”నా తప్పా ఇది”… యాస్మిన్ రుద్దకంఠంతో అడిగింది. ”కాదు నిన్ను ఇష్టపడ్డా కదా… నాదే తప్పు… ఇప్పుడు అనుభవిస్తున్నాను” పర్వేజ్ కోపంగా అన్నాడు. ఒక్క ఉదుటన మంచంపై నుంచి లేచి ”ఇంక నా వల్ల కాదు పడక మంచంపైన షొహర్(భర్త)ని మురిపించలేనిది. శవంలాగా పడి ఉండేది. ఆడదే కాదు భార్యే కాలేదు ఎప్పటికీ ముఝె తుమ్ నై చాహియే” అంటూ విసురుగా గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు పర్వేజ్. యాస్మీన్ కన్నీళ్ళతో మంచంపైన ముడుచుకు పోయింది.
”నాకు తలాఖ్ ఇస్తాంటున్నాడు మీ అబ్బాయి. నేను సంసారానికి పనికి రానంట… నన్ను చూస్తేనే అసహ్యం వేస్తుందంట… ఒక బిడ్డను కని ఆరేళ్ళు వచ్చాక మీ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడు” యాస్మిన్ కన్నీళ్ళతో అత్త మునీరాకు చెప్పింది.
”మైఁ క్యాఁ కరూఁ బహూఁ… ఉన్‌కో క్యోఁ ఐసా లగ్‌రా మైఁ కైసా బోల్‌సక్తీ బోలో” అంది మునీరా నిరాశక్తంగా టీవీలో సీరియల్ మిస్ కాకుండా చూస్తూ…. (నేనేం చేయను కోడలా వాడికి ఎందుకలా అనిపిస్తుందో నేనెలా చెప్పగలను)
”ఎందుకు చెప్పలేవు ఎనిమిదేళ్ళ క్రితం మా ఇంటి చుట్టూ తల్లి కొడుకులు తిరిగి తిరిగి నానీమా, అబ్బాజాన్‌ను ఒప్పించి నన్ను ఇంటికి బహూని చేస్కున్నప్పుడు తెలియదా… నీ కొడుకు నాకు తలాఖ్ ఇస్తానంటే అంతపట్టనట్లున్నావు చెప్పుకొని ఆపుకోలేవా. అబ్బాజాన్ నిన్ను కాకుండా వేరే ఔరత్‌తో ఉంటే కొట్లాడి ఏడ్చినదానివి నీకామాత్రం నా నొప్పి తెలియదా మాట్లాడు నీ కొడుకుతో” యాస్మిన్ అరిచినట్లే అన్నది.
”మరద్ హైఁవో… కుఛ్ బీ కర్ సక్తా హై” (వాడు మగాడు ఏమైనా చేయగలడు) నేను మాట్లాడతా నువ్వూరుకో మాసూమాను లోపలికి తీస్కెళ్ళు” మునీరా కూడా అరిచినట్లే చెప్పింది.
కోడలు తన భర్త అక్రమ సంబంధాన్ని దెప్పి పొడిచేసరికి మునీరా తట్టుకోలేక పోయింది.
అవును తన భర్త కూడా తన కొడుకు పర్వేజ్ కోడలితో నీతో నాకు సుఖం లేదని ఎట్లా అన్నాడో అలాగే అనలేదూ… అవును తనకు కూడా కోడలికి అయినట్లు ఖత్నా అయ్యింది.
అవును… తన చిన్నప్పుడే… స్త్రీత్వంలోకి నడిపించి తనను సంపూర్ణ స్త్రీగా మార్చిన ఖత్నా, తనను ఆ పాప పంకిలమైన మాంసపు తునక నుంచి విముక్తి కలిగించి పవిత్రురాలిని చేసిన ఖత్నా… అది తమ దావూదీ బోహ్రా సంప్రదాయం… తమ మత గురువు సయ్యేద్నా చెప్పినట్లు చెయ్యకపోతే… సమాజంలో చెడు స్త్రీగా, అపవిత్ర స్త్రీగా ముద్ర పడిపోదూ. ఖత్నా స్త్రీలో నెమ్మదితనాన్ని, ఒద్దికని పెంచుతుంది. తన పర్ దాదీ కూడా చేయించుకుంది.
తన అత్త తనకు ఖత్నా అయ్యిందో లేదో తనను పరీక్ష చేసిగానీ కోడలిగా చేసుకోలేదు. నొప్పితో ఏడుస్తున్న తన చెవులలో ”ఏం కాదు నిమిషంలో అయిపోతుంది. నువ్వు సంపూర్ణ స్త్రీగా మారిపోతున్నావు. సబర్ కరో బేటీ (భరించు బిడ్డా)” అని గుసగుసలాడిన అమ్మీ మాటలు ఇంకా గ్నాపకమే. తన నానీమా, దాదీమా, అమ్మీ తమ అందరికీ ఖత్నా అయ్యింది. నానీమా, దాదీమా అమ్మీలకు – వాళ్ళ అమ్మీలకూ కూడా ఖత్నా అయ్యింది. కానీ… అవును తన భర్త కూడా తనను పడక గదిలో మంచెం మీద కట్టెలా పడుంటావు అంటూ తిట్టేవాడు, కొట్టేవాడు కూడా ‘నొప్పి అని ఏడుస్తావెందుకూ’ అని… ఎంత కాలం భరిస్తాడు ఖత్నా కాని స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు. ఏడ్చింది. మొత్తుకుంది. మెల్లగా సర్దుకుపోయింది. బంగారం లాంటి మగపిల్లలు ఇద్దర్ని ఇచ్చానని ప్రేమగానే చూసుకుంటాడు. ఆడదానికి ఇంతకంటే ఏం కావాలి? ఈ కోడలే నాటకాలాడుతున్నది. కొడుకు ఇంకో ఆడదాని దగ్గరకు పోతేనేం… సర్దుకుపోవచ్చుగా… మునీరా ఆలోచనలు కొనసాగుతున్నాయి.
– – –
”అమ్మీ… నేనతని దగ్గరికి వెళ్లను గాక వెళ్ళను ప్రతి రోజు గొడవనే…. వెక్కిరింతలే… ఆ దోఝుఖ్ (నరకం)లోకి నన్ను పంపకు… ఏదీ ఆ ముసలిది… నానీమా చంపేస్తాను.. అదేగా నాకు ఖత్నా చేయించింది. నా జీవితం నాశనం చేసింది” యాస్మిన్ కోపంగా తల్లి ఆరెఫా జవహరీని పట్టుకొని కదిలి కదిలి ఏడుస్తున్నది. ”అమ్మీ నువ్వెందుకు నన్ను రక్షించుకోలేకపోయావు. నన్ను వదిలిపెట్టి ఎక్కడికెళ్ళిపోయావు అమ్మీ నీ కోసం ఎంత వెతికా, అరిచా… ఏడిచా”… యాస్మిన్ ఎక్కిళ్ళు పెడుతూనే ఉంది.
ధారగా కార్తున్న కన్నీటిని తుడుచుకోవాలన్న సోయి కూడా లేకుండా ఆరెఫా కూతురి తల నిమురుతూ ఉండిపోయింది. తల్లీ కూతుళ్ళిద్దరూ ఏడుస్తూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉండిపోయారు. కొంచెం సేపయ్యాక ఆరెఫా కన్నీళ్ళు తుడుచుకుంటూ కూతురి తలవెంట్రుకలు నిమురుతూ తన చీర కొంగుతో యాస్మిన్ కళ్ళు తుడుస్తూ గడ్డం ఎత్తి ”బేటీ… మాసుమాను… నీ బిడ్డను రక్షించుకోవాలి నీకు నేను తోడుంటాను. మనం ఇప్పుడు చేయగలిగింది ఇదొక్కటే” అంది దుఃఖంతో గొంతు పూడుకుపోతుంటే యాస్మిన్ భయంగా తల్లి కళ్లల్లోకి చూసింది. వెంఠనే తల తిప్పి మంచం మీద అమాయకంగా నిద్రపోతున్న తన ఆరేళ్ళ కూతురు ”మాసూమా”ను చూసింది. భయంతో అమ్మీ అంటూ తల్లిని కర్చుకు పోయింది.
– – –
ఆ రోజు ఆరెఫా ఒకప్పుడు తను రోజూ రాసే డైరీ తీసి, తారీకు రాసింది.
”మాసూమాను రక్షించుకోవాలి ఈ సైతాన్ల నుంచి ఎలాగైనా సరె యాఁ ఖుదా మదత్ కర్…” అని రాసుకుంది.
మంచం మీద పడుకున్న భర్త ”యాస్మిన్ ఎన్నిసార్లు పుట్టింటికి వస్తుంది మొహల్లాలో ఇజ్జత్ పోతుంది. షోహర్ దగ్గరకు హైదరాబాద్ పొమ్మను” కోపంగా అన్నాడు.
”నువ్వూ మీ అమ్మా కల్సి చేసిన షైతాన్ పనికి యాస్మిన్ ఇప్పుడు అనుభవిస్తున్నది. వీలైతే తన బాధను అర్థం చేసుకోని తగ్గించే కోషిష్ చెయ్యి… బాధలతో పుట్టింటికొచ్చిన బిడ్డను తిడతావు… పొమ్మంటావు కమ్‌సేకమ్ అల్లాకో డరో… సునో… నేను ఎన్నిసార్లు పుట్టింటికి పోయానో అన్ని సార్లు నా బిడ్డ కూడా పుట్టింటికి వస్తుంది లేదా ఇక్కడే ఉండిపోతుంది. దేక్తుం కౌన్ రోకేగా ముర్కో” ఆవేశంతో ఆరెఫా చూపుడు వేలితో భర్తను బెదిరిస్తూ అంది.
– – –
”యాస్మిన్.. బడీ అమ్మీకనే జాయేఁగే ఆజ్” (పెద్దమ్మ దగ్గరికి పోదాం ఈ రోజు) అన్నది ఆరెఫా. యాస్మిన్ బాల్కనీలో దిగులు కళ్ళతో కుర్చీలో ముడుచుకుని కూచున్నది. పొద్దుటి నాష్తా, చాయ్ అయిపోయినాయి. భర్త పర్వేజ్ గురించి ఆలోచిస్తూ కన్నీళ్ళు కారుస్తున్నది ఎనిమిదేళ్ళైంది నిఖా అయ్యి… తర్వాత ‘మాసూమా’ పుట్టింది. పాపంటే ప్రేమ ఉంది పర్వేజ్‌కి, కానీ తనంటేనే… అయిష్టత… ”నువ్వు నాకు ఆడదానిలాగానే కనపడవు ఆడతనం కోసేయించుకున్న నీతో కాపురం చేయలేను” అంటాడు. తనదా ఆ తప్పు? తన కాళ్ల మధ్య ఆడతనం అంట కోసేయించుకున్నదంట తనా… మేక తనంత తాను కసాయివాడి దగ్గరికి వెళ్ళి ‘నన్ను నరికి చంపుకో’ అంటుందా? తనకు తెలీకుండానే తన దేహంలో ఒక భాగం కోతకు గురి అయ్యింది. తననెవరూ అడగలేదు తొలగించాలా ఒద్దా అని. పధ్నాలుగేళ్ళ తనను నానీమా, డాక్టర్ దగ్గరకు తీస్కెళ్ళింది. అమ్మీ లేదు. అబ్బా కూడా లేడు. అబ్బాకు కడుపునొప్పి వస్తే ఆపరేషన్ కోసం దవాఖానాకు తెస్కెళ్ళారు. దవాఖానాలో అప్పటికే పుఫ్ఫా (మేనత్త) వచ్చి ఉంది.
నెలసరి సరిగా రావడానికి తనకు మెహినా వారి మందులు ఇప్పిస్తామన్నారు. నమ్మించారు. అక్కడ ఒక మగ డాక్టరున్నాడు. నానీమా, పుఫ్పా, ఇంకో స్త్రీ ఇద్దరూ తన కాళ్ళను వెడల్పు చేసి పట్టుకున్నారు. టేబుల్ మీదెందుకు పడుకో బెడుతున్నారో అర్థంకాలే.. తన చెడ్డీ విప్పుతుంటే… నక్కో… క్యోఁ… అని అడిగింది. కాళ్ళు బలవంతంగా వెడల్పు చేస్తుంటే భయంతో గించుకుంది. ఆ డాక్టరు.. ఇంకో ఆయా కల్సి తన కాళ్ళమధ్య రేజరు బ్లేడుతో ఏదో చేసారు. గుండెలు మెలి తిప్పే పెనునొప్పితో అమ్మీఁ నక్కో అని అరిచింది. వీళ్ళేదో చేస్తున్నారు. చేసేరు. అమ్మీ ఏదీ… ఎక్కడా అమ్మీ… ఎపుడూ తన పక్కనుండే అమ్మీ ఇప్పుడెందుకు లేదు. ”చుప్ హోజా బేటీ…” నువ్విప్పుడు శుభ్రమైపోయిన ఆడదానివి, పవిత్రమై పోయావు” నానమ్మ చెవుల దగ్గర గుసగుసలాడింది. తీవ్రమైన రక్తస్రావంతో తను స్పృహ తప్పిపడిపోయింది. ఇంటికొచ్చాక మంచంపైన గాయపడ్డ పక్షిలా ఆగని రక్తస్రావంతో పడి ఉన్న తనను చూసి దవాఖానా నించి వచ్చిన అమ్మ స్పృహ తప్పి పడిపోయింది. మెలకువ వచ్చాక నానీమా, పుప్పాతో ఘోరంగా పోట్లాడింది గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. ”ఖత్నా నక్కో బోలేతో క్యోకరాయేఁ… ఇన్సాన్ నహీఁ జాన్వర్ హో తుమ్” (ఒద్దంటే ఎందుకు చేసారు ఈ ఖత్నా? మనుషులు కాదు జాన్వర్‌లు మీరు) అంటూ వాళ్ళందర్నీ మీదపడి కొట్టింది. అబ్బా రెచ్చిపోయి అమ్మీని బెల్టుతో కొట్టి గదిలో వేసి బంధించాడు. ”నేనే చెయ్యమని చెప్పాను. నిఖా నై కర్నాహై క్యా” అంటూ అమ్మీ ఏడుస్తూనే ఉంది. తాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా… ఏడుస్తూనే ఉంది.
”యాస్మిన్ రోఁ నక్కో బేటీ… చలో బడీ అమ్మీ కనే జాఁయేంగే” ఆరీఫా… ఖంగారుగా, కూతురి భుజాలు కుదుపుతూ… చెంగుతో కన్నీళ్ళు తుడుస్తూ అన్నది.
యాస్మీన్ తలెత్తి ఆరెఫా మొఖంలోకి చూస్తూ ”అమ్మీ మైఁ నైఁ ఆతూఁమ్ ఆప్ జాయియేఁ, సిర్ దర్ద్ హోతాఁ హైఁ సోజాఁవూంగి థోడీ దేర్” అన్నది (అమ్మీ నేను రాను తలనొప్పిగా ఉంది నువ్వు వెళ్ళు కొద్ది సేపు పడుకుంటాను)
”ఠీక్ హై… మైఁ ఔర్ మాసూమా జాయేంగే” ఆరేళ్ళ మాసూమా చేయి పట్టుకొని అంది ఆరెఫా. (”మంచిది మరి నేనూ – మాసూమా వెళతాం”). అంతే… యాస్మిన్ తననెవరో కత్తితో పొడిచినట్లే ఆక్రందన చేసింది. ”నైఁ నక్కోఁ… మాసూమాఁ క్యో… ఆప్ అకేలీచ్ జాఁవ్, నై భేజ్‌తుఁమ్” (”ఒద్దు మాసూమా ఎందుకు నువ్వొక్కదానివే వెళ్ళు, నేను పంపను”) అని అరుస్తూ మాసుమాను ఆరెఫా నుంచి తన వైపుకు లాక్కుని గుండెకు హత్తుకుంటూ ఆరెఫా వైపు భయంగా చూసింది.
ఆరెఫా నిర్ఘాంతపోయింది. తనవైపు చూస్తున్న కూతురి కళ్ళల్లో ఎంత భయం… అపనమ్మకం… ఖత్నా కోసం తీస్కెళ్ళే ముందు దవాఖానా, మెహనా వారీ మందులు ఇప్పిస్తాం అని చెప్పి తీస్కెళ్ళి… రాబందుల్లా మీద పడి బ్లేడుతో కోసేస్తే నానమ్మను, పుఫ్పాను, తన అబ్బాను… ప్రతిక్షణం అపనమ్మకంతో చూసిన యాస్మిన్… ”నైఁ జాతుమ్… మేరెకో కాట్‌దేతే ఓ లోగ్… నక్కో భేజో అమ్మీ ఓ లోగోఁకే సాత్…” (నన్ను కోసేస్తారు వాళ్ళతో పంపియ్యకు అమ్మీ నన్ను) తన బాల్యం… యవ్వనం అంతా ఇదే ఆక్రందనలతో కూడిన పలవరింత తనకు లాగే… ఆరెఫా కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి.
కూతుర్ని, మనవరాలిని గాఢంగా హృదయానికి హత్తుకుంది. ”బేటీ ఎన్ని సార్లు చెప్పాను నాకూ నీలాగే జరిగింది అని, ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నా మీ నాన్నతో… నన్ను నమ్ము బేటీ నేను మీ నానమ్మ, అబ్బాలాగా కాదు. నీకు ఖత్నా ఒద్దన్నందుకు మీ అబ్బా కొట్టిన దెబ్బల గుర్తులు ఇంకా మచ్చలుగానే మిగిలాయి చూడు” అంటూ కొంగు తప్పించి తన పొట్టని చూపించింది. కాలి కమిలిపోయిన గుర్తులు అమ్మీ పొట్టమీద.
ఆరెఫా పొట్టమీది మచ్చలను కన్నీళ్ళతో యాస్మిన్ తడుముతుందే… మాసూమా కూడా చేతులు వేసి నిమురుతూ ”కాఁహువా దాదీ గిర్ గయేఁ క్యాఁ’ అని అడిగింది (ఏమైంది అమ్మమ్మా పడిపోయావా) ”నైఁ మా… తుమ్హారే… దాదా మారే మేర్కో” (లేదు తల్లి మీ తాత కొట్టాడు నన్ను) అంది ఆరెఫా. ”లాయర్ నంబరు దొరికిందన్నావు కదా, మాట్లాడు ఒకసారి” అంది ఆరెఫా. మాసూమాని ఎత్తుకుని గడప దాటుతూ…
– – –
పతాహై కౌన్ లోగ్
హమే ధోఖా దేతేహై
జిన్హే హమ్ అప్నీ జిందగీమేఁ
బహోత్ అహ్‌మీయత్ దేతే హైఁ…
– ఆరీఫా…
మనల్ని ఎవరు మోసం చేస్తారో తెలుసా…
మనం జీవితంలో ఎవరినైతే గాఢంగా
విశ్వసిస్తామో… వాళ్ళే మనల్ని నమ్మించి
ద్రోహం చేస్తారు… – ఆరీఫా.
అవును, తనకు ఎవరు మోసం చేసారు? నమ్మిన వాళ్ళే… తనను గుండెలకు హత్తుకుని ముద్దు చేసిన వాళ్ళే, ద్రోహం చేస్తారని ఊహించని వాళ్ళే… ఎవరు… ఎవరు వాళ్ళు? కౌన్ హై ఓ లోగ్? ”అమ్మీజాన్, అబ్బాజాన్, నానీమా, దాదీమా… వీళ్ళే కదా…? యా ఖుదా… కిస్ కిస్ కో పూఛూఁ? కాపాడుకుంటారనుకున్న వాళ్లే… తనను నమ్మించి కసాయి కత్తికి బలి చేసారే… అమ్మీ జాన్…అమ్మీ అమ్మీ నువ్వు కూడానా…?
ముడతలు పడ్డ ముసలి మొఖంతో ఉన్న ఆమె నల్లటి ముసుగేస్కుంది. తల మీదుగా చెవులను కప్పుతూ ఆమె స్కార్ఫ్ వేలాడుతున్నది. కళ్ళు కఠినంగా మెరుస్తున్నాయి. ఆమె ఒక్కసారి తను నిల్చున్న రక్తపు మడుగులోంచి బుడుంగున మునిగి లేచింది. ఆమె నిండా రక్తంతో తడిసిపోయి ఉంది. ఆమె చుట్టూతా ఐదారేళ్ళ పసి ఆడపిల్లల దేహాలు తేలుతూ ఉన్నాయి. వాళ్ళంతా ”కాటో నక్కోఁ అమ్మీ, నానీమాఁ దర్ద్ హోతాహైఁ” (అమ్మీ, నానీమా కొయ్యద్దు నొప్పి పుడుతుంది) అని కేకలు పెడుతూ ఏడుస్తున్నారు. ఆమె చేతి వేళ్ళు పూర్తిగా రక్తంతో నాని ఒక్కో వేలూ విచ్చు కత్తిలా మెరుస్తున్నది. కుడిచేతి వేళ్ళతో, ఆమె తళతళా మెరిసి పోతూ సగం తడిసిన రక్తంతో ఉన్న రేజర్ బ్లేడుని పట్టుకుని ఉంది. అది ఉండాల్సిన దానికంటే కూడా పెద్ద సైజులో ఉంది. ఆ ముసలామే తనని ”ఇప్పుడు నీ వంతు ఆరెఫా రా” అని అరుస్తూ తన వెంటపడింది. అక్కడంతా చీకటి చీకటిగా ఉంది. అదొక ఇల్లు అని అర్థమవుతూ ఉంది. తను భయంతో ఆమెకు దొరకకుండా పరిగెడుతూ… ఇల్లంతా పరిగెడుతున్నది. ”అమ్మీ బచావ్… మార్తే హై ఏ లోగ్” (అమ్మీ రక్షించు వీళ్ళు చంపేస్తారు నన్ను) అని అరుస్తున్నది. ‘పక్‌డో ఏ బచ్చీకో’ అని ఆ ముసలామే కోపంగా అరుస్తూ సైగ చేస్తే నలుగురు మగవాళ్ళు కండలతో భయం వేసేలా దృఢంగా ఉన్నవాళ్ళు తనను ఒడిసి పట్టుకున్నారు. తనను ఆ రక్తపుమడుగులో ముంచారు. అదేంటి ఆ మగాళ్ళల్లో ఒకడు తన భాయ్‌జాన్ రవూఫ్, తన అబ్బాజాన్ ఆలీలాగా ఉన్నారు. కోపంగా చూపులతో బెదిరిస్తున్నారు. ఆ మగవాళ్ళలో ఒక మగవాడి మొఖం అమ్మీ ముఖంలా, మరొక మగాడి ముఖం నానీమా ముఖంలా మారిపోయి ఉన్నాయేమిటి? వాళ్ళు తన కాళ్ళు వెడల్పు చేసి పట్టుకున్నారు. ఆ ముసల్ది బుడుంగున తన కాళ్ళ మధ్య మునిగింది. మరుక్షణం కాళ్ళ మధ్య భయంకరమైన నొప్పితో… తను వేసిన పెనుకేక… ఆ ముసలామే వికటాట్టహాసం చేస్తూ బ్లేడు పట్టుకున్న కుడిచేతిని గాలిలో పైకి లేపి తన కాళ్ళ మధ్య కోసేసిన ”హరాంకి బోటీ” పాపపంకిలమైన మాంసపు తునకను ”దేఖో కాట్ దియే ఏ హారంకీ బోటీకో అబ్ తుమ్ ఇజ్జత్‌దార్ ఔరత్ బన్‌గయె” అని అరిచింది. తన ఏడుపుతో ఆ గది ప్రతిధ్వనించింది. తను ఏడుస్తూ… అరుస్తూ… పెనుగులాడుతూ లేచి పడుతూ ఆ రక్తపు మడుగులోంచి పాకుతూ పారిపోతూ ఉంది. ఒక్కసారి… మెలకువ వస్తుంది. అవును ఇది కల… అయితే నిజం కాదా? నిజమే… ఇది. నిజంలో నించే వచ్చిన లేదా తరచూ వచ్చే కల. పెళ్ళై ఇరవై ఐదేళ్ళు గడుస్తున్నా ఈ కల ఇప్పటికీ తనను తన దేహం నించి కోసిపడేసిన ‘హరాంకీ బోటీ’తో సహా వేటాడుతుంది. ఎందుకుంది ఇంత కౄరమైన ఆచారం ఈ లోకంలో? తన కాళ్ళ మధ్య రేజర్ బ్లేడు కోత మిగిల్చిన నొప్పి కాళ్ళ మధ్య అంగారమై… నిప్పు కణికలు భగ్గున మండిన ఆ రోజుని తనెలా మరిచిపోతుంది? ఆ రోజే కదూ తన జీవితాన్ని మార్చేసింది? ఆ ముసలి నానీ… తన కాళ్ళ మధ్యని మాంసపు తునకనే ఖండించిందా? లేదు తన మొత్తం దేహాన్ని కళ్ళనీ, నాలుకనీ, చెవులనీ చేతులనీ కూడా కసిగా కసిగా నరికి పారేసింది. తన జీవితంలో అతి ముఖ్యమైన భాగాలను అత్యంత కిరాతకంగా కత్తిరించేసింది. తనను అవిటిదాన్ని చేసేసింది. కాళ్ళూ, చేతులు తెగిపోతేనే, గుడ్డి, మూగ, చెవిటితనం ఉంటేనే అవిటి తనమా? దేహంలో ఎక్కడ తెగిపోయినా అవిటితనమే కదా?
తను మూగదీ, గుడ్డిదీ, చెవిటిదీ కూడా కాదు.
తను కుంటిది కాదు, చేతులు లేనిది కాదు… దేహంలో అన్ని అంగాలు ఉన్నాయి. కానీ… తను జననాంగాలు లేనిది. కాళ్ళ మధ్య ఏమీ లేదు ఖాళీ, శూన్యం, ఒక చిన్న రంధ్రం తప్ప.
ఎవరికీ కనపడదు.
తాను ఎవరికైనా చెప్పినా వినపడదు.
”ఛలో ఆరెఫా మున్నీ ఆప్‌కో ఆజ్ ఐస్‌క్రీం ఖిలాయేంగే (ఆరేఫా మున్నీ ఈ రోజు నీకు ఐస్‌క్రీమ్ తినిపిస్తాను) ఐస్‌క్రీం అంటే ఆశ ఎవరికి ఉండదు అందునా ఏడేళ్ళ తనకి? అమ్మీ, నానీమా చెయ్యిపట్టుకొని గెంతుకుంటూ వెళ్ళిపోయింది.
బాంబే బోహ్రా మొహల్లాలో ఎక్కడైతే తను పుట్టి పెరిగిందో అక్కడి భేండీ బజార్‌లోని బైకుల్లా ప్రాంతంలో ఒక పాత అపార్ట్‌మెంట్‌లో ఒక చీకటి నిండిన ఫ్లాట్‌లోకి తీస్కెళ్ళారు. ఐస్‌క్రీం పార్లర్ ఇంత చీకటిగా ఉన్న ఇంట్లో ఎందుకుంది అని ఆశ్చర్య పోయింది. ”ఇంత అంధేరా ఏంటి నానీమా… అమ్మీ నాకు భయం వేస్తుంది వెళ్ళిపోదాం” అంది తను. ”అంధేరా నై బేటీ… ఎంత గొప్ప పని జరుగుతుందో తెలుసా నీకు” అంది నానీమా. ”ఏం జరుగుతున్నది నానీమా” తను అడిగింది.
”చాలా పవిత్రమైన పని జరుగుతున్నది. ఇక్కడ నీకు నీలాంటి ఆడపిల్లలకు ‘తహారత్’ (శుభ్రం) చేస్తారు. నీ కాళ్ళ మధ్య ఉన్న అనవసరమైన, పాపపంకిలమైన నీతో తప్పుడు పనులు చేయించే చర్మపు ముడుతలను కత్తిరించేసి, నిన్ను పవిత్రమైన స్త్రీగా మారుస్తారు. ”తుమ్‌కో ఔరత్ బన్‌నేకీ సమయ్ ఆగయా హైఁ” (నువ్వు స్త్రీగా మారే సమయం వచ్చేసింది) అంది నానీమా… తను భయంతో వొణికి పోయింది. ”ఎలా కత్తిరిస్తారు అమ్మీ నాకు వద్దు, నేను చెడ్డదాన్ని కాదు, ఏ తప్పూ చేయను” అని ఏడుస్తూ అమ్మీని కరుచుకుపోయింది. ”ఏం కాదు క్షణంలో అయిపోతుంది” అమ్మీ చెవుల దగ్గర గుసగుసలాడింది. లోపల అంతా తన వయసు అమ్మాయిలే ఉన్నారు. అందరి చేతుల్లో ఐస్‌క్రీములున్నాయి. ఏడుస్తూ, అరుస్తూ, మెలి తిరిగిపోతున్న అమ్మాయిల్ని… కాళ్ళ మధ్య నుంచి పాదాల దాకా రక్తం కారుతూ స్పృహతప్పి పోతున్న అమ్మాయిల్ని ఖంగారు, ఖంగారుగా పెద్దవాళ్ళు బయటకు తీస్కెళుతున్నారు. వాళ్ళని చూస్తూ మిగతా అమ్మాయిలూ ఏడుస్తూ, ఒణికిపోతూ ఉన్నారు.
తనూ భయంతో ”అమ్మీ ఖూన్ క్యోఁ ఆరా… ఆఁవ్ చలే జాయేఁగే” అని ఏడవసాగింది. (అమ్మీ వాళ్ళకి రక్తం ఎందుకు వస్తున్నది వెళ్ళిపోదాం) అక్కడంతా పెద్ద శబ్దంతో సంగీతం… డ్రమ్ముల మోత పెట్టారు. పిల్లల అరుపులూ ఏడుపులూ ఎక్కువయ్యేకొద్దీ. తన కళ్ళముందే పక్కింటి తస్నీమ్ తన స్నేహితురాలుని రక్తాలోడుతూ నొప్పితో గిజగిజలాడుతుంటే ఎత్తుకుని తీస్కెళ్ళారు. తస్నీమ్ వాళ్ళ అమ్మీనే ఉంది అక్కడ. అంతే తనకు అమ్మీ మీద నమ్మకం పోయింది. అమ్మను విదిలించుకుని పారిపోయి ఇల్లంతా పరిగెత్తసాగింది ఏడుస్తూ… ”పకడో బచ్చీకో (పట్టుకోండి పిల్లను)” అని నానీమా అరవగానే లోపల్నించి నలుగురు మగవాళ్ళు వచ్చారు. తన వెంట పడి పిట్టలాంటి తనను ఒడిసిపట్టారు. కోతల గదిలోకి తీస్కెళ్ళారు. ఆ గది నానా భీభత్సంగా ఉంది. టేబుల్‌పైనా, కిందా అంతా రక్తం. అక్కడ ఒక మగమనిషి బ్లేడు పట్టుకొని నిలబడ్డాడు. ఇంకొక ముసుగేసుకున్న ముసలామే కూడా ఉంది. అతనా బ్లేడు ఆ ముసలామెకి ఇచ్చాడు. తన కాళ్ళు ఇంకొక ఇద్దరు ఆడాళ్ళు విడదీసి వెడల్పు చేసారు. తన గుండెలు పగలదీసే ఆక్రందనలు ఎవరికీ వినపడలేదు. భయంకరమైన నొప్పితో. రక్తస్రావంతో స్పృహతప్పి పడిపోయింది తను.
తెలివి వచ్చేటప్పటికీ తనింట్లో ఉంది. తన రెండు కాళ్ళు కలిపి కట్టేసారు. రక్తం అంటుకోకుండా కాళ్ళ మధ్య గుడ్డపెట్టారు. అది రక్తంలో నిండిపోయి తన బట్టలు, దుప్పటి తడిసి పోయాయి. నొప్పితో ఏడుస్తూనే ఉంది. నొప్పి తగ్గడానికి ఏ మందులూ ఇవ్వలేదు. గుడ్డ మార్చినప్పుడల్లా ఏదో పొడి అద్దే వాళ్ళు. నొప్పితో గిలగిలలాడినప్పుడల్లా టబ్బులో వేడి నీళ్ళు, ఉప్పు వేసి పడుకోబెట్టేవారు. ఆ రోజు ”మూత్రం వస్తుంది. నానీమాఁ” అంది. పోస్కో అంది. ఎలా పోస్కుంటుంది కూర్చోలేదు. రెండు కాళ్ళు కలిపి కట్టేసారు. బాత్రూంకి పాక్కుంటూ పోయింది. పక్కకి ఒంగి పోసే ప్రయత్నం చేసింది కానీ భయంకరమైన నొప్పి మంటతో అరుస్తూ ఏడుస్తూండి పోయింది… నొప్పితో మూత్రం చుక్క చుక్కలుగా వచ్చింది. 14 రోజులు అలాగే నరకయాతన పడింది. పాక్కుంటూ, డేక్కుంటూ బాత్రూంకి పోయేది. మూత్రం, దొడ్డికి పోవాలంటేనే భయంతో ఒణికిపోయేది, ఏడుస్తూనే ఉండేది ఆ కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు. బంధువులంతా వచ్చి దావత్ చేసారు. తనకు ఔరత్ బన్‌నేకి బధాయీలు ఇచ్చారు. స్వీట్లు చాక్లెట్‌లు ఇచ్చారు. కొత్త బట్టలు డబ్బులతో ముంచెత్తారు. తనకు మాత్రం మంట, నొప్పి, రక్తస్రావం, జ్వరం… పధ్నాలుగు రోజుల తర్వాత నొప్పితో నడవలేక కుంటితనం వచ్చాయి. అన్నింటికంటే బాధాకరం బడి మాన్పించేయడం. ఎంత ఏడ్చినా పంపియ్యలేదు. తనంత నొప్పితో ఏడుస్తుంటే అమ్మీ, అబ్బాజాన్, నానీమా అంత సంతోషంగా ఎందుకున్నారు. దావత్‌కి తస్నీమ్ ఎందుకు రాలేదు? ఎవరూ చెప్పడం లేదు. వాళ్ళింట్లో కూడా దావత్ చేసారా? తస్నీమ్‌కు కూడా కోసారుగా తనకులాగానే? ఒకరోజు… పక్కింటి నుశ్రత్ వచ్చింది. ”మాలూమ్ నై క్యాఁ తస్నీమ్ కాఁ ఇంతెఖాల్ హోగయ్ బహుత్ ఖూన్ గయా… బుఖార్ ఆగయాఁ బిచారీ మర్‌గయీ… ఖుదాకో ప్యారీ హోగయీ” కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుందే… ”మేర్కో భీ ఖత్నా కరైఁ కతె అమ్మీ బాఁవా… మై నై కర్‌లేతుం… భాగ్ జాతుమ్ కయీఁ భీ” అంది భయంగా… తను నుశ్రత్‌ను గట్టిగా కౌగలించుకుంది.
– – –
పదహారేళ్ళకే పెళ్ళైంది. పెళ్ళొక నరకం. శోభనానికి నాలుగు రోజుల ముందు దవాఖానాకు వెళ్దాం అన్నారు. ఎందుకంటే ‘ఖోల్‌నా’ (తెరవాలి) అన్నారు. ”క్యాఁ ఖోల్‌నా అమ్మీ…” (ఏం తెరవాలి అమ్మీ) అడిగింది తను. ”ఖత్నా కరేసో ఖోల్నా బేటీ తుమ్ చుప్ చాప్ లేట్ జావ్” అంది అమ్మీ. (నీకు ఖత్నా చేసాం కదా, అది విప్పాలి నువ్వు గమ్మున పడుకో)
అదొక నరకం. ఆ డాక్టర్లు మళ్ళీ తన రెండు కాళ్ళ మధ్య కత్తులు కటార్లు ఆడించారు. ”చాలా చిన్నగా అయిపోయింది. ఇక్కడం ఏం లేదు మొత్తం కలిపి కుట్టేసారు. మూత్రానికి, నెలసరి రక్తం పోవడానికి చిన్న రంధ్రాలు వదిలారు అంతే…” డాక్టర్ బాధలో అందో… కొత్త విషయం తెలిసిందన్న ఉత్సాహంలో అందో తెలీదు. ”భర్తను కలిసే రంధ్రం కొంచెం కుట్టు విప్పండి చాలు… మిగతా అంతా అట్లే ఉంచండి” సాఁసూమా డాక్టర్‌కి చెబుతున్నది. ఏం జరుగుతోంది తన కాళ్ళ మధ్య ఉహూఁ అస్సలు అడగద్దు.
తెరిచిన గాయం పచ్చిగా ఉందింకా… శోభనం ఏర్పాటైంది… ప్రాణం పోయేంత నొప్పితో ఉండలు చుట్టుకుపోతూ ఆపరేషన్ గాయం రేగిపోయి తీవ్రంగా రక్తం కారుతూ ఉంటే… భయంతో ఏడుస్తూ గిలగిలలాడ్తున్న తనను చూస్తూ ”ఆదత్ హోజాయెగా సబర్ కరో” అంటూ నవ్వాడు తన షోహర్ షౌకత్ అలీ. (అలావాటై పోతుంది ఓర్చుకో) ప్రతీ కలయికా కత్తితో పొడిచి, మళ్ళీ ఆ గాయాన్ని కత్తి మొనతో కెలికినంత నొప్పి) అరుపుల్ని బయట వినపడకుండా నోట్లో గుడ్డలు కుక్కుకునేది. భర్త ఒంటిపై చెయ్యి వేస్తేనే ఒణికిపోయేది. నక్కో, ఛోడ్ దో పాఁవ్ పడ్తీ హూఁ అని అతని పాదాల మీద పడిపోయేది ఏడుస్తూ. (ఒదిలెయ్ వద్దు నొప్పి చాలా అవుతుంది, నీ కాళ్ళ మీద పడతాను)
సంవత్సరం అయ్యాక గర్భం వచ్చింది. సాఁసూమాఁ దవాఖానాకి తీస్కెళ్ళింది… ”జజ్జీ (ప్రసవం) కష్టం అవుతుంది. కాళ్ళమధ్య రెండు వైపులా ఉన్న ముడతల్ని కలిపి కుట్టేసారు. విప్పాలి. విప్పితేనే ప్రసవం సవ్యంగా జరుగుతుంది” అని చెప్పింది డాక్టరమ్మ. ‘ఖోల్‌దో’ అంది సాఁసూమాఁ తాపీగా పాన్ నములుతూ ”దో బచ్చే హోనేకే బాద్ ఫిర్ సీదేఁగే” (ఇద్దరు పిల్లలు పుట్టాక తిరిగి కుట్టేద్దాం) అంది సాఁసూమాఁ. తనది కాదుగా మళ్ళీ తన కాళ్ళ మధ్య కోతలు…
అదృష్టం బాగుండి కవలలు పుట్టారు యాస్మిన్ – అర్బాజ్.
జజ్జీ మామూలుగానే అయ్యింది. కాకపోతే బిడ్డ తల బయటకు రావట్లేదని కింది వైపుకి ఇంకా కోసారు ఆరు కుట్లు పడ్డాయి… జజ్జీ అయ్యాక తనకు తెలీకుండానే తన రెండు కాళ్ళ మధ్య ముడతలను కలిపి కుట్టేసి ఖత్నా చేసారు. ఈ కోతలూ కుట్లూ భరించలేక నరకయాతన పడింది. నొప్పి భరించలేక గంటలు గంటలు ఏడ్చింది. మీది నించి… షొహర్ కోరికా తీర్చాలి. అతను… అతనే ఒక కత్తి! తనకు ఖత్నా చేసే రేజేరు బ్లేడుకంటే కూడా పెద్ద కత్తి తన షొహర్, రోజూ ఆ కాట్లను భరించాల్సిందే.
”యాఁ ఖుదా… ఔరత్ కీ జిందగీ మేఁ ఇత్నా జెహర్ ఔర్ దర్ద్ క్యోఁభరా… ఖురాన్ మేఁ భీ నహీ లిఖాసో ఏ లోగ్ క్యోఁ కర్రై…” దువా చేసినప్పుడల్లా ఏడ్చేది.
నా బిడ్డకు మాత్రం చేయించను గాక చేయించను ఈ ఖత్నా… కొన్ని వేలసార్లు అనుకుంది.
తన భర్త షౌకత్ అలీ పరమ ఛాందసుడు రోజు ఐదుసార్లు నమాజ్ చేస్తాడు… మస్జిద్‌కు వెళ్తాడు. కాన్పుకు ముందు ఒక రోజు ”ఖత్నా కుట్ల విప్పాక కాన్పు తర్వాత మళ్ళీ కలిపి కుట్టెయ్యడం ఎందుని ఒద్దు” అని కోపంతో ఒణికిపోతూ, తన చెంప పగలగొట్టాడు. మీ ఆడాళ్ళకు ఖత్నా అందుకే చేస్తారు లేనిపోని సుఖాలకి ఎగబడతారనే కుట్లు విప్పించుకుని ఏం చేద్దామని? నఖరాలు చేస్తున్నావా? పిల్లల్ని కనడం, షొహర్‌కి ఆనందాన్నివడం మాత్రమే మీ పని అర్థం అయ్యిందా? మొహల్లాలో ఇజ్జత్ ఉండదు… సయ్యద్నా మాట తప్పుతావా బోహ్రా ఖాందానీ, రివాజ్ హైఁ తోడ్‌నేకీ జుర్రత్ కభీనహీఁ కర్నా బేషరమ్ ఔరత్”, ”ఇది మన బోహ్రాల వంశపు సంప్రదాయం దీన్ని కాదనే ధైర్యం ఎప్పుడూ చేయద్దు సిగ్గులేనిదానా” అన్నాడు.
తను కోపంగా ”ఖురాన్‌లో కూడా ఆడవాళ్ళకు ఖత్నా చేయమని ఎక్కడా లేదు” అంది. ప్రతిగా ఇంకో రెండు సార్లు తన చెంపలు పగిలిపోయాయి. కాళ్ళ మధ్యే కాదు, నోటికీ కుట్లే… తన షొహర్… తమ ముసల్మాన్లలోనే వేరే తెగకు చెందిన ఒక భర్త పోయిన ఆడదానితో సంబంధం పెట్టుకున్నాడు. ”నీతో ఆనందం ఎక్కడని? ముగిసే దాకా గొంతు సగం తెగిన మేకలాగా అరుస్తూనే ఉంటావు నీతో శృంగారం కోయబడి రక్తం కారుతున్న మాంసపు ముద్దతో చేసినట్లు ఉంటుంది. అయినా నీ రెండు కాళ్ళ మధ్య ఏముందని ఖాళీ.. స్త్రీత్వమే లేని దానివి నీ మీద కోరికే ఉండదు. తుమ్‌సే ఔలాద్ చాహియే బస్… మూ బంద్ కర్ కోఁ పడే రహోఁ కుచ్ నైఁ బోల్నేకా” అన్నాడు (నీ నించి వారసుడు కావాలి అంతే నోర్మూస్కోని పడి ఉండు – ఏం మాట్లాడద్దు) ఖత్నా తను కావాలని చేయించికొన్నట్లు…
యాస్మిన్‌కి మూడేళ్ళప్పటి నుంచే మొదలుపెట్టారు. ఖత్నా చేయాలన్నట్టు. తను గట్టిగా నిలబడి కానివ్వలేదు. సాఁస్… షొహర్ చాలా సార్లు వాదించారు. ప్రయత్నించారు. కొట్టారు కూడా.
బిడ్డను ఒక్క క్షణం కూడా వాళ్ళకి ఒంటరిగా దొరకకుండా పదిహేను ఏళ్ళు వచ్చే దాకా క్షణ క్షణం యుద్ధం చేస్తూ కాపాడుకుంది. కానీ ఒక రోజు తన భర్తకు కడుపునొప్పి వస్తే దవాఖానాలో చేర్పించాల్సి వచ్చింది. వారం రోజులు ఉంచుకొని, ఆపరేషన్ చేసారు. బాంబెలో పెద్ద దవాఖానాలో చేసారు. తన ఇంటికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది దవాఖానా…
వారం తర్వాత ఇంటికొచ్చిన తనకు తన బిడ్డ యాస్మిన్ మంచంపైన రెక్కలు విరిచిన పక్షిలా ముడుచుకుపోయి కన్పించింది. ”ఏమైంది మున్నీ జ్వరం వచ్చిందా” అని అడిగింది. తనను చూడగానే గొల్లున ఏడుస్తూ యాస్మిన్ మంచంపై నించి లేవబోయే ప్రయత్నం చేసింది. కానీ లేవ లేక పోయింది. దుప్పటి తీసి ఏమైంది.. ఏమైంది అంటూంటే… తన దృష్టి కట్టేసిన తనబిడ్డ కాళ్ళమీద పడ్డది. ”ఓ లోగ్.. నానీమా… పుప్పా మేరెకు కాట్‌దియె… బహాత్ దర్ద్ హుఁవా, ఖూన్ గయా… అమ్మీ… మేర్కో ఛోడ్‌కో క్యోఁ గయేఁ?” అంటూ ఒణికిపోతూ ఏడుస్తున్నది యాస్మిన్.
తనకు లోకమంతా అంధకారం అయిపోయింది. అంతే స్పృహ తప్పింది. హోష్ వచ్చాక అరుస్తూ… సాఁస్, ననంద్ మీదకు భయంకరమైన కోపంతో కొట్టడానికి ఎగబడింది. తన షొహర్ అడ్డమొచ్చి ‘మైఁయీచ్ కర్నెకో బోలా అమ్మీకో కుచ్ నై బోల్నేకా” అంటూ తన చెంపలు వాయించాడు. తనను గదిలో వేసి గొళ్ళం పెట్టారు. రోజంతా తిండీ, నీళ్ళూ బంద్ చేసారు.
తల గుండెలు బాదుకుంటూ ఏడుస్తూండిపోయింది ఏం చేస్తుంది?
ఎన్నిసార్లు తన అమ్మీని అడిగింది. ”ఖత్నా కర్‌కో క్యాఫాయిదాహై ఔరత్‌కో… ఏక్ ఫాయిదా బతావో అమ్మీ తుమ్ క్యోఁ ఐసా కరే… మేర్సె క్యాఁ ఛీన్‌లియే తుమ్… తుమ్‌కో క్యా హక్ బన్‌తా హైఁ” అని… ”ఔరత్ కాఁ ఇజ్జత్ కేలియే కర్నా పడతా బేటీ… మైఁ, ఔర్ మేరీ అమ్మీ సాస్ భీ… మేరే దాదీ, నానీ భీ కర్‌లియే… హమారే సబ్ బెహ్‌నాఁ భీ కర్ లియేఁ. ఔర్ ఏ రోక్‌నా ఔరత్‌కే హాతోఁ మేఁ నహీఁ హై బేటీ వేలోగ్ నహీఁ మాన్తే…” అనేది అమ్మీ నిర్లిప్తంగా…
”ఆడవాళ్ళకి ఖత్నా చేస్తే వచ్చే ఒక్క లాభం చెప్పు అమ్మీ నాతో ఎందుకిలా చేసావు… నా నించి ఏం గుంజుకున్నావు… నీకేం అధికారం ఉంది” అంది తను. ”ఖత్నా స్త్రీ గౌరవం పెంచడం కోసమే చేస్తారు బేటీ నేను, మా అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ, మా అక్క చెల్లెళ్ళు, అత్తగారూ అందరం చేస్కున్నాం. అయినా దీన్ని ఆపడం ఆడవాళ్ళ చేతుల్లో లేదు. వాళ్ళు ఒప్పుకోరు.”
”అరె… క్యాబోల్తీ హో ఆరెఫా… ఖత్నా చేస్కుంటే ఆడదాని మొఖంలో కొత్త నూర్ (మెరుపు) వస్తుంది… షొహర్ నీనించి పక్కకు వెళ్ళడు తెలుసా, ఇంకో ఔరత్ వైపు చూడడు” అంది నానీమా. ”అందుకేనా నీ కొడుకు నన్ను చూస్తే అసహ్యం పుడుతుందని, ఇంకోదాని దగ్గరికి పోతున్నాడు” అని అరిచింది తను కోపంగా. నానీమా గొణుక్కుంటూ వెళ్ళిపోయింది.
తన బిడ్డకు ఖత్నా జరగడం ఆపలేక పోయింది. ఆ సైతాన్లు మాటేసి కాటేసాయి.
పెళ్ళాయ్యాక యాస్మిన్ తరచూ ఫోన్లు చేసేది. ”అమ్మీ అతన్ని కలిసేటప్పుడు చాలా నొప్పి వస్తుంది” అని ఒకసారి ”నేను పడక మీద రాయిలాగా కదలకుండా పడి ఉంటానంటూ… నిన్ను చూస్తే కోరిక పుట్టదని అంటాడు అమ్మీ”, అని మరోసారి.
”అమ్మీ… ఆయన ఇంకో ఆడదానితో సంబంధంలో ఉన్నాడు” అని ఇంకోసారి ఎక్కెక్కి ఏడుస్తూ.
”అమ్మీ నాకు తలాఖ్ ఇస్తాను అంటున్నాడు క్యాఁకరూ” అని ఈ మధ్య మరీ తరచుగా ఫోన్ చేసి ఏడుస్తున్నది.
పోయిన్నెల… మనవరాలు మాసూమాకి ఖత్నా చేద్దామని వెంటబడుతున్నారంటే గుండె గుభేలుమంది. యాస్మిన్‌ని వెంఠనే బయలుదేరి రమ్మంది. వచ్చినప్పట్నించి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే ఉంది యాస్మిన్. ఏం చెయ్యాలి? ఎలాగైనా మాసూమాను కాపాడుకోవాలి.
అమ్మీ డైరీలో రాస్కున్న తన బాధాకర గ్నాపకాలు.. యాస్మిన్ చంపలు తడిసి పోయాయి. ఎంత ఘోరంగా చేసారు. అమ్మీకి… ఖత్నా… మొత్తం మూసేసి… మళ్ళీ కోసి, మళ్ళీ తెరిచి, మళ్ళీ మూసేసి… ఎలా.. ఎలా భరించావు అమ్మీ యాస్మీన్ ఆవేదనతో వెక్కి వెక్కి ఏడ్చింది.
అవును, తనకు ఖత్నా కాలేదంటే ఎంత అపవిత్రమైన స్త్రీగా చూసేవాళ్లు? వాళ్ళ ఇళ్ళల్లో పండగలకు పిల్చేవాళ్లు కాదు బంధువులు.
ఒకసారి తమ ఇంట్లో దావత్ అయితే వచ్చిన పర్వేజ్ తనను చూసి ఇష్టపడ్డాడు. తనకంటే పదేళ్ళు పెద్ద. పర్వేజ్ అమ్మీ మునీరా ఇంటి చుట్టూ తిరిగింది. చాలా సార్లు వచ్చి అబ్బాజాన్ నానీమాను అడిగింది. అమ్మీ వద్దంది పిల్ల చదువుకుంటుంది అని చెప్పింది నానీమాతో, అబ్బాజాన్‌తో కోట్లాడింది. కానీ అబ్బాజాన్ పెళ్ళికి ఒప్పుకున్నాడు. అయితే మునీరా నిఖాకి ముందే తనకు ఖత్నా చేయించాలని. లేకపోతే మాఁ ఖాన్‌దాన్‌లో ఒప్పుకోరు అంది. అమ్మీ ఒప్పుకోలే. కానీ అమ్మీకెవరూ విలువ ఇవ్వలేదు. అమ్మీ ఓడిపోయింది.
– – –
”ఖత్నా వాళ్ళే చేయించి నిఖా చేస్కున్నారు కాబట్టి అతని మీద మీరు కేసు వేయచ్చు…” లాయర్ నస్రీన్‌బాను అంది.
యాస్మిన్, అరెఫాల ముఖాలు వెలిగిపోయాయి. లాయర్ యాస్మిన్ చేతిలో ఒక కార్డు పెట్టింది.
”ఈమెతో మాట్లాడు ఆడవాళ్ళకు ఖత్నాలు ఆపడానికి పోరాటం చేస్తున్నది” అన్నది.
– – –
ఇంటికొచ్చిన యాస్మిన్, ఆరెఫాలకు నానీమా ఎవరితోనో మాట్లాడుతూ దాదీమాఁ కన్పించింది. ఆమెను చూడగానే యాస్మిన్ మొఖం ముడుచుకుపోయింది. ”యాస్మీన్‌కో జల్దీ భేజో… మాసూమాఁకో భీ సాత్ సాల్ ఆగయే బడీ హోగయీ, ఖత్నా కరవానా హైఁ” అంటోంది మునీరా దాదీమా తోటి.
యాస్మిన్, ఆరెఫా ఇద్దరికీ రక్తం మరిగిపోయింది. పరిగెత్తినట్లే మునీరా దగ్గరికి వెళ్ళి ”బేషరమ్ ఔరత్… ఖత్నా చేస్తేనే నిఖా అని నా బిడ్డకు నేను ఒద్దన్నా, నేను లేనప్పుడు ఖత్నా చేయించావు దోఖేబాద్. ఇప్పుడు నీ కొడుకుకు మోజు తీరిపోయాక తలాఖ్ ఇస్తానంటే నోర్ముస్కుంటున్నావు. ఇప్పుడు నా మనవరాలుని కాటెయ్యడానికి వచ్చావా ఫో ఇక్కడ్నించి” ఆరెఫా కోపంతో ఊగిపోతూ అరిచింది. మునీరా తెల్లబోయింది. ”దేఖో సమ్దన్‌జీ తలాఖ్ నక్కో బోల్ కోఁ మైఁ భీ బోల్‌రై పర్వేజ్ కో… మగర్ యాస్మిన్ భీ పర్వేజ్ దూస్‌రీ ఔరత్ కనే గయేతో, షాదీ కరేతో చుప్ బైట్‌నా.. మైఁ ఔర్ తుమ్ చుప్‌నై బైటే క్యా ఔరత్ హైఁ హమ్‌లోగ్ సబ్‌కుచ్ సబర్ కర్నా పడతా హైఁ” అంది కోపంతో ముటముటలాడుతూ (”నేను కూడా విడాకులొద్దన్నా పర్వేజ్‌ని కానీ నా కొడుకు వేరే ఆడదాని దగ్గరికి వెళ్ళినా, రెండో పెళ్ళి చేస్కుంటాన్నా నీ కూతురు ఊర్కోవాలి. నువ్వూ, నేనూ ఊర్కోలేదా? ఆడవాళ్ళం అన్నీ భరించాలి మరి)
”నీ కొడుకూ వద్దు… నీ కొడుకుతో సంసారమూ వద్దు. నేనే నీ కొడుకు మీదా, నీ మీదా కేస్ వేస్తున్నా లాయర్ దగ్గరికి వెళ్ళొచ్చా… నేనే నీ కొడుకుకి ‘ఖులా’ ఇస్తున్నా, చెప్పుకోఫో, ముసలిదానా ఫో ఇక్కడ్నించి” యాస్మీన్ కోపంతో, అరుస్తూ దర్వాజ వైపు వేలు చూపించింది ఇంట్లోంచి వెళ్ళమన్నట్లుగా.
మునీరా కోపంతో ఎర్రబడ్డ మొఖంతో ”మైఁ భీ దేఖ్‌లేతుం… జిందగీ బర్‌బాద్ కర్‌లేరేఁ మాఁబేటీ దోనో” అంటూ వెళ్ళిపోయింది.
(నేనూ చూస్తా… తల్లిబిడ్డలిద్దరూ కల్సి జీవితం నాశనం చేస్కుంటున్నారు).
– – –
‘నీ పేరేంటి ఎందుకేడుస్తున్నావు’… తన పక్కన కూర్చున్న ఒక ముప్ఫై సంవత్సరాల అమ్మాయిని చూస్తూ అడిగింది యాస్మిన్. ఆమె వచ్చినప్పట్నించీ ఏడుస్తూనే ఉంది. ఆమె భర్త కాబోలు కోపంగా అంటున్నాడు. ”ఏడవకు పరువు పోతుంది” అని. ”ఏమైంది బేటీ ఎందుకు ఏడుస్తున్నావు” నాకు చెప్పు నీ గుండెభారం తగ్గుతుంది అంది ఆరెఫా.
డాక్టర్ ఇంకా రాలేదు… పేషంట్లు ఎదురు చూస్తున్నారు. అది హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఖరీదైన మెటర్నిటీ హాస్పిటల్.
ఆమె భర్త ఇప్పుడే వస్తా అని, ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్ళాడు. ఆరెఫా మళ్ళీ బుజ్జగిస్తూ అడిగింది. ”నా పేరు సంస్కృతి” అంది. ఆమె భర్త వెళ్ళిన దిశగా భయంగా చూస్తూ. వచ్చీ రాని హిందీలో చెప్పసాగింది కన్నీళ్ళు తుడుచుకుంటూ.
ఇద్దరు పిల్లలు పుట్టాక యోని వదులైందని సతాయిస్తున్నాడు ఆమె భర్త… నీతో సంతృప్తిగా లేదు అంటూ ఈ మధ్య ఇంకో ఆడదాని దగ్గరకు పోతున్నాడట. డాక్టరు చెకప్ చేసి వదులు ఏమీ కాలేదు అని కొన్ని సలహాలు ఇచ్చిందట అయినా వినకుండా తన యోనికి కుట్లు వేసి టైట్ చేయించడానికి ఆపరేషన్ కోసం మాట్లాడ్డానికి ఇంకో సర్జన్ దగ్గరికి తీస్కోచ్చాడట. ఆ ముందు వెళ్ళిన డాక్టరమ్మ చేయనన్నదని మగ సర్జన్ దగ్గర్కి వచ్చాడట. ”నాకిష్టం లేదు… కానీ ఆయన వేరే ఆడదాని దగ్గర్కి వెళుతున్నాడు ఏం చెయ్యను?” సంస్కృతి మౌనంగా కన్నీరు కారుస్తూ అంది. ”నువ్వు ఒప్పుకోకు… నువ్వు పుట్టింటికెళ్ళిపోయి పంచాయితీ పెట్టాలి… ఎవరైనా లాయర్ దగ్గరికి వెళ్ళు ఇదిగో ఈ కార్డు తీసుకో” యాస్మిన్ సంస్కృతి చేతిలో లాయర్ నస్రీన్ బాను విసిటింగ్ కార్డు ఇచ్చి ధైర్యం చెప్పింది. ఆరెఫా దిగులుపడ్డ మనసుతో… సంస్కృతి కన్నీళ్ళు తుడుస్తూ ధైర్యం చెప్పింది. ”మీరెందుకు వచ్చారు. మీకేం సమస్య ఉంది?” సంస్కృతి అడుగుతుండగానే డాక్టర్ వచ్చింది.
యాస్మిన్… ఆరెఫా లోపలికి వెళ్ళారు..
అర్ధగంట తర్వాత బయటకు వచ్చారు. ఇద్దరి మొఖాల్లో సంతోషం, పెదాలపై చిరునవ్వు కనిపిస్తున్నాయి.
సంస్కృతి దగ్గరికి వచ్చారు. ”ధైర్యంగా ఉండు. సర్జన్‌కి ఈ ఆపరేషన్ ఇష్టం లేదని, బలవంతంగా చేస్తే డాక్టర్‌పైనా, నీ భర్తపైనా కేసు వేస్తానని చెప్పు” అంది యాస్మిన్.
సరే అంటూ ”నువ్వెందుకు వచ్చావు డాక్టరు దగ్గరికి” అంది సంస్కృతి. ”నేను వేసిన కుట్లు విప్పించుకోడానికి వచ్చాను రెండ్రోజుల్లో ఆపరేషన్ చేస్తానంది డాక్టర్నీ” అంది యాస్మిన్ నవ్వుతూ… యాస్మిన్, ఆరెఫా మొఖాలు సంతోషంతో వెలిగి పోతున్నాయి.
చిన్నారి మాసూమా… ”అమ్మీ ఐస్‌క్రీమ్ హోనా” అంది యాస్మిన్ చెయ్యి గట్టిగా పట్టుకుని.
*
మాటలు లేవు.. కన్నీళ్ళతో చెంపలు తడిసిపోయాయి ..
Thanque sudheer garu
ఎంత ఘోరమైన విషయం… గుండెల్ని మెలిపెట్టింది.మతం..ఆచారం పేరు మీద ఆడవాళ్ల మీద జరిగే లైంగిక హింస హేయమైనది.దీన్ని రూపుమాపాలి.ఇంత కల్లోల కథని పరిచయం చేసినందుకు డా.గీతాంజలి గారికి మప్పిదాలు.
Thanque srinivas garu
ఎంత కష్టమైంది ఆడవాళ్ళ జీవితం? ఎంత హింస? ఇంతకంటే మాటలు లేవు. ముగింపు బాధ నుంచి రిలీఫ్ ఇచ్చింది
Thanque rama sundari garu
ఆఫ్రికన్ కల్చర్లో జెనిటల్ మ్యుటిలేషన్ గూర్చి తెలుసు; అది చిన్నపిల్లలు ఎనిమిదేళ్ల వయసులో ఒకసారి మాత్రమే గురయ్యే ఆచారం. ఇక్కడ వర్ణించిన పరిస్థితి దారుణం. ఆడదానికి ఆడదే శత్రువు అన్నది నానుడి. ఇక్కడ తరతరాలుగా జరుగుతున్నదీ అదే. ఎడ్యుకేషన్ ఒక్కటే మార్గమేమో! గీతాంజలి గారి నిర్మొహమాట కథనానికి అభినందనలు.
Thanque Siva kumar garu
Entandi ee saampradaayalu..manushulni brthakaneeyara? Vallu Kuda manushulu Kada..badha ,noppi andariki okate Kada..antha darunamga inko manishiki ala ela chestaru..Katha chaduvuthunnanthasepu vallandarini champeyalannantha lopam vachindi..konni sandharbhallo manishi kanna janthuvulu nayam anipistundi.idi alanti Oka sandharbham..ilanti Oka anagarika sampradayanni ethi chupalanukunna meeku abhinandanalu..
గీతాంజలి గారు, చదువుతుంటేనే ఆవేశం, ఆగ్రహం, దుఃఖం వస్తున్నాయే అది భరిస్తున్న స్త్రీలకి ఎలా వుంటుందో వూహకి కూడా తట్టటం లేదు. మీరు ఏదైనా స్త్రీ సంక్షేమ శాఖలో పనిచేస్తున్నారా? ఈ కథలన్నీ నిజంగా అనుభవించినవేనా? మీరు వ్రాస్తున్న శైలి కూడా చాలా బాగుంది. ఆపకుండా చదివిస్తోంది.
ఆచారాలమాటున దాగిన భయంకరమైన లైంగిక హింస ఎన్ని రూపాల్లో.. చదువుతుంటేనే దుఃఖం పొంగుకొస్తున్నది. ఆ బాధిత మహిళల పరిస్థితి?
ముస్లిం మహిళలపై జరుగుతున్న ఈ లైంగిక హింస నుండి కాపాడుకోవడానికి ఉన్న చట్టాలు అమలు ఎంత వరకూ .. ముగింపు బాగుంది.
థాంక్స్ శాంతి
Very disturbing and touching.
Thanks శుభ్రమణ్యం గారు
The story is very disturbing. You have portrayed the pain, insult, anger and claim freedom from such assault as genital mutilation. I thought this practice was long long ago. If it still persists i hang my head in shame.