కొద్దిగా బేరమాడి ఎర్రమట్టికుండ ఒకటి కొని ఇంటికి తెచ్చుకుంటాం. దాంట్లో నీళ్లు నింపి అడుగున పెద్ద మూకుడు ఉంచి రేపటికి వెలుస్తుందని గదిలో మూలన పెడతాం. ఎండలో తిరిగి తిరిగి వస్తాం కదా, ఆకలి. ఒకళ్ళనొకళ్ళం చూసుకుంటాం. దగ్గరికి జరుగుతాం. ఇక అన్నం వండటం ఎందుకు?
తలుపు తీశాక, బయట రాలిన మావిడాకులన్నీ అవతలకి తోసి, కాస్త నీడపట్టుకి బక్కెట్టు లాక్కుంటావు. బట్టలుతికే విషయంలో భలే చాదస్తంలే నీకు. ఒక్కో చొక్కా, తువ్వాలు జాడిస్తూ వాటి కతలేవో చెప్తూ ఉంటావు. నల్ల కాటన్ చున్నీ వచ్చినప్పుడు మరీ ఎక్కువసేపు మాట్లాడతావు. నేను ఊ కొడుతూ మురికినీళ్లు తొలిపేసి మళ్లీ బకెట్ నింపుతాను.
అరల్లో దొరికిన దినుసులేవో కలిపి ఒక చిత్రమైన వంట ఏదో చేస్తాను. మాట్లాడకుండా గబగబా తింటుంటావు. బాగుందని చెప్పూ.. అని నీ చెయ్యి పట్టుకుని కలిపిన ముద్దల్ని గిన్నెలోకి విదిలిస్తూ ఉంటాను. ఊహూ.. పలకవు. మొత్తం తినేసి “ బతికించావ్ అమ్మాయ్, తెగ ఆకలేసింది” అని చెయ్యి తుడుచుకుంటావు. ఎందుకో తెలీదు, పిచ్చి ఇష్టం అనిపించి నీ తలవంచి “బ్లెస్ యూ బుజ్జమ్మలూ” అని ముద్దు పెట్టుకుంటాను.
మన్ని చూసిపోడానికి ఒక పెద్దాయనెవరో వస్తారు. కాసేపు విదేశాల గురించీ పుస్తకాల గురించీ మాట్లాడుకుంటాం. మనం నేర్చుకున్న కొత్తపాటలు సొంతరాగాల్లో పాడి వినిపిస్తాం. ఆయన మోకాలి మీద తాళం వేసుకుంటూ తల ఊపుతారు. ఆయన్ని సాగనంపే వంకతో వీధి చివరిదాకా నడుస్తాం. తిరిగొస్తూ “అయ్యో! ఆదివారం అయిపోయింది.” అంటాన్నేను. “ఊ.. ఆ కుర్చీ శీల బిగించాలి. ఇందాక ఆయన కూర్చుంటే చప్పుడొచ్చింది.” అని సమాధానం చెప్తావు నువ్వు. మన ఇంటెదురు మిఠాయికొట్టు అప్పుడే సర్దేస్తుంటారు ఇవ్వాళ కాస్త తొందరగా.
పాత గడ్డిపోచలు ఇక్కడ
[చదువరులకు గమనిక: “న్యూ మ్యూజింగ్స్” మీ శీర్షిక. యెవరైనా రచనలు పంపించవచ్చు. మీ అనుభూతులూ, ఉద్వేగాలూ, అనుభవాలూ, యాత్రా స్మృతులూ…ఈ శీర్షికకి ఒక పరిమితి అంటూ లేదు. ఇది పూర్తిగా మీ శీర్షిక. ]
సూపర్ అక్కా
Lovelyfeelings..nice
ఉదయాన్నే చెట్టు మీదో కొత్త పిట్టను చూసినంత ఆశ్చర్యం… ఆనందం వేసింది చదవగానే
wow , great poet really .ni kunadamta hattukovaalani.this worda touch my heart.