గమ్యం లేని పయనం  

1

యాత్ర అనేది అనేది కేవలం బహిరమయినది మాత్రమే కాదు, ఆంతరికమైనది కూడా. లోపలి దానిని బయట వెతుకుతున్నామో, బయటి దానిని లోపల వెతుకుతున్నామో చెప్పడం కష్టం. అసలు లోపలా బయటా వేరు వేరా, ఒక్కటా?

సత్యాన్వేషణ కి మార్గం, గమ్యం అనేవి ఉన్నాయా? అనంతమైన ఆకాశంలో, జీవితమనే అంతులేని చీకటిలో అక్కడక్కడ సత్యానికి కళ్ళు తెరచిన వారే నక్షత్రాలై ప్రజ్వలిస్తారు. అటువంటివారు ఈ పథికుడు నవలలో మనకు పుష్కలంగా కనిపిస్తారు.

ఈ వెతుకులాట ఇప్పటిది కాదు. ఇప్పుడు మొదలు పెట్టింది కాదు.

“మన మూలాలకి మనమే వారసులం కాదా! మన నరనరాలలో మన పూర్వికులు ఉండనే ఉన్నారు. వాళ్లు, నేను, నువ్వు అన్ని ఒకరే… జన్యు పరంపరే… మరి ఎవరి కోసం ఈ వెతుకులాట? సత్యం కోసమా? తన కోసమా?”…పేజి 58

ఇది ఒక పథికుని కథ. ఇది అనేక పథికుల కథ కూడా. కానీ వారందరూ రచయిత్రి అనుభవాల్లోంచి, ఆలోచనల్లోంచి వచ్చిన వారేనంటే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె ఈ నవలలో మానవ జీవితపు చీకటి మూలాల్ని తడిమి చూశారు. కాంతి చొరరాని మూలల్ని వెతికారు. లోకమంతా తనతో మనల్నీ తిప్పారు. అనేక వ్యక్తుల జీవితాల్ని మన చేత జీవింపజేశారు. ఆ విధంగా అనేక ముఖాలలో, తలాలలో ప్రయాణించిన మనం సత్యాన్వేషణలోకి మనకు తెలియకుండానే అప్రయత్నంగా చొరబడి ఇరుక్కుపోతాము. ఆ తరువాత ఆ పాత్రలు మనలో జీవిస్తాయి, మనలోనూ కొనసాగుతాయి. అవును, ఈ యాత్ర ఇప్పుడు మొదలైనది కాదు. మొదటి మానవుడి దిగులు నుండి ఇప్పటి వరకూ కొనసాగింది. ఇక పైనా కొనసాగుతుంది.

“ప్రయాణం, ముఖ్యమా? గమ్యం ముఖ్యమా?

నిజానికి గమ్యం లేని ప్రయాణాలు చాలానే ఉంటాయి జీవితంలో. అయితే జీవితం అంటే గమ్యం చేరడం కాదు, గమ్యం కోసం చేసే ప్రయాణం.”…55

మనిషి మనసే అనేక యుగాల అనుభవాల సమాహారం. అది వ్యక్తిగతం కాదు. అందువల్ల ఈ పథికుడు ఎవరు అని ఎవరికైనా సందేహం కలుగడం న్యాయమైనదే! నువ్వు, నేను, శివ, సత్య, మయూఖ … మరో వెయ్యేళ్ళ తరువాత పుట్టే వ్యక్తి కూడా పథికుడే..

“నీ చుట్టూ ఉన్న ప్రపంచం నీ స్వరూపం మాత్రమే అని తెలుస్తుంది. నీ తల మీద వాలిన సూర్యకాంతీ, నీ తల మీద ఆకాశాన్ని సృజిస్తూ ఎగిరే పిట్టా, నీ చుట్టూ ఉన్న మనుషులూ, వాళ్ల దిగుళ్లూ, భయాలూ, సంతోషాలూ, కలలూ అన్నీ నీవే అని అర్థమవు తుంది. అన్నిటినుండీ వ్యక్తమవుతున్నది నీ స్వరూపమే అని, అద్దంలో కనిపిస్తున్న మొహం అంత స్పష్టంగా తెలియవస్తుంది. అప్పుడు నీలోపల నిజమైన ప్రేమ ఉదయిస్తుంది. నేనూ నువ్వులకీ, ఇవ్వటమూ తీసుకోవటాలకీ అతీతంగా ఉన్న ప్రేమ… వెన్నెలలా, నదిలా, వర్షంలా ప్రవహించిపోతూ ఉంటుంది. అప్పుడు కాలం ఒక నైరూప్య వస్తువు కాదు, అది ఓ ప్రేమగానం. అది స్పటికంలాగా స్వచ్ఛంగా ఉండే అనుభూతి.”…పేజి 42

2

మన స్నేహితుల గురించి కావచ్చు, ఆప్తుల గురించి కావచ్చు, మనకు చాలా తెలుసని అనుకుంటాం. కాని వారి రచనలు చదివినప్పుడు మనకు వారి గురించి ఎంత తక్కువ తెలుసో అర్థం అవుతుంది. ఒక వ్యక్తి యొక్క అంతఃప్రపంచపు వైశాల్యాన్ని వారి రచనలు మాత్రమే అర్థం పడతాయి. ఎంతో నిరాడంబరమైన, ప్రేమాస్పదమైన వ్యక్తిగా రచయిత్రి మణి గారు రెండు ఏళ్లుగా నాకు తెలుసు. కాని నిజానికి పథికుడు పుస్తకం చదివాకనే ఆమె యదార్థమైన లోతు నాకు తెలిసింది.

“అసలు ఈ అస్తిత్వం అర్థం ఏమిటి? అసలు జరిగే ప్రతి చిన్న విషయం గురించి కూడా ఆలోచనలు… అసలు దేవుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు? ఆకాశంలోనా, సముద్రంలోనా? లేకపోతే నీడలా కనిపించకుండా వెనకే ఉంటాడా?

తన ఆలోచనలన్నీ ఆయనకు తెలుస్తాయా? నిజంగా దేవుడికి అసిత్త్వం ఉందా?”…56

“గమ్యం నిర్ణయించుకొని ఎక్కలేదు. ప్రయాణం ముఖ్యం అనుకున్నాడు. రెండు పగళ్లు, రెండు రాత్రులు ప్రయాణం చేసి గౌహతీ చేరుకున్నాడు.”…38

“నా కళ్లు ఒక వాక్యం నుంచి మరొక వాక్యానికి గమనం సాగిస్తున్నాయి అచ్చు జీవితం కోసం ప్రయాణిస్తునట్లు. అసలు అదొక దైనందిన చర్యగా మారుతుంది. ఈ నాటకంలో జరిగే ఒక అంకంలో మన చుట్టూ తిరిగే రంగుల పరదాలు, కదిలే దృశ్యాలు వాటి తాలూకు స్పందనలు- పూరించాల్సిన ఖాళీలు.

ఇలా జీవితం అంతంలేని పెద్ద వాక్యంలా అనిపిస్తుంది.

అర్ధమయినట్లు, ఒక నిజ స్వప్నం చూస్తున్నట్లు ఉంది.”…37

“నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో నేను అంతుచిక్కని శూన్యంలో ఉన్నాను.”… 29

“దానికి అతను, “yes, ఏదైనా సత్యాన్వేషణ చేయాలన్న, ఉత్తేజం పొందాలన్నా సంచారం చేయాలి… ఇంకా ఏదో తెలుసుకోవాలి. ఒక్కచోట ఆగిపోకుండా ప్రయాణం కొనసాగించాలి. యెంత శోధన చేస్తే అంతకు రెట్టింపు సమాధానం దొరికే అవకాశం ఉంటుంది.”… 46

     ఇటువంటి వాక్యాలు రచయిత్రి అంతర్దృష్టిని, తత్వచింతనని మనకి పట్టిస్తాయి.

3

రచయిత్రి మణి గారి రచనల్లో కనిపించే మరో ముఖ్య లక్షణం sophistication. Sophistication అనేది కేవలం ఆధునిక కాలానికి చెందినది అనుకుంటారు చాలా మంది. అది నిజం కాదు. అది సార్వకాలీనమైంది. ఆమె పాత్రలు జీవన మూలాల్లోకి లోతుగా, బలంగా వేర్లను చొప్పించి ఉన్నప్పటికీ ఆధునికత అనే ఆకాశంలో శాఖోపశాఖలుగా, బహుముఖీయంగా విస్తరించి తల ఎత్తుకుని మెరుస్తాయి. Sophistication అంటే urban తీరుని పట్టడం కాదు. అది చాలా మంది చేయగలుగుతారు. Sophistication అనేది అక్షరాల్ని పట్టివుండే ఒక మెరుపు. ఆ మెరుపు భావ పరమైనది, సాంకేతికమైనది కూడా. కొందరు రచయితకు మాత్రమే సాధ్యమైనది.

తెలుగు సాహిత్యంలో కొరవడింది ఈ Sophisticationనే. ఎక్కువ భాగం పాత చింతకాయ పచ్చడి. అర్బన్ రాపర్లు చుట్టినప్పటికీ చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడే.  Sophistication అనేది కళ యొక్క నాణ్యతకు సంబంధించిన విషయం. కళాకారుడి హృదయం ఆధునికత కోసం తెరుచుకొని ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. రచయిత బాగా నలిగిన బాటల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడగలిగినప్పుడే, నిజానికి ఇష్టపడడం కాదు, ఇష్టపడకుండా ఉండలేని స్థితి లో అతడు ఉన్నప్పుడే sophistication సాధ్యపడుతుంది. అలాకాకుండా వేరేలా రాయలేని స్థితి అతనిలో బలంగా ఉండాలి. అదికాక వేరేది స్పృశించలేని స్థితి అతనిలో ఉండాలి. అప్పుడే కదా sophistication సాధ్యపడేది! అందుకే అది బహు అరుదైన అంశంగా తెలుగు నవలా సాహిత్యంలో మిగిలిపోయింది. మణి గారి నవల ఆ లోటుని తీరుస్తుంది.

4

చక్కగా కందెన పట్టించిన చక్రంలా మణి గారి వచనం వడి వడిగా, సున్నితంగా, కుదుపులు – కరకరమనే ముతక శబ్దాలు లేకుండా కవితాత్మకంగా కొనసాగుతుంది. ప్రకృతి సౌందర్యం – మానవ సంవేదనలు మిఠాయిలో నెయ్యి, చక్కెర ఖచ్చితమైన పాళ్ళలో కలిసినట్టు చక్కగా అమరివుంటాయి.

“రాత్రి ఎప్పుడూ రహస్యంగాను, గంభీరంగానూ అనిపిస్తుంది. ఒక్కోసారి ఈ రాత్రి అందాన్ని చూస్తూ అలాగే పోవాలనిపిస్తుంది.”

“అప్పటికే కుమాపున్, గర్వాల్ మంచు శిఖరాల వెనుక నుండి పసుపు నారింజ రంగుల కలనేతతో ఆకాశం అద్భుతంగా ఉంది. ఇక సూర్యబింబం పైకి వస్తున్న క్షణాలు… అందరూ బొమ్మల్లా నిలబడిపోయారు.”

మణి గారు ఉత్తమ అభిరుచి గల రచయిత్రి. ప్రతి వాక్యంలోనూ ఆ అభిరుచి, భావ సంపన్నత కనిపిస్తాయి. ఆమె లోపలి చూపు కనిపిస్తుంది. గంభీరమైన విషయాన్ని అత్యంత సరళంగా చెప్పగలగడం ఆమెకున్న శక్తి. ఇక్కడ శక్తి అని ఎందుకు అంటున్నానంటే సరళత్వాన్ని సాధించడమే జీవితంలో అత్యంత కష్టమైన విషయం గనుక.

“ఒక్కో పొరను వలుచుకుంటూ వెళుతుంటే జీవితం గురించి స్పష్టం అవుతోంది. ఇదో నిరంతర పరిక్రమణ భ్రమణం. ఒక స్వప్నం నుంచి ఇంకో స్వప్నంలోకి ప్రయాణం. మృణ్మయ మరణంలోంచి మళ్లీ మళ్లీ అంకురించే జీవం. అదో విశ్వంభరావృత్తం.

శూన్యం, సృజనం, జీవితం ఒక వాస్తవ చిత్రం.”…25

కడుపునిండా ఆహారం తిన్నాక సాయంత్రం వేళ నిశ్చింతగా కొమ్మల మీద కూర్చుని అనాయాసంగా, అప్రయత్నంగా పాటలు పాడుకునే పక్షుల హృదయంలోని తేలికదనం ఆమె వచనంలో ఉంటుంది. పంటి కింద రాయలా ఏ భావంగానీ, ఏ విషయంగానీ తగలనే తగలదు. విషాదం కావచ్చు, సంతోషం కావచ్చు, మృదువుగా ముందుకు సాగిపోతుంది.

“అదో అనుభవం. నీలో ఉన్న నువ్వు గురించి తెలుస్తుంది. కాలాలు, ఋతువులు, రాత్రింబవళ్లు, ఆనంద విషాదాలు, నాలోనే, నాతోనే, మనం, మేము అనేది వట్టి ట్రాష్ చివరకి మిగిలేది ఏకాంతమే. భయాలు, బాధలు, అనుభూతులు అన్నీ రహస్యంగా నేనులోనే ఉంటాయి కాబట్టి”…40

5

ముఖ్యంగా కథ అనే ప్రక్రియ ఒక మనిషిని పట్టిస్తుంది. మణి గారి రచనల్లోని ప్రకృతి వర్ణన ఎంతో హృద్యంగా ఉంటుంది, సౌందర్యభరితంగా ఉంటుంది. భావోద్వేగాల చిత్రమైన చిత్రన ప్రకృతి వర్ణనతో మిళితం చేసే తీరులో ఎంత నేర్పరితనం ఉంటుంది.

“మయూఖ మనసంతా ఖాళీగా శూన్యాన్ని నింపుకుంది. ఇంతకుమించి వేరే ఏది అవసరం లేదేమో అన్నట్లుగ ఉంది. ఈ సౌందర్యం ముందు అసలు జీవితమే అల్పంగా కనిపిస్తోంది.”…పేజి 63

పథికుడు నవలలో నేను గమనించిన మరో అంశం detailing. ఆమె జీవితాన్ని, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిశితంగా గమనిస్తారు. ఆ ప్రపంచం యొక్క సూక్ష్మ వివరాలను ఒడిసి పడతారు. భావ చిత్రాలతో పాటు యదార్థ వ్యథార్థ జీవుల వేదనలు, నిస్సహాయత ఆమె చూపు నుండి దాటిపోవు.

ఫుట్ పాత్ మీద నిశ్చింతగా నిద్రపోతున్న బిచ్చగాడిని చూసి అమె పాత్రలు అసూయ పడతాయి. ఖరీదైన కారులో నిర్లక్ష్యంగా వెళ్లే యువకుల నవ్వులు సైతం ఆమె వినికిడి నుండి తప్పించుకోలేవు.

“నిజానికి ఎవరు కూడా తిన్నగా తమ చూపును కేంద్రీకరించలేరు. ఎందుకంటే చూపు ప్రసరించే లోపల ఎన్నో అడ్డంకులు వస్తూనే ఉంటాయి. వదిలేసాము అనే భ్రమలో ఉన్న మనకు తెలియదు అవి వెంట వస్తున్నాయని”

ఇటువంటి వాక్యాలలో ప్రతిఫలించే ఆమె సునిశితమైన అంతర్దృష్టి తెలియకనే తెలుస్తుంది. స్వయంగా రచయిత్రి ఒక యాత్రికురాలు కాకుండా ఈ స్థాయిలో అసాధారణమైన detailing ని సృష్టించడం అసాధ్యం. జీవితంలో అర్థాన్ని వెతుక్కునేవారందరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది. ఈ నవలను రచయిత్రి తెచ్చి పెట్టుకున్న ఆదర్శాలతోనూ, అరువు తెచ్చుకున్న కృత్రిమ సందేశాలతోనూ, తాను చూడని, అనుభవించని, అనుభూతి చెందని విషయాలతోనూ నింపలేదు. ఆమె జీవితంలో ఆధ్యాత్మికతను చూస్తారు, ప్రకృతిలో చూస్తారు. ఆమె చూపే పథికుడు. ఆమె అన్వేషణే పథికుడు. ఆమె తెలుసుకున్న జీవనసారమే పథికుడు.

ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పుస్తకాన్ని చదివితే భారతదేశం అంతా తిరిగి వచ్చినట్టే, దాని పవిత్రమైన ఆత్మను స్పర్శించినట్టే.

వివరాలు:

పేజీల సంఖ్య: 76

ధర: 150rs

పోస్టల్ చార్జీలు:60rs 

నేరుగా కొనుగోలుకు 8558899478 (whatsapp only) అనే నెంబరుకు సంప్రదించండి.

కొనుగోలు లింక్స్:

Amazon:

https://www.amazon.in/gp/product/B0DB6D5964/

website link:

https://books.acchamgatelugu.com/products/pathikudu

శ్రీరామ్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Thank you So much Sriram.
    చాలా చక్కటి సమీక్ష చేసినందుకు. ప్రచురించిన సారంగ టీమ్ కి కూడా ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు