సంగీత సాహిత్య నదులను ఏకం చేస్తూ దొరలిన గంధర్వ లోకం తను. ఆమె స్వరపేటిక, నితాంత మధుర స్నిగ్ధ వాటిక. ఆమె ఎవరెవరో కాదు. మన తెలుగు వాకిళ్ళ శాశ్విత చిరునామా. తన గానంతో మన అంతర్లోకాల విస్తృతిని, లోతులనీ పెంచుతూనే పోయింది. శ్రోతల వేదనాస్తిత్వాలను ఇప్పటికీ ఉయాలలూపుతూనే వుంది, ఎప్పటికీ ఆమె మనకు అమ్మే. మన బాలసరస్వతీదేవి. తన పాటతో ఏది మనం చెప్పుకోలేమో, ఏది పూర్తిగా విప్పారని దుఃఖముంటుందో, ఏ స్వరచిత్రం మన జీవానుభావాలకు అడ్డం పడుతుంతో. ఆమే.. మన సంపూర్ణ చిత్రలీలా గాయని బాలసరస్వతి. గత ఎనభై దశాబ్దాల కాలాన్ని తన వెంట, తన తొవ్వ వెంట, తిప్పుకుంటూ నడిచి వస్తూనే వుంది. ఆమె ఈ లోకంలో లేకపోవడం కాదు.
ఆమె లేని ఈ లోకమే లేకపోవడం. “ఆ తోటలో వొకటి ఆరాధనాలయము”, చాలదా ఎనభైలోని డెబ్బై సంవత్సరాల లలిత సంగీత జీవాన్ని పట్టి నిలిపి వుంచిందనటానికి. ఈ లలిత సంగీతం రేడియోతో మన జీవితాల్లోకి తెలిచల్లని నీడలాగా ప్రవేశించింది. మేధస్సులో నిద్రించే untamed అరణ్యాలను మచ్చిక చేసింది. మన శ్రవ్యతకు సభ్యతను నేర్పిందనడానికి… బాలసరస్వతి గారి గొంతును, తెలుగు శ్రోతలు తమ పెదవులపై ఇంకా తారట్లాడిస్తూనే వున్నారనడానికి ఉదాహరణ.
ఆమె పాట మన మదిలోపలి నదిపై తేలుతూపోయే నావ. దాని అలల విరుపు ఎంత స్పష్టమో… అంతే అస్పష్టం. ఆ పాటల ఊగిసలాట అంతా రెండు బలమైన సౌరకేంద్రాల మధ్య లోలకంలాగా వూగుతూంటుంది. ఒకటి అమ్మ/కన్నతల్లి. రెండు ప్రేమికురాలు/మధురమూర్తి. ఈ రెండు బిందువుల మధ్య ఆమె పాటల genre అంతా compose చేయబడివుంది.
పాటల content కూడా జోలపాటల, లాలిపాటల సంగతులతో వొక extreme centre లో తిరుగాడుతూంటే… మరో వైపు ప్రేమికురాలి వివిధ రస పార్శ్వాల నిగారింపు వలయిస్తూ వుంటుంది. బాలసరస్వతి పాటలు మనం వదిలేసి వచ్చిన అనేక ఏకాంతాల, ఎదురుచూపుల, విరాగగతుల, లాలింపుల, భక్తిలోని తెగింపుల, నమ్మకాల, ప్రకంపనాల, ధ్వనుల, ఉదాత అనుదాత్త స్వరాల, ఔడవ, సంపూర్ణ రాగాల fusion అయ్యి…., వాటితో మళ్ళీ మన పంచేంద్రియాల సమూహాలను తిరిగి పూర్వ స్థానాలలో నిలబెట్టి, కాపాడి వస్తూంటాయి. అందుకే బాలసరస్వతిని మనం నిష్పూచిగా ఆదిమ గానపదయోగినిగా… గుర్తించి సేదతీరవచ్చు. పాటలో ఆమె ఆత్మను పట్టుకోగలిగితే దుఃఖమూలాలను ఆకళింపు చేసుకున్నట్టే అనుకోవచ్చు. ఎందువల్ల అంటే దుఖం, సంగీతానికి మూలహేతువు కాబట్టి. ఆమె పాటల స్వరాలలోని సర్వ ప్రకంపనలూ ఆమె పాటల్లో సవ్వదించిన అనుభవాన్నే స్పష్టపరుస్తాయి.
ఆమె పాటలు… వినగలిగితే చెవి మొత్తం వొక దేహంగా metamorph అయిపోతుంది. వాటిలో ఇవి కొన్ని మాత్రమే…
“తానే మారెనా”
“ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా”
“హాయయ్మ్మ హాయి మా పాపాయీ”
“తన పంతమే తా విడువడు”
“గోపాలకృష్ణుడు నల్లన”
“ధరణికి గిరి భారమా… గిరికి తరువు భారమా”
“నల్లనివాడా నే కన్నెనోయ్”
“తలుపు తీయునంతలోనె”
ఇవి విన్నవారు మీండ్ తరానాలైపోతారు. వినగానే ముందుగా పెను అశాంతికి లోనవుతారు. అది క్రమంగా వొక ఎడతెగని శాంతికి దారి చూపుతుంది. వొక దివ్యానుభవ స్థితి మనలను కమ్ముకుంటుంది. కవనవచనాలకు ఇంకా పై స్థాయి అనుభవ ప్రస్తారాన్ని అవి కలిగిస్తూంటాయి. ఆమె గార వైడుశ్యంలో వొక అక్కమహాదేవి… వొక బేగం అక్తర్, వొక గాలిబ్, వొక రియాజ్ ఖాన్, కుమార్ గాంధర్వ, బడే గులాం ఆలీఖాన్, బేగం పర్వీన్ సుల్తానా, కవయిత్రి మొల్ల వంటి… గంధర్వ సమ్మెలనముంటుంది. విశ్వమోహన సిద్ది కలుగుతుంది.
***
1990, 91 లలో నేను ప్రతీ ఉదయం నా కవిత్వ కాగితాలను జేబులో పెట్టుకుని సీతాఫల్ మండిలోని జావేద్, అఫ్సర్ ల ఇంటికి పోతూండేవాణ్ని. ఇరానీ హోటల్స్ లో సగం ఛాయ్ లని అనుభవిస్తూ కవిత్వాన్ని వినిపిస్తూ గల్లీల్లోని రకరకాల షాప్స్ దగ్గర హైద్రాబాదీ జిన్దగీని ఆశ్వాదిస్తూ గడుపుతూన్న రోజుల్లో… ఒకసారి వొక ఇరానీ హోటల్ పక్కనే ఉన్న రేషన్ షాపు దగ్గర కిరోసిన్ కోసం పెద్ద క్యూ form అయ్యి వుండడం చూసా… ఆ క్యూలో అనామకంగా ఖాళీ డబ్బా పట్టుకుని రావు బాలసరస్వతీదేవి నిలబడి వున్నారు. ఆమెను ఎవరూ గుర్తించరక్కడ. నేను గుర్తించినా… నా లాంటి – విమోహితుడు తప్ప. అప్పటినుంచి నేను ఇప్పటికీ కాలిపోతూనే వున్నాను. నా “బొమ్మల బాయి” కవితల సంపుటిని ఆమె ఆవిష్కరించినా కూడా గుర్తెరగనట్టుగా శూన్యశరణంగా మోకరిల్లుతున్నాను ఆమెకు.
***
Very apt and touching tribute to a great legend.