ఒక్కసారిగా.. పొలమారినట్టుగా దగ్గాడు. కుడిచేత్తో గ్లాసు వదలకుండా, కిందపెట్టకుండానే… ఎడమచేత్తో నెత్తి మీద కొట్టుకుంటూ.. ఆ దగ్గుని మరికొన్ని క్షణాలపాటు సాగదీశాడు. గొంతులో పట్టేసినప్పుడు సవరదీసుకుంటున్నట్టుగా చిన్న చప్పుడు చేశాడు… మరికొన్ని క్షణాలు కళ్లు మూసుకున్నాడు.. కళ్లు వెడల్పుగా తెరచి నిటారుగా మోర పైకెత్తి, పైకప్పు కేసి కొన్ని క్షణాలు చూశాడు. ఒక కంటి చివరనుంచి ఒక చుక్క చెవికేసి జారి జులపాల్లో అదృశ్యయైపోయింది. అలా విదిలిస్తూ తల దించాడు. బల్ల మీద ఉన్న సీసాల్నీ గ్లాసుల్నీ చూశాడు. ‘మీకు ఇబ్బంది కలిగించానా’ అన్నట్టూ బల్ల చుట్టూ ఉన్న ముగ్గుర్నీ చూశాడు. ఒక రకంగా నవ్వాడు. తర్వాత అప్పటిదాకా కుడిచేతిలోనే ఉన్న గ్లాసును నోటికి అందించి.. ఒక గుటక వేశాడు.
ఏ ఉపద్రవాన్ని తప్పించుకోవడానికి.. ఇంత నాటకమూ రక్తికట్టించాడో.. అది మాత్రం తప్పలేదు.
కొన్ని క్షణాల గ్యాప్ తర్వాత మళ్లీ వొచ్చేసింది ప్రశ్న…
‘‘అమ్మాయి ఇప్పుడు ఏం చదువుతోంది సార్’’
పొలమారడానికి కారణం అదేనన్నట్లుగా గ్లాసుకేసి చూసి.. ఎక్కువ కలిపేశారన్నట్టు, సోడా అందుకుని, తాగినంత మేర గ్లాసు అంచువరకు నింపాడు. పోస్తూ ఆలోచించాడు. అవును ఏం చదువుతోంది తన కూతురు యిప్పుడు? వున్న ఒక్కగా నొక్క కూతురు!
డెస్కు దగ్గర కూర్చున్నప్పుడు.. ఏ అర్ధరాత్రి వేళో ఉపద్రవం జరిగిందని కబురొస్తే.. ఏంత వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడో.. అంత వేగంగానూ ఆలోచించాడు. ఆ అవసరాన్ని బట్టి.. ఎక్కడెక్కడినుంచి ఎవరెవరిని ఎంత హడావిడిగా పరుగులెత్తిస్తాడో.. అంతగానూ హడావిడి పడ్డాడు. ‘ఏం చదువుతోంది?’. చాన్నాళ్ల కిందట పదోతరగతి పాసైనట్టు, ఇంటికెళ్లాక, అర్ధరాత్రి దాకా మేలుకుని స్వీటు తినిపించింది గుర్తుంది. ఆ తర్వాత కాలేజీలో కూడా చేర్చాడు. అదీ గుర్తుంది. ఫస్టియరా? సెకండియరా? ఈ వెధవ అది కూడా ఆరా తీయకుండా అల్లా అనుగ్రహించు గాక!
‘‘ఇంటరు’’ హమ్మయ్య బరువు దిగిపోయింది.
‘‘ఏ గ్రూపు సార్?’’
అల్లా.. వీడిని ఉన్నపళంగా సైతాన్ ఎత్తుకుపోతే బాగుండు.. ఈ వెధవ కెందుకు? మళ్లీ పొలమారితే.. నాటకం బయటపడిపోతుంది. అవును యింతకీ ఏ గ్రూపు? హిస్టరీ ఎకనామిక్సూ ఉండేది చెప్పాడు తను. డాక్టరౌతా అనింది పాప. వొద్దొద్దు ఇంజనీరైతే.. తొందరగా చదువైపోయి, ఉద్యోగమొచ్చేసి పెద్దపెద్ద జీతాలొచ్చేస్తాయని.. తన పెండ్లాం హితబోధ చేసింది. తన ముష్టి జీతం మీద ఆమె ఎన్నడూ కనబరచని అసహ్యం, ఆ మాటల్లో ఆశలాగా బయటకు వచ్చింది. అదంతా సరే.. యింతకూ పాప ఏ గ్రూపులో చేరింది?
‘‘ఈ జీడిపప్పు కేరళది. గుండుగానే, పిల్లరొయ్యలా పిసరంత ఉంది. అదే మన పలాసదైతే దబ్బయినా కూడా టైగర్ రొయ్యలా యింతేసి వుంటుంది..’’ అన్నాడు సైజుల్ని చేతివేళ్లతో సంజ్ఞామాత్రంగా చెబుతూ.
‘‘అవునవును సార్.. మీరు కరెక్టు.. మీరంటే అటు ట్రివేండ్రం, ఇటు పలాసా తిరిగారు.. మీ అంత ఆథెంటిగ్గా ఎవరు చెప్పగలరు..’’ మరొకడు చిడతేశాడు. ఈ బల్ల మీద పొంగుతున్న సుఖాలకి వాడే ఉభయకర్త. యింతకీ వాడు, ఈ ప్రశ్నలనించి తనను తప్పించడానికి మాటల మధ్యలోకి జొరబడ్డాడా? లేదా నిజంగానే జీడిపప్పు మీద తనని సమర్థిస్తున్నాడా? ఎంతైనా వీడు మంచివాడు. బిల్లు భరిస్తున్నందుకు కాదు.. గండం దాటించినందుకు!
‘‘నీ పేరేంటన్నావ్ బ్రదర్..’’
‘‘వీరాంజనేయులు సార్..’’
ఫోనందుకున్నాడు..
‘‘ఏంటమ్మా.. ఏంటివాళ’’
‘‘రైతు కుటుంబం ఆత్మహత్యను ఏం చేస్తున్నావ్..’’
‘‘పిల్లల్తో సహా, నలుగురు కదా మెయిన్‌కు యిచ్చేయ్.. మనకి ఫస్ట్ పేజీలో హ్యూమన్ ఇంటరెస్టింగ్ స్టోరీ యాంగిల్ చెప్పా.. ఆఁ వొచ్చింది కదా.. సూసైడ్ నోట్ దొరికింది కద.. వాట్సప్‌లో చూశాన్లే. అది డీసీ వాడు! ఫ్యామిలీ ఫోటో మెయిన్‌కు యిచ్చేయ్.. చిన్నపిల్ల బర్త్‌డే ఫోటో ఎక్స్‌క్లూజివ్ వస్తుంది.. మినీలో వాడేయ్. హెడింగ్ ఏంపెట్టావ్?’’
‘‘అబ్బెబ్బే చప్పగా ఉందమ్మా.. పాచివాసన కొడుతోంది… చెప్తా రాసుకో.. ‘థూ.. దీనెమ్మా జీవితం…’ అయిదు కాలాలు పెట్టేయ్. సూసైడ్ నోట్ మధ్యలో ఆ సెంటెన్సుందిలే. ఇన్సిడెంట్‌లో మసాలా ఎక్కడుందో పట్టుకోవాలమ్మా! అదే మరి న్యూస్ నోస్ అంటే. నేన్నిన్ను ట్రైన్ చేస్తా కద. అదే పెట్టేయ్. అదిరిపోతుంది’’
‘‘అబ్యూజివ్ అవదమ్మా.. ట్రెండీ అది. ట్రెండ్‌ని బట్టి పోవాలి.. పాచి హెడింగుల్తో యిస్తే వెబ్ మీడియాని తట్టుకోలేం.. నేను మళ్లీ మళ్లీ ఫోన్చేయను.. ఎడిషన్ జాగ్రత్త’’
వీరాంజనేయులు చేస్తున్న సైగల్ని అందుకుని, అభయముద్రతో మళ్లీ అన్నాడు..
‘‘అమ్మా.. వీరాంజనేయులు పేరుతో ఓ ప్రెస్ నోట్ వస్తుందమ్మా..’’, ‘‘వొద్దొద్దు జోన్లో వద్దు. కామన్‌లోకి తే. ఫోటో కూడా కలర్లో వాడు.. రైట్ సైడ్ పేజీలో వాడు.. ఆ రైట్.. ఎడిషన్ జాగ్రత్త’’
అవతలి వాడు జవాబులు చెప్తున్నప్పుడెల్లా ఒక్కొక్క సిప్ వేసేసరికి గ్లాసు ఖాళీ అయిపోయింది. ఫోను కట్ చేసేసరికి, వీరాంజనేయులు గ్లాసులోకి మళ్లీ నైన్టీ వంపి.. సగం సీసాలు అక్కడే ఉండగా, వాటిని కాదని, కొత్త సోడా ఓపెన్ చేసి.. ‘వాటిలో గ్యాస్ పోయింది సార్’ అంటూ బుసబుస గ్లాసు నింపి సభక్తికంగా చేతికి అందించాడు.
వీడికి ఈ మాత్రం ఫేవర్ చేయొచ్చు. ఉభయకర్త అయినందుకు కాదు.. ఈరోజు వాడినించి రాబట్టే సమాచారం.. నాల్రోజుల తర్వాత.. ఇచ్చే ఇన్వెస్టిగేటివ్ కథనాలకి ఆయువుపట్టు. తన పేపర్ ఒక సెన్సేషన్ అయిపోతుంది. అందుకే అసలు ఈ పార్టీకి రావడం కూడా!
వీక్లీఆఫ్ రోజు అయినా గట్టిగానే డ్యూటీచేసిన పనిభారంతో, రిలీఫ్ కోసం సిగరెట్ అంటించి.. గట్టిగా దమ్ములాగి.. కొన్ని క్షణాలు గుండెల్లోనే ఉంచుకుని నెమ్మదిగా విడిచిపెట్టాడు. మొదటి ప్రశ్న అడిగినోడిని వోరగా చూశాడు. తర్వాతి రౌండ్లోకి వెళ్లిపోయి.. ప్రశ్నల సంగతి మరచిపోయాడు. హమ్మయ్య.. ఒక్క ప్రశ్నకు జవాబుగా ఇంత నాటకం నడిపించాలా? అనుకుని, ఆ తర్వాత తనలో తాను గొణుక్కున్నాడు. ఆఫీసుకు ఫోన్చేసి పెట్టిన హెడింగునే తలచుకుంటున్నాడని వారు అనుకున్నారు. మర్రోజు తెల్లారాక చదివిన వాళ్లతో ‘బలే వుందిరా’ అనిపించే హెడింగు! కానీ తను మాత్రం.. తనను తానే తిట్టుకున్నట్టుగా గొణుక్కున్నాడు.
‘థూ దీనెమ్మ జీవితం…’
***
చేతిలో ఉన్న ఐప్యాడ్ తెరని చూపుడువేలితో సుతారంగా స్క్రోల్ చేస్తూ.. కాసేపు తీక్షణంగా చూస్తూ ఉండిపోయిందామె. ఎదురుగా మేనేజర్ ఉన్నాడు. రెప్పవేస్తే, ఆలోగా మేడం తనవైపు చూస్తే.. నిర్లక్ష్యంగా ఉన్నట్లు అనుకుంటుందేమోనని అనిమేషంగా ఉన్నాడు. కాసేపు అలా చూసి.. ఐప్యాడ్‌ను టేబుల్ మీద పెట్టేసి.. ‘వెల్’ అంటూ అతనికేసి చూసింది. మరింత అలర్ట్ అయ్యాడు.
‘‘న్యూస్ ప్రింట్ రేట్ బాగా పెరిగిపోయింది… పత్రికల రేటు పెంచితే కొనడం మానేస్తారు. వెబ్, సోషల్ మీడియా ఫార్మాట్ చాల్లే అనుకుంటారు’’
అతను సైలెంట్‌గా ఉన్నాడు.
‘‘ఇది మీకు తెలియని సంగతి కాదు. కానీ ప్రతిరోజూ స్మరించుకుంటూ ఉంటే.. ప్లానింగ్‌లో తేడా వస్తుంది. ఎట్‌లీస్ట్ కొత్త అయిడియాలు జెనరేట్ అవుతాయి’’
‘‘పేజీలు తగ్గించాం మేడం.. మినీలవి కూడా…’’
‘‘సరిపోతుందా..’’
‘‘అందుకే.. కలర్ తగ్గించేశాం మేడం.. ఫస్ట్, లాస్ట్ మాత్రమే. యాడ్ ఉంటే తప్ప ఇన్నర్ కలర్‌కు వెళ్లట్లేదు.’’
ఆగి నెమ్మదిగా నవ్వింది. చురుగ్గా చూస్తూ అంది. ‘‘ఎన్ని గడ్డి పరకలు కాలిస్తే బొగ్గు లవుతాయ్?’’
ఆమె విట్టు అర్థం కావడానికి వాడికి కొన్ని క్షణాలు పట్టింది. ఇబ్బందిగా నవ్వాడు.
ఆమె విదేశాల్లో వ్యాపార శాస్త్రం చదువుకుని, తెలుగు పత్రికకు ఎండీగా వొచ్చింది. మనుషుల్ని అంతకంటె సులభంగా చదువుతుంది. ‘‘కాస్ట్ కటింగ్ చేయకుండా సర్వైవ్ కాలేం..’’
‘‘ప్రూఫులు చూడ్డానికి ప్రింట్‌అవుట్ కూడా తీయడం లేదు మేడం..’’ ఇంతకంటే ఇంకెలా కాస్ట్ కటింగ్ చేయగలం- అన్నట్టుగా చెప్పాడు మేనేజర్ ఏం తోచనట్టుగా.
క్షణంకంటె తక్కువ సేపు మూసిఉన్న ఐప్యాడ్ కేసి చూసి.. తలెత్తి ‘‘హూ ఈజ్ దిస్ ఇస్మాయిల్’’ అంది.
‘‘మఫుసిల్ ఇన్చార్జి మేడం, సిటీ తనే చూస్తాడు’’
‘‘యాభై తొమ్మిది వేలా..? టూ హై కదా’’
మేనేజరుకు నోట మాట పడిపోయింది. మరీ ఎక్కువేం కాదు. కానీ అనలేడు.
‘‘కంపోజ్ చేయలేడు, పేజీ మేకప్ రాదు.. ఆఫ్టరాల్ బియ్యే చదివి వొచ్చాడు.. అవుట్‌పుట్ పెద్దగా లేదు. మరీ అంత సేలరీనా..’’
‘‘బాగా సీనియర్ మేడం..’’ కొలబద్ధలు అవి కాదు అని నేరుగా చెప్పలేకపోయాడు.
‘‘సీనియర్ ఈజ్ ఓకే… బాగా సీనియర్ అంటే ముసలివాడని అర్థం…’’ జోక్‌కు తనే పెద్దగా నవ్వింది. ‘‘డూ వియ్ నీడ్ హిమ్.. పదీ ఇరవైకి దొరుకుతున్నారు మార్కెట్లో…’’
దొరుకుతున్నా‘యి’ అని ఉంటే గేదెల గురించో, గొర్రెల గురించో అనుకునేవాడు. ‘రు’ అనే సరికి.. ఆ మాట జర్నలిస్టులను ఉద్దేశించే అని అర్థం చేసుకున్నాడు. అలాగని ఇస్మాయిల్ దండగ అనే ధైర్యం లేదు.
మేనేజరు భయపడ్డాడు. ‘‘ఆయన అనుభవం, హెడింగులు అక్షరలక్షలు చే..స్తా..యి.. మేడం’’ ఆమె కళ్లలో మార్పు చూసి చివరి మాటలు తడబడుతూ పూర్తిచేశాడు.
‘‘అచ్చా.. ఆఁ.. వాడ్డిడ్ యూ సే.., ఆ అ..క్షర.. లక్ష..లు ఇచ్చి న్యూస్ ప్రింట్ కొనగలమా..’’
‘హిహీ’ మని నవ్వాడు. ‘‘పేపర్ ఇమేజి పెంచే, కాపాడే అనుభవం మేడం..’’ ఆఖరి ప్రయత్నంగా అన్నాడు.
‘‘ఒకడు పెంచితే పెరిగి, లేపోతే పడిపోయే ఇమేజి కాదు మనది. మన బ్రాండ్ చూసి కొంటున్నారు జనం. వీళ్ల అనుభవం చూసి కాదు. అయిదుగురు వస్తారు ఆ సేలరీతో. ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్‌తో చూడు’’
అయిపోయింది. టెన్నిస్‌లో ర్యాలీల్లాగా సాగిన సంభాషణలో చాలా టెక్నిక్‌తో, బంతిని జస్ట్ నెట్ పక్కనే, తన కోర్టులో డ్రాప్ చేసేసింది. లైన్ దగ్గరినుంచి పరుగెట్టుకెళ్లి, తాను దాన్ని రిటర్న్ చేయలేడు.
‘ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్’… వాదన ఆ మాట వరకు వచ్చిన తర్వాత.. ఇక పొడిగించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. ఎదుటివాడి నోరు మూయించడానికి అది బ్రహ్మాస్త్రం. పదో తరగతి ఫెయిలయ్యాక ఆఫీసు బాయ్‌గా చేరాడు. వయసొచ్చాక ఓపెన్ యూనివర్సిటీలో బీయే అనిపించుకుని క్లర్కుగా మారాడు. నరాల్లో ఇంకిపోయిన విధేయత అతణ్ని మేనేజరు చేసింది. అదే విధేయతతో మౌనంగా ఉండిపోయాడు.
***
ఇస్మాయిల్ ఆఫీసులో ఎవడిమీదైనా కోప్పడగా.. ఎవరూ చూడలేదు. కానీ అతడంటే అందరికీ భయం. అలాగని తను గిరిగీసుకుని ఉండడు. ఆఫీసు బాయ్ దగ్గర కూడా అగ్గిపెట్టె అడిగి తీసుకుని సిగరెట్ అంటించుకుంటాడు. మెషిను సెక్షను వాడి నీలం రంగు జేబుల్లేని చొక్కాకి ఉండే గ్రీజు అంటుకుంటుందనే భయం లేకుండా.. వాడి భుజం మీద చేతులు వేసుకుని చాయ్‌కు వెళ్తాడు. ఎవ్వరి పనిలోనూ వేలు పెట్టడు. కానీ తన పనిలో ఒకరి జోక్యాన్ని సహించడు. అందరిలో అతని పట్ల ఉండేది భయమో, దాన్ని గౌరవం అనాలో గానీ.. దానికి కారణం మాత్రం కారణం పని. ఆ పనిని శ్రద్ధగా, వేగంగా చేయడం. జర్నలిజంలో అది చాలా ముఖ్యం. ఇస్మాయిల్ పనిలో క్వాలిటీకి వంకపెట్టగలవాడు లేడు.
కానీ ఆ క్వాలిటీని తను కొట్టిపారేస్తాడు. జర్నలిజంలో ‘హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ’ అనే పదానికి అర్థం లేదంటాడు. ‘అడిక్వేట్’ అనేది అబద్ధం.. ‘డెడ్‌లైన్’ ఒక్కటే నిజం.. అని నమ్ముతాడు. డెడ్‌లైన్ దాటిపోకుండా మనం ఎంత చేయగలమో అదంతా చేసేస్తే చాలు. తెల్లారాక పేపర్ చదివేప్పుడు.. అంతకంటె బాగా చేసే అయిడియాలు ఖచ్చితంగా వొస్తాయి. నెక్ట్స్ టైం బాగా చేస్తాం! అంతే తప్ప.. బాగా చేసే అయిడియాల కోసం, డెడ్‌లైన్ దాటి ఎదురుచూడలేం అనేది అతని ఫిలాసఫీ. ప్లానింగ్‌లోనూ అంతే చురుగ్గా ఉంటాడు. నిద్దర్లేవగానే.. మధ్యాహ్నం మళ్లీ నిద్రపోయే దాకా రిపోర్టర్లకు ఫోన్లు చేసి అసైన్‌మెంట్లు వేయడం, ప్లాన్ చేయడంలో గడిపేస్తాడు. సాయంత్రం మళ్లీ నిద్రలేచి ఆఫీసు కెళ్తాడు. ఉదయం చేసిన ప్లానింగ్‌కు… రూపు యిస్తుంటాడు.
సృజన- యంత్రం కాదు. దానికి భావోద్వేగాలతో ముడి ఉంటుంది. ఈ సిద్ధాంతానికి సవాలులాగా.. క్రియేటివిటీ, మెషిన్ అవతారమెత్తితే అది ఇస్మాయిల్ అవుతుంది.
భావోద్వేగాలు అంటకుండా, అంటినప్పుడు తక్షణం దులిపేసుకుంటూ బతకడం గొప్పకళ. కుటుంబం గురించి అతను పట్టించుకునేది ఉండదు. బేగం టైలరింగ్ చేస్తుంది. అది.. వేడినీళ్లకు మంచినీళ్లలా కలుస్తుంది. ఒక్కటే కూతురు. అతడు జోక్యం చేసుకోవాల్సినంత పరిస్థితిని ఎన్నడూ తీసుకురాలేదు. అందుకే ఆ అమ్మాయి చదివేది ఫస్టియరో, సెకండియరో అతడికి తెలియదు. తెల్లవారడానికి కాస్తంత ముందు ఇల్లు చేరి, కుటుంబంలోని ఇద్దరూ గాఢనిద్రలో ఉండగా, చప్పుడు చేయకుండా పడుకుంటాడు. నిద్రలేచేసరికి కూతురు కాలేజీకి వెళ్లిపోయి ఉంటుంది. వెచ్చజేసిన టిఫిను తిని ఫోన్లు మాట్లాడి భోంచేసి మళ్లీ పడుకుంటాడు. సాయంత్రం నాలుగ్గంటలకే వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఎప్పటికో పాప ఇల్లు చేరుతుంది. అందుకే పది పాసైనప్పుడు స్వీట్ తినిపించడానికి అప్పట్లో అర్ధరాత్రి దాకా మేలుకుని కూర్చుంది. ఆదివారాలు ముగ్గురూ ఉంటారు. వాళ్ల ప్రపంచాలు మూడూ కలగలిసిపోయి.. ఆ రోజంతా కలగాపులగంగా గడచిపోతుంది. ఇస్మాయిల్‌కు తెలియకపోవడంలో ఇక ఆశ్చర్యం ఏముంది?
***
ఇస్మాయిల్‌తో మాట్లాడడం మేనేజరుకు భయమే. కానీ తన ఉద్యోగం కాపాడుకోవడం ముఖ్యం. గదిలోకి పిలిపించి మాటలు కలిపాడు. ఎక్కడ మొదలెట్టాలో తెలియదు.
‘‘పాప ఏం చదువుతోంది సర్..’’
ప్రతివెధవకీ ఈ సంగతే కావాలి. ‘‘ఇంటర్’’ చెప్పాడు.
‘‘పర్లేదు.. తొందర్లో ఇంజినీరింగ్‌లో వేస్తే మీరు ఫ్రీ అయిపోతారు’’
‘ఫ్రీ అయిపోతానా?’ దేన్నుంచి? అనుకున్నాడు ఇస్మాయిల్. ఇన్నాళ్లూ తాను కూతురు గురించి ఎన్నడు పట్టించుకున్నాడని.. ఇప్పుడు ‘ఫ్రీ’ కావడానికి! ..నవ్వాడు!
‘‘మీలాంటి వాళ్లు ఢిల్లీ బ్యూరోను లీడ్ చేయాలి సర్’’
‘‘ఛీఛీ.. వెధవ రొచ్చు.. అయినా ప్లానింగ్‌లో ఉండే తృప్తి ఉండదు. పైగా ఈ జీతాలతో.. ఢిల్లీలోనా.. చచ్చూరుకుంటాం..’’
‘‘కానీ.. మేనేజిమెంట్ అదే కోరుకుంటోంది..’’
చురుగ్గా చూశాడు ఇస్మాయిల్. తానేం పొరబాటు మాట్లాడాడో మేనేజరుకు అర్థమైంది. సర్దుకుని, ‘‘అబ్బెబ్బే అది కాదు- మిమ్మల్ని ఢిల్లీ పంపాలని…’’ టేబుల్ మీద ఉన్న తెల్ల కవరును ఇస్మాయిల్ వైపు నెట్టాడు.
అర్థమైంది. ఇస్మాయిల్ అనుభవానికి మేనేజిమెంట్ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసు! కానీ ఇది అనూహ్యం. ఇప్పుడు మేనేజిమెంటే మారిపోతున్నది. ఈ ఎత్తుగడలు కొత్తగా జీర్ణం చేసుకోవాలి. ‘‘బిట్వీన్ ది లైన్స్ ఏంటి?’’
‘‘మీకు తెలియంది ఏముంది సార్’’
కవరు అందుకోలేదు. టేబుల్ మీదనే ఓ కాగితం అందుకున్నాడు. సంతకం పెట్టి లేచి వచ్చేశాడు. ఎన్నో వేల వార్తలు రాసిన చేయి.. ఆ సంతకానికి ముందు నాలుగు ముక్కలు రాయడానికి వణికింది. ఎన్ని వెలుగులు చూసినా సరే, తర్వాత ఒక చీకటి వస్తుంది!
***
‘‘మీకేంటి సార్.. మా చానెల్లో చేరండి..’’ అన్నాడు లోకల్ యూట్యూబ్ చానెల్ వాడొకడు.. ‘‘అంత ఇవ్వలేం గానీ..’’ అని ముక్తాయించాడు. ప్రతిసారీ ఒకే కూలీ గిట్టుబాటు అవుతుందా…? కూలికి మోసేవాడికి- అది పాడె అయితేనేం.. పల్లకీ అయితేనేం!?
ఒప్పుకున్నాడు ఇస్మాయిల్.
‘‘పత్రికల్లో లాగా కాద్సార్.. ఇది టీవీ మీడియా. పైగా మన లోకల్ టీవీ లెవెల్ వేరు. భాష కొంచెం కిందికి.. అర్దమయ్యేట్టుండాల’’ అన్నాడు. ఒకరోజు రైతుల ధర్నాల మీద లాఠీ చార్జీ జరిగితే.. ‘మిన్నంటిన రైతన్న వేదన’ అనే ప్రోగ్రాం చేశాడు. వాడికి కోపం నషాళానికంటింది. ‘‘మిన్నంటిన అంటే..’’ అడిగాడు. చెప్పేలోగానే ‘‘వేదన రోదన ఇవన్నీ ఎందుకు సార్. వాయిస్ ఓవర్ చదివే అమ్మాయికి తెలిసిన భాషే మీరు రాయాల… రైతు ఏడుపు – అంటే సరిపోద్ది’’
కాదనలేదు ఇస్మాయిల్. అనలేడు. అచ్చంగా ఒకటోతేదీ కాకపోయినా.. నెలగడిచాక వాడిచ్చే పన్నెండువేలూ చాలా అవసరం తనకి.
‘ఇంకా ఎందరు గురువుల పాఠాలు వినాలో’ అనుకున్నాడు. నక్క సింహాసనం మీద ఉంటే సింహానికి వేట నేర్పుతుంది!
***
మిషను జోరుగా చప్పుడు చేస్తోంది. మధ్యలో కొన్ని క్షణాలు ఆగుతుంది. చక్ మని కత్తెర చప్పుడు. మళ్లీ దడదడమని మిషను శబ్దం. కాసేపు తర్వాత బేగం తొక్కడం ఆపి పాదాలు, వేళ్ల మొదలు, మడమలు ఒత్తుకుంటుంది. మళ్లీ తొక్కుతుంది. దడదడ దడదడ….
ఇస్మాయిల్‌కు ఆ దడదడ చప్పుళ్లు గుండెల్లో రొదలా ఉన్నాయి. మిషనుకు బిగించడానికి మోటరు అడిగింది – చాన్నాళ్ల కిందట! ‘నువు కుట్టే రెండు మూడు రైకలకి, మోటరు గావాల్నా’ అని తీసిపారేశాడు. ఇప్పుడు రోజంతా కుడుతూనే ఉంది. తెలిసిన ఇళ్లు తిరిగి అడిగి మరీ పని తెచ్చుకుని కుడుతోంది. ‘మోటరు కొనాల’.. ప్రతిరోజూ ఈ మాట అనుకుంటాడు ఇస్మాయిల్. ప్రత్యేకించి.. బేగం పాదాలు ఒత్తుకుంటున్నప్పుడు! ‘వొచ్చే నెలలో కొంటా’ అని సమాధానపడ్తాడు.. తిరిగి మిషను తొక్కుతున్నప్పుడు! మిషను చప్పుడు పూర్తిగా ఆగిపోయిన తర్వాత.. పడుకుని, ‘తొందరేం లేదు. యీ పిల్ల రేపు ఇంజనీరైపోయాక తొలిజీతంతో తల్లికి మోటరు కొంటుంది’ అని తన చేతగానితనానికి ముసుగేసేస్తాడు!
ఖాళీగా సోఫాలో కూచున్నాడు. ఇదివరకైతే ఈ పాటి ఖాళీ ఉంటే పేపరు అందుకుని చదువుతుండేవాడు. ఇన్నేళ్లూ కాంప్లిమెంటరీ వొస్తోంటే తెలియలేదు. పేపరు రేటు చాలా పెరిగింది. ఇప్పుడు కొనడం లేదు. టీవీలో వార్తల్ని మ్యూట్‌లో చూశాడు. వినడం దండగ. కింద అక్షరాల్లో వస్తున్నది చూస్తే సంగతులు అర్థమైపోతాయి. వింటూ కూచుంటే.. రెండు ముక్కల వార్తల్ని, యాంకరమ్మలు రామాయణమంత చెబుతారు! చెప్పేవాడికి వినేవాడు లోకువ.
పాప చదువుకుంటోంది. చాన్నాళ్లుగా గుండెలో ఏదో కెలుకుతున్నట్లుగా ఉంది. దానికి ముగింపుగా అన్నాడు.
‘‘ఇవాళ్టినుంచీ.. నేనే నీకు ట్యూషన్ మాస్టర్‌ని. అంటే చదువు చెప్పలేననుకో. కానీ రోజూ ప్రశ్నలడుగుతుంటా..’’
‘‘నిజంగా…’’ కళ్లు విప్పార్చుకుని అన్నదా పాప!
అవునన్నట్టు గర్వంగా నవ్వాడు. జీవితంలో ఏం చేశాడో.. ఏం సాధించాడో.. గుప్పుమని వెలిగి ఆరిపోయిన విజయాలు ఏమిటో.. ఏ పతనంలో బతుకీడుస్తున్నాడో.. ఇలాంటివన్నీ అనవసరం తనకిప్పుడు. తన కూతురు మనసు ఖచ్చితంగా గెలుచుకుంటాడు. ఆమెను తాను అశ్రద్ధ చేయలేదనే నమ్మకం ఆమెకు కలిగిస్తాడు. ఆమె తనది. ఒకసారి పాదుగొలిపితే… ఆ నమ్మకం, ప్రేమ ఎక్కడికీ పోవు. తనను ఎప్పటికీ గడ్డి పరకలాగా అనుకోవు. అవసరం తీరాక విసిరి పారేయవు. ఎందుకంటే- బంధాలు… ఉద్యోగాలు కాదు!
చదివేప్పుడు ప్రశ్నలు అడుగుతూ.. రికార్డులు రాసేప్పుడు డ్రాయింగులు వేసిపెడుతూ.. ఆడేప్పుడు పోటీ పడుతూ.. తినేప్పుడు ముద్దలు కలిపి పెడుతూ.. యింకా ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా తండ్రిగానే వ్యవహరిస్తాడు.
‘‘అమ్మకేమో ఇంగ్లీషు రాదు.. నువ్వు నిజంగానే ప్రశ్నలడుగుతూ ఉంటే.. బిలో ఫైవ్ తౌజండ్ కొట్టేస్తా..’’ ఉత్సాహంగా చెప్పింది.
‘‘ఇవాళ్టినుంచే’’ బొటనవేలు పైకెత్తిన పిడికిలి చూపిస్తూ నవ్వాడు. ‘సిద్ధం’ అన్నట్లుగా తనవైపు తిరిగి కూర్చుంది.
అంతలోనే ఉపద్రవం వచ్చిపడింది. ‘ఏ ఇయర్ చదువుతోంది ఇప్పుడు?’ తనను అనేకమార్లు ఇబ్బంది పెట్టిన ప్రశ్న. మళ్లీ ఇస్మాయిల్ ముందుకొచ్చి నిల్చుంది. అడిగితే అసహ్యంగా ఉంటుంది. తన తెలివితేటలతో కనిపెట్టాలి. అల్మేరాలోంచి ఆమె పుస్తకం ఒకటి అందుకున్నాడు. ఫిజిక్స్. తాను చదివినది కొంచెం కొంచెం గుర్తొస్తోంది, పేజీలు తిరగేస్తోంటే! అందులో ఏదోక ప్రశ్న అడగొచ్చు. కానీ.. తాను మరింత శ్రద్ధ పెట్టినట్టు అర్థం కావాలి!
‘‘ఏం పాఠం జరిగింది ఇవాళ- ఇందులో…’’ ట్యూషన్ మాస్టారులాగా అడిగాడు.
కూతురు ఆశ్చర్యంగా చూసింది. లోలోపల నవ్వుకున్నాడు. ఆ మాత్రం ఆశ్చర్యం సహజం. ఎన్నడూ లేనిది.. తొలిసారి పాఠాలు అడిగితే ఆ మాత్రం ఆశ్చర్యపోదూ..! పాప తేరుకుని అంది…
‘‘అది ఫస్టియర్‌ది నాన్నా. నేనిప్పుడు సెకండియర్..’’
ఒక్కసారిగా.. పొలమారినట్టుగా దగ్గాడు. కుడిచేత్తో పుస్తకం వదలకుండా, కిందపెట్టకుండానే… ఎడమచేత్తో నెత్తి మీద కొట్టుకుంటూ.. ఆ దగ్గుని మరికొన్ని క్షణాలపాటు సాగదీశాడు. గొంతులో పట్టేసినప్పుడు సవరదీసుకుంటున్నట్టుగా చిన్న చప్పుడు చేశాడు… మరికొన్ని క్షణాలు కళ్లు మూసుకున్నాడు.. కళ్లు వెడల్పుగా తెరచి నిటారుగా మోర పైకెత్తి, పైకప్పు కేసి కొన్ని క్షణాలు చూశాడు. ఒక కంటి చివరనుంచి ఒక చుక్క చెవికేసి జారి జులపాల్లో అదృశ్యయైపోయింది. అలా విదిలిస్తూ తల దించాడు. ఎదురుగా ఉన్న మిగతా పుస్తకాల్ని చూశాడు. ‘నా వెధవాయిత్వాన్ని గుర్తుపెట్టుకోకు’ అన్నట్టు ఎదురుగా ఉన్న కూతుర్నీ, వోరగా బేగంనీ చూశాడు. ఒక రకంగా నవ్వాడు. తర్వాత అప్పటిదాకా కుడిచేతిలోనే ఉన్న పుస్తకాన్ని కింద పెట్టేసి.. ఒక గుటక వేశాడు.
ఏ ఉపద్రవాన్ని తప్పించుకోవడానికి.. ఇంత నాటకమూ రక్తికట్టించాడో.. అది మాత్రం తప్పలేదు.
పాప క్వశ్చన్ బ్యాంక్ అందించింది. నవ్వుతోంది. ‘ఇందులోంచి అడుగు’ అన్నట్లుగా! దాన్ని తెరచి… పాప, బేగం తనని చూడకుండా… తల బాగా వంచుకుని అందులోకి దూర్చేశాడు ఇస్మాయిల్!
కొన్ని బతుకులు అంతే. గడ్డిబొగ్గులు అవి. కాలిన తర్వాత వేలితో ముట్టుకుంటే ధూళిగా మారి గాలిలో కలిసిపోతాయి.
ఎన్ని గడ్డిపరకలు కాలిస్తే.. బొగ్గులు రావాలి?
ఎన్ని ప్రశ్నలు అడిగితే.. తన మీద తండ్రికి శ్రద్ధ ఉన్నదని ఆ పాప నమ్మాలి?
ఎన్ని బతుకులు బూడిదైతే.. నిశి బతుకుల్లో చైతన్యం పుట్టాలి?
*
చాలా అద్భుతంగా ఉంది పిళ్ళై గారు..మన జీవితాలకు అద్దం పట్టింది. నిజంగా మనవి కరేపాకు బతుకులు.
Pillai nee katakekkina Ismail adrustavantudu…ekkadunnadoo…taluchukunnappudalla kantineerai palakaristadu
జెనరల్ షిష్టుకెళ్లే జర్నలిస్టుల జీవితాలు మాత్రం ఘోరం. చంద్రుడినీ చూడలేరు.. సూర్యుడినీ చూసే ఓపికా ఉండదు పాపం వాళ్లకు. వాళ్ల శరీరాలే కాదు.. జీవితాలకూ ఇబ్బందే. ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారో చూడలేరు. జీవితం చిన్నదంటారు.. పత్రికల్లో నైట్ షిఫ్టులో పనిచేసేవాళ్లకు ఆ జీవితం పిసరంత. పోయిన జీవితం రాదు. వయసైపోతే తిరిగిరాదని .. అసలు ఇంత కష్టపడి ఎందుకు చేశామని జర్నలిస్టులకు చాలా ఆలస్యంగా అర్థమవుతుందేమో. జీవితాన్ని రాత్రుళ్లకు తాకట్టు పెట్టినా.. డెస్క్ జర్నలిస్టుల జీవితాల్లో వెలుగురాదు. రిపోర్టర్లు మాత్రమే జర్నలిస్టులు అనుకునే ఈ సమాజంలో డెస్క్ జర్నలిస్టుల బాధలు అగమ్యగోచరం. వయసయిపోయిన జర్నలిస్టు యూట్యూబ్ వాడికి లోకువే. అనకూడదు కానీ .. జిహెచ్ఎమ్‌సీలో కసువు నూకే వాళ్లు చాలా బెటరేమో.. డెస్క్ జర్నలిస్టుతో పోలిస్తే. కథ.. ఆద్యంతం జర్నలిస్టు జీవితాన్ని టార్చిలైట్ వేసి చూపింది. ఒక డెస్క్ జర్నలిస్టు జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. గడ్డి బొగ్గులు.. టైటిల్ యాప్ట్‌గా ఉంది సర్!
Pillai
Now I clearly understood why you resigned
Excellent narration
Keep it up
సురేష్ భయ్యా, ఏకబిగిన చదివించారు… ఇంకేమైనా మిస్సయ్యానా అనిపించింది.
మీ శైలి 👌
అభినందనలు 😊👍
Kalla mundu jarugutunndi…. Cheppali… Suresh abhinandanalu..,
పిళ్ళై గారు.. చిన్న కథలో జర్నలిస్ట్ జీవిత సత్యాన్ని చాలా బాగా చెప్పారు. కంట నీరు తెప్పించారు. గ్రేట్. డెస్క్ జర్నలిస్ట్ కనెక్ట్ అవుతాడు.
ప్రపంచాన్ని తెలుసుకున్నా బ్రతుకు నేర్వని జీవితాలు. మళ్లొకసారి జర్నలిస్టు జీవితం, అభద్రతా భావంతో తిరిగే సీనియర్లు, లాకౌట్లు కళ్లముందు కనిపించాయి. కాంప్లిమెంటరీ కాపీ నుంచి వేలవార్తలు రాసిన చేయిలో వణుకు వరకు అద్భుతమైన డీటెయిలింగ్.
అభినందనలు🙏🏻