గుండె వాకిళ్ల ముంగిట ‘ఆకుపచ్చని ముగ్గు’

          చాలా విషయాల పట్ల మనకు ఎరుక వుండదు. చిన్నవిషయాల పట్ల అసలే వుండదు. మనం చాలా చిన్న విషయాలనుకునే వాటి వెనుక ఒక మూగబాధ వుంటుంది. ఒక మౌనవేదన వుంటుంది. ఏవుందిలే అని మనం అనుకునే విషయం ఒక మనిషి అంతరంగాన్ని కుదిపేస్తుంది. వేంపల్లి షరీఫ్ రాసిన ‘ ఆకుపచ్చని ముగ్గు’ చదివితే ముందు అనిపించిన మాట ఇదే అయినప్పటికీ, ఆ కథ చూడటానికి, చదవడానికి సాదా సీదాగా వున్నా, ఆ కథ పొరలు పొరలుగా అనేక మానవ అంతరంగాల్ని ప్రశ్నిస్తూ, లోతుకు ప్రయాణిస్తుంది.
         కథ టూకీగా చెప్పాలంటే కథకుడిది ముస్లిం కుటుంబం. కథకుడి అక్క రంజానుకి అమ్మగారింటికి వచ్చి వుంటాది. కథకుడి అక్క(జీనత్)కు గోరింటాకు పిచ్చి. అందరికీ గోరింటాకు పెట్టి తృప్తి పడుతుంది. కానీ ఆ గోరింటాకు పెట్టడం వెనుక తన చిన్నప్పటి ముగ్గులు పెట్టాలన్న యావ వుంది. ఆ కోరిక, ఆ చిన్ని కోరిక తన మత విధానాల కారణంగా, ఇంట్లో (ముఖ్యంగా) తల్లి  ఒప్పుకోని కారణంగా.. ఆ చిన్ని కోరికను కనపడినవాళ్లకల్లా గోరింటాకును పెట్డడంలో తీర్చుకుంటుంది. ఇదీ కథ. సాదా కథ. సాదా కథని ఇట్టాగ చెప్పేస్తే కథ గొప్పదనం ఏముంది ? కథకుడి గొప్పదనం ఏముంది ?
        కథకుడి కుటుంబం హిందువుల ఇళ్ల మధ్యలో ఒక ఇంట్లో వుంటుంది. పిల్లల చదువులు, ఆటలు వాళ్ల మధ్యలోనే.సావాసాలు వాళ్లతోనే. కాబట్టి వీళ్ల ఆచార వ్యవహారాలు వాళ్ల( హిందువులు )కి రావు గానీ, వాళ్లవి కొన్ని ఆటలు సంప్రదాయపు అలవాట్లు వీళ్లకి వస్తాయి. అట్టాగే ఎట్టాగో ముగ్గుల పిచ్చి(?) పట్టుకుంది కథకుడి అక్కకు. ముస్లింల కు అట్టా ముగ్గులేసే పద్ధతి లేదు. కనుక ఎవరేమనుకుంటారోనని తల్లి కూతురుని ముగ్గులేయద్దంటుంది. కూతురు వినకపోతే పోయి కల్లంలో ఎవరికి కనపడకుండా వేసుకొమ్మని కసురుకుంటుంది. ఇదంతా చదువుతున్నప్పుడు under current గా హిందువుల మధ్య బతుకుతున్న ముస్లింలు, వాళ్ల జీవితాలు, వాళ్ల మనోభావాలు, న్యూనతా భావాలు, భావజాలాలు మనకి అర్థం అవుతా వుంటాయి. ఇతర మతం ముందు తమ మత అస్తిత్వం కాపాడుకునే అమాయక ప్రయత్నం కనిపిస్తుంది. మతం మధ్యతరగతి లేదా దిగువ మధ్య తరగతి వర్గాల మెదళ్లలో తిష్ట వేసుకుని కూర్చున్న విషయం మరోసారి రూఢి అవుతుంది. ముగ్గు వేయడానికి, గోరింటాకు పెట్టడానికి కూడా మతం ఎలా అడ్డుగోడగా నిలుస్తుందో చదివితే ఆశ్చర్యం వేస్తుంది.
       కథకుడి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడే కుటుంబం. కథకుడి అక్కకు ఎట్టాగో మంచి సంబంధం చూసి పెండ్లి చేస్తారు.ముందు ముందు ముందు కథకుడికి చదువులకి చిన్న చిన్న సాయాలు చేసిన అక్క ఆ తర్వాతర్వాత తన ముగ్గురు ఆడబిడ్డలకి “నువ్వే దిక్కబ్బీ” అని కళ్లనీళ్లు పెట్టుకునే పరిస్థితికి వస్తుంది. కథకుడు నేరుగా అక్క సంసారిక సమస్యలను ఏకరువు పెట్టకపోయినా, అన్యాపదేశంగా చెబుతాడు. మొదట బాగానే వున్న అక్క సంసారం.. ఆడబిడ్డలు పుట్డిన తర్వాత అంత బాగుండలేదని మనకి తెలుస్తుంది.
           రంజాను పండక్కి అక్కను ఇంటికి పిలిపించుకున్న కథకుడు అక్క ముగ్గుల పిచ్చిని, తమ ఆర్థిక పరిస్థితిని, తలపోసుకుంటాడు.బలవంతంగా కూర్చోపెట్టి గోరింటాకు పెడుతుంటే..” గోరింటాకు పెట్టడమంటే ఎందుకే నీకంత బ్రెమ..” అని అడుగుతాడు.
” బ్రెమనా..పాడా..అమ్మ పోరు తట్టుకోలేకనే ఆ ముగ్గులపిచ్చిని ఇట్టా గోరింటాకులు పెట్టి తీర్చుకుంటాంటి.” అంటుంది అక్క.
‘ ముగ్గు ఇంటి ముందు వేస్తే తప్పు కానీ చేతిలో వేస్తే కాదు కదా!’ అనుకొంటాడు కథకుడు. నిజానికి ఇంటి ముందు ముగ్గు వేస్తే మాత్రం తప్పేమిటి? కంటికి కనిపించని, ఒక తెలియని కండిషనింగ్ మన ఆలోచనలని అదుపు చేస్తూ వుంటుంది. ఈ కండిషనింగ్ వెనుక బ్రాహ్మణీయ ఆధిపత్య శక్తుల మత పురాణాల ఆచార వ్యవహారాల కుట్రలు వున్నాయి.ఈ కండిషనింగ్ ఎంత శక్తివంతమైనది అనంటే మనం ఏదో మేరకు ఈ కండిషనింగ్ లోనే ఆలోచించడం. ‘ముగ్గు ఇంటి ముందు వేస్తే తప్పు కానీ..’ అని కథకుడు కూడా అనుకునేటట్లు ఈ కండిషనింగ్ చేయగలదు.
          మళ్లా అక్కే ఒక మాట అంటుంది ” ఇబ్బుడు మనం పండుగ జేసుకుంటాండాం. నువ్వు నీ స్నేహితులని అన్నానికి పిలుచ్చావ్..వాళ్లొచ్చి తింటారు. తిని బావుండాదంటారు. అంతమాత్రం దానికే వాళ్లు వాళ్ల మతాన్ని తక్కువ చేసుకున్నట్టా. ఏం గాదు కదా. వాళ్ల మతం వాళ్లదే. మన మతం మనదే! కాకపోతే ఒకరి మతాల్లోని కొన్ని విషయాలు మరొకరి మతాల్లోని వాళ్లకు నచ్చుతాయి.అంతే.”
          కొన్ని వేల ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవితాల్లో అల్లుకుపోయున్న మతం సమీప భవిష్యత్తులో ఏం పోదు కనుక మనం మన సాటి మతాల మధ్య నివసించక తప్పదు కనుక, మరొక మతం లోని నచ్చిన’ కొన్ని ‘విషయాలు , మన మతంలో వాళ్లకి నచ్చిన కొన్ని విషయాల మధ్యన కుదిరే ఆవగాహనతో మాత్రమే మనుషులు మతపరమైన విషయాలను పక్కన పెట్టి కలసిమెలసి వుండగలుగుతారు.ఇది చాలా సున్నితమైన, సరళమైన విషయమే. కానీ, చాలా ముఖ్యమైన, ప్రాధాన్యత కలిగిన విషయం.
         చిన్న చిన్న విషయాల వెనుక పెద్ద పెద్ద విషయాలు దాగి వుంటాయని సూఫీయిజం చెబుతుంది. సత్యం ఎప్పుడూ సరళంగా వుంటుంది అంటుంది జెన్ బుద్ధిజం.
Junot Diaz అందుకే ఇలా అంటున్నాడు “We all dream dreams of unity, of purity; we all dream that there’s an authoritative voice out there that will explain things, including ourselves. If it wasn’t for our longing for these things, I doubt the novel or the short story would exist in its current form. I’m not going to say much more on the topic. And when I write a book or a story, I too am the only one speaking, no matter how I hide behind my characters.”
      కథకుడి అక్కలా ఆలోచించగల వాళ్ల అవసరం ఇప్పటి కాలంలో చాలా వుంది. చిన్న విషయాలనే సరళంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఎక్కువుగా వుంది.
         ఇలాంటి ఒక ముఖ్యమైన విషయాన్ని ఒక సాదా కథలో అనేక విషయాలను దాచి, వ్యాచ్యర్థంగా సూచిస్తూ కథ నడపడం ముఖ్యమైన శిల్ప విశేషం. చాలా తక్కువుగా తెలుగు కథల్లో ఈ శిల్ప‌విశేషం నేను గమనించాను. అన్నీ కథకుడే చెప్పకుండా పాఠకుడు కూడా వివేకవంతుడేనని కథ నిర్వహించడం మంచి కథ లక్షణమూ.. అట్టాగే మంచి కథకుడి లక్షణమూ.
          మతపరమైన విషయాలను సంక్లిష్టంచేస్తూ తమ రాజకీయ జీవితం కోసం అనేక అమాయక జీవితాలను పణంగా పెట్టే మతోన్మాదులకు ఈ కథ చిన్నగా చురక పెడుతుంది.అంతే..! అన్నట్టు.. ఈ ‘ ఆకుపచ్చని ముగ్గు’ కథకి మోహన్ బొమ్మలు పేజీల మీద పెట్టిన డిజైన్లు డిజైన్లుగా పెట్టిన గోరింటాకులే. ఎర్రగా, ముచ్చటగా పండిన గోరింటాకు చందం గిరిధర్ అరసవిల్లిది. మోహన్ బొమ్మలతో, రంగుల్లో నాణ్యమైన పేజీలతో ముద్రించిన ఈ పుస్తకం- గిరిధర్ వేసిన మోహన్ బొమ్మతో, మోహన్ కు అంకితం ఇవ్వడం ఎంత బావుందో.. ఈ కథలో జీనత్ అక్కలా..
( ఈ కథ ఆంధ్రప్రదేశ్ డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశం చేసిన సందర్భంగా )

శ్రీనివాస్ గౌడ్

ఇప్పటివరకు సంపాదించినవి 5 కవిత్వ పుస్తకాలు..కొంతమంది మిత్రుల ప్రేమపూర్వక ప్రశంశలు..నిర్మాణాత్మక విమర్శలు- వృత్తి.. నిర్మాణ రంగం
ప్రవృత్తి..సాహిత్య నిర్మాణ రంగం--అనేకానేక సంక్షోభ సమయాలలో సాహిత్యం ఊతమిచ్చింది.

సాహిత్యం మనిషిలోని మాలిన్యాలను కడిగేస్తుందని నా నమ్మిక.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు