చూపుల దీపాలు ఆరిపోయిన
ముడతల ముఖంలా
నిస్తేజంగా నిస్సహాయంగా
నిలబడ్డ ఈ ఖాళీ గడప
కనిపించని కన్నీరు
ఎదురుగా దుఃఖంలా మున్నీరు
చిమ్మ చీకట్లో
సముద్రం నుండి చూస్తే
ఇప్పుడు మినుకు మినుకులకు దూరమైన ఈ నడవా
అప్పట్లో ఓ చిన్న లాంతరు కాంతి
పగటి నిద్రా…
రాత్రి మెలకువా…
ఈ గడపకేంతెలుసు
లోపలెక్కడో ఉండలు చుట్టబడ్డ వలల కలల్ని
ఏ అర్ధరాత్రి సమయంలోనో విసరడమా….
కడలి చివుర్లను
తనువులపై మొలకెత్తించడమా…
సముద్రం మింగేసిన
తన చెరగని పాదముద్రల కోసం
మౌనంగా విలపించడమా…..
ఏం తెలుసు…?
ఈ గడపకేం మిగిలింది
పదునంతా విదిలించుకున్న
ఇసుక వెన్నెల గంపలకెత్తబడి దాటిపోవడమా…
సమస్త రకాల జలపుష్పాలనూ
కమ్మగా వండిపెట్టిన దాక
వాకిల్లో బోర్లాపడి ముక్కలై విలపించడమా..
లోకం సమస్తాన్ని
చుట్టి పడేస్తానన్నంత ధీమాతో
దారాన్ని చుట్టే పిల్లాడి చేతిలో కండెలు
ఇసుక క్రింద ముఖాన్ని చాటేయడమా
గంగమ్మతల్లిని తెస్తూ
జీవితాన్ని జాతర చేసిన కుటుంబం కదలాడిన చోటు
ఒక్కచూపుకూ నోచుకోక పోవడమా…
ఏం మిగిలింది……?
తీరం దిక్కుమార్చుకుంటోదని
ప్రచారం జరిగితే జరగొచ్చు గాక
దిక్కుమాలినతనానికి ఈ ఖాళీ గడపే సాక్ష్యం…
కాళ్ల క్రింద నుంచి తీరాన్ని స్వాధీనం చేసుకుంటున్న మేధస్సు
బట్టబయలై ధ్వంసమయ్యే సందర్భాన్ని
పైన పొగచూరిన ఆకాశం అద్దంలా మారి ప్రతింబించే రోజొక స్వప్నం
జోలపాటల్ని అల్లుతూ అరకొరగా మిగిలున్న చేతుల్లో
మొదలైన చైతన్యం….
రేపో మాపో
ఈ ఖాళీ గడప ఇలాగే ఉంటే
ఈ రాజ్యానిదే విజయం
పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్
మీ కవిత లో
హృదయ విదారక దృశ్యం
మా ముందు ఉంచారు .
పాయల… మంచిగా దృశ్యమానమైన కవిత
Thanks Krishna rao garu
Thank you srinu
ఎన్ని మౌన గాయాల గేయం ఈ కవిత , నిస్సందేహంగా మీరో నూతన ఒరవడి ఒక దిక్సూచి , అభినందనలు ఈ గెలుపు మరో దానికి నాంది కావాలని కోరుకుంటున్నాను
Thank you anil
ఖాళీ గడవ కవిత చాలా బావుంది
“చూపుల దీపాలు ఆరిపోయిన
ముడతల ముఖంలా”ఖాళీ గడప
మంచి అభివ్యక్తి