తెలంగాణ ఉద్యమంతో పాటుగా జమిలీ గా పెనవేసుకున్న తన కవిత్వ ప్రయాణం ‘చుక్కల పందిరి’ కవిత్వ సంపుటితో ఒక మజిలీని చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర సాకారం తర్వాత కూడా కవి ‘వజ్జీరు ప్రదీప్’ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రాథమికతనంతో అమాయకత్వపు చూపులతో మొదలైనట్టే అనుభూతించే కవిత్వం నిజ జీవితాలతో పెనవేసుకున్న జ్ఞాపకాలను మూటగట్టుకొని కొనసాగుతూ తన బాధ, ప్రపంచం బాధ, ప్రకృతి బాధ మొ.నవి ఒక సరళరేఖ పై వేరువేరు బిందువుల వద్ద నిలబెడుతూ ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కున్న జ్ఞానిలా తలుక్కుమంటాడు.
పోలిక అసహజమైనప్పటికీ సమస్యల్ని మాత్రమే నెత్తిన రుద్దిపోయే చాలామంది కవులకి ‘ప్రదీప్’ భిన్నంగా కనిపిస్తాడు. తనదైన, ఇంతకుమించి సాధ్యపడదనిపించే వైయక్తిక పరిష్కారాన్ని సార్వజనీనం చేసే దిశగా ఆలోచింప చేస్తాడు. ‘ముందైతే తెలంగాణ రానీయ్.. మిగిలినవన్నీ తర్వాత చూసుకుందాం’ అన్న కవుల్లో ప్రదీప్ కూడా ఒకరు. ప్రకృతి విధ్వంసం గుట్టల గుండె కోతలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సమాంతరంగా ప్రయాణిస్తున్న కాలాన్ని జీర్ణించుకోలేకపోయిన కవి దగ్ధ హృదయంతో ‘గుట్టకో గుడి కడదాం’ అని తీర్మానిస్తున్నాడు. ఇది తాత్కాలికమో, శాశ్వతమో తనకు తోచిన ఒక పరిష్కారం మార్గాన్ని సూచిస్తున్నాడు. ఈ క్రమంలో తన నోస్టాల్జియా అంతా బాధతో తొలుచుకుంటాడు.
తనతో కలిసి రమ్మని, ప్రకృతి విధ్వంస వ్యతిరేక పోరాటంలో భాగస్వాములవుదాం కదలిరండి అని నినదిస్తాడు. పేగుబంధాలను కాలరాసే అధికారం ఎవరికి ఎక్కడిదని నిలదీస్తాడు. ప్రకృతి పరిరక్షణకై ఆధ్యాత్మిక పరిష్కార మార్గం ఎంత మేరకు దోహదపడుతుందో పక్కనపెట్టి, నిజానిజాల్ని మాట్లాడుకుంటే అది భారత ఎకానమీని ఢీకొడుతుంది. ఇక్కడ వస్తు ఉత్పత్తి, డిమాండ్, మార్కెట్, అంతర్గతంగా విధ్వంసం ఒక వలయాన్ని పూర్తి చేస్తుంది. ఈ విధ్వంసానికి మూలం ఎక్కడిది? ఇందులో భాగస్వాములు ఎవరెవరు? నువ్వు, నేను, కవి, ఇంకొందరు అంతేనా? ప్రత్యక్షంగా, పరోక్షంగా అందరమూ కారణం కాదంటారా?
*
గుట్టకో గుడికడుదాం
~
పర్వతదేహంపై మిషన్లు బెట్టి
నిలువెత్తు సజీవ రూపాలను
నిర్దాక్షిణ్యంగా నుజ్జు నుజ్జు జేస్తూ
ప్రకృతి శిఖరాలను గూల్చి
ఛిద్రమైన ముక్కలతో
వికృత శిఖర మేడలను గట్టే
రాతి మనిషి రాబందుల్లారా
కాసుల కాంక్షతో మీరు చేసే విధ్వంసం
రేపటి తరానికి కానరాని ఆనవాళ్ళై నిలుస్తుంటే
నిన్ను సమర్థించే పెద్దలు పందికొక్కులేమో!అని
ప్రకృతి మాత ఘోషిస్తుందిప్పుడు
గత సుందర దృశ్యాలకు గండ్లు కొడుతుంటే
అరికట్టే నాథుడెవ్వడా! అని
అరచేతులు చాస్తుంది
దాని నిర్మానుష్యపు నిస్తేజమైన ఒక దుఃఖం
నా మనసు అంతరంగాన్ని తొలుస్తుంది
అందుకే నేనిప్పుడు పోరాడదల్చుకున్నాను
ఇది మా బాల్యానికి – భవిష్యత్తుకు మధ్య వారధి
గతంలో మేమిక్కడ
ఇప్పపూవులనేరుకున్నాము
విస్తార్లకై మోదుగాకులనేరుకున్నాము
రేగు పండ్లు పరికి పండ్లు
తంగేడు తీరొక్కపూలు
ఎన్నెన్నో ఇచ్చింది ఈ గుట్ట తల్లి
ఈ గుట్టకు అడవికి ఉన్న అనుబంధం
ఈ గుట్టకు వానకు ఉన్న ఋణబంధం
మనిషి జీవితాన్ని పెనవేసుకున్న పేగు బంధం
దీనిని కాలరాసే అధికారం నీకెక్కడిది
ప్రకృతి ప్రేమికులారా కదలిరండి
వినాశకారులను విధ్వంసకారులను నిలదీద్దాం
కాదు కూడదంటే గుట్టకో గుడి కడదాం రండి
*
‘వికృత శిఖర మేడలను గట్టే రాతి మనిషి రాబందుల్లారా’ అన్నప్పుడు మానవ పరిణామ క్రమం కంటి ముందటి దృశ్యంలా కదిలిపోతుంది. ఎక్కడ మొదలై ఎక్కడికి సాగుతుందీ ప్రయాణం? అని మనసును మెలిపెడుతుంది. ఆదిమ జాతి మానవుడి నుంచి ఆధునిక రాతి మనసున్న మనిషి వరకు పరిణామం చెందిందా? అని ఆలోచనల్లోకి కూరుకుపోయేలా చేస్తుంది. ఉదయం లేవగానే ‘పాండవుల గుట్ట’ మీది సూర్యోదయాన్ని చూసి పులకించి పోయే కవి చుట్టుపక్కల గుట్టల మేనిపై రంపపు కోతలు మాత్రం ఎలా భరించగలడు? ‘సమర్థించే పెద్దలు పందికొక్కులేమో’ అని అనుమానం గానే రాజకీయ కోణాన్ని విప్పి చెబుతున్నప్పుడు ‘సుందర దృశ్యాలకు గండ్లు పడుతున్న’ వైనంతో ముడి పెట్టడం నిస్సహాయంగా చూస్తూ నిలబడతాం.
జీవనోపాధికి మార్గం చూపిన గుట్ట మాయం కావడం అలవికాని దుఃఖంలా జీరగడుతుంది. ఒక సంస్కృతి ఆనవాళ్లు తెగనరికిన వాళ్లను ఊరికే వదిలేద్దామా? గ్రామానికి పెద్ద దర్వాజా లెక్క చెప్పుకునే ఒక గుట్ట మాయమైతే విలవిలలాడే కవి- అనేక గుట్టలతో అలరారే ప్రకృతి సమతుల్యతను, తమ ఉనికిని కాపాడుకుంటున్న అడవి బిడ్డలు ‘ఆదివాసీల’ పోరాటాలకు ఇంకా ఎంత అవిసిపోతాడో కదా? అడవి నిండా ఎన్ని గుళ్ళు కడితే బయటి ప్రపంచానికి కనిపించని అణిచివేత ఆగిపోతదో.. ఈ కవి ఊహకు అందుతుందా? చూద్దాం.. ప్రత్యామ్నాయం రక్షణ కాగలదేమో?
*
Add comment