గుడిలో దెయ్యం!

We are not fond of  ethics but of economics.
We are not interested in relation but in sexual attachment.
we are not only politicians in government laws but also in  family.
We are lustful not loveful.తల నుండు విషము ఫణికిని
వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్
తల తోక యనక యుండును
ఖలునకు నిలువెల్లా విషము గదరా సుమతి!సీను మారింది.స్క్రిప్ట్ మారింది.కధమారింది. కధనమూ మారింది.మనుషులే మృగాలోచ్ అని దండోరా వేయాలిక.

తేలు కుట్టి ఒకరి మృతి,పాము కరిచి మరొకరు మృతి. అడవిపంది దాటికి వేటగాడు చావు, అంటూ ఒకప్పుడు జంతువులు మనుషుల్ని చంపటాన్నివార్తలుగా,కధనాలుగా ,కథలుగా,గాధలుగా చెప్పుకున్నాం.చదువుకున్నాం.ఇప్పుడేమో భార్యను చంపిన భర్త,అన్నని నరికిన తమ్ముడు,ఆస్తికోసం కన్నతండ్రినే హతమార్చిన కొడుకు,ప్రేమించలేదని కత్తితో అమ్మాయిని నరికి చంపిన ఇంటర్ విద్యార్థి అంటూ మనమంతా వార్తలు చుదువుతూ గుండెలు బాదుకుంటున్నాం.ఎక్కడ మనిషన్నవాడికి మనిషి నుండే రక్షణలేక, నమ్మకంలేక, గుండెమీద చేయివేసుకొని మనిషిని దగ్గరకు తీసుకునే విశ్వాసము లేక,  ఎవరెవరు ఏమేమిటో అర్థంకాక ,అర్థం చేసుకోలేక దుఖిస్తున్నాం.ఆధునిక కాలంలో కరిచేపాములు, కుట్టే తేళ్లు, చంపే మృగాలు మనుషులే అవ్వటం బాధాకరం.మన ఎదురొచ్చేవాడు మనల్ని బాధిస్తాడో సంతోష పెడతాడో నమ్మకంగా ఉంటాడో మోసమే చేస్తాడో తెలియడం లేదు.

ఇది నిరాశ కాదుగాని. ఇది చుట్టూరా చుట్టలు తిరిగిన అపనమ్మకపు కాలం.భరోస లేని సమయం..నిలబడలేని నిలదొక్కుకోలేని నిలపలేని ఒకానొక బలహీన జీవిత సందర్భం.ఎవర్ని ప్రశ్నించాలి ?ఎవరు సమాధానం చెప్పాలి?ఏ జీవితంలోకి ఏజంతువు వొస్తుందో తెలియదు. ఎవరి ఆనందంలోకి ఎవరు దుఃఖాన్ని మోసుకొస్తారో ఊహించలేం.ఎవరు ఎవరి జీవితం మీద తుమ్ముతారో దగ్గుతారో అర్థంకాదు.’Beware of Dogs’ అన్న మాటని ఇప్పుడు ‘Beware of people,అని మార్చాల్చి వొస్తోంది.బయటికి వెళ్లిన తన కూతురు వెళ్ళినట్టే తిరిగొస్తుంది అనే నమ్మకం లేని తండ్రి.తమ్ముడు  ఏగొడవలు లేకుండా తనతొనే కలిసి ఉంటాడు అనే నమ్మకంలేని అన్నయ్య. ఎవరికి కించత్తు హుందాతనం మరో మనిషిమీద లేదు.అట్లా నడిచిపోతుంది.గడిచిపోతుంది.కాలాన్ని కొలవలేని కళ్లతో,సమయాన్ని అంచనా కట్టలేని కాళ్లతో,రేపటిని ఉహించలేని హృదయ వైకల్యంతో అంతటా అందరూ దుప్పట్లకింద దొర్లుతున్నాం.ముసుగువేసుకొని నగ్నంగా నిలబడుతున్నాం.ఒక్కోసారి కొన్ని విన్నప్పుడు,తెలిసినప్పుడు గుండెల్లోంచి ఆవేశం, దుఃఖం పొగలుకక్కుకొని బయటికొస్తుంది.రక్తం తెలుపెక్కుతుంది.ముఖం ఎర్రబడి మధ్యాహ్నం సూర్యుడిలా భగభగ మండుతుంది.జరిగింది విని, తట్టుకోలేక ఆకళింపు చేసుకోక విరిగివిరిగి పడిపడి చిట్లిచిట్లి కుప్పకులతాం.తల్లడిల్లుతాం.

నాకు తెలిసిన సునంద అనే తొమ్మిదో తరగతి హాస్టల్లో చదువుతున్న  అమ్మాయి ముగ్గురు కుతుళ్ళలో చిన్నది.నాకు చెల్లివరస.కష్టం చేసి ముగ్గురు కూతుళ్ళని చదివించలేక మొదటి ఇద్దరిని కొంతవరకే చదివించి వారికి పెళ్లిచేశారు అమ్మానాన్న. మూడో అమ్మాయి అయిన సునందని కొంతవరకు పైచదువులు చదివించాలానే ఆశ అమ్మానాన్నదే కాదు ఆఇద్దరి అక్కలది కూడా.బహుశా దేవుడు అనేవాడుకుడా స్త్రీల పట్ల కర్కోటకంగా ఉంటాడేమో అనిపిస్తుంది చాలాసార్లు.తొమ్మిదో తరగతి చదివే సునందకి మూడో నెల కడుపు ఎందుకొచ్చిందో ఆ దేవుడే చెప్పాలి.నేను డాక్టర్ అవుతాను అన్నయ్య అనే సునందకి డాక్టర్ దగ్గరికి వెళ్లి పేరుతెలియని నొప్పులు ఏవో పడుతూ అబార్షన్ చేయింకోవడం అనే పరిస్థితి ఎందుకు వచ్చిందో  ఆ కలియుగ భగవంతుడు ఎవడైనా ఉంటే వాడే చెప్పాలి.ఇదేదో రాములమ్మ తరహా కధకాదు.పసిమొగ్గాల్ని చిదిమేసే రాబందు కథనం.ఆడపిల్ల ఐతే చాలు చెల్లయినా,అక్కాయినా మరదలైన స్నేహితురాళ్లయిన ఎవరైనా ఒకటే.కావలిసింది టెస్టోస్టెరాన్ని ejakulate చేయటo.అది ఎవ్వరికీ జన్మస్థానం కాదు మర్మస్థానమే.ఎవరో అన్నట్టు “woman vagina is a wound which never heals up” అని.ఎన్నెన్ని గాయాలో,మరెన్ని రక్తపు గాట్లో  ఆడపిల్లల దేహాలపైన? హృదయాలపైన? .వారి స్వప్నాలపైన? భవిష్యత్తు పైన?కన్న తండ్రినుండే రక్షణలేదు.అన్నలనునుండి అంకుళ్లనుండి అబ్బాయిలనుండి బడిలో గుడిలో రోడ్డులో ఆఫీసులో అంగడిలో ఎక్కడా భరోసా దొరకడంలేదు.

ఎప్పుడూ చాలా చలాకీగా ఉండే సునందకి కల్లుతిరిగినాయి.డాక్టర్ దగ్గరకు తీసుకెళితే చెప్పిన విషయం విని సునంద అమ్మాయ్యాలకి గుండెమెలితిప్పినట్టయింది.సునందకి ఇప్పుడు మూడో నెల,తల్లికాబోతుంది.నలుగురికి తెలిసింది.హాస్టల్లో సీట్ లేదని నిరాకరించారు.చదువు ఆగిపోయింది.అవమానం జరిగింది.పరువుపోయింది.
కన్నీళ్లు. కల్వరపాటు.శరీరంపై ఎప్పటికి చెరిగిపోని ఒక మచ్చ.ఎవర్రా కారణం అని అడిగితే చెప్పలేక గుండెల్లో మింగుకున్న సునంద గొప్ప హృదయం ఎవరికి మాత్రం అర్ధమౌతుంది?

నువ్వు ఒప్పుకోకపోతే నేనేం చేస్తానో తెలుసా అనే అహంకారి గాడ్ని,తన కుటుంబం ఏమౌతుందో అనే సందిగ్ధంలోంచి సునంద ఏమిచేయకూడదో అదే చేసింది.దేనికి తలవంచకూడదో దానికే తలవంచింది.ఎదురు తిరిగి పోరాడలేకపోయింది.బలహీనురాలైంది.ఎన్నయినా వయస్సు చిన్నదికదా?బలంగా నిలబడలేని మానసిక పరిపక్వత లేని చిన్నారి కదా?

నువ్వు ఒప్పుకోకపోతే నీ అక్కని వదిలేస్తాను.నీ అక్కకు పిల్లలు పుట్టడంలేదు.శారీరకంగా తను చాలా లావుగా ఉంది.నేను వదిలేస్తే మీ అక్క జీవితం పాడవుతుంది.మీఅమ్మానాన్న ఏడుస్తారు.అందరూ మిఅక్కని తిడతారు.మీ అక్క కోసం ఇది కూడా చేయలేవా?అని సముదాయించి స్పర్శించి సునంద జీవితాన్ని పాడుచేసిన పురుగులు మీ చుట్టూ కూడా ఉంటారు అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త.అన్నయినా,అన్నయ్య స్నేహితుడైన,పక్కింటి అంకుల్ ఐనా,క్లాస్మేట్ ఐనా,మగడన్నవాడు ఎవడయినా వాడ్ని నమ్మకండి.చల్లని ఐస్క్రీమ్ ఇప్పించి గుండెల్లో వేడిపుట్టించగలరు.రంగురంగుల ప్రపంచాన్ని కళ్లకుకట్టి ఏ రంగులేకుండా చేయగలరు.తియ్యని మాటలు చెప్పి చేదుని శరీరంపై గుమ్మరిస్తారు. జాగర్త.
బురధలోంచి పంది వొచ్చినట్టు అజ్ఞానంలోంచి ఒక రాక్షసుడు వస్తాడు.నీమీద పడి కుక్క బొక్కను కొరికినట్టు నీదేహాన్ని పట్టి పీలుస్తాడు.పీల్చేసిన సిగరెట్ ముక్కను కాలికిందేసి నలిపినట్టు నీమనసుమీద వికృత సంతకం చేస్తాడు.కుళ్ళిపోయిన జంతు కాలేభారాన్ని పిక్కుతింటానికి గద్దవొచ్చినట్టు ఒక వెదవొస్తాడు.వాడ్ని నువ్వు అడ్డుకోలేదా?ఆపడానికి ప్రయత్నించలేదా?ఇక నీపని ఐపోయినట్టే.నిన్ను ఉడకేసుకొని సప్పరిస్తాడు.నిర్మలమైన నీకళ్లలోంచి కన్నీరు తెప్పించి దాహంగా తాగుతాడు.మర్మాంగాలను ఆహారపదార్ధాలుగా మార్చుకొని ఆకలి తీర్చుకుంటాడు.రావటమంటే అకస్మాత్తుగా ఏమీరాడు.మెల్లమెల్లగానే వొస్తాడు.చాపకింద నీరులా వొస్తాడు.జంగుపిల్లిలా వొస్తాడు.దోమలా వొస్తాడు.నక్కినక్కి ఏశబ్దం చేయకుండావోస్తాడు.రంగులకలల్ని నీకు ఎరవేసి నిన్ను బందీని చేస్తాడు.పుట్టలోంచి పామోచ్చినట్టు.పురుగులాంటి పురుషుడు ఒకడు వొస్తాడు.వాడ్ని నువ్వు అడ్డుకోలేదా? ఆపజూడలేదా? ఇక నీపని ఐపోయినట్టే.కళ్ళలో పడిన నలుసుని తీసేయవొచ్చు.కాళ్ళలోవిరిగిన ముళ్ళని పీకేయవొచ్చు.

ఎలా తల్లి గర్భంలో గుట్టుగా నిద్రొతున్న పసిగొడ్డుని తీసేయటం?
అందుకే చెవుల్తో చూడండి.కళ్లతో వినండి .అంచనా కట్టండి.ఉప్పుఏదో కర్పూరం ఏదో పసిగట్టండి.రంగులు వెలవకండి.దారులు తెరవకండి.దేవుళ్ళు ఉన్నారు అనుకున్న చోటల్లా ఇప్పుడు దెయ్యాలు ఉంటున్నాయి
మీముందు ఒక  ప్రపంచముంది.సంతోషించే కాలామూ ఉంది.మీ స్వప్నాల్ని సాకారం చేసుకునే బంగారు సమయం రానేవొస్తుంది.బెండ్ అవకండి.లొంగిపోకండి.మీ శీలాల మీద మేకులు దిగ్గొట్టడానికి సిద్ధంగా ఉన్న శిల చేతుల్ని సిలువ వేయండి.సునందలు కాకండి.అంతటా అన్నీ నందనాలే ఉంటాయని భ్రమపడకండి.ప్లీజ్..
*

పెద్దన్న

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మనిషి తన అవసరాలకు ఒక్కొకరిని ఒక్కో విధంగా manupulate చేస్తుంటాడు. అది ఇతరుల అమాయకత్వం అవ్వొచ్చు,మంచితనం అవ్వొచ్చు,తెలియనితనం అవ్వొచ్చు ఏదేమైనా గాని మోసాగిస్తున్నారు మోసపోతున్నారు ,మనిషి కోరిక తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు అది కేవలం అతడి అప్పటి అవసరాలు,ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది.
    ఇక విషయానికొస్తే తొమ్మిదో తరగతి చనువుతున్న సునందని ఆమె బావ అతడి మాయ మాటలతో లొంగతీసుకుంటాడు.ఏదేమైనా ఆ అమ్మాయికి ఆ సమయంలో ఎలా ఎదుర్కోవాలో తెలియాకపోవడం వల్ల ఆ సమస్యలో చుక్కుకొనిపోయింది ,ఇటువంటివి జరగడానికి ప్రధానగా ప్రతి తల్లి తండ్రులే మొదటి ముద్దాయిలు అవుతారు,అమ్మాయిలకు మరీ ముఖ్యంగా పల్లెటూరి ఆడపిల్లలకు సరైన అవగాహన కల్పించలేకపోవడం,వారిని నమ్మడంలో విఫలం చెందుతున్నారు.ఈ విషయంలో పెదన్న గారు ముందడుగు వేసి స్పర్శల గురించి , వాటి రకాల గిరించి చెప్పడం. అటువంటి సమయంలో అమ్మాయిలు ఇటువంటి ప్రమాదాన్ని ముందుగా గ్రహించడం లాంటివి ఒక తల్లి తండ్రి లాగా బాధ్యత తీసుకోని ఇలా తన భావాలు,అనుభవాలు వ్యక్తపరచి ఆడ పిల్లలకి అవగాహన కల్పిస్తూ రాసిన ఈ రచన, నేటి తరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
    ధన్యవాదాలు

  • ఈ తరం అమ్మాయిలకు ప్రమాదకరమైన స్పర్శలను పసికట్టడం అవసరాన్నిగుర్తుచేశారు. ఈ విషయానికి సంబంధించి పట్టణాల్లో, నగరాల్లో జరుగుతున్నన్ని అవగాహనా కార్యక్రమాలు జరగకపోవడం,తల్లి తండ్రులు అమాయకత్వం, అసహాయతలను సున్నితంగానే అయినా కొంత నిష్టూరంగా కూడా వ్యక్తపరిచారు.మొత్తంగా చాలా విషాదకరంగా, హృద్యంగా ముగిసింది. ఈ కాలం అమ్మాయిలు మెలకువతో,జ్ఞానంతో,ధైర్యంతో ఎందుకుండాలో పెద్దన్న ఈ సంఘటన ద్వారా హెచ్చరించడం అభినందనీయం,అభిలషనీయం.ఎక్కడో మధ్యలో ఒక చోట సునంద అమాయకత్వాన్ని,నిస్సహాయతను,చిన్నతనాన్ని గురించి చెప్తూ …..ఆమె కారణం ఎవరో తల్లితండ్రులకు చెప్పకపోవడాన్ని…”ఆమె గొప్ప హృదయం”అంటూ కీర్తించడం నాకు నచ్చలేదు.ఇది నకారాత్మక సూచననిస్తుంది (అమ్మాయిలకు).తస్మాత్ జాగ్రత్త పెద్దన్నా……..

  • చాలా బాగుంది మీరు రాసిన విధానం, మీ రచన లో అమ్మాయిల సమస్యలకు కవిత్వం జోడించి చెప్పడం అనేది మెచ్చుకోదగిన అంశం. ఇటువంటివి మీనుంచి మరిన్ని ఆశిస్తున్నాము.

  • ఇటువంటి సున్నితమైన సమస్యల గురించి అందరూ చదవాల్సిన , విస్తృతంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు రాసిన విధానం లో ఎంతో గాఢత ఉంది. ఇటువంటి సమస్యల గురించి విద్యార్థుల్లో కన్నా ముఖ్యంగా ప్రతి పేరెంట్స్ లో అవగాహన కల్పించాలి అని మేము కోరుకుంటున్నాము.థాంక్ యు

  • మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం. అబలలు మౌనంగా కూర్చుంటే మృగాల్ల దాడికి బలి కావలసిందే. ఈ వ్యాసంలో మాటలు చైతన్య స్ఫూర్తిని రగిలిస్తాయనే నమ్మకం కలుగుతుంది. చక్కటి వ్యాసాన్ని అందించిన మారాబత్తుల వారికి అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు