1
అన్ని రంగుల్నీ మేసిన చీకట్లు
శబ్ధాలన్నిటినీ నిద్రపుచ్చుతాయి
అర్ధరాత్రి దాటాక
నిశ్చల కొలనులో కప్ప ఒకటి దూకుతుంది
కలత వలయాలు
చుట్టుముట్ది దాడి చేస్తాయి
వలయాల మధ్య ఒక నిర్నిద్ర ద్వీపం
నీటి మీది పడవలా మెత్తగా
మేలుకుంటుంది
ఎంత జాగ్రత్త పడినా-
వేసిన స్విచ్ చటుక్కున పేలుతుంది
తలుపు గొంతు
కిర్ర్ ర్ ర్ న పగులుతుంది
నల్లా తిప్పితే నయాగరా పుడుతుంది
కలం కంకర రోడ్డు మీంచి
బరబరా నడిచి పోతుంది.
2
రాత్రికి వినికిడి ఎక్కువ
నిశి స్వరానికి నోరెక్కువ
3
ఏదో ఒక రోజున కాలం
మనిషి మీద శాశ్వత నిశ్శబ్దాన్ని కప్పిపోతుంది
ఉన్నట్టుండి
శబ్దాలు ఉనికిని పోగొట్టు కుంటాయి
కదిపినా కుదిపినా కౌగిలించినా
గుండె పగుళ్ళు రక్తం కార్చినా
మౌన పొరలు యేమాత్రం చిరగవు
ఇక ఏ శబ్ధమూ
నిశ్శబ్దాన్ని గాయపరచ లేదు
చాలా బాగుంది
ఏ శబ్ధమూ నిశ్శబ్దాన్ని గాయపరచలేదు బాగుంది సార్
Superb ఉపమానాలు sir