1. స్తబ్ధలోకం
లేత అరిటాకు అడుగుల్లాంటి బుడిబుడి మాటలతో
తేనెచూపుల అలికిడితో
చందనంపూసిన నవ్వొకటి విని
దీపకాంతితో వడపోయని చీకటిలోకి చూస్తానా..!
భ్రమలాంటి నువ్వు కనిపించి మాయమవుతావ్.
నక్షత్రాల దిగులేసుకొని
చమికీకన్నులతో కిటికీకి ఆకాశాన్ని కుట్టేసి
దిగమింగిన విషాదాన్నంతా వడపోయాలనుకుంటానా..!
ఏ కాంతీ కూడా చీకటంత అందంగా అగుపించక
నిన్నలానే అక్కడే వదిలేస్తుంటాను.
నిర్లిప్తశోకానికి ఎన్ని రచనలు చేసినా
భాష సరిపోక
భావం అగాధంలో పొర్లి ఏడుస్తుంది.
అరచేయిమందాన సంతోషాన్ని అప్పుతెచ్చుకొని
పూలకౌగిళ్ళ గాలితో కళ్ళుమూసి కలకెళ్ళిగానీ…
ఇదంతా అబద్ధమనుకోలేను.
2
ఆకుపచ్చ కళ్ళు
పచ్చదనం కోసమో
కాస్తంత వెలుతురు చూద్దామనో
మరి కొంచం స్వచ్ఛమైన గాలి కోసమో
అచ్చంగా నాకోసమో
ఒక్కోసారి అట్లా కిటికీని తీసి
నన్ను నేను బయటకి పంపుతాను.
గుండె నిండుగా చల్లగాలిని పీల్చి
ఒక ఉదయాన్నో లేక సాయంత్రాన్నో
లేత ఆకులంత మృదువుగా తడుముతాను.
చూపు స్పర్శించిన దేహాలు ఏవని?..
అడుగుతారా ఎవరైనా-
ఎగిరే పక్షులు ఎగురవేసే చెట్లూ
చెట్లని ఎగురవేసే గూళ్ళూ
అన్నిటినీ అరచేతుల్లో జాగ్రత్తగా పుచ్చుకుని
ఉఫ్ఫున ఊదే మనుషులూ
…….
ప్రేమ రాహిత్యపు భాషేదో
అగాధాల్లోంచీ పెల్లుబికి
ఆకాశానికి అంటలేక
మధ్యన అట్లా ఊయలూగుతోందని
చెప్పాలా నేను మీకూ!?
3.
ఖాళీలో ఖాళీగా
ఖాళీ కాఫీ టేబుల్ వెక్కిరిస్తది.
కుర్చీలు మౌనం వహిస్తాయ్.
కప్పు నిండి కాఫీ కాస్త ఒలుకుతది.
ఇక కాసేపు గోడవారనున్న చెట్లను చూస్తాను.
పూల మొక్కలకేసి తలనుతిప్పి
రంగుల పువ్వుల్లో
మరికాసేపు ఉంటాను.
నిదానంగా, చేతిగడియారంకేసి చూస్తాను.
చీకట్లు క్రమ్మి
దీపాలు వెలిగి
నక్షత్రాలు మెరిసి
ప్చ్.. తెలీని విసుగులో
లేచి నిలుచున్నప్పుడు
నాలోనేను రాలిపోతాను.
*
Add comment