ఖర్చు లేని రిస్కు లేని ఆదర్శం!

“నీకు దేశభక్తి లేదు” లేదా “నీకసలు దేశభక్తి వుందా?” “నాకు దేశభక్తి మిన్న!”. “ఆమె తన కుమారుడికి కథల ద్వారా దేశభక్తిని రంగరించి పోసేది” అనే మాటలు విన్నప్పుడల్లా లేదా చదివినప్పుడల్లా చాలా ఆశ్చర్యం కలిగేది. ఎందుకంటే భక్తి అనేది దైవ విశ్వాసానికి సంబంధించిన ఒక మానసికోద్వేగం. అభౌతిక, మానవాతీత విశ్వాసం మీద ఆధారపడినటువంటిది. కనిపించే మనుషుల మీద నమ్మకం లేక వాస్తవాలకి భయపడో, గందరగోళ పడో కనిపించని దేవుడికి మొర పెట్టుకునే విధానం. భక్తి అంటే ఊదొత్తుల, ధ్యానాల, పూజా పునస్కారాల, మంత్ర తంత్రాల, కర్మ కాండల, క్రతువుల వ్యవహారమయే.   మరి దేవుడికి దేశంకీ మధ్య పోలికెక్కడ? దేశం ఒక వాస్తవం కదా? పూర్వకాలంలో రాజుల్ని దైవ ప్రతినిధులుగా భావించి రాజులకు అధీనంగా, విశ్వాసంగా బతకటాన్ని ‘రాజభక్తి ‘ అనేవారు. కానీ ఈ ఆధునిక కాలంలో దేశాల్ని ఏ భగవంతుడూ తన ప్రతిరూపాలుగా ఏర్పరిచాడని మనం అనుకోలేం. పైగా ఏ మతగ్రంధమూ అలా ఉద్భోధించలేదే! మరి దేశభక్తి ఏమిటి బాబూ? దేశం కూడా దేవుడి లాంటిదని, దేవుడిని కొలిచినట్లు సమాజాన్ని కొలవాలని ఊరకనే తర్కానికి అనుకోవచ్చు. కానీ సమాజానికి కావలిసింది నిబద్ధతతో కూడిన కార్యాచరణ, సాటి మనుషులకు సేవ. ఊదొత్తులు కాదే?

నిజానికి దేశమంటే నువ్వూ, నేనూ, మనలాంటి వాళ్లే కదా ప్రియ మిత్రమా! మన ప్రభుత్వాలు, మన రాజ్యాంగం, మన చట్ట వ్యవస్థలు, మన నాయకులు…అన్నింటికీ మించి మన దేశమంటే మన ప్రజలు. అంటే మనందరం.     ఇదో భౌతిక వాస్తవం. ఈ ప్రభుత్వం మన కోసం మనం ఏర్పరుచుకున్నది. ఈ చట్టాలు మన కోసం మనం చేసుకున్నవి. దేవుడు నుండి నువ్వు కోరుకుంటావు, మొక్కుకుంటావు. మరి నువ్వే దేశం అయినప్పుడు నీకు నువ్వు మొక్కుకుంటావా? పోనీ నీకూ నాకూ మధ్యన వుండాల్సింది భక్తా? నిజాయితీతో కూడిన బంధమా?

దేశమంటే భూమి సరిహద్దులా లేక ఏ యుద్ధమో లేక ఏదో ఒడంబడిక ప్రకారం మారుతుండే సరిహద్దుల మధ్యన బ్రతికే ప్రజలా? నిజం చెప్పు, చరిత్రలో భారతదేశ సరిహద్దులు ఎన్నిసార్లు మారలేదు? దేశం ఎప్పుడు ఎంత వుంటే ఆ మేరకి భక్తి కలిగి వుండటం దేశభక్తా? దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులనుకున్నప్పుడు ఒకరి పట్ల ఒకరికి వుండాల్సింది నిజాయితీతో కూడిన నిబద్ధత. ఒకరి మీద మరొకరు లేదా ఏవో సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువల, విశ్వాసాల ఆధారంగా ఏర్పడిన ప్రజా సమూహాల్లో ఒక సమూహం మరొక సమూహాన్ని అణచివేయకుండా బతికే సంస్కారం కావాలి. ఏదో వంకతో తనకో లేదా కుల, మత, వర్గ, ప్రాంత ప్రాదిపదికన తన వాళ్లకో లాభం కలిగించే పనులు చేయని నిస్వార్ధం కావాలి. భిన్నమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఆలోచనల పట్ల సహనం కావాలి. అంతేకానీ కోవెలలోనో, మశీదులోనో, చర్చిలోనో, గురుద్వారాలోనో చూపించాల్సిన భక్తి ఏం చేయగలదు ఏ ఇద్దరి మధ్యనైనా?

భగత్ సింగ్ దేశభక్తుడు, అల్లూరి దేశభక్తుడు, గాంధీ నెహ్రూ పటేల్….అందరూ దేశభక్తులంటాం బాగానే వుంది కానీ వారు నిజానికి భక్తితో బ్రిటీష్ వారి మీద పోరాడారా లేక ఆగ్రహంగానో, ప్రతీకార దృక్పథంతొనో, శాంతియుతంగానో నిరసనగానో పోరాడారా? వారు బానిసత్వానికి, దోపిడీకి, క్రూర చట్టాలకు వ్యతిరేకంగా స్వాత్రంత్ర్య కాంక్షతో పోరాడటంలో భక్తి పాత్ర ఎంత? వాళ్లు ఖచ్చితంగా ఒక జాతి మీద మరో జాతి సాగించే దౌష్ట్యానికి వ్యతిరేకంగా పోరాడారు. ఒక వ్యక్తి లేక ఒక సమాజం బానిసత్వంలో మగ్గటం అమానుషం కాబట్టి, ఆత్మగౌరవానికి భంగం కాబట్టి, జాతుల ఉనికికి ప్రమాదకరం కాబట్టి వారు పోరాటం చేసారు. వారి గుండెల్లో వున్న భావోద్వేగం దుర్మార్గం పట్ల ధిక్కారమే కానీ భక్తి భావం కాదు. బంకిం చంద్ర చటోపాధ్యాయ రాసిన బెంగాలీ నవల “ఆనంద్ మఠ్” లోని “వందేమాతరం” అనే ఒక కవిత శీర్షికని నినాదం ప్రజల్ని స్వాతంత్రోద్యమం పట్ల ప్రొద్భల పరచటానికే కానీ ఒక ఆధ్యాత్మిక దృక్పథంతో ఇచ్చినది కాదే!

“నువ్వు నిబద్ధత అను, నిజాయితీ అను…మేం దాన్నే దేశభక్తి అంటాం! నష్టమేమిటి?” అని అడగొచ్చు. నష్టం వుందనే అనుకుంటున్నా. భక్తికి ఆచరణకి సంబంధించిన జవాబుదారీతనం లేదు. భక్తి నైరూప్యం. దాని లక్ష్యం ఏదో కోరుకోవటం, కటాక్షం పొందటం. భక్తి లేకపోతే నిన్ను అడిగేవాళ్లెవ్వరూ లేరు. అందుకే దేశభక్తిది ఖర్చులేని రిస్కు లేని ఆదర్శంగా ప్రచారం చేయబడే భావోద్వేగంగా మిగిలిపోయింది. పైన అనుకున్నట్లుగా దేశమంటే కేవలం సరిహద్దులే కాకుండా ప్రజలు, ప్రభుత్వం, రాజ్యాంగం, అది నిర్దేశించే విధులు, చట్టాల పట్ల గౌరవం, న్యాయబద్ధమైన నడవడిక, రాజ్యాంగ వ్యవస్థలపైన నమ్మకం….వీటన్నింటినీ దేశభక్తి ఎంతమాత్రమూ చర్చించదు, తనలో పొందుపరుచుకోదు.

మనదేశంలో దేశభక్తి కేవలం ఒక ప్రతీకాత్మక ఆదర్శం. అది మాటలకే పరిమితమైనది. నువ్వెన్ని సార్లు “భారత్ మాతాకీ జై” అంటే అంత దేశభక్తుడివి. మనకి దేశభక్తి అనేది ఒక సెంటిమెంట్. దేశభక్తి వున్నవాళ్లు ఏం చేయాలో ఎక్కడా చెప్పబడలేదు. దేశభక్తి అంటే మనకు జెండాకి సెల్యూట్ చేయటం, సైనికుల పట్ల ఆరాధనాభావం కలిగి వుండటం, భారతదేశంతో తగాద వున్న దేశాల్ని ద్వేషించటం, ఒక ఊహాజనిత స్త్రీమూర్తికి పట్టుచీర కట్టి, అమ్మవారిలా అలంకరించి భారతమాత అని తాదాత్మ్యమై పోవటం. ఇదీ మన దేశభక్తి. ఇందులో దేశం కోసం ఆచరణ ఏముంది? మనవారు సైనికులే అత్యున్నత దేశభక్తులనుకుంటారు. కానీ సైన్యమే అదో మంచి కెరీర్ అని ఉద్యోగ ప్రకటనల్లో వేస్తుంటుంది. సైనికులే దేశభక్తులనుకోవటానికి ప్రధాన కారణం పౌరులుగా మనకున్న అభద్రతే. వారు సరిహద్దుల్లో కాపలా కాస్తూ మనల్ని శతృవుల నుండి రక్షిస్తుంటారనే నమ్మిక! అవతలి దేశపు ప్రజలూ తమ సైన్యం గురించి అలానే అనుకుంటారని మనం అనుకోం. మన కోసం వారెందుకు అంత ప్రమాదకర ఉద్యోగాలు చేయాలని, మనకెందుకు ఇంత స్వార్ధమని ప్రశ్నించుకోం. దేవుడికి దండం పెట్టినట్లు వీళ్లకి కూడా చప్పట్లు కొదితే చాలనుకుంటాం. అసలు చుట్టుపక్కల దేశాలన్నింటితో మనకెందుకు తగాదాలు అని తార్కికంగా ఆలోచించటం మాత్రం దేశభక్తిలో భాగంగా చూడం. అంటే పౌరులుగా మనం హక్కులతో, తలెత్తి బతకటంగా కాక కాపాడబడే వారిలా, రక్షించబడే వారిలా, కటాక్షించబడే వారిలా బతకటాన్నే దేశభక్తి ప్రభోదిస్తుంది.

పైన అనుకున్నట్లు దేశభక్తి ఆచరణకి సంబంధించినది కాదు. దేశభక్తి మన రాజ్యాంగం మీద అవగాహనేమీ పెంచదు. హక్కుల పట్ల మన స్పృహని పెంచదు. రాజ్యాంగం లోని ఆదేశిక సూత్రాలను నిజం చేయటానికి మనల్ని కర్తవ్యోన్ముఖుల్ని చేయదు. మన నాయకుల అవినీతిని ప్రశ్నించేలా చేసేది కాదు. వారి మీద ఎన్నికల వాగ్దానలను నిజం చేయమని వొత్తిడి తీసుకొచ్చేది కాదు. మన దేశభక్తికి అతి పరిమితమైన పరిధి వున్నది. ఆ పరిమిత ఆదర్శంలో వాస్తవాలతో పనిలేకుండా ఎవ్వరైనా తలమునకలేసేలా చేయగలదు మన దేశభక్తి. ఏవో జెండా పండుగలకు శాల్యూట్ కొట్టడం మినహా, సైన్యాన్ని చూసి ఉప్పొంగిపోవటం, క్రికెట్ మాచెస్లో ప్రత్యర్ధుల మీద గెలిస్తే సంబరాలు చేసుకోవటం మినహా దేశభక్తి మన నుండి ఆశించేది పెద్దగా లేదు.   కానీ దేశం గురించిన మన ఆలోచనలు ఇంతవరకేనా ఉండాల్సింది?

మనం జాగ్రత్తగా గమనిస్తే దేశభక్తి అనేది మతం చుట్టూనే తిరుగుతుంటుంది. ముఖం మీద ఇంతేసి తిలకాలు పెట్టుకొని, కుంకుమలు అద్దుకొని కాషాయ స్కార్ఫ్స్ కట్టుకొని “భారతమాతాకీ జై” అంటూ దేశభక్తిని ఒక మతానికి పరిమితం చేయటం దేశానికి ఏ విధంగా హితకరం? విగ్రహారాధన లేదా బహు దేవతారాధన చేయని మత సెంటిమెంట్స్ వున్నవారు భారతమాత రూపంలోని దేశభక్తికి దూరం కావలిసిందేనా? పౌరులందరినీ కలుపుకుపోవాల్సిన భావజాలానికి పనిగట్టుకొని దూరం చేయటం “దేశభక్తి” ఉద్దేశ్యమా? వాళ్లు “భారత్ మాతాకీ జై” అనే ప్రతీకాత్మక నినాదం అనలేదని కంప్లైంట్లో అర్ధం ఏమున్నది? తమ మైనారిటీ మత సెంటిమెంట్స్ ని గాయపరుచుకొని మరీ మెజారిటీకి తలొగ్గాల్నా? నినాదమిస్తేనే మీరన్న దేశభక్తి వున్నట్లా? ఇది దేశభక్తి ద్వారా చెలరేగిపోయే మెజారిటేరియనిజపు అసలు రంగు. పౌరుల్ని మతాలుగా విడదీసేదా దేశభక్తి అంటే? దురదృష్టవశాత్తూ దేశభక్తులకు ఇవేవీ పట్టవు.

కేవలం ఉగ్రవాదాన్ని మాత్రమే ఖండించటానికి, పొరుగు దేశాల్ని ద్వేషించటానికి, పొరుగు దేశాలతో మతపరమైన పోలికలతో మన పౌరుల్లోని కోట్లాదిమందిని వేలెత్తి చూపటానికి దేశభక్తి పరిమితం అవుతున్నది. ఉగ్రవాదానికి అచ్చు బొమ్మ వుంటాయనే సంగతి కాసేపు పక్కన పెడదాం. అసలు దేశాన్ని నాశనం చేసేది కేవలం బాంబు మోతల, మారణకాండల చర్యలేనా? ఇవి ఖండించటం వరకేనా దేశభక్తుల పని? దేశానికి నష్టం కలిగించే రాజకీయ నాయకుల, పార్టీల అవినీతి కార్యకలాపాలు దేశభక్తుల దృష్టిలో ఎందుకు పడవు? పార్టీలు మార్చే వాళ్లు, రాజకీయ బ్రోకర్లు, పదవుల్ని అడ్డం పెట్టుకొని వందల వేల కోట్ల రూపాయిల ఆస్తుల్ని పోగేసుకొని వాటిని కాపాడుకోవటానికి పదవుల్లో రావటం కోసం ఎన్నికల సమయంలో మద్యం, నగదు పంపిణీలు చేస్తూ ప్రజల్ని కూడా అవినీతి పరుల్ని చేసే రాజకీయ నాయకులు, ఎమ్మెల్లేల్ని కొనటానికి కోట్లు కుమ్మరించే పార్టీల అధినేతల కార్యకలాపాలు ఏ విధంగా ఉగ్రవాదం కంటే తక్కువ నష్టం కలిగిస్తాయి? వీటిని ఖండించటం, వాళ్లని తిరస్కరించటం ఏ విధంగానూ దేశభక్తుల కార్యాచరణలో భాగం కాదు కదా! వేల లక్షల కోట్ల రూపాయిల ఋణాల్ని ఎగ్గొట్టే కార్పొరేట్ల దాష్టీకం ఆయుధ ఉగ్రవాదం కన్నా ఏ విధంగా తక్కువ? యాభైమంది కార్పొరేట్లకి 68 వేల కోట్ల రూపాయిల ఋణ మాఫీ చేసారట. ఆయుధ ఉగ్రవాదం కన్నా ఆర్ధిక ఉగ్రవాదం మరీ ప్రమాదకరం. దానికి రాజకీయుల అండ వుండటం దేశానికి మరింత హానికరం. కార్పొరేట్ డిఫాల్టర్స్ తో జాతీయ నాయకులే చెట్టపట్టాల్ వేసుకు తిరుగుతుంటే నోరు పెగలక పోవటం దేశభక్తా? అందుకే మరోసారి చెబుతున్నా దేశభక్తి అనేది కార్యాచరణతో సంబంధం లేని, ఖర్చు లేని రిస్కు లేని ఆదర్శం!

దేశం గురించి మన అవగాహన అప్ గ్రేడ్ కావాలి. అందుకు కృత్రిమ దేశభక్తి అనే ఈ భావజాలమే పెద్ద అడ్డంకి. దేశం యొక్క ప్రాచీన సాంస్కృతిక వారసత్వం గురించి పొంగిపోయే ముందు ఇప్పుడున్న పరిస్తితి నుండి ఎలా ఉన్నతీకరించబడేలా అవగాహన పెరగాలి. దేశంలోని అత్యధిక భాగం పేదరికంలో మగ్గుతున్నప్పుడు, నిరుద్యోగం పెరుగుతున్నప్పుడు, రైతులు ఆత్మహత్యలు అవిఛ్ఛన్నంగా కొనసాగుతున్నప్పుడు మనదైన ఘన ప్రాచీన వారసత్వం ఎంతవరకు పనికొస్తున్నది? మనల్ని మనం తృప్తి పరుచుకున్నంత కాలం మనలో ఎదుగుదల వుండదు. మనల్ని మనం పొగుడుకోవటం ఆత్మవంచన. మనకి కావలిసింది దేశం పట్ల కార్యాచరణతో కూడిన నిబద్ధమైన ప్రేమ. త్యాగాలు చేయటం కంటే బాధ్యతలు నిర్వర్తించటం ముఖ్యం. బాధ్యతలంటే కేవలం రాజ్యాంగంలో నిర్వచించిన విధులని నిర్వహించటం కాదు. ఇక్కడ బాధ్యత అంటే సామాజిక బాధ్యత. వాణిజ్య ఒప్పందాల పేరుతోనో లేదా మరో ఒడంబడిక పేరుతోనో మన దేశ సర్వసత్తాక, సార్వభౌమత్వానికి భంగం కలిగించే అంశాల పట్ల జాగరూకత పెరగాలి. దేశం సర్వ సమగ్రాభివృద్ధి దిశగా వెళ్లాలంటే ఏం చేయాలో ఆలోచించాలి. దేశాన్ని ఆర్ధికంగా కుదేలు చేసే కుంభకోణాల పట్ల అప్రమత్తంగా వుండాలి. పర్యావరణ స్పృహ కలిగి వుండాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామిక హక్కులనంటి పట్ల అవగాహనతో కూడిన చైతన్యం వుండాలి. ప్రభుత్వాల్ని నిలదీయగలగాలి. కులం వంటి సాంఘీక అంతరాల్ని ప్రశ్నించగలగాలి. వాటి నిర్మూలనకి కృషి చేయాలి. జెండర్ దృక్పథంలో మార్పులు రావాలి. ఈ దేశ ప్రగతికి పాటు పడే ప్రతి పన్ను చెల్లింపుదారుడి పట్ల జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ జెండర్, కుల, మత, జాతి, రంగు వంటి ప్రాతిపదికల ఆధారంగా ఎదురయ్యే సమస్త సాంస్కృతిక, అస్తిత్వ వివక్షలన్నీ నశించాలి. ఇన్ని చేసి ప్రభుత్వాలు నిజంగా సంక్షేమ ప్రభుత్వాలు కాగలిగినప్పుడు, దేశం సాంకేతికత హరించని మానవీయతతో అభివృద్ధి చెందినప్పుడు, సాధనాసంపత్తిలో స్వావలంబన సాధించగలిగినప్పుడు, ఇతర దేశాలకు ఒక గైడింగ్ ఫోర్స్ గా వుండగలిగినప్పుడు….అప్పుడు ప్రజల్లోని సామూహిక చేతనకి ఏ పేరు పెడతారో ఆ పేరు పెట్టుకోండి. నాకేం అభ్యంతరం లేదు.

ఒప్పుకుంటారా?

అరణ్య కృష్ణ

11 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ సమస్యల్లా కాషాయంతో. దేశానికి ఉన్న ప్రధాన సమస్యల్లా కాషాయం అనుకోవటం వల్ల ఏర్పడ్డ భావజాలం ఇదంతా. నిజమే అదీ ఒక సమస్య. కానీ, ఈ మతం కాకపోతే ఇంకో మతం. రాజకీయ నాయకులు మత విద్వేషాలు రగిలించటం మన దేశానికి కొత్త కాదు.

    కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నప్పుడు కుంభకోణాల పట్ల, మత అల్లర్ల పట్ల, మైనారిటీస్ ఓట్ల కోసం చేసిన రాజకీయాల పట్ల – మీ స్టాండు, దేశ సమస్యల పట్ల మీకు ఉన్న్న అవగాహన తెలిపే గతవ్యాసాలు చదవాలని ఉంది. దయచేసి పంచుకోగలరు.

    దేశభక్తి అనే పదం పట్ల ఆక్షేపణ సరి కాదు. భగత్ సింఘ్, గాంధీజీ లాంటి వారిని దయచేసి ఇందులోకి లాగకండి. వారికున్న అవగాహన, దేశం పట్ల పరిధులు లేని ప్రేమని మనం కనీసం ఊహించలేము. మనం కేవలం వివిధ కారణాల రీత్యా అభ్యుదయవాదులము. అభ్యుదయం కావాలనుకుంటాము. ఏది అభ్యుదయం, ఏది వెనుకబడ్డ భావజాలమనేది మళ్ళీ మనం నియంత్రించుకున్న పేరామీటర్లలోనే నిర్వచించుకుంటాము. మనకి కావలిసింది ఏమిటో, అభివృద్ధి ఎలా అయితే సాధ్యమో నిజంగా మన లీడర్లకి మల్లేనే మనకీ సరైన అవగాహన లేదు.

    – మీరిలా భక్తి కానీ, మరే ఇతర సాంప్రదాయక పదాన్ని కానీ భరించలేక దాన్ని తుడిచిపెట్టాలనుకోవటం కూడా మరో రకమైన ఉన్మాదం లాగే అనిపించవచ్చు.. తటస్థవాదులకు !
    We need balanced views.

    ————-

    అసలు చుట్టుపక్కల దేశాలన్నింటితో మనకెందుకు తగాదాలు అని తార్కికంగా ఆలోచించటం మాత్రం దేశభక్తిలో భాగంగా చూడం…”- It’s funny. మనం ఆలోచిస్తే సరిపోదు.అవతలి దేశానికి సైన్యమున్నప్పుడు మనకి ఉండటమనేది అవశ్యం. అది కనీస అవగాహన.
    ———

    • నేను వ్యాసాలు రాయటమనేది సోషల్ మీడియాలోకి వచ్చాకనే జరిగింది. అంటే సరిగ్గా ఐదేళ్ల క్రితం నేను ఎఫ్బీ అక్కౌంట్ ఓపెన్ చేస్తే, సుమారు ఒక మూడు సంవత్సరాల నుండి మాత్రమే వివరంగా వ్యాసాలు రాస్తున్నాను. అప్పటి వరకు కేవలం కవిత్వం, సాహిత్యం మీదనే ఫోకస్ చేసాను. రేపెప్పుడైనా కాంగ్రెస్ పవర్లోకి వస్తే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. మౌలికంగా నేను ఏ పాలక పార్టీ మధ్య తేడా చూడను. నా సమస్య బీజేపీతో కాదు. దేశభక్తి అనే నైరూప్య ఆదర్శం మీద నా నిరసన. భారత్ ప్రజలు అనుకున్నట్లే పాక్ ప్రజలు కూడా తమ దేశ సైన్యం గురించి భావోద్వేగానికి గురి కావొచ్చు అని చెప్పానంటే దానర్ధం ప్రజలు ఎంత తేలికగా భావోద్వేగాలకు గురవుతారో కదా అని! దేశభక్తి అనే పదం ఎందుకు సరైంది కాదో చెప్పాను.

  • సర్, మీ రాతలు చదువుతుంటే “తెలుగువార్తలు.కాం” బ్లాగ్ నిర్వహించిన ఎన్.విశేఖర్ గుర్తుకొస్తున్నారు.

      • Upgrade కావాల్సిందే.
        ‘ మరి నువ్వే దేశం అయినప్పుడు నీకు నువ్వు మొక్కుకుంటావా?’
        మీరన్న ఈ ఒక్క వాక్యం చాలు అర్థం చేసుకోగలిగితే. Great post అండి.

  • దేశం గురించి మన అవగాహన అప్ గ్రేడ్ కావాలని, మన సామాజిక రుగ్మతలన్నిటినీ ఏకరువు పెట్టారు. బావుంది. కానీ వీటన్నిటినీ రూపుమాపటానికి(దేశభక్తి పదం పట్ల మీకు అభ్యంతరమున్నా), కావాల్సింది కూడా దేశభక్తే కదా! ఆ పదం వద్దన్న మీరు,దానికి ప్రత్యామ్నాయాన్ని సూచించలేక పోయారు. మీరు కోరుకున్నవన్నీ సిద్దించినప్పుడు అటువంటి ఒక పదం అవసరం కూడా ఉండదనుకున్నారు కాబోలు. కానీ అవి జరిగేవరకైనా, మనమంతా ఒకటే అనే భావన కోసం ఏదో ఒక మంత్రం ఉండాలి కదా. మంత్రం అంటే మళ్ళీ హిందూవాదం అనుకునేరు.
    మీలాంటి వాళ్ళు చేయాల్సింది కాషాయ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళని విమర్శించటం, కాంగ్రేసు అధికారంలో ఉంటే దాన్ని విమర్శించటం కాదు. ఒకే సమయంలో ఇద్దరూ చేస్తున్న మోసాలను ఎండగట్టండి. అధికారం అడ్డు పెట్టుకుని నియంతల్లాగా వ్యవహరించేవారిని ఎలాగైతే విమర్శిస్తారో, అలాగే ప్రభుత్వం ఒక పని చేయగానే రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తలా తోకా లేని సందేహాలను జనాల మెదళ్ళలోకి చొప్పిస్తున్న వాళ్ళనూ దునుమాడండి.
    మన దౌర్భాగ్యం ఏమిటంటే మన దేశ మేధావులందరూ, ఎప్పుడూ ప్రతిపక్షాలుగానే ఉంటారు. అధికారాన్ని అడ్డుకోటానికి, ఎదుటి పక్షంతో జట్టు కట్టి ఆట ఆడవలసిందే అనుకుంటారు. కానీ రిఫరీలుగా ఉండడమనే మాటే మర్చిపోతారు.

    • పైన ఇలాంటి పార్టీల ధోరణితో కూడిన దేశభక్తియుత విమర్శకి జవాబు చెప్పాను. మళ్లీ చెబుతున్నా. రేపేప్పుడైనా కాంగ్రెస్ పవర్లోకి వస్తే అప్పుడు కాంగ్రెస్ ని కూడా విమర్శించి మీ కోరిక నెరవేరుస్తాను. అయోధ్య వివాదంలో కాంగ్రెస్ పాత్రని నేనేం తక్కువ చేయను. అన్నట్లు నేను ఎంతో కొంత కాలం ఏదో ఒక చిన్న స్థాయిలో అయినా కార్యకర్తగా వున్నప్పుడు కాంగ్రెస్సే అధికారంలో వుంది. అప్పుడు మేం పోస్టర్లు వేసినది, గోడ రాతలు రాసినదీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగానే. ఇప్పుడే కాదు “నక్సలైట్లే దేశభక్తులు” అన్న రాతలు చదివినప్పుడు కూడా ఈ ట్రాప్ లో వీళ్లు కూడా పడ్డారే అనుకున్నా. అన్నట్లు కవులెప్పుడూ ప్రతిపక్షమే అనుకుంతా. అంటే అన్ని పాలక పార్టీలకి వ్యతిరేకమే. అది అధికారంలో వున్నా లేకున్నా బీజేపి, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలైనా లేదా తెలుగుదేశం, టీఆరెస్, వైఎస్సార్సీపి వంటి ప్రాంతీయ పార్టీలైనా సరే. కాకుంటే అధికారంలో వున్న పాలక పార్టీలకి ప్రజా వ్యతిరేకంగా ఎక్కువ తప్పులు చేసే అవకాశం వుంటుంది. ప్రతిపక్షంలో కూర్చున్న పాలక పార్టీలకి తక్కువ తప్పులు చేసే అవకాశం వుంటుంది కాబట్టి నాబోటోళ్ల స్పందనలో కూడా తేడా వుంటుంది. ఇంక దేశభక్తి అన్న పదంలోని భావజాలం గురించి వివరించాను. దాని గురించి మీరు మాట్లాడితే బాగుండేది. దేశభక్తి కంటే దేశ ప్రేమ లేదా దేశ నిబద్ధ అనొచ్చు కదా అని నా సూచన. చివరి ముగింపు కూడా చూడండి.

      • “దేశభక్తియుత” ఇక్కడే ఈ మాటలనటంలో … మీ అసహనం తెలుస్తూ ఉంది. మనమంతా ఒక తల్లి పిల్లలం అనే స్ఫూర్తి రగిలించటానికి ఒక స్త్రీమూర్తిని ఆవిష్కరించారు. ఈ మాటలు- ఊహాజనిత స్త్రీమూర్తికి పట్టుచీర కట్టి, అమ్మవారిలా అలంకరించి భారతమాత అని తాదాత్మ్యమై పోవటం. ఇదీ మన దేశభక్తి. ఇందులో దేశం కోసం ఆచరణ ఏముంది? – ఇక్కడ మీకు చిరాకు తెప్పించింది హిందూస్త్రీని పోలిన అలంకరణ. అంతేగా? ఇక్కడ చిన్న వివరం మర్చిపోతున్నారు సార్. ఆ స్త్రీమూర్తి హిందూ వస్త్రధారణలో కాకుండా… మదర్ థెరెస్సా అయినప్పటికీ భారతీయులంతా…. హిందు, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కలిసి అదే భక్తిభావనకి, మీరంటున్న నిబద్ధతా భావానికి లోనయేవారు.

        అపరమేధావులు, రాజకీయనాయకులు వారి వారి స్వప్రయోజనాల(Divide and Rule) కోసం పనికట్టుకుని వేర్పాటువాదాలని జనం నెత్తిన రుద్దకుంటే… భారతమాతలో హిందూస్త్రీనీ, మదర్ థెరెస్సా లాంటి మానవీయమూర్తిలో క్రిస్టియన్ స్త్రీని… చూడరు మామూలు జనాలు. నా నిరసనంతా పనికట్టుకుని మతాన్ని ప్రతీ అంశంలోకి జొప్పించటం పట్లే. దీపావళి పండుగ రోజు పాతబస్తీలో సంతోషంగా టపాకాయలు పేల్చుకునే ముసల్మాను మిత్రులు, ఇఫ్తార్, ఈద్ విందులకి పిలువగానే వాలిపోయే మా హిందూ మిత్రబృందం, మేమంతా సామాన్య జనాలము సార్.
        బాధగా ఉంటుంది ఏ అంశానికి ఆ అంశాన్ని హిందుత్వ అని ముడిపెడుతుంటే. ఆఖరికి భారతమాత అలంకరణా మీలో అసహనాన్ని పుట్టించటం సామాన్యమైన విషయం అని మీరనుకున్నా మీలో పెరిగిపోతున్న అసహనానికి నిదర్శనం సార్ అది. దయచేసి గ్రహించండి. ఒక సంఘటిత శక్తిని సూచించే ఒక మూర్తి/ పటం- అంతే. విగ్రహారాధన చేయవలిసిన పని లేదు. అన్నదమ్ములు కలిసున్న ఉమ్మడి కుటుంబంలో మూలదారం లా కలిపి ఉంచిన తల్లిఫోటో పెట్టుకోవటమూ విగ్రహారాధన అని వద్దనేలా ఉన్నారు మీరు… తల్లి ఏకతాటిపై పిల్లలని నిలుపుతుంది. తల్లి అక్కడ ఒక సినర్జీ ని సృష్టించే గొప్ప భావన. దర్గా ని దర్శిస్తే పిల్లలు పుడతారంటే దర్గా ఏ మతమన్నది చూడకుండా వెళ్ళిపోయి సంతానం కోసం మొక్కుకునే హిందూ తల్లులని చూసాను సార్. ఆ తల్లిలోనూ, తల్లి అనే భావనలోనూ మతం కనబడుతుందా సార్ మీకు?

  • దేశభక్తి వున్నవాళ్లు ఏం చేయాలో ఎక్కడా చెప్పబడలేదు.

    అసలు సమస్య ఇదే అండి. ఈ రోజున వున్న పరిస్థితులకు కావాల్సిన వ్యాసం ఇది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు