గరిమనాభి

గులు తెంపుకున్న పల్ల బర్రె ఏ దిక్కువోయ్యిందో
ఊర్లకు ఊర్లు జల్లెడవడుతున్న దెవులాట

మారెమ్మ గుడికింద రాగిరేకుల యంత్రం
గవ్వలిసిరేసి ప్రశ్న చెప్తుంది దాసర్లపెల్లి దేవునమ్మ
తూర్పుకు మూడు బాటలు
జువ్వి చెట్టు నీడలు పరిమర్క
నాలుగు రేగళ్ళు నిమ్మల్ల గడ్డలు

బుద్దారం పొలిమేరల్లో
కామంచె గంటల్లో మేస్తున్న పసురం
కండ్లవడ్డంక గుక్కెడు నీళ్లు తాగిన దుఃఖం

గల్మలు ఎర్రమన్నుతోని అలికిన వాసన
సుద్ద రాళ్ళ ముగ్గు పంచపాలి నీ ప్రాణవాక్కు
నాలుగు పిడికెలేస్తే
దాలి నిండా పొద్దుందాక మసిలే పాలు
పెద్దనేలు మందం మీగడ కట్టు
అద్దసేరు బుడ్డి నిండా ఎన్నపూస
సల్లకవ్వాలు నీ బతుకు సంతకాలు

చిట్యాల మునుగోడు చిన్నానపురం
పొద్దూక ఇల్లు జేరిన మూడు రెక్కల పెద్ద పక్షి
మోటగిల్లలు అమ్ముకొచ్చిన పైకం
అయిదు పాళ్లు పంచుకోంగ ఆపూట
మోట బండల మీద కోసిన ఆసామి యాట
కాళ్ళు తలకాయ తక్కెడు కూర
రేకలువారంగ రవ్వగాలానికి కుచ్చిన చందమామలు
అటికెల ఉడుకుతున్న నీ చేతి కడుపు తీపి

పూర్వం
భైరిగోడు గడ్డ
మల్త దేవుని బండ మీద
ఇప్పుడు నిలవడ్డది మూడో తావు
రచ్చ కిష్టమ్మ రాయని చరిత్ర
ఊరి పొలిమెరల వొలపోత

ఏనెసర్పగుండ్ల నల్లచెర్వుకట్ట
మాలింగంబండ మీద ఆలుమాలు లేని పానవట్టం
తావులు తప్పిన బొడ్డురాయి
పక్షులుడిసిన గూడు పల్లె గోడు
కలి కుండలు ఎత్తేసుకోని
కూరాడు ఇడిసి తరాలు బాసి
కడపమొద్దు లేకుండ పీక్కపొయిన రక్తబంధాలు

సున్నపురాళ్ల బట్టికింద మహిషబంధం
కోలలోతు పుట్ట కన్నెల్ల
నల్లచిత్రమూలం నాగసిందూరం ఎర్రకలమంద
పాకం కుదరని బంగారు భస్మాల పరుసవేది
దీప కంచుడు అంచులకు ఎర్రమట్టి ఎల్లిగారపు పూత

గంగదేవమ్మ తలవోసుకున్న చినుకులావాన
ఎల్లమ్మ పడిమీదికి పాలువోసిన బెల్లన్నం
పాలవెళ్ళికి కట్టిన తీరొక్క పండ్ల కింద పదహారు బూరెలు
నోము దండలు నీ నొసట నిత్య పసుపుకుంకుమలు

కోటివేయిల దిక్కులు తిరిగి
సవలక్ష కథలు కలెమెలిగినా
పేర్పుల నిండా ప్రేమలు ఒలికినా
భవంతుల పడెంత్రం భ్రమలుపడ్డా
అమ్మ నీ చేతి దీవేనార్తి గర్భ చనుబాల కుతి
ఊగి ఊగి లోకమంత ఏలివచ్చినా
తల్లి నీ ఒడి తలదాసుకునే గరిమనాభి

*

విశ్వనాధుల పుష్పగిరి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అటికెల ఉడుకుతున్న నీ చేతి కడుపు తీపి
    సల్ల కవ్వాలు నీ బతుకు సంతకాలు
    నోము దండాలు నీ నొసట నిత్య పసుపు కుంకుమలు

    బావుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు