కరీంనగర్ కొత్తపల్లిలో పుట్టి పెరిగి హైదరాబాద్ తన చిరునామాగా మార్చుకున్న శోభారాణి భట్ గారు తన పదమూడవ ఏట నుండి రచనా వ్యాసంగం ప్రారంభించారు.తన కవితలు ‘ఉదయం’, ‘వార్త’, ‘ఆంధ్రజ్యోతి’, ‘సాక్షి’ లాంటి పత్రికలలో అచ్చు అయ్యాయి .” నీలిమేఘాలు” ,” జులూస్”, “అనేక వచనం” వంటి సంకలనాలలో తన కవితలు చోటు చేసుకున్నాయి . వార్త లో “చెంచిత” శీర్షికకింద ఒక సంవత్సరం పాటు స్త్రీ అంతరంగ, బహిరంగాలను ఆవిష్కరించారు. “సుప్రభాతం” వీక్లీ లో సామాజిక ,రాజకీయ అంశాలపై వ్యాసాలు రాసారు. “మహాబోధి “, “గోల్కొండఖిల్లా” మాస పత్రికలకు సంపాదకత్వం వహించారు. భిన్న మహిళా సంఘాలతో కలసి పని చేశారు. బహుజన , తెలంగాణ ఉద్యమాలలో పాలుపంచుకున్నారు. తన కవిత్వాన్ని ‘అంగారక స్వప్నం” పేరుతో పుస్తక రూపంలోకి తీసుకవచ్చారు. వీరి కలంపేరు “ ఊర్మిళ “.
మీకు సాహిత్యం పై ఆసక్తి ఎలా కలిగింది? మీ కుటుంబంలోని సాహిత్య వాతావరణం గురించి చెప్పండి?
ఒక ప్రత్యేక కారణం లేదా సంఘటనో సాహిత్యంపై ఆసక్తిని కలిగించిందని చెప్పడానికి లేదు. సహజంగా నాకు తెలియకుండానే కలిగిందేమో. చిన్నప్పటి నుండి నేను కొంచెం ఎమోషనల్ అని అనుకుంటాను. భావుకత ఎక్కువ. మాది చాలా పెద్ద కుటుంబం. 9మంది పిల్లలం. మా బాపు స్కూల్ టీచర్. ఒక విధంగా బాపు ప్రేరణ అని చెప్పవచ్చు. ఎప్పుడూ ఆలోచనలో, ఆచరణలో ఒక తరం ముందు ఉండేవాడు (ఇప్పుడు తనకి 90 సంవత్సరాలు). ఇంట్లో చిన్న లైబ్రరీ , గ్రామఫోన్ రికార్డు ప్లేయర్ ఉండేవి. రోజూ రాతిరి కరుణశ్రీ కుంతీ విలాపం, పుష్పవిలాపం పద్యాలు, భారతంలోని పద్యాలు పాడి వినిపిస్తుండేవాడు. అలా సాహిత్యం పై అనురక్తి కలిగిందనుకుంటా.
ఎప్పటి నుండి రాస్తున్నారు. రాయడానికి ప్రేరణ ఏమిటి ?
నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు మొదటి సారి కవిత రాసాను. దానిని స్కూల్ లో టీచర్ చూసి మెచ్చుకున్నారు. స్కూల్ లో అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ లో ముందు ఉండేదాన్ని. ఒక గుర్తింపు ఉండేది. బహుశా ఆ గుర్తింపే నాలో ఉత్ప్రేరకంగా పనిచేసిందేమో. అప్పటినుండి రాస్తుండేదాన్ని. ప్రకృతి, స్నేహం, సమాజంలో అంతరాలు అన్నీ నన్ను ఒక ఆలోచనకు, ఉద్వేగానికి గురిచేసేవి. అలా కొన్ని వందలు రాసాను. అయితే జాగ్రత్త పరుచుకోవడం, అచ్చుకు పంపించడం అప్పటికి తెలియదు. మొదటిసారి ఇంటర్లో అలిశెట్టి ప్రభాకర్ తన పత్రిక ‘చిత్రిక’లో అచ్చు వేశారు. అలా కొన్ని అచ్చయ్యాయి. కాలేజీ మాగజీన్లో కూడా వస్తుండేవి.
సాహిత్యం మీలో ఎలాంటి ప్రశ్నలు రేకెత్తించింది. సాహిత్యం మీకు ఎలాంటి సమాధానాలు ఇచ్చింది ?
సాహిత్య పఠనం జీవితం గురించి ఎన్నెన్నో ప్రశ్నల్ని నాలో రేకెత్తించింది. నేను మొదట చదివిన రచనలు హింది మహారచయిత ప్రేంచంద్ కథలు, త్రిపురనేని గోపిచంద్ కథలు, నవలలు. అవి నాకు జీవిత వాస్తవికతను చూపించాయి. రవీంద్రనాథ్ టాగోర్ కథలు, నవలలు కూడా అప్పుడే చదివాను. చిన్నప్పుడు చదివిన లత, మాదిరెడ్డి సులోచన రచనలు సమాజం తీరుతెన్నులు, వ్యవహార శైలులపై పలు సందేహాలను కలిగించాయి.
రంగనాయకమ్మ రచనలు స్త్రీల ఉనికిపై స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగించాయి. విశ్వనాథ ‘వెయ్యి పడగలు’ మొదలు గురజాడ ‘కన్యాశుల్కము’, కొడవటిగంటి కుటుంబరావు, శారద కథలు… ఇలా దొరికిన ప్రతి పుస్తకం విడవకుండా చదివేదాన్ని. అయితే అన్నింటిపై అవగాహన ఎర్పడే స్థాయి అప్పుడు లేదు. తాఫి ధర్మారావు రచనలు సమాజం లోని ఆచారాలు, కట్టుబాట్లు, నమ్మకాలపై కొత్త కోణానికి తెర తీసాయని చెప్పవచ్చు. సమాధానాలు దొరికాయా అంటే లేదనే చెప్పాలి. ప్రతీ క్షణం మనలో మనం బేరీజు వేసుకుంటూ, సమాధానం దొరకకపోయినా సాగిపోవాలి.
మిమ్మల్ని ప్రభావితం చేసిన సాహిత్యం గురుంచి చెప్పండి ?
‘నేను’ అనే నా ఉనికిని ప్రశ్నించుకోవడం లత తరువాత రంగనాయకమ్మ రచనలు చదివాకే మొదలయింది. డిగ్రీలో అనుకుంటా చలంని చదవడం. స్త్రీ స్వేచ్చ ను చలం అర్ధం చేసుకున్నంతగా ఎవరూ అర్ధం చేసుకోలేదు. కానీ చలం చెప్పిన స్వేచ్చ వర్తమాన కాలంలో ఆచరణకు అందదు. చలం ఊహించిన, కోరుకున్న పురుషులు నూటికి నూరు పాళ్ళు ఇప్పుడైతే లేరు. కవుల్లో టాగోర్, కృష్ణశాస్త్రి, నండూరి సుబ్బారావు, శ్రీశ్రీ, తిలక్, అజంతా, ఇస్మాయిల్, రేవతీదేవి, జయప్రభ, విమల, ఘంటసాల నిర్మల, కొండేపూడి నిర్మల, శివలెంక రాజశ్వరీదేవిల కవిత్వం నన్ను అపరిమితంగా ఆకట్టుకుంది. నన్ను అమితంగా ప్రభావితం చేసింది శరత్ సాహిత్యమనే చెప్పాలి. శరత్ స్త్రీలు అన్ని వేళలా స్త్రీ తత్వాన్ని వదలకుండా వాళ్ళ వ్యక్తిత్వాన్ని గొప్పగా నిలబెట్టుకుంటారు. శరత్ నాయకులు వట్టి బేలలు. వాళ్ళ అస్తిత్వానికి ఉనికి లేదు. స్త్రీలపై ఏదో ఒక రూపంలో ఆధారపడి మాత్రమే మనగలిగే పాత్రలు. తమను తాము కోల్పోకుండా సంపూర్ణ వ్యక్తిత్వాన్ని నింపుకున్న మానసిక పరిణతి కలిగిన స్త్రీలు శరత్ నాయికలు.
సాహిత్యంలో ఇంకా భావజాలలకు స్థానం ఉందా ?
సాహిత్యంలో భావజాలాల స్థానం పరిమితం. ‘భావజాలం’ కేవలం ఒక ‘వాదం’గా, ప్రచారం ఏకైక లక్ష్యంగా తలెత్తినప్పుడు ఆవేశపూరితంగా పైకి లేస్తుంది తప్ప నిలకడగా నిలబడి మనలేదు. భావజాల ఉద్యమాలు ఎంత ఉవ్వెత్తున లేస్తాయో అంతే వేగంగా సద్దుమణిగిపోతాయి. ఆయా భావజాలాల స్ఫూర్తిని కవులు రచయితలు తీసుకున్నప్పుడు మాత్రమే మంచి సాహిత్యం వస్తుంది. వాదం, భావజాలం ఏదైనా రచయితలు దానిని స్వీకరించే తీరుపై దాని బాగోగులు ఆధారపడి ఉంటాయి. అప్రమత్తత కోల్పోతే సాహిత్య సృజన తన స్వభావాన్ని కోల్పోయి పాఠకునికి పనికిరానిదవుతుంది. తనను తాను ప్రశ్నించుకోవడం, సమాధానాల కోసం అన్వేషణ సాగించడం మానేసిన ఏ భావజాల సాహిత్యమైనా సత్తువ కోల్పోయి ఆత్మ న్యూనతకు లోనయి ‘ప్రదర్శన’ కళగా మిగిలిపోతుంది. తెలుగు సాహిత్యంలో కొంత కాలంగా సర్వత్రా కనిపిస్తున్నది ఈ పటాటోపమే.
తెలుగు సమాజంలో ఇప్పటివరకు స్త్రీవాద సాహిత్యం సాధించిన ప్రయోజనాలు, విజయాలు ఏమిటి ?
స్త్రీవాదం విజయాలు సాధించిందా లేదా అనేది పక్కన పెడితే స్త్రీలలో అస్తిత్వపు ఆలోచన మాత్రం రేకెత్తించింది. ‘నేను’, ’నా ఉనికేమిటి?’, ‘నాకు ఏమి కావాలి?’, ‘నేను కేవలం అబలనేనా?’ వంటి ప్రశ్నలను పాఠకుల మదిలో కలిగించిన స్త్రీవాద సాహిత్యం తనను తాను నిలబెట్టుకోవాలనే ఆసక్తిని, ఆశని వారిలో కలిగించింది.
స్త్రీవాద సాహిత్యం ఇప్పుడు పలచబడ్డదని భావించవచ్చా?
జ. మొదట్లో ఉన్న ఉరవడి ఇప్పుడు లేకపోయినా అది ఇచ్చిన అవగాహన స్పష్టత మాత్రం ఇప్పటికీ నిలిచే ఉన్నాయి. ఎంత ఉవ్వెత్తున లేచిందో అంతే తొందరగా ముగిసిపోయింది. పురుషులను శత్రువర్గంగా చూడకుండా స్త్రీల ఆత్మ గౌరవం, ఆత్మాభిమానాలకు ప్రాధాన్యం ఇచ్చి వుంటే ఈ నాటికీ మనుగడలో ఉండేది. స్త్రీ వాదం ఒక భావజాలంగా పురుష భావజాలంలోకి పరకాయ ప్రవేశం చేసి తన అస్తిత్వాన్ని కోల్పోయింది. కెరీరిజానికి ఉపయోగపడింది. కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడింది. అడ్డదారుల్లో అవార్డులు తెచ్చుకునే స్థాయికి దిగజారింది.
దళిత బహుజన స్త్రీవాదాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? ఇది స్త్రీవాదం లో వైవిధ్యమా లేక లోపమా ?
మన సమాజంలో స్త్రీల మధ్య అంతరాలు లోలోతున పాతుకుపోయి ఉన్నాయి. అగ్రకుల స్త్రీలు దళిత బహుజన స్త్రీలకు మధ్య కనీకనపడని దూరాలు ఈనాటివి కావు. బతుకు పోరాటంతో పాటు వాళ్ళ వాళ్ళ అస్తిత్వాన్ని ఆత్మాభిమానాన్ని నిలుపుకునే పోరాటం దళిత బహుజన స్త్రీలది . బతుకు వాళ్ళకొక పెను సవాలు. స్త్రీలంతా ఒకటే అనేది నూటికి నూరు పాళ్ళు మోసపూరితం. దళిత బహుజన స్త్రీవాదం కొత్త సాహిత్య సృష్టికి దారులు వేసింది.
మొదట్లో ధిక్కార స్వరం వినిపించిన మీ కవిత్వం ఇప్పుడు తాత్వికతను ఎక్కువగా ప్రదర్శిస్తున్నది. ఇది ఎలా సంభవించింది ?
ధిక్కారాన్ని మాత్రం వీడలేదనే చెప్పాలి. అయితే అప్పటి ఆలోచన, అవగాహన వేరు. కాలం తో పాటు పొందే అనుభవాలు మనలో మార్పుని సహజంగానే కలిగిస్తాయి కదా. అనుభవానికి అనుభవానికి మధ్య అనుభూతికి అనుభూతికి మధ్య మార్పు అతి సహజం. అప్పటి ధిక్కారమే ఇప్పుడూ ఉంది. ‘కర్మ’ అనో ‘ఫలితం’ అనో సమాధాన పడటం లేదు. నన్ను నేను శోధించుకుంటున్నాను. ఒక విధంగా ఆత్మ పరిశీలన చేసుకుంటున్నానేమో. ప్రశ్నించే స్వరంలో మార్పు వచ్చిందేమో కానీ రాజీపడలేదనే చెప్పాలి. అనుభూతిలో ఉన్న సాంధ్రత- సంక్లిష్టతలకు అక్షర రూపం ఇచ్చే క్రమంలో చిగురులు తొడిగిన అభివ్యక్తిని మీరు తాత్వికత అంటున్నారు కానీ అట్లాంటిదేమీ లేదు.
తెలుగు సాహిత్యానికి ప్రపంచ సాహిత్యానికి మధ్య మీరు గమనించిన తేడాలు ?
నిజాయితీ గా చెప్పాలంటే ప్రపంచ సాహిత్యాన్ని ఎక్కువగా చదవలేదని చెప్పాలి, ప్రఖ్యాతి గాంచిన అనువాధ నవలలు తప్ప. ఉదాహరణకు శరత్ సాహిత్యం, కమలాదాస్, మహాశ్వేతాదేవి, బిభూతిభూషణ్ బందోపాధ్యాయ్, జయకాంతన్, బైరప్ప, శివశంకర పిళ్లై, అనంతమూర్తి, శివరామ కారంత్, ఇస్మాత్ చుగ్తాయి, సాదత్ హసన్ మంటో, తోల్స్తోయ్, గోర్కీ , దోస్తోవిస్కీ వంటి వారి రచనలు చదివాను. వీరి రచనలు జీవిత వాస్తవికతకు అద్దం పడతాయి. ఆదే మన తెలుగులో జీవితం పాళ్లు తక్కువ. భావాలు, సిద్ధాంతాల పాళ్లు ఎక్కువ. కన్నడ, బెంగాలీ, మలయాళీ నవలలు తీసుకుంటే కనీసం వాటి దరిదాపుల్లో కూడా తెలుగు నవలా సాహిత్యం లేదని చెప్పాలి.
మానవ జీవన గమనానికి సాహిత్యం ఎలాంటి ఇంధనం ఇచ్చింది?
సాహిత్యం లేని మానవ జీవన గమనం ఎక్కడ ఉంది.
మీ దృష్టిలో ఏది అత్యుత్తమ సాహిత్యం?
పాఠకుడిని లోబరుచుకొని తీవ్రంగా ప్రభావితం చేసి అతని/ఆమె సంస్కారానికి పదును పెట్టేది అత్యుత్తమ సాహిత్యం. పాఠకుడిని మానసిక సంఘర్షణకు గురిచేసి లోలోపలినుంచి మార్పుని తీసుకువచ్చేది. ఉత్తమ సాహిత్య పాఠకుడిని తన వెంట తీసుకునిపోగలిగేది ఉత్తమ సాహిత్యం.
సాహిత్యం అంతిమ లక్ష్యం ఏమిటి ?
సాహిత్యం మానవ విలువలను పెంచి మనిషిని మనిషిగా నిలుపుతుంది. స్వాతంత్ర్యం, సమభావం గల నూతన మానవ నిర్మాణం సాహిత్య లక్ష్యం.
సమకాలీన తెలుగు సాహిత్యం పై మీ అభిప్రాయం ఏమిటి ?
ఇటీవలికాలంలో విలువలు ఉన్న సాహిత్యం తెలుగులో విరివిగానే వస్తున్నది. గత కాలపు భావజాలాల హ్యాంగోవర్ తగ్గుముఖం పట్టింది. ఫలితంగా కండ ఉన్న రచనలు వెలుగు చూస్తున్నాయి.
*
“పాఠకులని తీవ్రంగా ప్రభావితం చేసి సంస్కారానికి పదును పెట్టేది అత్యుత్తమ సాహిత్యం”
అక్షరాలా నిజం. పదునైన జవాబులతో సూటిగా చెప్పారు.
మా,అభిమానరచయిత్రి,. శోభగారు తోఇంటర్వ్యూ బాగా ఉంది..!అంగారక స్వప్నం,భద్రంగా దాచు కున్నాము, మేము….ధన్యవాదాలు!
ఇంటర్వ్యూ బాగుంది. శోభా భట్ గారు ఇచ్చిన సమాధానాలు నిజాయితీగా ఉన్నవి. గత, వర్తమాన సాహిత్య చరిత్రకు అక్షర రూపం ఈ ఇంటర్వ్యూ.
మీ అంగార స్వప్నం అద్భుత సృష్టి. ఈ మధ్య కాలం లో అంత ఘాడత ఉన్న కవిత్వం చదవలేదు. సాహిత్యం లో భావజాలం పై మీ అభిప్రాయాలు ప్రశంసనీయం. అభినందనలు.
మీ కవిత్వానికి మీ సాక్షాత్కారానికి అబేధంగా పాఠకునికి చేరింది. మిమ్మల్ని రచనలో చూసుకొన్న పాఠకునికి యీ సాక్షాత్కారమ్ మరింత చేరువచేసింది. కవిని ఆవిష్కరించే ప్రయత్నమ్ చేసిన సత్యోదయ ప్రయత్నానికి ఆ ప్రయాసకు సహకరించిక మీ జవాబులకు
వెరసి యీ ప్రక్రియ ఫలవంతమైనందులకు..శుభాకాంక్షలు
a good interview
సాహిత్యంలో భావజాలాల స్థానం పరిమితం — ఆలోచన రేకెత్తిన వాక్యం. బాగుంది సత్యా
ఊర్మిళ గారికి నమస్తే
స్పందించిన అందరికి ధన్యవాదాలు