మనిషి చనిపోయాక ఆత్మ ఏమౌతుందో ఎవరికీ తెలీదు. ఒకవ్యక్తి చనిపోయాక ఆ వ్యక్తి శరీరాన్ని వారసులు ఏం చేస్తారో కూడా ఆ వ్యక్తికి తెలీదు. కానీ మనిషి – బతకడం ఎట్లా బతికినా – మరణం తర్వాత జరిగే కర్మకాండగురించి చాలా ఆలోచిస్తాడు. అట్లా ఆలోచించిన మురారితల్లి ఏం చేసిందనేదే పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారి ‘‘పగిలిన గాలిబుడగ’
తన పనేమిటో, తానేమిటో తప్ప చవకబారు ప్రసంగాలు చెయ్యడం, ఇతరులగురించి మాట్లాడడం అలవాటులేని మితభాషి, నలుగురిలో పెద్దమనిషిగా చలామణి అవుతున్న శంకర్రావు పనికట్టుకుని వచ్చి మురారి పక్కన కూర్చుని, మురారి తల్లినిగురించిన కఠోర వాస్తవాన్ని అతని చెవిలో వేసి, ‘ఉద్రేకపడవద్దు, బాధపడవద్దు, నెమ్మదిగా, నింపాదిగా వ్యవహరించండి, కోపతాపాలు పనికిరావు’ అంటూ నచ్చచెప్పి వెళ్ళాడు. శంకర్రావు చెప్పింది విన్నాక మురారి ఆఫీసు పనిమీద మనసు నిలపలేక, ఎట్లాగో కాలం గడిపి, టైమయ్యాక ఆఫీసునుండి బయటపడ్డాడు. బస్టాండులో, లీలామహల్ క్యూలదగ్గర అడుక్కునేవాళ్ళందరినీ పరిశీలించి, పరీక్షించి, వాళ్ళలో తన తల్లి లేదని నిర్ధారణ చేసుకుని, ‘శంకర్రావు ఎవర్నిచూసి ఎవరనుకున్నాడో’ అని తనను తనే సమాధాన పరుచుకుని ఇంటి ముఖం పట్టాడు. మురారి ఇల్లు చేరేటప్పటికి తల్లి మరణించి ఉంది. ఆవిడ ట్రంకుపెట్టెలో చిల్లరనాణేల మూటలు కనిపించాయి. ‘మురారికి దుఃఖం పొంగి వచ్చింది’ అంటూ కథని ముగిస్తారు సుబ్బరామయ్యగారు.
మురారి తల్లి ఏం చేసింది? – బస్టాండులో, లీలామహల్ క్యూల దగ్గర అడుక్కుని డబ్బు సంపాదించింది.
తిండిలేకనా… తిప్పలు లేకనా… ఎందుకు ఆ పని చేసింది? – తాను చనిపోయాక కార్యక్రమాలు నిర్వహించడానికి కావలసినంత ధనం కొడుకుదగ్గర లేకపోతే… జరగవలసిన కర్మకాండ సక్రమంగా జరగకపోతే… తన ఆత్మకి సద్గతులుండవు. శరీరాన్ని విడిచిన ఆత్మను ఉత్తమలోకాలకు చేర్చడానికి అవసరమైన ధనం కొడుక్కి సంపాదించి పెట్టింది ఆ ముసలావిడ. ఉందో లేదో తెలీని పరలోకంలో ఉత్తమగతులు పొందాలన్న ఆరాటం – ఇహంలో కొడుకు పరువుప్రతిష్ఠలగురించిన ఆలోచన లేకుండా నీచమైన జీవన విధానాన్ని అవలభించేలా ఉసికొల్పింది పెద్దావిణ్ణి. కొడుకు బాధ పడతాడు, అవమాన పడతాడు అన్న ఆలోచన చెయ్యలేకపోయిన ఆత్మకు – ధనాభావంవల్ల మరణానంతరం తనకు ఉత్తరక్రియలు సక్రమంగా జరిపించడేమోనని కొడుకుమీద అనుమానపడిన ఆత్మకు – శాస్త్రోక్తంగా అపరకర్మలు జరిగినంత మాత్రాన సద్గతులు ప్రాప్తిస్తాయా?
ఒక మూఢ ఆచారాన్ని, గుడ్డి నమ్మకాన్ని ఏమాత్రం వాచ్యం కాకుండా చాలా నేర్పుగా ఎండగట్టారు సుబ్బరామయ్యగారు ఈ కథలో. కాలం గడిచేకొద్దీ ఈ విధమైనఖర్చు విపరీతమైపోయింది, వేలంవెర్రిగా మారింది.
‘మెడికల్ కాలేజీకి దేహాన్నిచ్చి ఏవగింపు కలిగించే కర్మలనుంచి తప్పించుకోగలిగారు’ అన్నారు పి.సత్యవతిగారు సుబ్బరామయ్యగారి గురించి.
మన సమాజంలో వైద్యకళాశాలకు దేహం ఇవ్వాలన్న కోరిక చాలామందికి తీరదు – అందుకు శ్రీశ్రీగారుకూడా మినహాయింపు కాదు. కానీ సుబ్బరామయ్యగారు సాధించుకున్నారు. ధన్యులు.
*
Add comment