కవిత్వ వారసత్వాన్ని రక్తంతో అందుకున్న మురళికి కవిత్వ అల్లిక తెలుసు. మురళికి వాళ్ల నాన్న ఇచ్చిన ఆస్తి కవిత్వం. మొదటి కవితా సంపుటి అస్తిత్వం వైపు అతని స్థానం ఏంటో తెలుగు సాహిత్య లోకానికి చెప్పింది. ఇది రెండవ రాకడ. ఉత్తరాంధ్ర నేల మీద నుండి ప్రవహిస్తున్న ఎస్టాబ్లిష్డ్ స్వరం మురళి. జీవితాల్లోని సున్నితత్వ పార్శ్వాలతో పాటు సామాజిక చరణాలను జమిలిగా మురళి ఆవిష్కరించాడు. ఇతను వాక్యం శాశ్వతమైన అనుభూతిగా మన మనసులో ఉంటుంది. మురళికి తరచుగా కవిత్వం అయ్యే లక్షణం లేదు.
బాగా రగిలిన తర్వాత కవిత్వం అవుతాడు. రగిలిన క్షణాల్లోంచి వాక్యావిష్కరణ చేస్తాడు. తనదైన సృజనలోకి మనల్ని సులభంగా తీసుకెళ్తాడు. కవితలో మనమెంత నిమగ్నం కాగలమో మనమే తేల్చుకోవాలి. తాను ఎంచుకున్న వస్తువుని అలలు ,అలలుగా విస్తరిస్తూ మనల్ని తీరాన్ని చేరుస్తాడు. మా చిన్నప్పుడు పల్లెటూర్లలో రావి ఆకు, రావి ఆకు చేర్చి విస్తరి కుట్టినట్లుగా ఈతాకు ఈతాకు జరిచేసి చాప అల్లినట్లుగా కవితను నిర్మించగలడు. వాక్యం చిక్కగా ఉంటుంది.వదులుగా ఉండదు. తానేం చూశాడు, చూస్తున్నాడు వాటి ముందు వెనుక ఉన్న జీవితం గురించి మురళి మాట్లాడగలడు. బ్యాలెన్స్ తప్పని వాక్యాలు ,నేల విడిచి సాము చేయని అక్షరాలును ఈ కవితలలో మీరు చూడవచ్చు. కవిత్వ నిర్మాణంలో మనోభావాలు నిర్మాణాన్ని సమర్థవంతంగా నడపగలడు. కవిత్వ వాతావరణంలోకి పాఠకుడిని తీసుకెళ్తాడు. సున్నితత్వం ,సునిశితత్వం ఎక్కువ. ఈ కవిత్వ సంకలనంలోకి మనం తొంగి చూస్తే పరీక్ష నాలికలో నుంచి పొడుచుకొస్తున్న సూర్యుణ్ణి చూపిస్తాడు. మరట్టే మాటాడ్నేను అంటూనే తన నేల దుఃఖాన్ని మనలోకి పంపుతాడు. రుజాగ్రస్థ లోకానికి కంటి వెలుగు ప్రసాదించే అక్షరాలు ఇవి మురళి నిఖార్సైన కవిత్వభాషలోనే మాట్లాడుతాడు .అతని పద్యం హఠాత్తుగా కురిసే మేఘం కాదు . గుంభనంగా ఉండి ముంచేత్తే మేఘం. అంతర్లీనంగా చెప్పడం ,కవితాత్మకతను నిర్లక్ష్యం చేయకపోవడం గమనించవచ్చు.
మురళికి కవిత్వం ఎలా రాయాలో తెలుసు, రాయకూడదో తెలుసు.
అయితే ఒకానొక సందర్భంలో నాకు మురళికి మధ్య ఇట్లాంటి ఆసక్తికర సంభాషణ ఒకటి జరిగింది. ఆ సందర్భాన్ని ప్రశ్నలు జవాబులుగా మీ ముందుకు తెస్తున్నాను.
సాహిత్యంలోకి మీ ప్రవేశం ఎలా జరిగిందో చెప్పండి?
సాహిత్యం లోకి నా ప్రవేశం గురించి తలచుకున్నపుడల్లా నాన్న గుర్తుకొస్తాడు. అత్యంత సరళంగా పద్యాన్ని అల్లడమేకాకుండా హృద్యంగా ఆలపించడంలో దిట్ట ఆయన. పిల్లల్ని అమితంగా ఆకట్టుకునే బాలగేయాలని సృజించడంలో ఈ కాలంలో ముందు వరసలో ఉంచదగిన బాలసాహితీవేత్త కూడా. ఆ కారణంగా ఇంట్లో ఏర్పడ్డ సాహిత్య వాతావరణం వలనో, నాన్నతో చిన్ననాటి నుండే సాహిత్య సభలకు వెళ్లడమూ,..ఆయన గేయాలు కవితలు అచ్చయ్యే బాలజ్యోతి,ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలతో పాటు బాలల కథలు, నవలలు బాల్యంలోనే ఎక్కువగా చదవటమూ నేను ఇటు రావడానికి దోహదమయ్యాయనుకుంటాను.
అస్తిత్వం వైపు కవితా సంపుటికి, ఈ కవితా సంపుటికి ఉన్న ప్రధానమైన తేడా చెప్పమంటే ఏం చెప్తారు?
అస్తిత్వం వైపు కవితా సంపుటికి దీనికి ప్రధానమైన తేడా చెప్పమంటే వస్తువైవిధ్యమని చెబుతాను.నా మొదటి సంపుటిలో వస్తువును శిల్పం కొంత డామినేట్ చేసిందనిపించొచ్చు.ఇందులో అలా కాకుండా వస్తువు శిల్పం సమతూకంగా నిర్వహించగలిగానని అనుకుంటున్నాను
ఈ కవితా సంపుట్లో యాత్ర అనే కవిత తాత్వికత,నేపథ్యం ఏమంటారు?
మిత్రులతో కలసి సామర్లకోటలో నున్న కుమార భీమేశ్వర ఆలయాన్ని సందర్శించినప్పుడు ఎప్పుడో పదమూడొందల ఏళ్ళ క్రితం కూడా ఆ నిర్మాణం వెనుక నున్న శ్రమ, కళానైపుణ్యం నన్ను కదిలించాయి.గుడి ముందు యాచిస్తున్న ముసలావిడ ముఖ్యంగా ఆ కవిత రాయడానికి కారణమయ్యింది. కవిత నన్ను వేలుపట్టి నడిపించిందా అన్నట్లు రాసిన కవిత అది.మీరు యాత్రాకవిత్వం మీద రాసిన వ్యాసంలో ఆ కవితలో మొదటి రెండు లైన్లు కోట్ చేయడం చాలా ఆనందమనిపించింది
బడి పిల్లల నేపథ్యంలో రాసిన కవితలు రెండు కూడా విభిన్నంగా ఉన్నాయ్, వాటికి ప్రేరణ ఏమంటారు?
ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నాకు తెల్లవారితే పిల్లలతోనే సావాసం.నా దగ్గర చదువుకునే విద్యార్థుల్ని గమనించినపుడు నేను పరిశీలించిన అంశాలే కవిత్వంలోకి తర్జుమా అవుతాయి. అలా రాసినవే ఆ కవితలు.
మత్స్యకార నేపథ్యంలో ఉన్న కవితలు రాయడానికి గల కారణాలు ఏమిటీ?
ఉత్తరాంధ్ర నుంచి కావచ్చు లేదా మొత్తంగా కావచ్చు… మత్స్యకార జీవితం మీద రావలసినంత కవిత్వం రాలేదన్నది నా అభిప్రాయం… నేను తరచూ మత్స్యకార గ్రామాలలో సంచరిస్తున్నపుడు నేను గమనించిన అక్కడి జీవితం , వారి వలస ,వారి వేదన నేనీ సంపుటిలోనున్న మత్స్యకార కవితలు రాయడానికి ప్రేరణలయ్యాయని చెబుతాను
అస్పష్టత సంక్లిష్టత ఈరెండు పదాల పట్ల మీ అభిప్రాయమేమిటి
మొదట నేను సంక్లిష్టత గురించి మాట్లాడుతాను.జీవితం సంక్లిష్టమవుతున్నపుడు కవిత్వం కూడా సంక్లిష్టం కాకుండా ఎలా ఉంటుంది. అయితే సంక్లిష్టతలో కూడా కవి ఫీల్ అందగలగాలి.కవి ఏదో ఒకచోట పాఠకుడు గుర్తించేలా తాళంచెవి లాంటి లైన్ ఉంచగలగాలి.అలా అయితే ఎవరికి వారు తమ తమ రీతుల్లో ఆస్వాదించగలగుతారు. ఇక అస్పష్టత అంటారా ఏ రకంగానూ కవి పాఠకుడి అందలేకపోవడం.
మీ కవిత్వ నిర్మాణ పద్ధతులు ఏంటి?
కవిత్వ నిర్మాణ పద్ధతులంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. రాసే వస్తువు నాలోకి పూర్తిగా ఇంకినంత వరకు కవిత మొదలుపెట్టను.అన్నీ ఒకే నిర్మాణ శైలిలో ఉంటాయనుకోను. దేనికదే తన నిర్మాణాన్ని నిర్దేశిస్తుందా అన్నట్లనిపిస్తుంది.కవిత పూర్తయ్యాక కూడా కొన్ని రోజులు నా దగ్గర అట్టే పెట్టుకొని తర్వాత చదివితే నాకు బాగుంది అనిపిస్తేనే మెరుగులు దిద్దుతాను..ఏమైనా కవిత వాచ్యంగా మారిపోకుండా జాగ్రత్త పడతాను..
ఉత్తరాంధ్ర అస్తిత్వ సాహిత్యం పై మీ అభిప్రాయం చెప్పండి
ఉత్తరాంధ్ర వివక్షకు గురైన ప్రాంతం. అట్టాంటి నేల మీద సహజంగానే ప్రాంతీయ అస్తిత్వ సాహిత్యం ఉద్భవిస్తుంది.కథల్లోనూ ముఖ్యంగా కవిత్వంలో ఈ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఈ ప్రాంతంలో రాస్తున్న కవులు ఇక్కడ దుఃఖాన్ని బలంగా వ్యక్తీకరిస్తున్నారు
ఇందులో మీరు రాసిన రెండు మాండలిక కవితలు జీవద్భాష తో నిండిఉన్నాయ్. కవిత్వంలో మాటలు వినియోగం గురించి మీరేమంటారు?
కవులు వాళ్ల వాళ్ల మాండలికంలో కవిత్వం రాయడం అవసరమని జి.లక్ష్మీ నరసయ్యగారు,అట్టాడ అప్పలనాయుడు గారు తరచూ చెబుతూ వస్తున్నారు. ఉత్తరాంధ్ర నుండి ఇదివరకే కవులు మాడలికంలో బాగా రాసారు,ఇప్పుడు కూడా రాస్తున్నారు.నేను కూడా ప్రయత్నం చేసాను. ఎంతవరకు సఫలమయ్యానో అన్నది తెలియదు.కానీ ముందు ముందు మరిన్ని కవితలు మాండలికంలో రాయాలన్న కోరిక మాత్రం బలంగా ఉంది.
అయితే మురళి తాను ఎన్నుకున్న వస్తువు ఏదైనా గాని ముందు తనలోకి తాను ఒంపుకుంటాడు. సృజన మూలాలు తెలుసు. చైతన్య రహిత హృదయాలను భగ్నం చేయగలడు. లోచూపుతో పాటు స్వేచ్ఛతో కూడిన భావవ్యక్తీకరణ ,నిజాలను పునర్నిర్మించే సాహసం ఉన్నాయ్.మనసులను మెలిపెట్టగల మృదువైన వాక్యాలు
రాయగలడు. కవికి అధ్యయనం అత్యంత ప్రధానమైన సంగతి మనకు తెలుసు. గతంలో వెలువడిన సాహిత్యంతో పాటు వర్తమాన ధోరణి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి.
ఆ ఎరుక మురళిలో ఉంది. ఈ కవితా సంపుటి చివరిలో ఉన్న అనువాద కవితలు మురళి స్వీయకవిత్వానికి ధీటుగా ఉన్నాయి. వర్తమాన సంక్షుభిత సామాజిక జీవన సంవేదనలను అప్రమత్తంగా గమనిస్తున్న కవి మురళి. ఈ కవిత సంపుటి ద్వారా మురళి ఇచ్చే సారాంశాన్ని పాఠకులు అందుకోవాలి . తన కవిత్వం ద్వారా మురళి మన హృదయాలను స్పృశించ గలడు. దాదాపు డజను సంవత్సరాల తర్వాత మురళి మళ్లీ మన ముందుకు వస్తున్నాడు. ఇతని కవిత్వాన్ని మనసారా హత్తుకుంటారని ఆశిస్తున్నాను.
*
అఫ్సర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు
అఫ్సర్ గారికి,గోపాల్ కు కృతజ్ఞతలు