”బాషా భాయ్ దుకాన్‌కెళ్లి కోడి మాంసం పట్రా…” చీర కొంగులో ముడేసుకున్న మూడు పది రూపాయల కాగితాల్ని నా చేతిలో పెడుతూ అంది అమ్మీ.
కోడిమాంసం అనగానే… నాకు ప్రాణం లేచొచ్చింది. ఇంట్లో కోడి కూర వండితే పండగన్నట్టు. రోజూ… ఉల్లిపాయ పులుసో, తెలగపిండి కూరో, అదీ లేకపోతే… మజ్జిగ చారో, పచ్చడి మెతుకులో. తినీ తినీ మొహం మొత్తేస్తుంటే, అమ్మీ అప్పుడప్పుడూ… ఇలా వరాలు కురిపిస్తుంటుంది. కానీ అదేం బయట కనిపించకుండా..
”మూఫ్ఫె రూపాయలా… దీనికేం వస్తుంది.. ఎంత మందికెడతావ్?” అన్నాను. నలిగిపోయిన పది రూపాయినోటుని అరచేత్తో సాఫ్ చేస్తూ.
”ఇష్టమైతే పట్రా, లేదంటే లేదు. ఈరోజు కూడా.. పప్పు చారు కాచేస్తాను…” అంటూ ఆ నోట్లు లాక్కోబోయింది.
అమ్మీ మనసు మారితే మొదటికే మోసం వస్తుందని నా బుజ్జి బుర్ర గ్రహించింది. పరుగులాంటి నడక అందుకుని… బాషా భాయ్ దుకాన్ వైపుకు కదిలా.
బాషా భాయ్‌తో మాకు దోస్తాగీ ఏం లేదు. కానీ ఇంటి ముందు నుంచి పోయే ప్రతీసారీ… ”బాషా భాయ్…” అని ఆప్యాయంగా పిలుస్తుంది అమ్మీ. నేనూ, మా ఆపా కూడా ”సలాంవాలేకూం.. మామూ” అంటూ వరస కలిపేస్తాం. మాంసం కోసం దుకాన్‌కి వెళ్లిన ప్రతీసారీ ఆ పిలుపు బాగా గిట్టుబాటు అవుతుందని నాకప్పుడు తెలీదు.
నేనెప్పుడెళ్లినా మంచి కండపట్టిన తొడ చూసి.. ఓ యాభై గ్రాములు ఎక్కువే తూచి… పొట్లం కట్టిస్తాడు బాషా మామూ. కాకపోతే.. రద్దీ ఎక్కువ. అన్నీ కేజీ, అరకేజీ బేరాలే. వాళ్లందరిముందూ ”ముఫ్ఫై రూపాయల మాంసం కొట్టు” అని అడిగితే చిన్నతనంగా ఉంటుందని… మౌనంగా ఓ పక్కనే నిలబడిపోతుంటా.
ఈలోపు… మామూకు విస్తరాకులు అందిస్తూ, పొట్లాలు కట్టడంలో సాయం చేస్తుంటా. అందుకే కొసరుగా రెండు కార్జం ముక్కలు పైన అద్దుతాడు. ఈరోజు నా పంట పండింది. కార్జంతో పాటుగా గుడ్లసేరు కూడా తగిలించాడు.
వస్తూ వస్తూ… హెడ్మాస్టారు గారింటి వాకిట్లో ఏపుగా పెరిగిన నిమ్మ చెట్టు రొబ్బని వంచి… నాలుక్కాయలు కొసి సంచిలో వేసుకున్నా.
అమ్మీ కోడి కూర వండేటప్పుడు చూడాలి. ఆ కూరకి అంత రుచి ఎందుకొస్తుందో అర్థమైపోతుంది. మసాలా బండపై అల్లం, వెల్లుల్లి మెత్తగా దంచి కొడుతుంది. కత్తిపీట ముందరేసుకుని మాంసం ముక్కల్ని ఇంకాస్త కురచగ కోస్తుంది. ”ఇది నీకు, ఇది ఆపాకు, ఇది అబ్బాకు, ఇది నాకు…” అంటూ కోస్తున్నప్పుడే వాటాలేసేస్తుంది.
అలా అంటుంది కానీ, కంచాల దగ్గర… అమ్మ వాటాలోంచి ముక్కలు కూడా నాకే పడుతుంటాయి. బేసెన్‌లో పచ్చి ముక్కలేసి, కారం, ఉప్పూ, మసాలా… బాగా కలిసి కాసేపు నానబెడుతుంది. మా ఆకలి సంగతి తెలుసు కాబట్టి, ఆ రోజు మాత్రం ఎసట్లో ఓ గుప్పెడు బియ్యం ఎక్కువే వేస్తుంది.
ఒక్కోసారి మాంసంలో మునక్కాడో, శనగపప్పో, బంగాళ దుంపో కలిపేస్తుంటుంది. రెండు పూటలా వచ్చేస్తుందన్న ధీమాతో. కానీ ఒట్టి కోడి కూరంటేనే నాకిష్టం.
కూర వండే వరకూ… నేనూ అమ్మ ఎనకాలే తిరుగుతుంటా. పొగ్గొట్టంతో గాలి ఊదుతూ, పొయ్యి కింద మంట ఎగదోస్తూ, మధ్య మధ్యలో గరెటతో కలుపుతూ… సాయం చేస్తా. కుత కుత ఉడుకుతున్నప్పుడు దేగ్షా మూత తీస్తే.. మసాలా వాసన గుప్పుమంటుంటుంది. ఆ వాసనకి ఆకలి రెట్టింపు అయిపోతుంటుంది.
”ముంతాజ్ ఇంట్లో ఈరోజు ముక్కల కూర… ” అంటూ ఆ వీధిలో వాళ్లంతా చెప్పుకుంటారు. పక్కింటి సత్యవతత్త అయితే… ముందే గిన్నెతో దిగబడిపోతుంది. ”నాక్కూడా కొంచెం కూరెట్టు వదినా” అంటూ. అమ్మీ ఏమీ అనుకోదు. నవ్వుతానే గిన్నెనిండా కూరేసి పెడుతుంది.
”ముక్క ఉడికిందో లేదో చూడు…” అని అమ్మీ ఎప్పుడు పిలుస్తుందా? అంటూ అక్కడే పచార్లు కొడుతుంటా. ఆ పేరు చెప్పి కోడి కూర అందరికంటే ముందే రుచి చూసేద్దామన్న ఆశ నాది.
నిమ్మకాయల్ని నేలపై అర చేతితో అటూ ఇటూ రుద్ది, కాస్త మెత్తబడ్డాక, ముక్కలు కోసి, ఉల్లిపాయలు తరిగి సిద్ధం చేయడం ఆపా పని. అన్నం ఎప్పుడు ఉడుకుద్దా, కంచాలు ఎప్పుడు సర్దుతారా అంటూ ఎదురు చూడడం నా పని. కోడి కూర అని తెలిసిన రోజు అబ్బూ కూడా ఇంటికి పెందలాడే వచ్చేస్తాడు.
వేడివేడన్నం… అందులో కోడి కూర. నిమ్మకాయ పిండుకుని, ఉల్లిపాయ కొరుకుతుంటే… అంతకంటే విందేం ముంది? తింటే త్వరగా అయిపోతుందని, ముక్కల్ని అన్నం కింద దాచిపెట్టుకుని… ముందు షేర్వాతో లాగించేసి, ఆ తరవాత చారన్నంతో ముక్కల్ని నంజుకుంటూ తృప్తిగా త్రేనిస్తే తప్ప.. కోడి కూర తిన్నట్టుండదు.
”అమ్మీ… ఈసారి యాటమాంసం తెచ్చుకుందాం…” అని ఎన్నిసార్లు అడిగానో?.
”ఏట మాంసమా? మీ అబ్బూ తెచ్చే జీతం డబ్బులతో పచ్చడి మెతుకులు తినడమే ఎక్కువ” అని కరుసుకునేది.
”రఫీగాడింట్లో ప్రతీ ఆదారం.. యాట మాంసమే. మనం ఎందుకు వండుకోం?” అని కూడా అడిగాను.
”రఫీ వాళ్ల అమ్మీ దుబాయ్ నుంచి డబ్బులు పంపుతోంది కదా… అందుకే యాటేంటి? ఏదైనా వండుకుంటారు. అది డబ్బున్నోళ్ల కూర. నీక్కావాలంటే… గొడ్డుమాంసం వండుతా. రెండింటికీ ఫరక్ పడదు” అనేది.
గొడ్డుమాంసం పేరెత్తితే… అబ్బా తిడతాడు. ఎందుకో ఆ కూరంటే ఆయనకు ఏవగింపు. అందుకే ఇంట్లో ఎప్పుడూ… కోడి కూరే. అది కూడా పండక్కో పబ్బానికో.
”నువ్వు కూడా దుబాయ్ ఎళ్లొచ్చుగా..” అని అడిగితే,
”మరి నిన్నూ, ఆపాని ఎవరు చూస్తుంటారు.. పగటి కలలు మానేసి.. పడుకో” అని నాలుగు చివాట్లేసేది.
”దుబాయ్ ఎళ్తే… అమ్మీకి పని దొరుకుతుంది. పని చేస్తే… బోలెడు డబ్బులొస్తాయి. డబ్బులొస్తే… ఎంచక్కా… యాట మాంసంతో భోంచేయొచ్చు.. రఫీ గాడిలా దర్జాగా తిరగొచ్చు” అనిపించేది. కానీ ఎలా?
రాను రాను… యాట మాంసం తినాలన్న కోరిక బాగా పెరిగిపోయింది. కానీ అమ్మీనే.. ”ఇంకోసారి దాని పేరెత్తావంటే చీరేస్తా…” అని చీపిరి చూపించేది.
చుట్టాలొచ్చినప్పుడైనా యాట మాంసం వండుతుందనుకుంటే… ఉల్లిపాయ పులుసులో గుడ్లు ఉడకబెట్టి వేసేది.
రంజాన్‌కైనా మా ఇంట్లో యాట ఉడుకుద్ది అనుకుంటే… ఆ రోజూ కోడే కూసేది. ఆఖరికి ఆపా పెద్ద మనిషైనప్పుడు కూడా అదే.
”కనీసం బక్రీద్ కైనా… యాట మాంసం వండుకుందాం” అని అడిగితే.. అప్పుడు నా అమాయకత్వం చూసి నవ్వింది.
”బక్రీద్ కి కావల్సినంత యాట మాంసం. మన చుట్టాలంతా ఖుర్బానీలు ఇస్తారుకదా. మనకీ కొన్ని పొట్లాలొస్తాయ్. అప్పుడు తిందాం లే” అని సర్ది చెప్పిందో సారి.
”బక్రీద్ అంటే మేకల పండగ. బాగా డబ్బున్న ముస్లింలు ఆ రోజు మేకల్ని బలిచ్చి… ఆ మాంసం చుట్టాలకు, పేదోళ్లకీ పొట్లాలు కట్టి పంచి పెడతారు. మా ఇంటికీ కొన్ని పొట్లాలొస్తాయి…” అంది ఆపా.
అప్పటి నుంచీ బక్రీద్ గురించి ఎదురు చూడ్డం మొదలెట్టాను.
ఖుర్బానీ అంటే ఏంటి? అని అమ్మీని అడిగితే… ఉర్దూలో ఏదో చెప్పింది. అర్థం కాలేదు. ఆపాని అడిగితే.. ”బలిదానం” అంది. అంటే… ”మన కోసం ఇంకొకరు త్యాగం చేయడం” అంట.
అర్థం ఏదైతే ఏంటి? ఆరోజు యాట మాంసంతో భోం చేయొచ్చు.. ఇది ఎంత మంచి పండగో కదా? అనిపించింది.
****
ఆరోజు బక్రీద్. ఎనిమిదింటికల్లా… మజీద్‌కి రావాలని పేషుమామ్… మైకులో అరిచి మరీ చెప్పారు. అందుకే పెందలాడే నాకూ, అబ్బూకూ నూతి దగ్గరే కుంకుడు కాయ రసంతో తల స్నానం చేయించింది అమ్మీ. పాత బట్టలే అయినా.. గంజితో ఉతికి, బాగా ఇస్త్రీ చేయడంతో… తళతళ లాడుతున్నాయి. అబ్బా తన టోపీ నాకిచ్చి.. ఆయనేమో.. జేబు రుమూలు తలకి చుట్టుకున్నాడు.
”తినడానికేం లేదా?“ అని అడిగితే “మజీద్ నుంచి వచ్చాకే… ఏమైనా.. ”అంటూ మా ఇద్దర్నీ సాగనంపేసింది.
మజీద్ అంతా కొత్త బట్టలతో మెరిసిపోతోంది. పేష్‌మామ్ నమాజ్ చేసే పద్ధతుల్ని చెబుతున్నారు. నాకవేం ఎక్కడం లేదు. ఈరోజు… యాటమాంసంతో భోజనం అన్నది తప్పిస్తే. నమాజులూ, ములాఖాతులూ అయ్యాక పరుగు పరుగున ఇంటికెళ్లి కూర్చున్నా. అప్పటికే ఖుర్బానీ పొట్లాలు రావడం మొదలెట్టాయి. మొదటి పొట్లం రఫీ ఇంటి దగ్గర నుంచే. అవన్నీ ఓ గిన్నెలో పేరుస్తోంది ఆపా. కాసేపటికే.. ఏకంగా ఎనిమిది పొట్లాలొచ్చాయి. అటూ ఇటూగా కేజీ అయినా తూగుతుంది.
”ప్రతీ ముస్లీమూ ఖుర్బానీ ఇవ్వాల్సిందేనా..” నూతి దగ్గర మాంసం ముక్కల్ని కడుతున్న అమ్మీ పనిని అడ్డగిస్తూ అడిగా.
”అవును.. ఇవ్వాల్సిందే..” అంది ఏమాత్రం చూపు మరల్చకుండా..
”మరి మనం ఎప్పుడిస్తాం…”
”బాగా డబ్బు సంపాదించినప్పుడు” ముక్త సరిగా సమాధానం ఇచ్చింది.
”మరి డబ్బులు ఎప్పుడు సంపాదిస్తాం”
”నువ్వు బాగా చదువుకుని ఉద్యోగం చేసినప్పుడు”
”నువ్వు దుబాయ్ ఎళ్తే… నేను బాగా చదువుకుంటాను కదా”
అమ్మ నా వంక చూసింది. ఆ కళ్లలో కోపం లేదు. కానీ… ఇంకేదో ఉంది. అదేంటో నాకప్పటికి తెలీదు.
ఆరోజు తృప్తిగా.. యాటమాంసంతో భోంచేశాం. దేగ్షా లో కొంచెం కూర మిగిలితే.. అందులో అన్నం వేసి… ”ఇది నీ కోసమే… రేప్పొద్దుటే తిందువు గానీ..” అని ప్రేమగా తల నిమిరింది.
****
ఆరు బయట మంచాలేసుకుని పడుకున్నాం. కొబ్బరి ఆకుల మధ్యలోంచి చాన్‌మామూ కనిపిస్తున్నాడు. అక్కా, నేనూ… నక్షత్రాలను లెక్కెడుతున్నాం.
ఆ పక్క అరుగుమీద పడుకున్న అమ్మీ అబ్బా మాత్రం – అప్పుల్ని లెక్కగడుతున్నారు.
”షావుకారుకి పదేలివ్వాలి… మున్నీ పెద్దమనిషైనప్పుడు శంకరం దగ్గర మూడేలు తీసుకున్నాం. మొత్తం పదమూడు” అంది అమ్మీ.
”శంకరానికి కొంచెం ఆలస్యమైనా ఫర్లేదు.. షావుకారు మాత్రం కనిపించినప్పుడల్లా అడుగుతున్నాడు. బజార్‌లో ఇజ్జత్ పోతోంది…” ఎందుకో అబ్బూ గొంతులోంచి మాట దిగడం లేదు.
”చిన్నోడ్ని బాగా చదివించాలి.. మున్నీకి మంచి సంబంధం చూసి నిఖా చేయాలి… ఇవన్నీ మనవల్లవుతాయా…” అమ్మ మాటల్లో దిగులు వినిపిస్తోంది.
”అన్నిటికీ అల్లానే ఉన్నాడు…”
”పోనీ. ఓ పనిచేస్తే…”
”ఏంటి..?”
”నేనూ.. దుబాయ్ ఎళ్తే”
దుబాయ్ పేరెత్తగానే… నాకు చాలా సంతోషమేసింది. నక్షత్రాల్ని లెక్కేయడం మానేసి.. అబ్బ ఏం చెబుతాడా..? అంటూ… ఆయనొంక చూశాను. వెన్నెల ఎలుతురులో అబ్బూ మొహం స్పష్టంగా కనిపిస్తోంది.
”నాకూ అదే అనిపిస్తంది… ఎంత? రెండేళ్లు కష్టపడ్డావంటే అప్పులు తీరిపోతాయి… మున్నీ పెళ్లి కూడా చేసేయొచ్చు…”
అంటే అబ్బూ ఒప్పుకున్నట్టే..?
”మరి వీసాకి బాగా డబ్బులవుతాయి కదా…”
”షావుకారే దిక్కు. తనేదోలా సర్దుబాటు చేస్తాడు లే. రేపొద్దుట కలిసి మాట్లాడతా”
”సరే.. అయితే..”
ఇక అట్నుంచి మాటలేం వినిపించలేదు. మున్నీ అప్పటికే నిద్రలోకి జారుకుంది. నాకు మాత్రం ఎగిరి గంతేయాలనిపించింది. అమ్మీ దుబాయ్ వెళ్తే.. బోలెడన్ని డబ్బులు సంపాదిస్తుంది. ఆ రఫీ గాడిలా ఎప్పుడూ కొత్త బట్టలు కట్టుకోవొచ్చు. బాగా చదువుకోవొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా యాటమాంసంతో భోం చేయొచ్చు…
చాన్ మామూ ఇప్పుడు ఇందాకటికంటే అందంగా కనిపిస్తున్నాడు.
*****
”ఏరా… దుబాయ్ వెళ్లూ.. దుబాయ్ వెళ్లూ. అంటుంటావ్ కదా. నిజంగానే నీ కోసం వెళ్తున్నా. ఆపాని బాగా చూసుకుంటావ్ కదా.. అల్లరి చేయవు కదా..”
అమ్మీ ఇలా నన్ను అడగడం వందోసారి అనుకుంటా.
”నే చూసుకుంటానమ్మీ.. నువ్వేం బెంగపెట్టుకోకు..” అని భరోసా ఇస్తూనే ఉన్నా. కానీ ప్రతీసారీ.. అమ్మీ కళ్లలో నీళ్లు తిరిగేవి.
షావుకారు డబ్బులిచ్చాడు. వీసా కూడా వచ్చేసింది. ఆ రోజే ప్రయాణం.
అపాకీ చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పేసింది. సత్యవతత్తని పట్టుకుని కన్నీరెట్టుకుంది.
హైదరాబాద్ బస్సెక్కేముందు నన్నూ ఆపాని పట్టుకుని మళ్లీ బోరుమంది. నాకూ చాలా ఏడుపొచ్చేసింది.
”అమ్మీ నువ్వు దుబాయ్ ఎళ్లకు. ఇక్కడే ఉండు.. ” అనేశా ఎక్కిళ్ల మధ్య.
”మరి నువ్వు బాగా చదువుకోవాలి.. ఆపాకి పెళ్లి చేయాలి… ప్రతీవారం యాట మాంసంతో భోంచేయవ్వా” కన్నీళ్లు తుడుస్తూ. తాను తుడుచుకుంటూ… అడిగింది.
ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. జేబులో చిల్లర డబ్బులు పెట్టి… బస్సెక్కేసింది.
******
అమ్మీ లేని ఇంట్లో… కళ ఉండదు. కాంతి ఉండదు. మేమంతమంది ఉన్నా – ఎవ్వరం లేనట్టే… ఈ విషయం తెలీడానికి ఎన్నో రోజులు పట్టలేదు.
ఆపా ఆపపోసాలు పడుతూ వంట చేసేది. రుసిగానే ఉండేది.. కానీ కంచం ముందు కూర్చుంటే ఎవ్వరికీ ముద్ద దిగేది కాదు. అమ్మీ లేని లోటు తీర్చడానికి అబ్బూ మమ్మల్ని ఇంకొంచెం ప్రేమగా చూసుకునేవారు. కానీ ఆయన కూడా ”మీ అమ్మీ ఉంటే బాగుండేద్రా” అంటూ బొంగురు గొంతుతో బాధ పడేవారు.
ఆపాకి జడలేస్తున్నప్పుడు అద్దంలో చూస్తే… ఆపా కనిపించేది కాదు.. ఎందుకంటే అద్దంపై కన్నీరు వర్షంలా కురుస్తుండేది. అమ్మీ గుర్తొచ్చినప్పుడల్లా మా మధ్య ఎక్కిళ్లు ఎక్కువ. మాటలు తక్కువ.
కానీ ఏం చేస్తాం..? ఇంకా రెండేళ్లు గడవాలి.
అమ్మీ ఉత్తరాలు రాసేది. అక్షరాలన్నీ నా గురించీ, ఆపా గురించే.
మాట్లాడి క్యాసెట్లు పంపేది. ప్రతీ మాటలోనూ… మేమిద్దరమే.
మూడు నెలలకోసారి డబ్బులు పంపేది. దాంతో షావుకారు అప్పులు తీరిపోయాయి. శంకరం బాకీలు మాఫీ అయ్యాయి. అబ్బా నాకు కొత్త సైకిలు కొన్నాడు. కొత్త బట్టలు కుట్టించుకున్నా. కానీ ఆ సంతోషమే ఉండేది కాదు.
క్యాలెండర్లు చూసుకుంటూ… రోజులు లెక్కేసుకుంటూ గడిపేసేవాళ్లం.”ఇక్కడ చాలా కష్టంగా ఉందండీ.. సేటు అప్పుడప్పుడూ కొడుతున్నాడు…” అని అమ్మీ ఉత్తరంలో రాసినప్పుడల్లా… మా ఇంట్లో ఏ ఒక్కరం నిద్రపోయేవాళ్లం కాదు.
”ఈమధ్య పనులు బాగా ఎక్కువ అవుతున్నాయి. ఒంట్లో కూడా బాగుండడం లేదు” అని బాధలన్నీ చెప్పుకొనేది.
”అమ్మీని వచ్చేయమనండి అబ్బా..” అంటూ అబ్బూని పట్టుకుని ఏడ్చేసేవాళ్లం.
”నాకు పెళ్లొద్దు… మీ దగ్గరే ఉంటా…” అని మున్నీ కన్నీరుమున్నీరయ్యేది.
ఆయన మాత్రం ఏం చేయగలడు. అల్లాని వేడుకోవడం తప్ప.
******
ఓ రోజు దుబాయ్ నుంచి ఫోనొచ్చిందని షావుకారు కబురంపితే… అబ్బూ పరుగెట్టాడు. మేమూ వెనకాలే వెళ్లాం. ఫోను మాట్లాడుతూనే అబ్బూ కుప్పకూలిపోయాడు. ఆపాకూ నాకూ ఏం అర్థం కాలేదు. సాయింత్రానికల్లా ఇంటికి చుట్టాలు రావడం మొదలెట్టారు. అందరూ నన్నూ, ఆపాని చూసి ఒకటే ఏడుపు.
”మీకు అల్లా ఇంత అన్యాయం చేశాడేంట్రా” అంటూ సత్యవతత్తయ్య… మమ్మల్ని హత్తుకుని బాధపడిపోయింది.
”మీ అమ్మి మిమ్నల్ని వదిలి వెళ్లిపోయింద”oటూ.. ఏడ్చేసింది.
”అమ్మీకేమైంద”oటే ఎవ్వరూ చెప్పరే.
”దుబాయ్‌లో సేటు పెట్టే బాధలు పడలేక ఆత్మహత్య చేసుకుంది” ఎవరో అంటున్నారు..
”లేదు.. ఆ సేటే చంపేశాడు” ఇంకెవరో ఏదో చెబుతున్నారు.
ఆపా స్పృహ తప్పింది. నేనున్నా.. లేనట్టే.
వారం రోజుల తరవాత అమ్మీని తెల్లని బట్టలో చుట్టి పంపించారు… దుబాయ్ నుంచి. భయపడుతూనే ఐసు పెట్టెలో చూశాం. నవ్వుతూ పడుకుంది అమ్మీ. అంత ప్రశాంతంగా అమ్మీని ఎప్పుడూ చూళ్లేదు. అప్పటికే మా కన్నీళ్లన్నీ ఇంకిపోయాయి. అందుకే… ఒక్క చుక్క కూడా రాలేదు.
నలభయో రోజు పెద కర్మ. ఇంటి ముందు పెద్ద టెంటేశారు. నాలుగు యాటలు తెచ్చి మాంసం కూర వండారు. ఊర్లోవాళ్లంతా…యాట మాంసంతో భోం చేస్తున్నారు. బలవంతంగా నా చేతిలోనూ ఓ కంచం పెట్టారు.
వేడి వేడి అన్నం… అందులో యాట మాంసం కూర.
”ఖుర్బానీ” అంటే అర్థం అప్పుడు తెలిసింది. డబ్బున్నోళ్లకు మేకలు. లేని వాళ్లకు మనుషులు. బలిదానం కావాల్సిందే. ఈ ముద్ద చేతికి రావడానికి అమ్మీని పోగొట్టుకోవాల్సివచ్చింది. మేకని బలిస్తే పుణ్యం వస్తుందట. పాపాలన్నీ పోతాయట. మేం మాత్రం అమ్మీనే బలిచ్చేశాం.. ఇంతకంటే పాపం ఉంటుందా?
ఇప్పుడు యాట మాంసం ముందే ఉంది… కానీ ముద్దే దిగడం లేదు.
*****
కథ చాలా బాగుంది. బలి దానం,.. ఈ పదానికి అర్థం తెలిసి కళ్ల ల్లో నీరు తిరిగింది..! ధన్య వాదాలు మంచి కథను రాసిన రచయిత కు … సారంగ కు. 💐💐.
ధన్యవాదాలండీ…🙏
Anwar garu ❤ chaala bagundandi ! Kallu chemma gillayi !
Thank you చైతూ గారూ..❤️🙏
చక్కని కథ… నరేషన్ అద్భుతంగా ఉంది 👌
Thank You🙏
“ఖుర్బానీ”కథ చదువుతూ చివరకు వచ్చేసరికి కన్నీళ్ళు ఆగలేదు భాయ్
Thank You andi🙏
కథ చాలా బాగుంది అన్నా, సింపుల్ గా మొదలెట్టి ఎమోషనల్ గా లీనం చేశావ్.
థ్యాంక్యూ చరణ్…
ఖుర్బానీ అసలు అర్ధం చెప్పేరు. ఎవరు ఎవరికి బలి అవుతున్నారో! అభినందనలు అన్వర్ గారూ!
ధన్యవాదాలు జగదీష్ గారూ..🙏🙏🙏
గుండెలు బరువెక్కాయి అన్వర్ గారూ.. 😔
రాస్తున్నప్పుడు నాక్కూడా…😢
మాటలు రావడం లేదు అన్వర్ గారు. నిజంగా excellent story.. మనసు చెమ్మగిల్లింది.
థాంక్యూ కిరణ్ విభావరి గారూ..🙏🙏🙏
మరే దారీలేక అమ్మి ఏడుస్తూ దుబాయ్ ప్రయాణమైన సన్నివేశం చదువుతున్నపుడే కనబడని తాడు అమ్మిని లాక్కుపోతున్నట్టు కనిపించింది. మేక అయితే మొరాయిస్తుంది. అమ్మ కదా భారంగా నడిచి వెళ్ళిపోయింది.
గెలుపోటములు కాదుకాని,
జీవితంతో పెనుగులాట ఎక్కడో పట్టేసుకున్నట్టు వుంది
అన్వర్ గారు మంచి కథ రాశారు. 🙏
Thank You Naveen గారూ🙏🙏🤦🏻