నిత్యం సామాజిక చైతన్యంతో ముందుకు సాగే రత్నాజీ నేలపూరి ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధ బీభత్సవం పై ఇటీవల ‘గాజా లేని జాగా’ అనే దీర్ఝ కవితను అచ్చువేశాడు. గతంలో ఒకే గొంతు, నెత్తుటి మరకలు అనే రెండు దీర్ఘ కావ్యాలు రాసిన అనుభవం ఉంది. అంతే కాకుండా హైకూలు, నానీలు, కవిత్వ సంపుటాలను అచ్చువేశాడు. వివిధ సమకాలీన అంశాలపై తన సంపాదకత్వంలో పలు సంపుటాలను తెచ్చి సమాజాన్ని జాగురతపరుస్తున్నాడు ఈ కవి.
రత్నాజీ నేలపూరి రాసిన ఈ దీర్ఘ కవితను చదువుతున్నంతసేపు దుఃఖం ఊబికి వచ్చింది. ముఖ్యంగా కళ్ళ ముందు రక్తమోడుతున్న చిన్నారుల ప్రతిబింబాలు మనసును అల్లోకల్లోలం చేశాయి. ఎంత విషాదకర దృశ్యం? ఎంత గుండె కోత?? ఈ బీభత్సవంలో వేల సంఖ్యలో మహిళలు, ముఖ్యంగా చిన్నారులు మరణించడం అత్యంత బాధాకరమైన విషయం. అందుకే కవి గుండె ద్రవించి పోయింది. పసిపిల్లల గాయాలకు కవి తన అక్షర లేపనాలు అద్దుతూ జరుగుతున్న పరిణామాలపై ఈ దీర్ఝ కవిత ద్వారా చాలా ఆవేదనతో ఆక్రోశమై గొంతెత్తాడు.
“ఎందుకో ఈ పూట అన్నం
సయించటం లేదు
గిన్నెలో తెల్లని మల్లెపూల మెతుకులు
రక్తం రంగులోకి మారిపోతుంటే
గుండె కంపనంతో పగుళ్లు దీరుతోంది”
*
“ఈ మారణకాండ చూశాక
ఈ దుఃఖ స్రవం విన్నాక
నాలోని
సముద్రాలు
ఇంకిపోయాయి
నాలోని
ఆకాశాలు
చితా భస్మమైపోయాయి”
కవి ది ఎంత దుఃఖం? ఎంత వేదన? కళ్ళముందు నెత్తురు రాలి పడుతుంటే ఎవరికి మాత్రం ఆకలి వేస్తుంది? మెతుకులన్నీ రక్తం గా మారుతుంటే నోట్లో ఎలా ముద్ద దిగుతుంది??
రోజుల తరబడి యుద్ధం. ఎటునుండి ఏ రాకెట్ దూసుకొస్తుందో, ఏ బాంబు దేహాన్ని చీల్చి బద్దలు చేస్తుందో తెలియని భయం గాజాలోని ప్రతి మనిషిని వెంటాడింది. ఇంకా వెంటాడుతూనే ఉంది. అటువంటి స్థితిలో ఏ మనిషికైనా అన్నం ఎలా సయిస్తుంది? అందుకే కవి కి ఇక్కడ అన్నం సహించ లేదు. గుండె బద్ధలై రోదిస్తున్నాడు.
“ఏ దేశమైనా సరే యుద్ధ శిబిరాల్లో
ఆడదాని అంగాలే ఛిద్రమవ్వాలా!?
పసిపిల్లల మెదళ్ళే పేలిపోవాలా??
ఏ యుద్ధంలోనైనా సామాన్యుల బతుకులే ముందుగా కూలిపోతాయి. అందులోనూ మహిళలు, చిన్నారులే ఎక్కువగా బలిపశువులవుతున్నారనేది చరిత్ర చెబుతున్న సత్యం. ఇక్కడ కవి ప్రశ్నలో నిజం ఉంది. మతం ముసుగులో జరుగుతున్న మారణకాండపై ఆక్రోషం ఉంది. అందుకే,
“నా మనిషితనం ఏ మతం మీదైనా
తిరగబడమనే చెబుతుంది
రక్తపాతమే మతం అభిమతమైతే
మనషుల చావుతోనే
దాని ఆకలి తీరుతుందనేది నిజమైతే
ఆ మతం పులిని మట్టుబెట్టడానికి
ఆ దేవుణ్ణి శిక్షించే తీరుతాను” అంటాడు కవి.
“వైశ్యామ్యాలు లేని వంతెనల మీద దాటుకుంటూ
సెల్ఫీ తీసుకుందామని
తోటల మధ్య నిలబడ్డాను
నా కళ్ళ ముందో
పాలస్తీనా పిల్ల తల తెగిపడింది”
ఎంత హృదయవిదారకమైన దృశ్యం? మనమంతా ఆధునిక కాలంలో ఉన్నామనే భావనే తప్ప పయనం మాత్రం ఇంకా ఆదిమ దశలోనే ఉంది. చుట్టూ అణ్వాయుధాలను కట్టుకొని తిరుగుతున్నాం. మతం, ఆధిపత్యం పేరుతో కొట్టుక చస్తున్నాం.
అభం శుభం తెలియని పిల్లలు కదా వాళ్ళు. దేశాల మధ్య వాళ్ళకు సరిహద్దులు తెలియవు. వాటి మధ్య పాతుకున్న ముల్లకంచె గోడలు తెలియవు. వాళ్ళు ఎగిరే సీతాకోకలు. చందమామ కోసం ఉవ్వెత్తున ఎగిసే పిల్లలు. అటువంటి పిల్లలు యుద్ధ సైనిక విమానాలు చిమ్మిన బూడిద కింద కప్పబడుతున్నారని, తుపాకి తూటాలతో దేహాలన్నీ చెల్లాచెదరైపోతున్నాయంటూ..
“అటుఇటు గురిపెట్టుకున్న తుపాకులకేం తెలుసు
అవి కంటాయ నొప్పులు పడతాయా
వాటికి యుద్ధమే తెలుసు ప్రాణం పోయటం రాదు” చెబుతూనే..
“మీ తుపాకుల్ని పువ్వుల్ని చేయండి
శ్రద్ధాంజలి ఘటిద్దాం ఆ సమాధుల మీద రేపటి
శాంతి చిగురు మొక్క నవ్వుని ఆహ్వానిద్దాం” అని ఆ పసి పిల్లల పెదాల మీద నవ్వుల ప్రపంచాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసాడు కవి.
‘నీకు ఆకలేస్తుందా పాపా
నీకు అమ్మనయ్యి
పాలు పట్టిద్దామంటే నాకు పాలిండ్లు లేవు”
కవి ఎంత తండ్లాడిపోతున్నాడో? పిల్లల ఆకలి తీర్చడానికి అమ్మనవ్వలేకపోతున్నాననే కవి ఆవేదనగా పలికిన వాక్యాలు మన గుండెను తట్టి లేపుతాయి.
‘యుద్ధం ఆపమని చెప్పు నాన్న’ అనే ఖండికలో అమ్మానాన్నలతో ‘పాప’ జరిపిన సంభాషణ మనల్ని బాధగా వెంటాడుతుంది. యుద్ధం తమ్ముడిని, చెల్లిని మింగేసిందని, బుజ్జి మేకను చంపిందని, ఒంటె రక్త మోడుతూ చావు బతుకుల మధ్య కాళ్ళు కొట్టుకుంటూ ఎదురుగా వచ్చి చచ్చి పడిందని బాధపడుతూ.. ముగింపులో,
“ఈ అసహ్య మానవుడికి చెప్పు నాన్న
యుద్ధం వొద్దని
అవును ఇప్పుడు
ఎలా చెబుతావ్
యుద్ధం నిన్ను కూడా చంపేశాక.” అన్నప్పుడు మన కళ్ళు చెమర్చుతాయి.
అసలు యుద్ధాలు ఎవరికోసం? ఎవరిని కాపాడుకోవడానికి? ఎవరికి ఎవరు శత్రువులు? ఎవరికి ఎవరు మిత్రులు?? అంటే దేనికి సరైన సమాధానం దొరకదు. అలా దొరకనంతవరకు చచ్చిపోతూనే ఉంటాం. ఎవరికి ఎవరు మిగులం. కాబట్టే
“సంధి చేయండి
తుపాకులు దించండి” అని కవి పాలకులకు హిత బోధన చేశాడు. ‘మీ గుండెల్లో తేమ ఊరితే నా బాధమయా అక్షర విత్తనం ఈ విశ్వమంతా విత్తండని’ ప్రాధేయపడ్డాడు. నా చుట్టూ ఎవరైనా ఉంటే ముందుకు రండి అంటూ ‘నా శోకాన్ని తర్జుమా చేసి ప్రపంచానికి వినిపించండని కోరాడు.
“మనసే జీవనరాగం
మనస్సుడే నా బృందగీతం
ఆ మనిషే నాక్కావాలి”
కవి మనిషి కోసం వెతుకుతున్నాడు. మనిషి కోసం తండ్లాడుతున్నాడు. మనిషి మనిషివాసన కోల్పోతున్నాడని, ఊరూరా గాలించైనా సరే మనిషి వాసన వేసే మనిషి కోసం తపస్సు చేస్తానని అంటున్నాడు. ఒకవైపు యుద్ధవంలో చావులు చూస్తూ చలించడం లేదంటే మీలో మనిషి కనుమరుగైపోయిండని చెబుతూ..
“దేశం దేశాల నుంచి
మనిషి మనిషినుంచి
అప్పు తెచ్చుకోవచ్చేమో గాని
మనిషితనం దొరకాలంటే
మనసు పెట్టి చూడు
ప్రతి పిల్ల చావులోనూ దొరుకుతుందేమో.” అంటూ అందరికి సత్యం మార్గాన్ని చూపాడు.
యుద్ధంతో దేశాలను కొల్లగట్టగలం. సరిహద్దుల్ని జరపగలం. మహా ఐతే ఇంకో విస్తీర్ణాన్ని కాలికింద తొక్కి పట్టుకోగలం. కానీ మనషుల హృదయాలను ఎప్పటికీ గెలవలేరని కవి స్పష్టం చేస్తూ చివరికి,
“అప్పుడే పుట్టిన ఓ బిడ్డ
నులువెచ్చని మూత్రం పోసిన
తన నిరసన ప్రదర్శనలో
నువ్వొక కూలిన విమాన శకలమై
కాలిపోతావ్” అంటూ యుద్ధోన్మాదులకు హెచ్చరిక జారీ చేస్తున్నాడు. మానవ శ్రేయస్సు కోసమే నా ఈ గేయం అంటూ శాంతిని ప్రకటన ఇచ్చాడు.
పదిహేడు భాగాలుగా సాగిన ఈ దీర్ఘ కవితలో కవి జరుగుతున్న సంఘటనలను వివరిస్తూనే మనిషితనం, మతం మీద చర్చ పెట్టాడు. పెట్టుబడిదారీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేశాడు. చివరిగా ఏ యుద్ధమైనా సమస్త జీవరాశిని చంపుతుందని, శాంతి మాత్రమే ప్రపంచ కన్నీటిని తుడిచేసే మైత్రి అని ప్రకటించాడు.
మొత్తంగా ఈ దీర్ఘ కవితకు ఎంచుకున్న వస్తువును సమగ్రంగా ఆవిష్కరించడంలో కవి విజయం సాధించాడు. ఒకటి, రెండు చోట్ల ప్రవాహ గుణంలో కొంత లింకు తెగినట్లు కనిపించినా వస్తువు ప్రాధాన్యత విషయంలో మాత్రం ఎక్కడా లోటు కనిపించలేదు. అర్థవంతంగా తన భావాలను వ్యక్తీకరించినతీరు అందరిని ఆకట్టుకుంటుంది. ప్రయోగించిన భాష లో ఎక్కడా క్లిష్టత లేకపోవడం వల్ల సులభంగా పాఠకులకు చేరుతుంది. అక్కడక్కడ వాక్యాలలో తాత్విక గాఢత కనిపిస్తుంది. మనిషి పుట్టుక నుండి అభివృద్ధి చెందే క్రమంలో మతం, ఆధిపత్యం పేరుతో చివరికి ఎలా తనను తాను నాశనం చేసుకుంటున్నాడో, మనిషితనాన్ని ఎలా కోల్పోతున్నాడో ఈ దీర్ఘ కవిత చెబుతుంది. ముఖ్యంగా యుద్ధంలో చిన్నారుల మరణ దృశ్యాలు కవి తన అక్షరాలతో ఆవేదనగా మలిచినతీరు కంటతడిపెట్టిస్తాయి. ఐతే ఎత్తుగడతోనే ప్రవాహంలా సాగిన ఈ కవిత ముగింపుకొచ్చేసరికి కాస్త బిగువు తగ్గినట్టు కనిపిస్తుంది. ఊహించినదానికంటే భిన్నంగా భావ వ్యక్తీకరణ జరిగినప్పుడు ఈ తేడా కనిపించడం సహజం. అది ఆయా పాఠకుల ఆలోచన విధానంపై ఆధారపడి ఉంటుంది.
రత్నాజీకి సమాజంలో జరుగుతున్న వివిధ సంఘటనల పట్ల వెంటనే స్పందించే గుణం ఉంది. అంతేగాకుండా అనేక జాతీయ, అంతర్ఙాతీయ అంశాలపై నిశిత పరీశీలనతో పాటు మంచి రాజకీయ దృష్టి ఉంది. కాబట్టే గాజా దుఃఖాన్ని వివిధ కోణాలలో పాఠకులముందుంచి, ఆ దుఃఖాన్ని, తన దుఃఖంగా చేసుకొని అక్షరమయ్యాడు. మనుషులను తట్టి లేపి మేల్కొల్పే ప్రయత్నం చేశాడు. ఈ పుస్తకానికి అప్సర్ మరియు తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ లు ముందుమాటలు అందించారు. వీరిలో ‘గాజా గురించి ఎంతమంది తెలుగు మేధావులు ఎన్ని రాసినా, సాహిత్య జీవులనుంచి సరైన స్పందన లేదని నా పిర్యాదు’ అని ఒకరు అంటే, మరొకరు ‘ఇలాంటి వస్తువుల్ని దళిత కవులు గాక ఇంకెవరు స్వీకరిస్తారు? అని మరొకరు ఒక ప్రశ్నను సంధించారు. ఏది ఏమైనా వారు లేవనెత్తిన అంశాలను కాస్త లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకుంటే మాత్రం బుద్ధిజీవులైన మనం ఈ విషయాలపై కొంత ఆత్మ పరిశీలన చేసుకోవలిసిన అవసరం కూడా ఉందని భావిస్తూ, ఈ సందర్భంగా దుఃఖంతో ఎడారవుతున్న గాజా మళ్ళీ చిగురుతొడగాలని కోరుకుంటూ కవికి అభినందనలు తెలియజేస్తున్నాను.
*
మంచి కవిత.
-vaasu-