పుట్టింది రేమిడిచర్ల,ఎర్రుపాలెం మండలం,ఖమ్మం జిల్లా. ఉపాధ్యాయ వృత్తి నల్లవసంతం,తప్తస్వరం,రెండు కవితా సంపుటాలు. అన్ని,దిన,వార,పక్ష, మాస పత్రికలు, ఇంటర్నెట్,టీవి, రేడియోలో వివిధ సంకలనాలలో కవితలు ప్రచురితం, ప్రసారం. ప్రస్తుతం ఖమ్మం లో నివాసం.
1
Air bells
నీ కదిలిక చిరు గాలి
అలా మెల్లగా తెరలు తెరలుగా
గుండె గదిలో లోలకాలుగా
ఆరోహణ అవరోహణ క్రమంలో
లోహ గొట్టాల స్వర మాధుర్యం
ఇంద్రచాపం లాంటి
గాజుల చేతులతో
పింగాణి పూల కూజాలను తాకినపుడు
తనువొక గిటార్ స్ట్రింగ్
రాగ మాధుర్యపు మదువొలుకుతంది.
నువ్వు నడయాడిన మేర
గోడల అంటిన డెకరేటెడ్ బటర్ ఫ్లైస్
2 BHK లలో పూల వనాలను సృష్టిస్తాయి.
నువ్వు
వరి కుచ్చువై ఇంటి తోరణం ఐనపుడు
బంధుగణం కువకువ రాగాల పావురాలై
ఆనందాల బృందగానాలవుతారు
భోజనపు బల్లను నువ్వు
అపురూగా సిధ్దపరుస్తున్నపుడు
పిల్లలు ఒలీవ మొక్కలై
వెండి నవ్వులు ఫిలిగ్రీలవుతారు.
మిలమిల మెరుపుల నయనాలతో
నీ గుండె అక్వేరియం లో
మమ్మల్ని గోల్ల్ ఫిష్ లా సాకుతంటావు
ఒక మంద స్మిత
ఋతవు ఎప్పుడూ
వాసంత వెల్లువై ఇంటిని
నియాన్ బల్బ్ కాంతిపుంజం చేస్తుంది.
నువ్వు
నా నూరువరహాల మొక్కవి
నేను నీ చుట్టూ పరిభ్రమించే హమ్మింగ్ బర్డ్ ను
( సహచరి స్వర్ణ కోసం )
2
లోయ నుంచి పిలుపు
నేను
కొండవాలులో
పూల రాసిగా మారిన పెద్ద
బండ రాయిపై కూర్చొని
అరమోడ్పు కళ్ళతో
సారంగి తో స్వరం కలుపుతాను.
నువ్వు
మెడుస్సావై స్నేక్ హేర్ తో
నావైపుగా అడుగులు కదిపావు.
నీ కళ్ళతో రమించాక
దయతో నన్ను స్థాణువుగా మార్చలేదు
ఆ లేలేత నవ్వులకు
కొండపైనుండి తేనె జలపాతాలు
పొంగినాయి
నీ సౌకుమార పాద స్పర్శకు
అగాధలోయలు మెట్టలూ
వనాలుగా విస్తరించాయి.
కాలం గోడపై
నేను పురుషుడిగా
నువ్వు ప్రకృతిగా చెరో నినాదమయ్యాక
లోకం తెర తీసింది
వర్ణమయ సీతాకోకల సమూహంగా
నదులు
నీటి కాళ్ళతో నడిచినంత మేర
నాగరికత పంట ఋతువై పరవశించి
నీ పాద యుగళ మంచు అందియలై
కొత్త దారుల్లో
భూపాళం పాడుకుంటూ సాగుతుంది.
Add comment