేడా లేకుండా ఆయన చెప్పినట్టు జరుగుతుంది. ఈ కావేరీ నది ఎగువకైనా పారుతుందేమో కానీ, ఆయన చెప్పేది తప్పనే తప్పదు.

పాము కాటుకూ, తేలు కాటుకూ మంత్రం వేస్తాడు. పాము కాటు పడిన మనిషి నొప్పితో ఆకాశానికీ భూమికీ మధ్య గంతులేస్తూ వస్తాడు. ‘తేలు కాటేసిందా? యేంటీ? నిజంగానే తేలు కాటేసిందా?’ అని నవ్వుతూ అడిగే వాడు సామా. ‘బాగయిపోయిందే. యెక్కడ కాటేసిందని కూడా తెలియడం లేదు’ అని వచ్చినోడు తిరిగి వెళ్ళి పోతాడు. సామా దెయ్యాల్ని కూడా వదిలించే వాడు. అతని నడవడికే కొంచెం బాగుండదు. పూర్వీకుల ఆస్తి ఒకటిన్నర ఎకరా సర్వ హక్కుల మాన్యపు భూమి వుండేది. అంతా హారతి కర్పూరం చేసేశాడు.

నలభై యేళ్ళ వయసులో వున్నట్టుండి పక్షవాతం వచ్చి ఒక వైపు శరీరం పూర్తిగా చచ్చుపడి పోయింది. యేడేళ్ళు మంచం దిగ లేదు. భోజనానికి కష్టమైంది. బ్యాంకులో నాలుగు వందలో, ఐదు వందలో వేసి వుంచాడు. ఇప్పుడు పోయిందే, ఆ పిల్ల పెళ్ళికి ఖర్చయిపోయినాయి. యేం చెయ్యాలి? తినాలి కదా? ఆయన బతికున్నప్పుడే భార్య యీ పని మొదలు పెట్టింది.

యీ పిల్ల మొగుడికి పెళ్ళయిన నాలుగు నెలలకి విషయం తెలిసింది.  అప్పుడు వాళ్ళ కాపురం మధురైలో. విషయం తెలియగానే, ఈ పిల్లని తన్ని తరిమేశాడు. తల్లి అలా వుంటే పిల్ల యేం చేస్తుంది? అప్పుడంతా ఈ పిల్ల మచ్చ లేకుండానే వుండింది.

మొగుడు లేకుండా వచ్చి చేరిన కూతుర్ని తల్లి యిందులోకి దింపింది. యేడెనిమిది మంది పిల్లలు. చాలని దానికి ఇంట్లో ఈ విడో ముసలి తల్లి. యేం చెయ్యాలి? వొక క్లబ్బులో యిద్దరూ పిండి రుబ్బే వాళ్ళు. వొక రోజంతా రుబ్బితే యెనిమిదణాలు దొరకడమే గగనం. పది మంది వుండే కుటుంబం. వొక రూపాయితో రోజంతా గడపడం అయ్యే పనేనా? యిట్లానే బతకాల్సి వచ్చింది. యెట్లా వున్నారో యెవరు చూసొచ్చారు? చెబితే వినడమే. నేనేమో ఖచ్చితంగా తెలుసుకోకుండా చెప్పే రకాన్ని కాదు.” మళ్లీ అదే ముక్తాయింపుతో ముగించాడు శీను మామ.

“యెంత కష్టం!”

“కష్టమే. అయినా నగా నట్రా, పొలం పుట్రా వుంచుకొని వూరు నవ్వాలని వీళ్లేమీ చెడిపోలేదే? పెద్దింటి సమాచారం తెలుసా లేదా నీకు?” అని తనకు పడని యెవరి గురించో చెప్పడం మొదలు పెట్టాడు శీను.

“అలా కొవ్వు పట్టి ఎగురుతుండారు. వాళ్ళనడిగేదెవరు? వొక్క నాధుడూ లేదు. డబ్బు అన్నిటినీ ప్రాయశ్చిత్తం చేసేస్తుంది. వీళ్ళ మాదిరిగా నాధుడు లేకుండా, తినడానికి లేకుండా దొరికిపోతే మాత్రం అంతే సంగతులు. కట్టుబాట్లు, ఆచారాలు అన్నీ వీళ్ళకే వుండాలంటారు. సామా వున్నపుడు జోస్యం జోస్యం అని యింటి ముందే పడుండే వారు. యెక్కడ తిరుచిరాపల్లి, యెక్కడ మధురై, యెక్కడ కడలూరు-అన్ని వూర్లనుండి పెద్ద పెద్దోళ్ళంతా వచ్చి కాచుకొని వుండే వాళ్ళు. కార్లు, గుర్రపు బళ్ళు నిలబెట్టి వుండేవి. వ్యాపార్లు, మిరాశీ దార్లు-చిన్నోళ్ళు కాదే యెవరూ! అట్లా బతికినోడు. చివరికి, చెప్పలేం అది- అంత కష్టాన్ని అనుభవించాడు. అది చాలదని వీళ్ళిప్పుడు నవ్వుల పాలవుతున్నారు. వూర్లో వొక్కరికి కూడా వాళ్ళతో రాకపోకలు లేవు. ఆ యిల్లు మాత్రమే వుంది. అది కూడా యెప్పుడు యెవరి తల మీద కూల్దామా అన్నట్టుంది.

సామా వున్నప్పుడు అగ్రహారంలోని ఇళ్ళల్లో దోసెకూ, ఇడ్లీకి పిండి రుబ్బిచ్చే వాళ్ళు. వొక పెళ్ళో, ఇంకో కార్యమో వస్తే, వీళ్ళెల్లి ఇడ్లీలు చేసే వారు. అప్పడాలు కాల్చే వారు. యిలా యేదో ఒక పని చేస్తుండే వారు. అయితే ఆమె వొక ‘సరుకు’ అని తెల్సిపోయిందో యేమో, అంతా ఆగిపోయింది. వొక ఇంట్లో కూడా పొయ్యి ముట్టించడానికి పిలవలేదు. అంగడి వీధిలోని హోటల్లోనే పని చేస్తున్నారు…”

వూహించలేదు నేను. ఆయన మనస్సునే కరిగించిందంటే, నిజమే కరిగించ గలుగుతుంది.

ఆయన చెప్పింది నిజమే. గౌరి చెప్పింది కూడా నిజమే. వూహించని చోట్లల్లో ఆ పిల్లను చూసి మనసు వికలమవుతోంది. రాత్రి తొమ్మిది గంటలకి జన సంచారం లేని వీధిలో పోతూ వుంటుంది. పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ కానిస్టేబిల్‌తో మాట్లాడుతూ వుంటుంది. తమల పాకులు అమ్మే వాడితో నవ్వుతూ వుంటుంది. రాత్రి పూట తేరు పక్కన కారు చీకట్లో నిలబడి వుంటుంది. బాడుగ కార్ల షెడ్డు ముందు నిల్చొని మాట్లాడుతూ వుంటుంది.

గౌరితో చెప్పాను.

“గౌరవం యెక్కడ? మర్యాద యెక్కడుంది దీన్లో? ఆడ జన్మ. యెన్ని రోజులు వెతుక్కుంటూ వస్తారు? మొదట్లో అలానే వుంటుంది. యిప్పుడు ఈ పిల్లే వెతుక్కుంటూ పోయే కాలం వచ్చింది. లేదంటే యిలా సందుల్లో గొందుల్లో నిలబడుతుందా? యింక అంతా వేగంగా అయిపోతుంది. జబ్బు, ఆసుపత్రి, బిచ్చ మెత్తుకోవడం, సత్రం తిండి-ఎంతని తట్టుకుంటారు? దుర్గమ్మ దగ్గరికే వచ్చి బతుక్కోసం వేడుకోవాల్సి వచ్చింది.”

“ఎలాగూ అడిగింది కదా, అడిగేదేదో డబ్బు కావాలి, కష్టాలు తొలగిపోవాలని వేడుకోవఛ్చు కదా, మంచి వాడ్ని చూసి తెమ్మనా అడిగేది?”

“ఆమె పని చేసుకొని బతుకుతోంది. వొక పని కూడా చేయకుండా తటాలుమని డబ్బొచ్చి పడిపోవాలనుకునే మన రకం కాదు. యేదైనా యిస్తేనే, యీ లోకం నుంచి యేదైనా తీసుకొని తినడానికి మార్గం చూసుకోవచ్చని అనుకుంటారు వాళ్ళు. తెలిసిందా?”

“యేంది తెలిసేది? యిది వొక పనా?” గౌరి సామర్థ్యాన్ని చూసి నాకు ఆశ్చర్యం వేసింది. గడప దాటకుండానే సమాచార గని, అభిప్రాయాల నిధిగా ఎలా అభివృద్ధి చెందింది?

“యింక అంతా వేగంగా అయిపోతుంది…”

కానీ, యింత వేగంగా అంతా ముగిసిపోతుందని నేను అనుకోనే లేదు.

భోజనం ముగించి అడిగాను, “యేం జబ్బు ఆమెకు?”

“ఆ కడుపు మంట యెందుకడుగుతారు! మూడు నెలల గర్భం అంట..”

మొన్న రాత్రి ఆమెను గుళ్ళో చూసింది మెరుపు లాగ నాకు గుర్తొచ్చింది. చర్మంలో, శరీరంలో నుంచి వుబుకుతూ కనులకింపుగా కనిపిస్తున్న కొత్త కాంతి గుర్తొచ్చింది. అరకొర ఆహారంతో, పరువం కోల్పోయిన ఆరేళ్ళ తర్వాత రావాల్సిన మెరుపు కాదు అది. మాతృత్వపు వెలుగు. కడుపులో పెరుగుతున్న బిడ్ద వెలుగు, వొక సంధ్యారుణ తేజస్సు. అదిప్పుడు నన్ను తాకి తలకిందులు చేస్తూ వుంది.

“ఆ పిల్ల తల్లి వుందే-ఆమె డాక్టరు దగ్గరికి పోయి అడిగిందంట. ఆ పాపాత్ముడు యాభై రూపాయలు అడిగాడంట. చివరకు, యింటి తలుపులన్నీ మూసేసి ఆ కన్న తల్లే ఆ పిల్ల నోట్లో గడ్డి, గుడ్దలు, యేవేవో కుక్కి సొంత వైద్యం చేసిందంట. అట్టనే అరవ లేక, కనీసం మూలగ లేక వూపిరి ఆగిపోయిందంట. అట్లని మన పూలమ్మి చెప్పింది. కానీ, పూజారి భార్య యింకొకటి చెప్పిందంట. ఆ మహా తల్లి గాజు పొడిని నీటిలో కలిపి ఆ పిల్ల చేత తాగించిందంట. ఆ పిల్ల దాన్ని తాగి కడుపు నొప్పి తాళ లేక వూరే అదిరిపోయేట్టుగా అరిచిందంట. అప్పుడు తల్లి ఆ పిల్ల నోట్లో గుడ్డల్ని కుక్కిందంట. అదే వుసురు తీసిందంట.”

వింటుంటే కడుపులో దేవినట్టయింది నాకు. గౌరి పసి బిడ్డ లాగ యెక్కిళ్ళు పెట్టి యేడుస్తూ వుంది. నన్ను కూడా అది కృంగ దీసింది.

“ఆ పిల్ల పోసిన నూనె కోసమైనా దయ చూపించాలి కదా ఆ దైవం. యింత పెద్ద గుడిలో కూర్చుని వుందే! దుర్గమ్మ ముందు నిలబడి యేడ్చిందని చెప్పారే, ఆడ దాని కళ్ళల్లో జలం కారిస్తే  ఆ దేవి బాగుపడుతుందా? ఆ పిల్ల యెవరైతే యేంటి? మనసు విరిగిపోయి కంట్లోంచి నీరు కార్చిందే అది” అంటూ గౌరి దఃఖంతో స్పృహ తప్పింది.

గుడికి అతుక్కున్నట్టు వుంది మేనేజర్ యిల్లు. పోయి తలుపు తట్టాను.

“యెవరు?”

“నేనే సార్”

తలుపు తెరుచుకొని వచ్చాడాయన. బయట లైటు కాంతివంతంగా వెలుగుతోంది.

“ఓ! సారా, రండి, రండి. యేంటిలా అపురూపంగా వచ్చారు?”

“గుడిలో పూజ లేదని విన్నా…”

“అవును సార్. వొక చావు.. దక్షిణపు వీధిలో.”

“దాని గురించి విన్నాను. ఆ విషయం గురించే చూసి పోదామని వచ్చాను.”

“యేమిటి?”

“గోపురం మీద లైటు వెలగక పోయేసరికి వీధే చీకటైపోయింది. వూర్లో దొంగల భయం వుంది. అందుకని…”

“వొక రోజు యిలాగే వుండనీ అనుకొన్నా.”

యిదేంటి అర్థం పర్థం లేని జవాబు! వింతగా వుండింది నాకు. మాట్లాడకుండా కూర్చున్నా. వొకటి రెండు నిమిషాలు గడిచాయి. యిద్దరం మాట్లాడ లేదు.

“యేంటి యిలాంటి జవాబు చెప్పినానని అనుకుంటున్నారా? నాకెందుకో ఈ చావును సంతాప దినంగా ప్రకటించాలని వుంది. చచ్చిపోయింది యెవరో తెలుసు కదా మీకు?”

“తెలుసు. చాలా ఘోరం”

“మీరు కూడా చూసుంటారే. గుడికి వస్తుండేది ఆ అమ్మాయి. చితికి పోయిన కుటుంబమే. వొప్పుకుంటాను. అయితే, చనిపోయిన తర్వాత పీనుగును యెత్తడానికి వొక మనిషి కూడా రాలేదంటే యిది మనుషులుండే వీధేనా? కాకులు కూడా వొక కాకి చనిపొతే గుంపులు గుంపులుగా చేరి అరుస్తుంటాయే. మధ్యాహ్నం మూడు గంటలకు పోయిన ప్రాణం. వొక పిట్ట కూడా తొంగి చూళ్ళేదు.

ఆ ఆడోల్లంతా యింట్లోనే వుండిపోయినారు. అంతా చిన్న బిడ్డలు. అంత యేం మునిగిపోయింది? వాళ్ళు చెడిపోయినారు. నాథుడు లేకుండా చెడిపోయిన కుటుంబం. ఆకలికి బలైన కుటుంబం. యేం అధర్మం సార్ యిది? యిలాంటి మృగాల్ని చూడలేదండీ నేను. నేను కూడా నాలుగు వూర్లల్లో కాపురముండే వచ్చాను-”

మేనేజరు పెదాలు అదురుతున్నాయి. జల జల మని కన్నీళ్ళు కారుతున్నాయి. మాటలు రాక నిల్చుండిపోయాడు. కొంచెం సేపయ్యాక, కళ్ళు తుడుచుకొని,  వొక పెద్ద నిట్టూర్పుతో దుఃఖాన్ని దిగమింగుకున్నాడు.

“యీ రోజు దేవుడు వెలుగును కోరుకొంటాడా? కోరుకోడు. వూరుకి మాత్రం యెందుకు వెలుగు? యెంత పెద్ద లైటు వేస్తే మాత్రం యేంటి? మన చీకటిని తొలగించ గలదా? తొలగించ లేదు. యిలాగే చీకట్లో మగ్గనీ వొక రోజుకి…”

ఆగ్రహంతో అతని ముఖం జ్వలిస్తోంది. “గుళ్ళో పూజ చెయ్యాలి. యింకా శవాన్ని తీయలేదు. యెవరు తీస్తారు? వూరి తల మీద పిడుగు పడ!”

నేను యేం మాట్లాడాలో తెలియక కూర్చుండిపోయాను. కోపం తగ్గాక ఆయన చెప్పారు. “పది గంటల వరకు చూస్తాను. తర్వాత ఎవరూ రాకపోతే, నాదస్వర విద్వాంసుడు యిద్దర్ని తీసుకొస్తానని చెప్పాడు. నలుగురం కలిసి మోసుకెళ్దాం అని అనుకొంటున్నా. యింకేం చేయాలి, గుడిని తప్పని సరిగా తెరవాలి కదా?”

“నేను కావాలంటే వస్తాను”

“మీరా? యెందుకోసం? మాట్లాడకుండా మంచి బాలుడిలా వుండండి. యిది చాలా ప్రమాదకర విషయం. వొక వ్యక్తితో పెట్టుకునే గొడవ కాదిది.”

“అన్యాయంగా వుంది! బతకడానికి యింకెక్కడా తావు లేదా?”

గట్టిగా వూపిరి తీసుకున్నా. నాకు భయంగానే వుండింది.

“యిదిగో చూడండి. నా కోసం చెప్పకండి. నేనేమీ మీ గురించి తప్పుగా అనుకోను. నిజంగా ధైర్యం వుంటే రండి. లేదా..నా కోసం…”

“ఫర్వాలేదు లెండి.”

“యేమో మీ యిష్టం. కానీ, వీధికి మాత్రం లైటు వుండదు. రేపు రాత్రి వరకు ఖచ్చితంగా వుండదు. ఆ దుర్గమ్మకూ, ఆ పిల్లకూ అంత బలమైన వొప్పొందం. లైటు వుండదు. యిప్పుడే చెప్పేస్తున్నా-”

“సరే”

లైటు ఆర్పేసి, తలుపేసుకోమని యింట్లో వాళ్ళకి చెప్పి, భుజాన తువ్వాలేసుకొని బయలు దేరారు ఆయన.

చీకట్లో తడుముకుంటూ, తూర్పు వీధి వెలుగులోకి వచ్చాం.

***

మూల కథ రచనా కాలం:1954      

 

దామూ

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ , అనువాదం చాలా బాగా ఉన్నాయి, జానకిరామన్ గారి శత జయంతి సందర్భంలో ప్రచురించడం విధాయకం.

  • మంచి కథ చదివించినందుకు ధన్యవాదాలు. Original story చదువుతున్నట్టే అనిపించింది, చదవడానికి సులభంగా. But pain అంతా కథలో వుంది. మనిషికో దేవుడు కావాలేమో కష్టాలనుంచి గట్టెక్కించడానికి. మాతృత్వం వల్ల వొచ్చిన మెరుపని చదవగానే మనసంతా విషాదమైపోయింది. Thank you so much Daamu gaaru 💐

  • అనువాదం కథబాగుంది..చదువుతుంటే దిగులు అన్పించింది….

  • హృదయవిదారకమైన జీవితం ధరముది.. చాలా బాధకరమైన కధ.. చక్కగా అనువదించారు దాము

  • వంశీ గారి పుణ్యమాఅని మంచి కథ చదివాను‌. మీ అనువాదం చాలా బాగుంది. మనషిని కరిగించి ఆలోజింప జేసే కథ.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు