క.. కా….

“తినడానికి లేని దేశంలో ఇంత వృథాని అతడు తట్టుకోలేకపోయాడు.దేశం అతనికిప్పుడు రెండు భాగాలుగా విడిపోయినట్టనిపించింది”.

లిక్కిపడి లేవడంతోనే శ్రీనివాసు ప్రతి ఉదయం మొదలవుతుంది.అలవాటులో పొరబాటుగా ఆఫీసు లేకపోయినా ఆదివారం కూడా కంగారుపడతాడు.రోజూ పెరట్లో నీళ్ళతొట్టె దగ్గరకు ఇంట్లోకి ఉరుకుతున్నప్పుడు ఐదో తరగతి చదువుతున్న కూతురు ఎక్కాల పుస్తకం చదువుతుంటే అంకెల్ని వింటుంటాడు.తన జీవితమంతా తీసివేతలేగా అందుకేనేమో ఆ ఆసక్తి.వైట్ ఆన్ వైట్ డ్రెస్ వేసుకుని దేవుడికి దణ్ణం పెట్టుకుంటాడు.పాత మోపెడ్ ను పదిసార్లు కిక్ కొట్టాక స్టార్టవుతుంది.కలెక్టరేట్ దాటుతుండగా కొందరు ఎర్రజెండాలు పట్టుకుని టెంటులేసుకుని ధర్నా చేస్తుంటారు.ఏదో ఒక విషయం మీద వాళ్ళలా నిరంతరం పోరాడుతూనే ఉంటారు.రోజూ వాళ్ళనలా చూసుకుంటూ ఆఫీసుకు సాగిపోతాడు.
ఆఫీసు ఏడున్నరకు మొదలవుతుంది.శ్రీనివాసు ఏడుగంటలకు ఆఫీసులో ఉంటాడు.ఏడు గంటలకు ఆఫీసులో ఉండడానికి ఆరున్నరకు పాలకేంద్రం దగ్గరుంటాడు.తీసుకొచ్చిన పాలతో టీ పెట్టాక ఆఫీసును అద్దంలా శుభ్రంగా తుడుస్తాడు.
సరిగ్గా ఏడున్నరకు మేనేజరు కారు రాగానే వినమ్రంగా డోరు తెరిచి పట్టుకుని దిగాక ఆయన చేతిలో ఏముంటే వాటిని ఆఫీసులోకి తీసుకెళతాడు.నెమ్మదినెమ్మదిగా ఆఫీసులోకి స్టాఫ్ అంతా చేరాక మేనేజరుకు స్పెషల్ టీ,మిగిలిన స్టాఫ్ కు మామూలు టీ ఇస్తాడు.కాస్త స్పెషల్ టీ శ్రీనివాసు తాగుతాడు.ఆ తరువాత ఖాళీ కప్పుల్ని ఏరుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి అలమారాలో సర్దాక కాస్త ఊపిరి పీల్చుకుని పరుగుపందెం ఆటలో పాల్గొనడానికి సిద్ధపడతాడు.
ఆ టేబుల్ పై ఫైలు ఈ టేబుల్ పైకి,ఈ టేబుల్ పై ఫైలు పక్కగదిలో టేబుల్ పైకి మారుస్తుంటాడు.కాగితాల ప్రపంచంలో అతనూ ఓ కాగితమయిపోతాడు.ఫైలు టేబుల్ పై పెట్టేటప్పుడు ఆఫీసర్ల కళ్ళలో కళ్ళు పెట్టి చూడకుండా శబ్దం రాకుండా పెట్టాలి.వాళ్ళు ఏదైనా చెప్పేటప్పుడు చేతులు కట్టుకుని ఊ కొట్టాలి.వాళ్ళు విసుక్కున్నా సహనంతో ఉండాలి.కోప్పడినా నవ్వుతూ ఉండాలి.వాళ్ళ అభిప్రాయాలకు ఎప్పుడూ అడ్డుచెప్పకూడదు.ఆఫీసర్ల ఆలోచనలకు మరింత మెరుగులు దిద్ది పనిచేయకుండా,అస్పష్టంగా ఉన్నా వాళ్ళెలా చెబితే అలా చెయ్యాలి.
అప్పుడప్పుడూ ఆఫీసర్లు రాజకీయాల మీద,సినిమాల మీద చర్చలు మొదలుపెడతారు.వాళ్ళకన్నా ఎక్కువ అవగాహన ఉన్నా శ్రీనివాసు వాస్తవికతను తెలుపడు.తెలిసినా తెలియనట్లే వారి మాటల్లోంచి  జ్ఞానాన్ని స్వీకరిస్తున్నట్టు తన కళ్ళను ఆశ్చర్యంలో ముంచెత్తుతాడు.అలా స్వీకరించక జ్ఞానప్రదర్శన చేస్తే తనేమౌతాడో తనకు తెలుసు.వారంలో ఒకరోజు సివిల్ డ్రెస్ వేసుకొచ్చేటప్పుడు ఆఫీసర్లను డామినేట్ చేయకుండా ఏ మాత్రం ప్రత్యేకతలేని సాధారణ దుస్తుల్లో వచ్చేవాడు.ఇవన్నీ శ్రీనివాసుకు ఎవరూ చెప్పరు.అతను అర్ధం చేసుకుంటాడంతే!
రోజంతా నిలబడే ఉండాలి.ఎవరేమనుకుంటారో అని ప్రతి నిముషం తుఫాను వాతావరణంలో ఉండాలి.అందుకే కిచెన్ రూములో టీ మీద టీ తాగి చివరకు అల్సర్ తెచ్చుకున్నాడు.మాత్రలు మింగుతూనే ఉంటాడు.
తను తప్ప ఆఫీసర్లందరిదీ ఒకటే కులం.ఫ్యాక్టరీ ఓనరుది అదే కులం కావడంతో ఆఫీసు స్టాఫ్ ని వాళ్ళ కులమోళ్ళని పెట్టుకున్నారు.కార్మికులు,దినసరి కూలీలు,సెక్యూరిటీ గార్డులని మాత్రం నిమ్నకులాల నుండి తీసుకున్నారు.
ప్రతిరోజూ కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి చేరేసరికి రాత్రి ఏడవుతుంది.రోజుకు పన్నెండు గంటలు కష్టపడినా ఎనిమిది గంటలకే జీతం ఇవ్వజూస్తారు.ఓవర్ టైమ్ డ్యూటీ పెద్ద కష్టమేమీ కానట్టు అది పరిశ్రమ పురోగతికి తమ బాధ్యత అన్నట్టు ఉండాలంటారు.అడగ్గాఅడగ్గా కానుక ఇస్తున్నట్టు నెలకు కొన్నిగంటలు మాత్రం ఓవర్ టైమ్ డ్యూటీ పేరిట రాస్తారు.
శ్రీనివాసు సెలవులు పెట్టడం బహు అరుదు.పెట్టకపెట్టక ఎప్పుడయినా సెలవు పెడితే తను సెలవు వల్ల జరిగే నష్టాలను ఏకరువు పెడతారు.ఈ క్లాసులు భరించలేక శ్రీనివాసు సెలవులు రద్దు చేసుకున్న రోజులు బోలెడు.
సాయంత్రం ఇంటికి చేరిన శ్రీనివాసు మంచం మీద కూలబడి రోజంతా నిలబడడం వల్ల వచ్చే నొప్పులకు కాళ్ళకు కొబ్బరినూనె రాసుకుంటాడు.ఆఫీసులోలానే ఇంట్లోకూడా భార్య చెప్పే అన్ని విషయాలను భేదాభిప్రాయం లేకుండా ఏకీభవిస్తాడు.భార్య తన మాట నెగ్గిందని ఆనందంగా వంటింట్లోకి వెళ్ళిపోతుంది.ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది.తనకు కావలసిందీ ఈ స్థితే.ఆదివారమంతా బయటకు వెళ్ళకుండా తన బిడ్డతోనే ఆడుకుంటాడు.తనపై ఆధిపత్యం చెలాయించకుండా నాన్న చేసే పనుల్ని ఆరాధనా భావంతో గొప్పగా చూసే పాపను చూసినప్పుడు ‘మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందో ఆ ఆదివారం’ కోసమే అతను ఎదురుచూసేవాడు.శనివారం రాత్రి ప్రశాంతంగా నిద్రపోయిన శ్రీనివాసు ఆదివారం రాత్రి మాత్రం సోమవారం ఉదయం తలపుతో కలత నిద్ర పోతాడు.
          ***
ఆ రాత్రి ఫ్యాక్టరీ కాంట్రాక్టర్ కొడుకు పెళ్ళి కావడంతో ఊరిచివర ఫంక్షన్ హాల్ కు శ్రీనివాసు చేరుకున్నాడు.అక్కడ విద్యుద్దీపాలంకరణను,పార్కింగ్ లో కార్లను చూడగానే అతనికి భయం పట్టుకుంది.పార్కింగ్ లో తన మోపెడ్ ను పార్క్ చేసి హ్యాండిల్ లాక్ సరిచూసుకుని బెదురుగా లోనికి అడుగుపెట్టాడు.దారికటూ ఇటూ నిలబడి అమ్మాయిలు వచ్చే అతిథులపై అత్తర్లు చల్లుతున్నారు.ఫంక్షన్ హాలంతా సెంట్రల్ ఏ.సి.గ్లాసుడోరు తీసుకుని లోపలికి వెళ్ళగానే శ్రీనివాసు ఒళ్ళు చలికి జల్లుమంది.పెళ్ళివేదిక వెనుక భాగంల్ సినిమాల్లో వేసినట్టు దేవాలయం సెట్టింగ్ వేసారు.పెళ్ళివేదిక చుట్టూ బెంగుళూరు నుండి తెప్పించిన పూలతో డెకరేషన్ చేసారు.పెళ్ళికొచ్చిన ఆడాళ్ళంతా ఏదో డ్రెస్ కోడ్ అయినట్టు ఖరీదైన పట్టుచీరలు,నగలు ధరించారు.పెళ్ళికొడుకు,పెళ్ళికూతుర్ల ఒంటి మీదున్న బంగారానికైతే శ్రీనివాసుకి కళ్ళు తిరిగాయి.కాంట్రాక్టరు మెళ్ళో పురికొస లావున్న బంగారపు చైనును చొక్కాపై రెండు గుండీలు తీసి కనబడేలా ప్రదర్శిస్తున్నాడు.కొడుకు కట్నం పేరుతో డబ్బు గట్టిగా గుంజాడని వినికిడి.
ఫ్యాక్టరీకి బాయిలర్ లో వేసే ఊక దగ్గర్నుండి,దినసరి కూలీలను సప్లై చేసే వరకు అన్ని పనులు కాంట్రాక్టర్ చేతిలో ఉంటాయి.పనిచేసిన కూలీలకు సక్రమంగా డబ్బులివ్వక వాళ్ళ శ్రమదోపిడీని మేనేజరుతో కలిసి పంచుకుంటాడు.
ఆకలి పుట్టి భోజనాలెక్కడోనని శ్రీనివాసు వెతికాడు.పక్క హాల్లో భోజనాలు జరుగుతున్నాయి.హాలంతా అన్నార్తులతో కిటకిటలాడుతోంది.ఆఫీసులో పర్మిషన్ లేకుండా తమ దగ్గరకు కూడా రానివ్వని ఆఫీసర్లందరూ భోజనాల బంతిలో తినేవాళ్ళ కుర్చీలు పట్టుకుని నిల్చున్నారు.బొజ్జలతో ఆకలికి తట్టుకోలేక వాళ్ళలా కాపుకాయడం శ్రీనివాసుకు నవ్వు తెప్పించింది.
సమాజంలో పెద్దలనేవాళ్ళు హాల్లో ప్రవర్తిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉంది.ఒక్కో ఆకులో అన్నం పెట్టే నాటికే రకరకాల ఐటెమ్స్ తో నిండిపోతుంది.బంతి పూర్తయ్యాక ప్రతి ఆకులో బోలెడన్ని ఆహార పదార్ధాలు మిగిల్చేస్తున్నారు.శ్రీనివాసుకు బాధ కలిగింది.
“తినడానికి లేని దేశంలో ఇంత వృథాని అతడు తట్టుకోలేకపోయాడు.దేశం అతనికిప్పుడు రెండు భాగాలుగా విడిపోయినట్టనిపించింది”.
అద్దాల్లోంచి హాలు బయట వంటవాళ్ళు కనబడుతున్నారు.శ్రీనివాసు బయటకొచ్చాడు.జనం తాకిడి ఎక్కువగా ఉండి వాళ్ళు మళ్ళీ వండుతున్నారు.మళ్ళీ వండినా కాంట్రాక్టరు మొదట చేసుకున్న ఒప్పందం మేరకే డబ్బులిస్తాడు కానీ ఎక్స్ స్టా పైసా కూడా ఇవ్వడు. పైగా వాళ్ళింకా అన్నం తినలేదు.వెనుక వరుస జీవుల్లో తనలాంటి వాళ్ళే వీళ్ళు అని బాధపడ్డాడు.
అద్దాల్లోంచి లోపలికి చూస్తే కాంట్రాక్టరు ఎవరో తనకు తెలిసిన పెద్దోళ్ళ కోసం భోజనాల దగ్గర కుర్చీలు ఆపుతున్నాడు.తను ఆఫీసులో ఉండగా తమ ఆఫీసర్లందరూ మేనేజర్ రూమ్ లో మీటింగ్ పెట్టుకుని “క్రోనీ కాపిటలిజం” గురించి మాట్లాడుకుంటుండగా చాలాసార్లు విన్నాడు.నిజానికి ఈ ఫ్యాక్టరీ ప్రభుత్వానిది.వాళ్ళ కులస్తులు అధికారంలో ఉన్నప్పుడు ఫ్యాక్టరీని అదే కులమైన వీరికి ప్రైవేటుపరం చేసేసారు..ఆశ్రితులకు అప్పనంగా ఆస్తుల్ని కట్టబెట్టే క్రోనీ కాపిటలిజం “తమ అనుకున్న వాళ్ళకు ప్రయోజనాల్ని సీటు మీద కర్చీఫ్ వేసి రిజర్వ్ చేయడమే”.దాని రూపాంతరమే కావాల్సినవాళ్ళ కోసం సీట్లు ఆపడం.
శ్రీనివాసుకు కోపం పెరిగిపోయింది.కాపిటలిజం ఒక ఆటవిక వ్యవస్ధ.అసమంజసమైన సంపద పంపిణీ
,అధికారం.సంపదనంతటినీ కొందరికే కట్టబెట్టే గుత్తాధిపత్యం పట్ల శ్రీనివాసు విసిగిపోయాడు.పెట్టుబడిదారీ విధానాన్ని కూలదోయడానికి సోషలిజానికి దారిచూపడానికి పోరాడే వాళ్ళతో కలవాలనే కోరిక పెరిగిపోయింది.
ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని పరిశీలిస్తుండగా తనకు ఆరురూపాయల వడ్డీకిచ్చే తమ ఆఫీసరు నాగేశ్వరరావు కనిపించాడు.సఫారీ డ్రస్సులో,మూడు సెంటీమీటర్ల మందం మేర బంగారపు బ్రాస్ లైట్ పెట్టుకుని హాల్లోకి వెళుతున్నాడు.శ్రీనివాసు నమస్కరిస్తే పెద్దగా పరిచయంలేని వాడిని చూస్తునట్టు తలూపి లోపలికి వెళ్ళిపోయాడు.
నాగేశ్వరరావు ఫ్యాక్టరీలోని కూలీలకు,కార్మికులకు,సెక్యూరిటీగార్డులకు ఆరు రూపాయల వడ్డీకి డబ్బులిస్తుంటాడు.జీతాలొచ్చాక నెలనెలా వడ్డీ ఠంచనుగా వసూలు చేస్తుంటాడు.ఇలా పోగేసిన డబ్బు రియల్ ఎస్టేట్ లో పెడుతుంటాడు.వడ్డీ రూపాయి తగ్గినా ఒప్పుకోడు.అప్పుకోసం వెళ్ళిన వాళ్ళని ఇంటిపనులు గట్రా చేయించుకుని రెండు మూడుసార్లయినా తిప్పించుకుంటాడు.వాళ్ళ అవసరం తీవ్రతను తెలుసుకున్నాక వడ్డీరేటును ఇంకా పెంచే ప్రయత్నం చేస్తాడు.వడ్డీ అసలును మించిపోయి చాలామంది లోలోపల ఏడుస్తుంటారు.శ్రమఫలాలు అందరికీ సక్రమంగా పంచితే ఇలాంటి పరిస్ధితి వచ్చేదికాదు కదా అనుకున్నాడు శ్రీనివాసు.ఇలాంటి దోపిడీపూరిత,అహేతుకమైన వ్యవస్ధను సరిచేయడానికే కదా కలెక్టరు ఆఫీసు ముందు ఎర్రజెండాలు పోరాడేది?కవులు,రచయితలు సాహిత్యాన్ని సృష్టించేది.వాళ్ళతో కలిసి ముందుకు నడవాలి అనుకున్నాడు.ఇక అక్కడ ఒక్క క్షణం ఉండాలనిపించలేదు.వెళ్ళిపోదామనుకున్నాడు కానీ కడుపు కాలుతుంది.తను భోజనానికి వెళుతున్నానని భార్య అన్నంవండలేదని గుర్తొచ్చింది.
భోజనాల హాల్లో గుంపు తగ్గుముఖం పట్టింది.గ్లాసుడోరు తీసుకుని లోపలికెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు.
              ***
ఆకులోని అన్నిరకాల వెరైటీలను చేత్తో తడిమి పక్కన తింటున్న వాళ్ళనొకసారి చూసి శ్రీనివాసు తినడం మొదలుపెట్టాడు.కూలింగ్ వాటర్ తో ఆహారం గొంతు దిగుతుంటే ఆ ఏ.సి హాల్లో తలంతా హాయిగా ఉంది.పైకి చూస్తే సీలింగ్ కు లైట్లు చందమామల్లా వేలాడుతున్నాయి.ఒక్కోముద్దకు ఒక్కో ఆలోచన మొలుస్తుంది.
కష్టపడేది సుఖపడడానికే కదా!జీవితాంతం కష్టపడాలి అని ఎవరనుకుంటారు?సుఖమే జీవితం.డబ్బు నుండే ఆ సుఖం వస్తుంది.ఇక్కడున్న ఇంతమందిని మీరెలా డబ్బు సంపాదించారు అని ఎవరైనా అడిగారా?ఎలా గడించినా లోకం సలాం కొడుతుంది.ఎలాగైనా సంపాదించి సుఖపడమని ప్రోత్సహిస్తుంది.
ఆ ప్రోత్సాహం కాపిటలిజం ఎందుకు కాకూడదు!కాపిటలిజాన్ని సానుకూల ధృక్పథంలో ఎందుకు పరికించకుడదు?ఇప్పుడు శ్రీనివాస్ మెదడులో కాపిటలిజం-సోషలిజం పరస్పర వ్యతిరేక ధృవాలు కావు.
అందులో మొదటిది ఉత్పత్తి.రెండోది మార్కెట్ (పంపిణీ)గా కనబడుతుంది.ఉత్పత్తిలేని మార్కెట్ ,మార్కెట్  లేని ఉత్పత్తి అసాధ్యం.
కనుక సూత్రరీత్యా ఉత్పత్తికి పెట్టుబడి తప్పనిసరి.కనుక కాపిటలిజాన్ని కాదనలేం అనుకున్నాడు.
సోవియట్ రష్యా పతనాన్ని సోషలిజం ఎందుకు ఆపలేకపోయింది!కమ్యూనిస్టు దేశమనే చైనా పెట్టుబడిదారి విధానంతోనే ప్రస్తుతం అభివద్ధిని పొందింది.
ఇక అమెరికా నేటికీ అప్పులిచ్చే రూపంలోనైనా అనేక ప్రపంచదేశాలకు అవసరమవుతూనే ఉంది.అప్పువల్ల విధించే ఆంక్షల ద్వారా పాలనా జోక్యాలు,అప్పు తీర్చలేని పేద దేశాల మీద పెత్తనాలు చెలాయిస్తుంది.అమెరికా అనగానే అప్పులిచ్చే ఆఫీసరు నాగేశ్వరరావు గుర్తొచ్చాడు.ప్రపంచాన్ని తమ చుట్టూ తిప్పుకోవడంలో నాగేశ్వరరావైనా,అమెరికా అయినా మానసిక సంతృప్తి పొందుతారు.సాధారణంగా దేనినైనా ఇవ్వగలిగిన వారికి తీసుకునే అవసరం కలిగినవారు నైతిక లొంగుబాటును కలిగి ఉండవలసిందే!
శ్రీనివాసుకు కూడా బాగా సంపాదించి అప్పులివ్వాలనిపిస్తుంది.పదిమంది మీదా పెత్తనం చెలాయించాలనే ఊహొకటి బుర్రను తొలచడం మొదలెట్టింది.
బంతి జరుగుతుండగా మధ్యలో శ్రీనివాసు పక్కోళ్ళ విస్తరిని చూసాడు.కొన్నికొన్ని పదార్ధాలు వాళ్ళు సగమే తిని వదిలేస్తున్నారు.బంతి పూర్తయ్యాక అతను కూడా కొన్ని ఆహారపదార్ధాలు అలానే ఆకులో వదిలేసి లేచి చెయ్యి కడుక్కోవడానికి వెళ్ళిపోయాడు.ఆకులోవన్నీ పూర్తిగా తింటే ఎవరేమనుకుంటారోనని అసంపూర్తిగా వదిలేసాడు.అలా వదిలేయడం శ్రీనివాసుకు స్టేటస్ సింబల్ అనిపించింది.
అల్సర్ టాబ్లెట్ నోట్లో వేసుకుని నీళ్ళు తాగి గాజు గ్లాసు డోరు తీసుకుని బయటికి నడిచాడు.నడుస్తూ అద్దాల్లోంచి వేదికపై కనబడుతున్న పెళ్ళికూతురిని ఆగి మరొకసారి పరిశీలనగా చూసాడు.నిలువెల్లా బంగారంతో మెరిసిపోతుంది.పోతపోసిన బంగారపు బొమ్మలా ఉంది.తన కూతురిని ఆ నగల్లో చూసుకున్నాడు.కూతురి పెళ్ళీడు కల్లా తను కూడా ఎలాగైనా ఇంత బంగారం కొనాలి అనుకున్నాడు.
శ్రీనివాసు పక్కనుండి వెళుతున్న ఇద్దరు “పెళ్ళంటే చేస్తే గీస్తే నోళ్ళెళ్ళబెట్టేలా ఇలా చేయాలండి”అని వాళ్ళలో వాళ్ళు అనుకోవడం విన్నాడు.
తన గురించి కూడా జనం ఇలా గొప్పగా చెప్పుకునే రోజు రావాలనుకున్నాడు.ఇంత ఘనంగా పెళ్ళి చేయడానికి అడ్డంగానైనా సంపాదించాలనుకుని మనసులో నిర్ణయించుకున్నాడు.
          ***
వంటోళ్ళతో కాంట్రాక్టరు బేరమాడుతున్నాడు.ముందు ఒప్పుకున్న వరకే డబ్బులిస్తామంటున్నాడు.వాళ్ళేమో మీరు చెప్పిన వాళ్ళకంటే ఎక్కువమంది జనం వచ్చారు.వాళ్ళకు కూడా మళ్ళీ వంట చేసాం కాబట్టి కొంచెం డబ్బు ఎక్కువ ఇమ్మంటున్నారు.
కాంట్రాక్టరు ఇలాంటి బేరసారాల్లో నోరు తిరిగిన మనిషి.పొద్దున్న లేచింది మొదలు ఎంత కూడబెట్టాం.ఎంత తక్కువకు పని చేయించాం అన్న లెక్కల మీద బతికే మనిషి.రూపాయి తన చేతినుండి జారిపోతే ఆ రాత్రికి తిండి తినడు,నిద్రపోడు.
వంటోళ్ళందరూ కాంట్రాక్టరును మూకుమ్మడిగా బతిమలాడుతున్నారు.రోజూ ఫ్యాక్టరీలో ఇలాంటివెన్నో చూసే శ్రీనివాసుకు అతడు రూపాయి విదల్చడని తెలుసు.
బతిమలాడుతున్న వంటవాళ్ళలో ఒకరిద్దరు కాస్త కోపగించుకున్నారు.ఇదే అదనుకోసం చూసే కాంట్రాక్టరుకు పట్టు చిక్కింది.తనపైన కోపం చూపినందుకు తను కూడా కోపం నటిస్తూ నాలుగు కేకలేసి వాళ్ళకిక పైసా కూడా ఎక్కువ ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసాడు.
వంటవాళ్ళెంత చెప్పినా ససేమిరా అనడంతో ఆ డబ్బులు తీసుకుని కాంట్రాక్టరు మీద కోపంతో వాళ్ళు భోజనం చెయ్యకుండా వెళ్ళిపోయారు.శ్రమదోపిడీకి గురయ్యి ఆకలితో వెళ్ళిపోతున్న వాళ్ళ ఆత్మాభిమానం ఎవరికైనా జాలి తెప్పించడమే కాదు,స్పూర్తిని నింపుతుంది.ఇదంతా చూస్తున్న శ్రీనివాసుకు కాంట్రాక్టరుపై విపరీతమైన కోపం వచ్చింది.అతన్ని వంగదీసి వీపు మీద పిడిగుద్దులు గుద్దాలనుకున్నాడు.ఇలాంటివి చూసినప్పుడే ఆయుధం పట్టాలన్నంత ఆగ్రహం అతనికి వస్తుంటుంది.
కానీ అంతలోనే రేపు మొహమొహాలు చూసుకోవాల్సిన వాళ్ళం… గొడవలెందుకులే అని సర్దుకున్నాడు.పార్కింగ్ ప్లేసుకు నడిచాడు.
        ***
భుక్తాయాసంతో మగత ఎక్కువగా ఉండడంతో శ్రీనివాసు లేటుగా నిద్ర లేచాడు.ఆఫీసు టైం దగ్గరపడడంతో తనను తానే తిట్టుకుంటూ గాలితీసి వదిలిన బెలూన్ లా అటూఇటూ పరిగెత్తాడు.
పెరట్లో తొట్టె దగ్గరనుండి లోపలికొస్తుంటే కూతురు క “గుణింతం” చదువుతుంటే కాస్త సందిగ్ధంతో కూడిన చెవితో వినడం గమనించాడు.క,కా తప్ప మరేమీ చెవికెక్కడం లేదు. గదిలో బట్టలేసుకుంటూ శ్రీనివాస్ ఆలోచించాడు.అద్దంలో చూసుకుంటే తన ముఖం బహుముఖాలుగా విస్తరించి కనబడుతుంది.
మగ్గిపోయిన వెలగ పండు చెట్టుకు కొంచెం బలంతో అంటిపెట్టుకుంటుంది.అది ఏ ఏనుగుకో ఆహారమవుతుంది.లేదా కొద్ది గాలికే అది రాలిపడుతుంది.
అలా రాలిపడే పేద,మధ్య తరగతి జీవితాల కమ్యూనిజం-కాపిటలిజాల మధ్య ఊగిసలాట “క” గుణింతం అని అర్ధం చేసుకుని ఇంటి బయటకు నడిచాడు.కాలం కూడా మానవ సమాజానికి డోలాయమాన పరిస్ధితుల్ని సృష్టించడానికే నడుస్తూంది.
మోపెడ్ ను రెండుమూడు సార్లు కిక్ కొట్టినా స్టార్ట్  అవ్వడం లేదు.మళ్ళీ నిరంతరాయంగా కిక్ కొట్టడంతో కిక్ రాడ్ కాలిమడమకి తగిలింది.బాధను అణచుకుంటూనే మళ్ళీ కిక్ కొట్టి మోపెడ్ స్టార్ట్ చేసి ఆఫీసుకు బయలుదేరాడు.దార్లో కలెక్టరేట్ దగ్గర ఎర్రజెండాలు ఏదో విషయం మీద రిలే నిరాహార దీక్ష చేస్తుండడం చూసాడు.
లేటయితే తిట్లుతినాల్సి వస్తుందని ఆఫీసు వైపుకు యాక్సిలరేటర్ వేగం పెంచాడు.
*

చిత్రం: రాజశేఖర్ చంద్రం

జుజ్జూరి వేణుగోపాల్

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రాజశేఖరం గారి నఖ చిత్రం, ఈ కథ రెండూ ఆలోచింపజేస్తాయి.

  • ఎంతో అద్భుతమైన కథనం అన్నా…శ్రీనివాసు ఆఫీసులో ఉండే విధానం చాలా సహజంగ ,అద్భుతంగ చెప్పారు.కమ్యూనిజం,కాపిటలిజం లను బాగ అర్థం చేయించిన కథ….ఎర్రజెండాల ఆవశ్యకతను చెప్పిన కథ

  • కథలో శ్రీనివాసరావు పాత్ర, నాగేశ్వరరావు పాత్ర, పెళ్లి భోజనాల నేపథ్యం, వంటవాళ్ల శ్రమదోపిడీ ఇవన్నీ క.కా. డోలాయమానాన్ని భలేగా చిత్రించావు. సింబాలిగ్గా కొన్నిచేష్టల్ని కథాసారానికి అన్వయించడం గొప్పగా చెప్పగా మనసు పులకరించింది.అభినందనలు వేణూ తమ్ముడూ!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు