గుండె లోతుల్లోకి దిగబడే ముళ్ళు 

కీ.శే.దాసరి శిరీష గారమ్మాయి అపర్ణ తోట కి ఒక మంచి టీం ఉంది. పింగళి చైతన్య, తాషి, ఎకె ప్రభాకర్ – వీళ్ళ ముగ్గురూ శిరీష గారి పేరిట ఒక జ్ఞాపిక గా మంచి రచనను ఎంపిక చేస్తారు. ఆలంబన ప్రచురణల పేరిట పుస్తకాన్ని ప్రచురిస్తారు. గతేడాది యండపల్లి భారతి రాసిన ‘జక్కీకు’ అనేనవలని ప్రచురించారు. అంతకన్నా దాన్ని దేశీ నవల అని ప్రకటించడం గొప్ప ఆసక్తిని రేపింది. వస్తు పరంగా మంచి విస్తృతి గల నవల. ఈ యేడు రెండు పుస్తకాలను ప్రచురించారు. వైష్ణవిశ్రీ రాసిన ‘రెండు ప్రపంచాల మధ్య’; దొంతం చరణ్ ‘ఉదయించే ఊపిరి’. రెండూ కవిత్వ సంకలనాలే. వైష్ణవికిది నాలుగో పుస్తకం కాగా, చరణ్ కి మూడవది.

రెండు ప్రపంచాల మధ్య – వ్యక్తిగత సామాజిక జీవితాల పట్ల ఒక స్త్రీకి గల బలమైన దృక్పధాన్ని ఆవిష్కరించిన పుస్తకం ఇది. ఈ పరంపరలో వైష్ణవి మొదటి వ్యక్తీ కాదు, చివరామె కూడా కాదు. కవయిత్రిగానో, రచయిత్రిగానో రూపాంతరం చెందుతున్న ఏ స్త్రీకైనా తన, లేక తన సహచర స్త్రీల జ్ఞానము, స్వేచ్చ, చైతన్యము వంటి విషయాల పట్ల ఎంతో పరిశీలన ఉంటుంది. వాటిని తమదైన వ్యక్తీకరణలోంచి సృజనావరణంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. సరిగ్గా వైష్ణవి ఆలాంటి ఒక శక్తివంతమైన సంబద్దతలోంచి ఇందులోని కవితల్ని రాయడం జరిగింది. ఇందులో రెండు ప్రపంచాలున్నాయి. స్త్రీగా కౌటుంబిక చట్రంలో చిక్కుకుని అణచివేతకు గురవుతూ నలిగిపోయేది ఒకటైతే; సమాజమూ, దేశమూ ఏమైపోతోంది ? అందులో స్త్రీలెలా బ్రతుకుతున్నారు ? అనేటువంటి ఆలోచనలతో సతమతమయ్యే విశ్వ మహిళా ప్రపంచం మరొకటి. రెండూ ఒకటి కాదు. రెండింటిలో స్త్రీ జీవితం ఒకేలా ఉండదు.

స్త్రీ రెండు చోట్లా విచిత్రమైన పరిణామాలను ఎదుర్కొంటుంది. నన్ను చూసి బిగ్గరగా నవ్వడం నీకెంత హాయినిస్తుందని. కొనప్రాణంతో నే తన్నుకులాడుతున్నప్పుడు నీ ఛాతీనెంతగా సాగదీసుకుంటున్నావో’ ‘ఏడడుగుల చప్పుడు వినబడ్డ ప్రతిసారీ గుండెలో పిడుగు పడ్డ చప్పుడు’(నడి తుఫాను) అంటుంది. ఆ పిడుగేదో చదువుతున్నవాళ్ళ గుండెల్లోనూ పడుతుంది. అలాంటివే కుదురు (27), ముల్లు (67), బొమ్మ (97) వంటి కవితలు. ఎప్పుడో శిలాలోలిత రాసిన రేవతీదేవి గుర్తొస్తుంది. ఆమె ఆత్మహత్య వెనుక ఉన్న ప్రచారంలో ఉన్న అనేక విషయాలు మెదుల్తాయి. స్త్రీ జీవితం కదా, అంతే అలాగే కనబడతాయి. వాళ్ళేం మాట్లాడినా వాటినన్నింటినీ వ్యక్తిగతంగా అంటు కట్టేసి వాళ్ళమీద ఒక సామూహిక అభిప్రాయాన్ని ఏర్పాటు చేయడం కొత్త విద్యేం కాదు కదా. సరిగ్గా వైష్ణవి కవితలు చదువుతున్నంతసేపూ అదేవిధమైన భావజాల సమస్యతో కొట్టుమిట్టాడుతాం. ఇన్నేళ్ళ స్త్రీవాద ప్రయాణం చేసిన తెలుగు కవిత్వంలో ఇంకనూ వైష్ణవికి ఇలాంటి వస్తువులే ఎందుకు అవసరం పడ్డాయి ? ‘ఇప్పుడిక చేతులు చాచి లేని ప్రేమను నటించలేను. ఇది ఒక ఒరలో ఇమడలేని పదునైన కత్తుల్లాంటి నమ్మకమూ ద్రోహమూ కథ’ (ఇది మనందరి కథ) అంటుంది. నలభయ్యేళ్ళుగా ఎంతో స్త్రీ కేంద్రక కవిత్వం వచ్చింది. ఇంకా స్త్రీలలో గూడు కట్టుకున్న దు:ఖం ఉంది.

వ్యక్తిగత, సామాజిక ఒత్తిడులున్నాయి. సమస్య స్వభావంలో మార్పు జరిగిందేమో తప్ప సమస్య నిర్మూలించబడలేదు. వైష్ణవి ఒక స్త్రీ వైవాహిక జీవిత పార్శ్వాలను చాలా స్పష్టమైన చూపుతో రాసిన విధానం మనల్ని మంత్రముగ్ధం చేస్తుంది. ఆమె కళా నైపుణ్యాలు కొలవబుద్ది కాదు. వాక్య నిర్మాణాల్లో వ్యాకరణాల్ని వెతకబుద్ది కాదు. స్వీయాత్మకత, స్వీయ ప్రయోజన వైఖరిలా అనిపిస్తుంది కానీ కాదు. All personal is political ని మళ్ళీ మళ్ళీ ఉదహరించను కానీ, అణచివేత విధానంలో పునాది ప్రవర్తన మారుతోన్న విషయం బోధపడుతుంది. స్త్రీ చుట్టూ కృత్రిమ స్వేచ్చ కల్పించబడ్డదన్నది వైష్ణవి అభిప్రాయం. వివాహ వ్యవస్థలో స్త్రీకి సరైన విలువనివ్వక పోవడం, నిర్లక్ష్య ధోరణి, స్నేహమూ బాంధవ్యాల పరంగా మోసం చేయడం, స్త్రీని ఎంత ఒంటరితనానికి గురిచేస్తాయో ఈ కవితలు అద్దం పడతాయి. బాల్యం రెక్కలు విరిచిందెవరో (59), సముద్రం పోటెత్తుతోంది (57) కవితలు ఆ కోవలోనివే. వైష్ణవి స్త్రీ అనుభవిస్తున్న గృహ హింసకు ప్రత్యక్ష రూపాన్ని ఈ కవిత్వ పుస్తకంలో పొదిగింది. ఈ సంఘర్షణంతా ఒక ప్రపంచంలోనిది.

మరొక ప్రపంచాన్ని చూస్తే చేనేత కార్మికుల కష్టాలు (మగ్గాలు పగులుతున్న చప్పుడు), కుల సమస్యలు (ఇప్పుడు నాదేశం ఓటి కుండ) మణిపూర్ అరాచకాలు (తల్లులు కూలుతున్న వేళ) హిజాబ్ రాజకీయాలు (మెహ్సా ఓ మెహ్సా, నేను దేశాన్ని)– ఇవన్నీ కవితలుగా కనిపిస్తాయి. ఒక సృజనకారుని అనుభవంలోంచి ఒక పాదార్థిక సంబంధం ఎంత చిత్రవిచిత్ర వ్యక్తీకరణల పాలు కాగలదో ఈ రెండు ప్రపంచాల మధ్య పరుగులుదీసే పాఠకులకే తెలుస్తుంది. వైష్ణవి నిజాయితీగల కవయిత్రి. ఆమె సున్నితత్వాన్ని తన కవిత్వంలో ఇట్టే పసిగట్టవచ్చు. స్త్రీవాద భూమిక నిర్మాణంలో అనేక త్యాగాల పాత్ర ఉన్నదన్నది కొత్త సత్యమేమీ కాదు. ఈ రెండు ప్రపంచాలలోనూ స్త్రీని త్యాగమూర్తిగానే అందరమూ గుర్తించాల్సి రావడం బాధ కలిగిస్తుంది. అంతకు మించి స్త్రీని విప్లవాత్మకంగా చూడలేని అనేక వాదాల వైఫల్యం వైష్ణవి కవిత్వంలో నిరసనగా వ్యక్తమయ్యింది.

ఏటికి ఎదురీదగల తెగువ, భూమిలోంచి వేళ్ళు పెళ్ళగిస్తున్న తుఫాను రాత్రిలోనూ నిటారుగా నిలబడ్డం అందరికీ సాధ్యపడదు. కేవలం మాటలు కాదు, కార్యాచరణ అతి ముఖ్యమని కూడా కొంతమందికే తెలుస్తుంది. వైష్ణవిశ్రీకి అటువంటి ఒక దృఢమైన అవగాహన ఉంది. నిజానికి భరింప శక్యం కాని వేదనని అనుభవిస్తేగానీ సున్నితత్వం ఎంతటి కఠినమైనదో తెలిసిరాదేమో ! లేకపోతే వైష్ణవి శ్రీ కవితల స్వభావం స్థలకాల సౌందర్యాల్ని ఎలా రెట్టింపు చేయగలుగుతోంది. వ్యక్తిగత జీవితంలోనుంచి వైరుధ్యాలతో నిండిన సమాజాన్ని చూడగల సాధన, కవిత్వం చేయగల నిపుణత వైష్ణవిశ్రీ కవిత్వ లక్షణాన్ని ఆవిష్కరిస్తాయి. ఈ కవితలన్నీ స్త్రీ కేంద్రిత మార్పు దిశగా చేసిన కొత్త ప్రతిపాదనలు. ఆమె స్వరంలో ఎంతటి ఉద్వేగ తీవ్రత ఉందో అంతకు మించిన ఆలోచనా స్థాయి కూడా ఉంటుంది.

జ్ఞాపిక పేరిట చరణ్ పుస్తకం ‘ఉదయించే ఊపిరి’ గురించి మరొకసారి మాటాడుకుందాం. అయితే అమ్మ పేరిట అపర్ణ చేయదలుచుకున్న వైవిధ్యపూరితమైన పనిలో ఇంకాస్త సృజనాత్మక కష్టాన్ని ఆశించడంలో తప్పు లేదేమో. ఎందుకంటే ఈలాంటి అద్భుతమైన ప్రయత్నాలే సాహిత్య సూత్రాల్ని తిరగరాస్తాయి. దాసరి శిరీష వ్యక్తిత్వం అంత గొప్పది కదా మరి.

*

శ్రీరామ్ పుప్పాల

ఈ తరం కుర్రాళ్ళలో శ్రీరాం కవిత్వాన్నీ, విమర్శనీ సమానంగా గుండెలకు హత్తుకున్నవాడు. అద్వంద్వం (2018) అనే కవితా సంపుటితో పాటు, బీమాకోరేగావ్ కేసు నేపథ్యంగా 1818 (2022) అనే దీర్ఘ కవితని ప్రచురించాడు. తనదైన సునిశిత దృష్టితో వందేళ్ళ వచన కవితా వికాసాన్ని 'కవితా ఓ కవితా' శీర్షికన అనేక వ్యాసాలుగా రాస్తున్నాడు. ఆ వ్యాస సంకలనం త్వరలో రావలసి ఉంది.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు