తిరిగీ తిరిగీ అన్నుబట్టినాక
నగరంలో తేనెతెట్టెల్లాంటి చాయ్ అంగళ్ళు
కాస్త పెదాలపై వానలో తడుస్తూ తిన్న
కలేకాయల రుచిని తియ్యగా పూస్తాయి
టీ కప్పు ఒక్కొక్క సిప్ ఒక్కొక పండు తిన్న రుచి
సిగరెట్టు తాగి
మన తావుకి వెళ్ళే బస్సు ఎక్కి
సీటులో ఒంటరిగా కూర్చున్నాక
పక్కన కూర్చోవటానికి ఎవరైనా వస్తారేమోనని ఎంత చూసినా ఎవరూ రారు
మన కోసం వచ్చి పక్కన కూర్చొనే వారు ఎవరుంటారు?
బయట నగరాన్ని చూస్తూ ఉంటే
బస్సు కిటికీ అద్దం మీద
కలలు లేని నిద్ర తలను
పెయింట్ చేస్తుంది
ఊహలే లేని జీవితంలో
నిద్రకి కలలేం ఉంటాయి?
మళ్ళీ మేలుకోవటానికి తప్పా
మరేంటికీ అక్కరకు రాదు నిద్ర
బస్సు ప్రయాణం ఒక నిద్రతోనో
ఒక ఒంటరి తనంతోనో ముగుస్తుంది
బస్సు దిగి పోయాక
ఖాళీ సీటు మరింత ఖాళీగా
మన ఒంటరి ఆనవాళ్ళతో మిగిలిపోతుంది
మరొకరి కోసం చూస్తూ…
*
Add comment