ఊక కుంపటి లో నిప్పు
చల్లారిందనుకుంటే
నిప్పు కొస ఎర్రగా చిగురించడం
చూసి నీకు లేఖ రాస్తున్నాను
నిన్ను దోపిడీ చేస్తున్నారు
ఆర్తనాదలు నిద్రలేపినప్పుడు
మాతృత్వాన్ని మోస్తున్న అనందం
దోపిడీ కింద నలిగి పోవడం వింటే
ఎవరో ముఖానికి ముసుగు వేసి
బిగించినట్టు అనిపిస్తే
నీతో నాలుగు అక్షరాలు పంచుకుంటున్నాను
ఆడ పిల్లల వెనక
ఒక్క మొగ నలుసు కోసం
నెలలు నిండని
పిండాలు రాలిపోతుంటే
తల వొంచుకుని
అనారోగ్యం చీకటిలో
గుమ్మనికి కొట్టుకుని
సిగ్గుపడుతూ
బ్యాండ్ఎయిడ్ వేసుకున్నట్లు
తాయత్తు కట్టున్న రోజు
జ్ఞాపకాల కొమ్మకి తగిలి
నెత్తురు చిమ్మితే
నీతో చెప్పుకుంటున్నాను
కాటుక జ్యోతిష్యంలో
పొయ్యి ఆకారాన్ని చూసి
ఏడ్చిన కళ్ళు
గర్భసంచిని నమ్ముకోలేదన్న
నిజాన్ని నీ ముందు ఒప్పుకుంటున్నాను
పిల్లలు పుట్టరంటే
బెంగ లోయలో పడి
దుఃఖ సముద్రం ఈదుతూ
నిన్ను తిట్టుకోని రోజు లేదంటే
ఆశ్చర్యపోవు కదూ
మంత్రాలు మహిమలు
తయాత్తులు దేవుళ్ళు మొక్కులు
అన్నీ నీ చుట్టూ తిరుగుతుంటే
నాకో ఉనికి ఉందని మరచిపోయి
నీలోకి తొంగి చూడకుండా
సంచిలో చేయి పెట్టీ
సామానులు అన్నీ తీసుకుని
మడత పెట్టీ దాచేస్తారని
తెలిసిన రోజున
నా ముఖం
నీళ్ళల్లో కొట్టుకు పోతే
ముఖం లేని వేళ్ళతో
నీకు ఉత్తరం రాస్తున్నాను
ముట్లు పోయిన సంచికి
గొంతుక ముఖం లేదు
ఆర్తనాదాల రక్తం
గాయాన్ని తడిమి నిద్రలేపాయి
ఇకనైనా సంచీకిఒక ముఖం
వస్తుంది అనే ఆశతో ముగించే
వేయి గొంతుకల అక్షరాన్ని….
*
సంఘానికి చెంప దెబ్బ