‘చరిత్ర పుటల మధ్య పేరుకుపోయిన సుదీర్ఘ నిశ్శబ్దాలు నన్ను వేధించాయి. ఇవే నాచేత ఈ కథలని రాయించాయి’ అంటున్నారు ‘తూరుపుగాలులు’ సంకలనంలో ఉణుదుర్తి సుధాకర్. ‘సామ్రాజ్యవాద దేశాలు వలస రాజ్యాలలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, సరికొత్త ఉత్పత్తి విధానాలనూ ప్రవేశపెట్టినప్పుడు స్థానికంగా వెలువడే ప్రతిస్పందన ఏవిధంగా ఉంటుంది? ఎవరు బాగుపడతారు? ఎవరు నష్టపోతారు?’ వంటి ప్రశ్నలకు జవాబులు వెదుక్కుంటూ కథలు రాశానన్న రచయిత ఈ కథల్లో చేసిన పరిశీలన విలువైనదీ, తను ఎటువైపున్నాడో స్పష్టపరచేదీను. గతంతో మన వర్తమానాన్ని పెనవేసిన సామాజికాంశాల నూలుపోగుల చిక్కులను విడదీసే ప్రయత్నం చేసిన ఈ కథలు మెదడుకు మేత. బౌద్ధం క్షీణదశనాటి తూరుపు గాలుల నుంచి, ఈస్టిండియాకంపెనీ కాలపు నాలుగు కథల మీదుగా నడిచి, శ్రీకాకుళ పోరాటాన్ని స్పృశించి, రాజభరణాల రద్దును ప్రకటించి, కమ్యూనిస్టూ ఆధ్యాత్మికవాదీ ఎక్కడ ఏకమౌతున్నారో పరిశీలించి, దళితుల ఆత్మగౌరవ ప్రకటనను గుర్తిస్తూ సాగిన కథలను ఈ క్రమంలో చదివితే, పి.సత్యవతిగారు తన ముందుమాటలో చెప్పినట్టుగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతపు 800 సంవత్సరాల చరిత్ర రేఖామాత్రంగానైనా మనకు గోచరిస్తుంది.
‘కంపెనీ (ఈస్ట్ ఇండియా) కథలు’గా ఈ సంకలనంలోని ‘మూడు కోణాలు’, ‘వార్తాహరులు’, ‘తెగిన నూలుపోగు’, ‘ఒక వీడ్కోలు సాయంత్రం’ కథలను చెప్పుకోవచ్చు. ‘మూడు కోణాలు’ కథకు నేపథ్యం ఈస్టిండియా కంపెనీ వాళ్ళు తాము ఆక్రమించిన దేశం ఎక్కడెంత వుందో కొలవటానికి మొదలు పెట్టిన గ్రేట్ ట్రిగొనామెట్రికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ కొలతపనిలో తూర్పుతీరం వెంబడి సాగిన చివరిదశను నైపుణ్యం, నిబద్ధత, ఆధునికపరిజ్ఞానం కలిగున్న కంపెనీ అధికారి క్లార్క్సన్ దొర పర్యవేక్షిస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ త్రికోణమితి యంత్రపు దుర్భిణి పాడవుతుంది. అప్పుడతనికి బ్రిటిష్ వాళ్ళు కొత్తగా వాడటం మొదలుపెట్టిన ఆప్టికల్ అలైన్మెంట్ పద్ధతిలోనే వాయిద్యపు తీగతో దుర్భిణిని బాగుచేసి ఇచ్చిన డుంబ్రి అనే సవరజాతి కమ్మరి తారసపడతాడు.
డుంబ్రి పనితనాన్ని గ్రహించినప్పుడు క్లార్క్సన్ కు త్రికోణమితి నిష్పత్తులు భారతదేశం నుంచే యూరప్ కు చేరాయని గుర్తు వస్తుంది. ఇక్కడే పుట్టిన ఆ శాస్త్రం ఇప్పుడెందుకిక్కడ మిగలలేదో తెలియలేదంటాడు క్లార్క్సన్. అతని సందేహం మనందరిదీ కూడా. తను చూసిననాటికి ఇక్కడి చదువుల్లో శాస్త్రం, నైపుణ్యం రెండూ లేవని చెప్తాడు. ఇప్పటికీ ఐ.ఐ.టీ లాంటి ఉన్నత విద్యాలయాల్లో కూడా మనం రీసెర్చ్ కు ప్రాముఖ్యత ఇవ్వకపోవటమూ, నైపుణ్యంలో ఎవరికీ తీసిపోని మనవాళ్ళు పాశ్చాత్యుల టెక్నాలజీ నేర్చుకుని విదేశాలన్నిటా నిండివుంటే, మరోవైపు సంప్రదాయ వృత్తినైపుణ్యాలు నశించగా, కొత్తనైపుణ్యాలను సరిగ్గా వంటబట్టించుకోలేని చదువులతో ఎటూగాకుండాపోతున్న తరమూ.. ఇవన్నీ క్లార్క్సన్ నివేదికకు కొనసాగింపుగా కనిపిస్తాయి. డుంబ్రి లాంటి ఆదివాసీల పరిజ్ఞానాన్నీ, భాషలనూ, పర్యావరణ స్పృహనూ పక్కకు తోసేసి ముందుకు పరుగెడుతున్నాం. ‘ఇది నా పని, ఎవరు చూస్తున్నా చూడకపోయినా నేను ఒప్పుకున్న ప్రకారం చేసుకుపోవాలి’ అనే ఆలోచన వీళ్ళకు తక్కువ’ని క్లార్క్సన్ చేసిన తీర్మానాన్ని ఒక జాతిగా మనం ఒప్పుకోక తప్పదు. దీనికి కారణాలనూ మనమే వెదుక్కోవాలి. వేరే దేశంవాడు వచ్చి చేపట్టిన సర్వే ఆఫ్ ఇండియా లాటి బృహత్కార్యాలు ఏమిటో అసలవి ఎందుకో అర్థంకానితనం నుండి బయలుదేరిన అలసత్వం నెమ్మదిగా మన జాతిలోకి ఇంకిపోయినదని కూడా అనుకోవచ్చేమో!
రామయ్యపంతుళ్ళు దుబాసీలుగా, రికార్డిస్టులుగా కుదురుకుని ఆ తరువాత ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడటం, సూర్యనారాయణ రాజులు కాంట్రాక్టర్లుగా కుదురుకోవటం తెలిసినదే. డుంబ్రి వుండే ప్రాంతాలలో కదలిక రావటానికి, అంటే ఆదివాసీలు హక్కుల ప్రకటన చేసి నక్సల్ విప్లవంలో భాగం కావటానికి ఓ వందేళ్ళూ, ఆ తరువాత కొండలనూ గనులనూ మింగే ఘనులనుంచి ప్రకృతినీ తమజాతినీ రక్షించుకునే ప్రయత్నం మొదలెట్టటానికి మరో యాభై ఏళ్ళూ పట్టిందన్న చారిత్రక సత్యాన్ని సూచిస్తుంది ఈ కథ.
‘ఈ దేశపు ప్రజలూ ప్రాంతాలూ చేరువ కాగలిగిన అవకాశాలు’, అంటే తాము కొత్తగా ప్రవేశపెడుతున్న సివిల్ సర్వీసెస్, రైళ్ళూ టెలిగ్రఫీ వంటివి జనాన్ని ఏకంచేసి తమను తరిమేస్తాయనే ఆలోచనలోని అభద్రతను కలిసి పంచుకున్న ఇద్దరు బ్రిటిష్ ఉన్నతాధికారుల సంభాషణ ‘ఒక వీడ్కోలు సాయంత్రం’. టెలిగ్రాఫ్ తీగలు పాలకులూ పాలితుల మధ్య దేశంలో సృష్టించిన అలజడిలో మతాలు మరిచి ఏకమైన ముసల్మాన్ ‘మరియం’, హిందూ ‘కాలియా’లు మన తొలి స్వాతంత్ర్య సంగ్రామంలోని హిందూ ముసల్మాన్ ఐక్యతను గుర్తుచేస్తారు (వార్తాహరులు). ‘తెగిన నూలుపోగు’ బందరుతీరంలో జరిగే కథ. వ్యాపారదక్షత, దూరదృష్టీ లేకుండా చివరకు గుత్తగా కంపెనీ చేతుల్లోకి రాజ్యాలను అప్పగించిన ప్రభువుల వెర్రితనం చరిత్ర పుస్తకాల్లోంచి మరోసారి తొంగిచూస్తున్నట్టు అనిపించే కథ ఇది. తుపాకులు పట్టుకుని సముద్రంమీద పెత్తనం చేస్తే మనమూ తెల్లవాళ్ళ లాగానే ప్రపంచాన్ని గెలవవచ్చుననే ఊహ ఒక నేత పనివాడి కొడుకు గవరయ్యకు వస్తుంది. సముద్ర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే ఆలోచనా ధైర్యమూ మన వర్తకులలో లేకపోవటానికి ఔరంగజేబ్ చివరి రోజుల్లో దక్కనులో స్థిరమైన పాలన లేకపోవటం, పాలకుల అవినీతి వంటివి పెద్ద కారణాలైతే, గవరయ్య వంటివానికి అలాంటి ఆలోచనలు రావటానికి మనుషులంతా సమానమేనని చెప్తూ వీరబ్రహ్మేంద్రస్వామిసమాజంలో తీసుకువచ్చిన సమానత్వ భావనలు కారణం అయివుండాలి. మరోపక్క ఇండియాతో సముద్రవ్యాపారం కోసం ఇంగ్లిష్, ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్ వాళ్ళ తీవ్రప్రయత్నాలు. సముద్రం మీద ఆధిపత్యం దైవదత్తమని నమ్మి పోటీలో వెనుకబడిపోయిన పోర్చుగీస్ నావికుడిని సముద్రపుదొంగగా విచారించటం ఈ కథలో ఆసక్తికరమైన ఘట్టం.
చాలా చక్కని కథనంతో సాగేవి ‘కొంచెం సబ్బునురగ, ఒక కత్తిగాటు’, ‘చేపకనుల రాజకుమారి’ కథలు. కొంచెం సబ్బునురగ.. లో ‘ఎదుటిమనిషిని చంపెయ్యాలంటే కసి వొక్కటే చాలదు నిర్దాక్షిణ్యంగా కూడా వుండా’లంటాడు ఎస్సై సూర్యారావు నక్సలైట్ సానుభూతిపరుడు కైలాసంతో. ఆ నిర్దాక్షిణ్య మనస్తత్వాన్ని పోలీసులకు నేర్పేది పోలీసు యంత్రాంగమూ వాళ్ళ అధికారమూను. “మీ వాళ్ళు ఇప్పుడిప్పుడే మాదగ్గర నేర్చుకుంటున్నారు” అన్న ఎస్సై మాటలే ఈ కథకు ప్రాణం. డెబ్బైలలో ప్రభుత్వం రాజభరణాలను రద్దుచేసినప్పుడు, హంగులూ ఆర్భాటాలూ దళారీల సాయంతో తప్పితే బ్రతకలేని ఒక చిన్న సంస్థానపు రాజుగారి విషాదాంతాన్ని ఇద్దరు హైస్కూల్ వయసు పిల్లలు వాసూ, మీనాక్షీల స్నేహం నేపథ్యంలో నేర్పుగా అల్లిన కథ ‘చేపకనుల రాజకుమారి’.
ఇజాలూ, అస్తిత్వ ప్రకటనలూ, “ఛిద్ర సమూహాల మోహరింపు” మధ్యలో మధ్యతరగతి అగ్రకుల బుద్ధిజీవి తన స్పేస్ ను వెదుక్కునే క్రమాన్ని వివరించే కథలు “వాళ్ళు-మనం, మీరు-మేము”, “ఇద్దరు మావయ్యల కథ”. “ఉన్నంతలో మీ నాన్నగారి లాంటివాళ్ళు కొంత స్పేస్ క్రియేట్ చేశారు. అయితే త్వరలోనే అది ఇరుకైపోయింది. మా స్పేస్ ను మేమే సృష్టించుకోవాలని తెలుసుకోవటానికి చాలాకాలమే పట్టింది” అని అగ్రకులాల ఉదారత్వాన్ని విదిలించుకుని ఆత్మగౌరవంతో సాగుతున్న దళితుల ఎదుగుదలకు ప్రతినిథిగా నిలబడ్డ స్నేహితుడు కన్నయ్య, రాఘవేంద్ర శర్మలోని అనవసరమైన సెల్ఫ్ పిటీని తనమాటలతో కడిగివేస్తాడు.
‘తూరుపుగాలులు’ మనదేశంలో బౌద్ధం అంతరించిన దశలో మతానికీ అధికారానికీ వున్న సంబంధాన్ని అర్థంచేసుకునే ప్రయత్నంచేస్తున్న దీపాంకరుడనే బౌద్ధభిక్షువు కథ. ఎన్నో కథలూ అనుభవాల మధ్య దీపాంకరుడి యాత్ర నలందా నుంచి మొదలై చివరకు ధాన్యకటక విహారం చేరుకోవటంతో ముగుస్తుంది. ఇదొక యాత్రాస్మృతివంటి కథ. “విదేశీయులతో యుద్ధాలు జరిగినప్పుడల్లా బౌద్ధం, సింహళ జాతీయవాదానికి ప్రతీకగా నిలిచింది. ఏదైనా సంక్షోభం మీదపడినప్పుడు ప్రజల్ని సమీకరించటానికి బౌద్ధమే శరణ్యం. అప్పుడు ధర్మం, సంఘం ఒక స్థాయివరకే. ఆ తరువాత అంతా రాజకీయప్రమేయం, ఆధిపత్య పోరాటమే” అని శాంతిదేవుడు ఇచ్చిన వివరణ చదువుతుంటే బౌద్ధులు కూడా హింసకు పాల్పడాల్సిన రాజకీయ అవసరాలెలా పుడతాయో తెలుస్తుంది. మతం విలసిల్లటానికి దానికి రాజపోషణ ముఖ్యమా లేక ప్రజాదరణ ముఖ్యమా అన్న చర్చలోకి వెళ్తుంది ఈ కథ. సింహళంలో రాజాశ్రయమూ ప్రజాదరణా రెండూ బలంగా వున్నప్పుడు బౌద్ధం సింహళ జాతీయవాదానికి ప్రతీకగా నిలిచి ఉండవచ్చు. అదే టిబెట్ విషయానికి వస్తే, టిబెట్ ను చైనా ఆక్రమించాక అక్కడ బౌద్ధానికి రాజ్యాదరణ లేదు.
టిబెట్ ప్రజల్లో విస్తరించిన బౌద్ధమతం, వారి స్వాతంత్ర్య అభిలాషతో కలిసి మిలిటెంట్ జాతీయవాదంగా మారకుండా అడ్డుపడ్డదేమిటి? అనే ప్రశ్నకు మతానికి రాజ్యాదరణ లేకపోవటంతో ఏదోఒకలా బతికివుండి, మతాన్ని బతికించుకోవటమే ముఖ్యమన్న భావనయేనేమోననిపిస్తుంది. రాజ్యాదరణనూ, ప్రజాదరణనూ సమానంగా పొందిన కాలంలో మతాలు అత్యున్నత స్థితిలో ఉండటానికి అవకాశం ఉంటుంది. మెజారిటీ, మైనారిటీ మతాలు, పాలకులు, జనాభిప్రాయాలు, సెక్యులరిజం వంటి ఆధునిక పదాలను పైపై మాటలుగా కాక, నేటి అసహనాల మధ్యలో అర్థం చేసుకునేందుకు ‘తూరుపుగాలులు’ వంటి రచనలు ఉపయోగిస్తాయి. మనం చూస్తున్న కాలంలోనే బమియాన్ బుద్ధవిగ్రహాలు నాశనమైనాయి. మతాధిక్యత కోసం పెనుగులాటలో హింస అహింసల మధ్యవున్న లక్ష్మణరేఖను ఎవరైనా ఎంతవరకూ పాటించగలరనే ప్రశ్న వ్యవస్థీకృత మతాలన్నిటికీ వర్తిస్తుందని తోస్తుంది. “అంతటి తథాగతుడు కూడా ఒకే ఒక్క అంగుళీమాలుడిని సంస్కరించ గలిగాడు. కోసలరాజైన విరూధకుడు శాక్యగణ రాజ్యాన్ని నాశనం చేసి, మొత్తం తధాగతుడి వంశీకులందర్నీ ఏనుగులతో కుమ్మించి మట్టుబెట్టినప్పుడు అతడు ఆ దుర్వార్త విని మౌనంగా ఉండిపోయాడు తప్ప ఏమీ చెయ్యలేకపోయాడని మనకు తెలుసు” అంటాడు శాంతిదేవుడు. ఈ సంఘర్షణల మధ్యలో కూడా ‘బౌద్ధం ఒక ఉత్తమ మోక్షసాధనంగా సత్యం, కరుణ, మైత్రి … వీటివైపు మనుషులను నడిపిస్తూనే ఉంటుంద’ని మనసారా నమ్మే నిజమైన బౌద్ధుడు దీపాంకరుడు.
సాఫీగా సాగిపోయే కథనంతో బాటు చారిత్రక కథలకు అప్పటి వాతావరణాన్ని తగుమోతాదులో సృష్టించి, ఆ కాలంలోకి పాఠకులను సజావుగా ప్రయాణం చేయిస్తాయి ఈ కథలన్నీ. కథ పరిధిని దాటిపోని సూక్ష్మవివరణలతో సంభాషణలతో కథలకు అమరే అందం, కవిత్వంలాంటి వర్ణనలతో వచ్చేఅందం కంటే గొప్పది. ‘చేపకనుల రాజకుమారి’ లో చితికిపోయిన ఆర్థికపరిస్థితిలో వున్న రాజుగారి ఇంటి సామానులు, నాణాలూ స్టాంపుల వర్ణనలూ, భాషా, వివరాలూ (“అయ్యో సీసీసీపీ కాదండీ. యూ ఎస్ ఎస్ ఆర్. అంటే సోవియట్ రష్యా. రష్యన్ భాషలో అలా రాస్తారు”). అలాగే డుంబ్రి దుర్భిణీని బాగుచేసిన విధానం. ఈ సూక్ష్మవివరాలన్నిటినీ అధ్యయనం చేసి అప్పటికాలానికి వెళితేగానీ రాయటానికి వీలుకాని కథలివి. కథలన్నీ ఏకబిగిన చదివిస్తాయి.
చరిత్ర పుటల్లోలాగే ఈకథల్లో కూడా మధ్యమధ్యలో ఖాళీలుంటాయి. పాఠకులు చదువుతూనే ఆలోచించాలి. సర్వే ఆఫ్ ఇండియాను కంపెనీ ఎందుకు మొదలుపెట్టిందో మనమే తెలుసుకోవాలి. మహాయాన, వజ్రయాన, థేరవాద బౌద్ధాలకు గల తేడా మనకు తెలిసివుండాలి. సాధారణ జీవితాల్లో చరిత్రను వెదికి వ్యాఖ్యానించటంలో కథకుడి గొంతు మనలను ఒకొక్కసారి ఎటూ తప్పిపోకుండా కావలి కాస్తుంది. ‘మూడు కోణాలు’లో రచయిత వ్యాఖ్యానం చేయకుండా మన ఊహకు వదిలేసే కథనం కూడా నడపవచ్చు. కానీ చరిత్రను చదివే అవసరమే లేదని విధానాలు చేసిన ప్రభుత్వాలూ, లేదా చరిత్రను పురాగాధల స్థాయికి దించే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వాలూ వున్న నేలమీద ఇంత స్పష్టంగానూ రాయటం కూడా సరైనదేనేమో! చరిత్రలోని సాధారణవ్యక్తుల సందిగ్ధతలూ మనోరథాలూ, నిర్ణయాల మధ్యకు మళ్ళీమళ్ళీ ఆసక్తిగా ప్రయాణించటం కోసం, ఈనాటి మన బాటల ఆనవాళ్ళను గతంలో వెదకటం కోసం, కొని దాచుకోవాల్సిన పుస్తకం ‘తూరుపుగాలులు’. చదువరుల రసదృష్టిని మరింత పెంచేలాంటి బొమ్మలు (శివాజీ) మనకు బోనస్.
*
Good review. Very comprehensive
ల.లి.త గారూ!
త్రిపుర గారి అల్లుడు ఉణుదుర్తి సుధాకర్ గారి కధల పుస్తకం ” తూరుపు గాలులు ” మీకే చాతనైయ్యే విధంగా అద్భుతంగా విశ్లేషించినందుకు ధన్యవాదాలు.
కానీ ఏ దిల్ మాంగే మోర్. “ఇద్దరు మావయ్యల కథ” గురించి మరో విసృతమైన వ్యాసం రాయాలి మీరు.
కాలం నాటి విన్నపమే మరోసారి – – – గౌతంఘోష్, బి. నర్సింగ రావు, గద్దరన్నలతో కూడిన ” మా భూమి” సినిమాను మీరే పరిచయం చెయ్యాలి.
గొప్పగా రాసారండీ, మీ వచనం కోసమే మొత్తం చదివాను. కానీ ఓ విభిన్నమైన, అరుదైన కథల పుస్తకం చదవాల్సి ఉందని అర్థమయింది. మరిన్ని పరిచయాలు రాయాలి మీరు.
చరిత్రను, కథను మిళితం చేసిన సుధాకర్ గారి నేర్పు చక్కటి కథా సంపుటం. తూరుపు గాలులనిచ్చింది. కథలపై మీ విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది.
Nijamga మీరన్నట్టు చరిత్ర అవసరం లేని ప్రభుత్వాలు ప్రజలూ..కానీ chadavalsinavi చాలా ఉన్నాయి అని బాగా ాఅర్ధ్దమయ్యింది mam.