గద్దర్ ఉద్యమమై రెక్క విప్పినప్పుడు…

హదారులు దిగి, కాలనీలు దాటి, సందుగొందుల్లో ప్రవేశించినప్పుడు ఒక స్వరం నిన్ను వెంటాడుతుంది. భారత దేశం భాగ్య సీమరా, పాడి పంటలకు కొదువ లేదురా.. బంగరు పండే భూములున్నవి.. చావు ఎరుగని జీవనదులురా.. సకల సంపదలు గల్ల దేశములో దరిద్రమెట్లుందో నాయనా.. అన్న గద్దర్ స్వరం ఆ మురికివాడల్లో ప్రతిధ్వనిస్తుంటుంది. అది ఢిల్లీలోనే కాదు, దేశంలో ప్రతి ఊరులోనూ మనకు కనపడుతుంది.

గద్దర్ నాకు 1976 నుంచీ అనుభవంలోకి వచ్చారు.  వరంగల్ లో నేను ఇంటర్,డిగ్రీ చదువుకుంటున్న రోజుల్లో గద్దర్ పాటలు మొత్తం జనాన్ని ఉర్రూత లూగిస్తున్న రోజులవి. కాకతీయ యూనివర్సిటీలో ఆయన ప్రదర్శన చూశాను. 1980లో ఇంద్రవెల్లి కాల్పుల తర్వాత ఆ నెత్తురు ఆయన స్వరంలో ప్రజ్వరిల్లడం తిలకించాను. 1990లో చెన్నారెడ్డి ప్రభుత్వ హయాంలో నిజాంకాలేజీలో జరిగిన భారీ బహిరంగ సభలో అశేషజనాన్ని గద్దర్ అలరించడం కన్నాను. కాజీపేట రైల్వే స్టేషన్ వద్ద జరిగిన బహిరంగ సభలో గద్దర్ స్వరం  రైళ్లు, బస్సుల  నిండా జనం వచ్చి ఉప్పెనలా ప్రవహించేలా చేయడాన్ని చూశాను.  గద్దర్ ఒకఉద్యమం..ఆ ఉద్యమం రెక్క విప్పినప్పుడు చూసి అట్టుడికిపోయే  అవకాశం నాకు అనేక సందర్భాల్లో లభించింది.

..

1992లో నేను ఢిల్లీ వచ్చిన తర్వాత కూడా ఆయన చాలాసార్లుకలిశారు. నా కోసం మా ఆఫీసుకు వచ్చేవారు. ఆయన ఢిల్లీలో అజ్ఞాతంగా ఉండేవారు..  ఒక సమయంలో నాకు ఉద్యోగ సమస్య వచ్చినప్పుడు “మీరు వైట్ కాలర్ ఉద్యోగులు.శ్రమ చేస్తే కాని మీకు దాని విలువ తెలియదు.ఒక్కసారి శ్రమ చేయొచ్చుకదా..”అని అడిగారు.”నేను పెరిగిన వాతావరణం వల్ల  నాకు కూలి చేసి బతకడం రాదేమో సార్..ఠఅన్నాను. “పోనీ ఇండియాగేట్ వద్ద పల్లీలు అమ్మి బతికేవారెందరు లేరు “ అన్నారాయన. “ఎండనకా, వాననకా అలా చేయడం నాకు చేతకాదు సార్.. బౌద్దిక జీవనానికి అలవాటు పడ్డాను..”అని చెప్పారు. “నిజమే.. నేను ఆ దృష్టితో ఆలోచించలేదు..”అని ఆయన అంగీకరించారు. ఉత్తరాదిన హిందీలోఅక్కడికక్కడే పాటలు అల్లి ఉర్రూతలూగించడాన్ని నేను కళ్లారా చూశాను.  భారత్ అప్నే మాతృభూమి, ఇస్ కే కహానీ సునోరే భాయ్ … సుజలాం, సుఫలాం ఇసే దేశ్ మే రోటీ మహంగే క్యోం రే భాయ్” అన్న గద్దర్ స్వరం ఉత్తరాదిలో మారుమ్రోగేది. ఎన్నో సిద్దాంత గ్రంథాల కంటే ఈ పాట లోని ప్రతిపదం విలువైనది.

తెలుగు సాహిత్యంలో పాటకూ, ప్రజా జీవనానికి, ముఖ్యంగా శ్రమ జీవనానికి సంబంధం ఉన్నదని సిద్దాంత రీత్యా నిరూపించిన నేత గద్దర్. శ్రమజీవులు తమ శ్రమ ను మరిచిపోవడానికి ఆలపించే సృజనాత్మక గానమే పాట అని ఆయన చెప్పారు. జార్జి థామ్సన్ ‘హ్యూమన్ ఎసెన్స్’ పుస్తకం నేను చదివి ఈవిషయం తెలుసుకున్నాను కాని అంతకు ముందే గద్దర్ ఆ విషయం నాకు తెలిపారు.

పాట అనేది ఒక ఆయుధం. ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆయుధం, దోపిడీకి వ్యతిరేకంగా ఆయుధం. వ్యవస్థ దుర్మార్గాలకు వ్యతిరేకంగాఆయుధంగా భావించిన కవి గద్దర్.   ప్రజల రాజకీయ పోరాటాలతో ఆయన పాటలు మమేకమయ్యాయి.పాటల ద్వారా సిద్దాంతాన్ని చెప్పిన ఏకైక కవి గద్దర్.

సామాన్య జీవుల జీవితాల్లో చుట్టూ ఉన్న వాటినే తన ప్రతీకలుగా మలిచారు. గద్దర్ ప్రతిఘటనాసంకేతాలు అణగారిన నేపథ్యంలోంచే వస్తాయి. జనజీవితంలోభాగమైన సామాన్య పదజాలాన్నిఆయన వాడారు. మిడతలు,చీమలు, పిల్లులు, కుక్కలు,డప్పులు, చీపుళ్లు, చెప్పులు ఇలాంటివి ఆయన కవితలల్లో భాగమయ్యాయి. . కిర్రు చేప్పులు,చెత్త కుండీలు,పాయఖానాల్లో ఆయన జీవన సౌందర్యం చూశారు.

“ఇంటి ముందు పెరడులోనా జౌన్నసేనై మేము పుడుతం,వొంటికాలు మీదనిల్చి కొడుకునిమ్మని వ్రతం కడుతం,మీరు జొన్నకంకులయి పుడతారా మా బిడ్డలు” అని ఆలపించే గద్దర్ మన మట్టి, చేను, పాడి, పశువు, పేడ, పంట ఉత్పత్తుల చుట్టూ, అడవి,  వెన్నెల, చిగురాకుల మధ్య మన జీవితాలు ఉన్నట్లు చెప్పారు. శ్రమైక జీవన సౌందర్యానికి ఆయన ప్రధాన స్రవంతి సాహిత్యంలో గౌరవాన్నితెచ్చిపెట్టారు.

తెలుగు సాహిత్యంలో విస్మృత వర్గాల జీవితం గురించి తొలుత వచన సాహిత్యంలో వ్యక్తమయిందని అంటారు. కాని మౌఖిక సాహిత్యంలో కొన్ని శతాబ్దాలుగా విస్మృత వర్గాలు తమ జీవితాల్ని ఆలపిస్తూనే ఉన్నాయి.  ఇటాలియన్ తత్వవేత్త గ్రాంసీ, ఫ్రెంచి విప్లవం, రష్యా విప్లవంతోపాటు అనేక ఉద్యమాలు సాహిత్యంలో శ్రమ జీవుల పాత్రను తెలియజేశాయి. శ్రీశ్రీ ఈ విషయాన్నితన కవిత్వం ద్వారా తెలియజేశారు. అంతకంటే ప్రతిభావంతంగా గద్దర్ తన గానం ద్వారా తెలుగు ప్రపంచానికి వెల్లడించారు. అంతేకాదు. మార్క్స్,ఎంగెల్స్, మావో సిద్దాంతాల్ని చాలా తేలిక భాషల్లోపాటల్లో దింపింది గద్దరే. “రాజకీయ అధికారం కొద్ది మంది చేతుల్లోఉన్నది. వారి దగ్గర భూమి ఉంది. భూమి మన చేతుల్లోకి రావాలి” అని చెప్పి కొండపల్లి సీతారామయ్య సిద్దాంతీకరించిన వ్యవసాయ విప్లవం పాత్రను తన గళం ద్వారా వ్యక్తీకరించిన మేధావి గద్దర్.

“దళిత జీవుల విముక్తి పోరు భూమి పోరుతో ముడివడి ఉంది” అని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. “భూమి ఇస్తనని భూమిపట్టాఇచ్చారండి

భూమెక్కడోతెలపండి మా భూమెక్కడో తెలపండి” అని నిలదీశాడు. “భూమిని తల క్రిందు చేసి బువ్వ పంచి పెట్టెటోడ” అని రైతుకూలి ను గురించి అంత అద్భుతంగా చెప్పిన కవి మరొకరు లేరు.

“మతాలల్లో మర్మాన్ని ఇప్పి సెప్పుదాం, దేవుండ్ల గుట్టంత బయటపెట్టుదాం, గుణం లేని కులాల గుట్టు చెప్పుదాం,మత పిచ్చిగాల్ల మత్తు దించుదాం.” అని మత పిచ్చిని అత్యంత  ప్రతిభావంతంగా ఎండగట్టారు.

నేను జర్నలిస్టు,కవిని కాకముందే  వ్యవస్థ, రాజ్యస్వభావం, సమాజంలో దోపిడీ వర్గాలనుంచి గద్దర్ నుంచి నేను నేర్చుకున్నాను. మనిషిని మనిషి గౌరవించడం గురించి నేర్చుకున్నాను. గద్దర్ నాలోని భయాన్నిమాత్రమే కాదు, మధ్య తరగతి భయాన్ని కూడా  పోగొట్టాడు. ఒక నినాదాన్నిమాలో  ప్రవహింపచేశాడు. మాలో  జనాన్నీ ప్రవహింపచేశాడు. సామాన్యుడి రక్తమూ, నా రక్తమూ ఒకేలా వేడెక్కేలా చేశాడు. నాలో గోడలు కూల్చాడు. పాదాలు సంకెళ్లు తొక్కి కదం తొక్కేలా చేశాడు. అడవి నాలో ప్రవేశించేలా చేశాడు. అడవిలోని పోరు నాలో ప్రవేశించేలా చేశాడు.  పాదాలు సంకెళ్లు తెంచుకుని  నాలోకదం తొక్కేలా చేశాడు. ఆకులన్నీ ఉప్పెనగా మారి, భూమిపై దుమారం రేపేలా చేశాడు.

పుట్టుక రీత్యా నేను అగ్రవర్ణం వాడినే కావచ్చు. కాని నా లాంటి  ఎందరో అగ్రవర్ణీకుల్ని కదిలించిన, వీధుల్లోకి లాగి నాకు మట్టి వాసన గురించి.చెమట విలువ గురించి, అట్టడుగు వర్గాల దౌర్భాగ్య జీవితం గురించీ  చెప్పిన మహానుభావుడు గద్దర్. మా పూర్వీకులు దారుణాలేమైనా చేసి ఉంటే అందుకు నాలో పశ్చాత్తాపం నీరై కరిగేలా చేసిన వాడు గద్దర్.  అందువల్ల ఆయనను దళిత, బహుజన వర్గాలు తమ వాడిగా కీర్తిస్తున్నప్పుడు అంబేద్కర్ లాగా ఆయన ఒక వర్గానికే పరిమితం అయిపోతారేమోనన్న భయం నాలో ఉన్నది. గద్దర్ ఒక వర్గాతీత వ్యక్తి. గద్దర్ ఒక ప్రజాసమూహం. ఈ సమూహం కొన్ని దశాబ్దాల పాటు తెలుగునాట సాంస్కృతిక విప్లవానికి మాత్రమే కాదు. సామాజిక కార్యాచరణకూ దోహదం చేసింది. ఈ విప్లవంలో నాలాంటి వారిని రెపరెపలాడించిన ఘనత గద్దర్ కే దక్కింది.

గద్దర్ సామూహిక విప్లవం కోసం జనాన్ని చైతన్య పరుస్తూనే ఆర్థిక వ్యవస్థలో అసమానతలను ప్రతిభావంతంగా వ్యక్తీకరించారు. “.  ప్రపంచీకరణ వికృత స్వరూపాన్ని గద్దర్ కంటే ప్రతిభావంతంగా చెప్పిన వారు  కూడా మరొకరు లేరు. “అంగట్లోని అన్నీ ఉన్నాఅల్లుని నోట్లాశనిఉన్నట్లు” అని థామస్ పికెటీ రాయకముందే ఆయన చెప్పారు. సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కావడం  గురించి చెప్పాడు. వ్యక్తి వైకల్యాన్ని (ఏలియనేషన్) గురించి మాట్లాడాడు.  పెట్టుబడిదారీ సంక్షోభం గురించి చెప్పాడు. సమాజంలో పేదరికం ఎందుకంది.. ఇన్ని వనరులున్నా పేదవాడు మరింత పేదవాడెం దుకు అవుతున్నాడనే ప్రశ్నలు రేగేలా చూశాడు.

గద్దర్  ఈ క్రమంలో కులవ్యవస్థ లోని దుర్మార్గాన్ని కూడా తెలిపారు. “బంగారు పంటలిచ్చె భారతగడ్డ మనది, గంగమ్మ ప్రవహించే – పుణ్యభూమి మనది, గంగాయమునా బ్రహ్మపుత్ర – కృష్ణా పెన్నా కావేరి ఎన్నెన్నో జీవనదులు  ప్రవహించే జీవగడ్డ మనదైనా  మాలమాదిగన్నలకే మంచినీళ్ళు కరువాయె” అని చెప్పారు. “మాదిగోని ఇంట పుట్టి  కాలికేమో చెప్పులేదు” అన్నవాస్తవాన్ని కళ్లకందించారు. “ఏలరో ఈమాదిగా బతుకు,మొత్తుకుంటే దొరకదిరా మెతుకు” అని రాసినప్పుడు గద్దర్ అస్తిత్వ ఉద్యమ కవిగా మాత్రమే గుర్తింపు పొందలేదు. చెరబండరాజు లాంటి వారు అద్భుతమైన కవిత్వం రాసి శ్రమజీవులంతా ఒకే కులం అని (ఏ కులమబ్బీ) అని చెప్పి చైతన్యపరుస్తున్నకాలంలోకూడా గద్దర్ కు కుల వ్యవస్థలోని అణిచివేత లక్షణం గురించి స్పష్టంగా తెలుసు.  కారం చేడు లాంటి సంఘటనలు జరిగినప్పుడు కుల దోపిడీని నేరుగా ఎదుర్కొంటే తప్ప ఉద్యమాలు సాధ్యం కాదని రంగంలోకి దిగిన చైతన్యశీలి గద్దర్. “దళిత పులులమ్మా,కారం చేడు భూస్వాములతోనీకలబడి నిలబడి పోరు జేసినా దళిత పులులమ్మా” అని దళితులను పులులుగా చిత్రీకరించి వ్యవస్థలోని దుర్మార్గాలను సంహరించాలని ప్రేరేపించిన కవి గద్దర్.. కేవలం జీవితాలను చిత్రించడమే కాకుండాఆయన సంఘటితం కావాలన్న,ప్రతిఘటించాలన్న సంకేతాలు ప్రతి పాటలోనే ఇస్తారు. “తిరగబడు” అన్న పదమే గద్దర్ ఆత్మ.

అదే సమయంలో “నిండు అమావాస్యనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడపిల్లపుట్టినాదే ఒ లచ్చ గుమ్మడి” అని రాసినప్పుడు వ్యవస్థ పెంచి పోషిస్తున్న స్త్రీ పురుష అసమానతల గురించి గద్దర్ కు స్పష్టమైన అవగాహన ఉన్నది. గద్దర్ రాజకీయాలు వర్గ రాజకీయాలను వ్యక్తీకరించాయి. భూస్వామ్యం, పెట్టుబడిదారీ విధానం మాత్రమే కాదు, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కూడా ఆయన పాటలు రాశారు. స్త్రీలను కూడాఆయనఅణగారిన వర్గాల క్రిందేభావించారు. అన్ని పోరాటాలు కలిసిపోవాలని ఆయనభావించారు.  మౌఖిక సాహిత్యానికీ, లిఖిత సాహిత్యానికీ మధ్య హద్దుల్నిఆయన చెరిపేశారు.

చరిత్ర పుటల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న గద్దర్ అవసరం గద్దర్ కళ్ల ముందే కరిగిపోవడానికి కారణం గద్దర్ మాత్రం కాదు. ఒక సామాజిక వైఫల్యం. నెత్తురు, త్యాగాల విలువలు తెలియని సైద్దాంతిక దారిద్ర్యమే!

(గద్దర్ జయంతి సందర్భంగా)

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు