ఆర్ట్ సినిమాల గురించి మాత్రమే రివ్యూలు రాయాలనీ కమర్షియల్ సినిమాల గురించి రాయకూడదనీ ఎక్కడా లేదుగా?
ఇప్పుడు రాయబోతున్న సినిమాని, పూర్తిగా కమర్షియల్ సినిమా అనలేం. ఇందులో కూడా హీరో హీరోయిన్లున్నారు. కాకపోతే ఒక హీరో కాదు. ఇద్దరు. ఆ హీరోల మీదికి, గుంపుగా కనిపించినా ఒక్కొక్కరుగా మాత్రమే దూసుకొచ్చి గాల్లో గింగిరాలు తిరిగిపోతూ ధర్మయుద్ధం చేసే పదులమంది రౌడీలూ ఉన్నారు. మోహమాటానికైనా కనపడకపోతేనూ చూపకపోతేనూ చాలా బాగోదన్నట్టు ఒక ఐటెమ్ సాంగ్ కూడా ఉంది. మధ్యలోంచి మొదలైనట్టు కనిపిస్తూ ఊడలొచ్చేసి మరీ కనిపించే పాత్రలెన్నో ఉన్నాయి. వాటికి మనమే విత్తనాలు వేసుకుని చూసుకోవాలి. కథకి కొన్ని సినిమాటిక్ లక్షణాలున్నాయి. వాస్తవంలో వారం పది రోజుల్లో కానీ కుదరని పనులని రెండు మూడు నిమిషాల్లోనే జరిగిపోయినట్టు చూపించిన ‘క్రియేటివ్ లైసెన్స్’ అలవాట్లు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ అక్కడక్కడే. మొత్తం మీద “జీబ్రా” చూడాల్సిందే!
ముందుగా కథ. ఇది ‘క్లాస్’ ప్రేక్షకుల కోసం రాసిన కథ. కానీ మాస్ కోసం అన్నట్టు ఐటెమ్ సాంగ్ తోబాటు ఫైట్లు కూడా పెట్టినా అవి ఎక్కడా శృతి మించినట్లు అనిపించదు. పైగా మాస్ మసాలా తెలుగు సినిమాలు చూసే చాలామందికి పదుల కొద్దీ రౌడీలని హీరో ఒక్కడే చేగొడ్డలితో నరికిపారేస్తుంటే ఆనందించడం ఎటూ బటర్ తో పెట్టిన డిగ్రీనే. ‘మన సినిమాల్లో – ఆ మాటకొస్తే రోజువారీ చదివే వినే చూసే యూట్యూబాది కళారూపాల్లో కూడా తెలుగు తగ్గిపోతోందోః’ అని ఘోషించే చాలామందికి ఈ సినిమాకోసం రాసిన సంభాషణల్లో తెలుగు తక్కువే కనిపించొచ్చు.
ఇక పాత్రలు, నటన విషయానికొద్దాం. ‘లక్కీ భాస్కర్’ సినిమాలో నలభై ఏళ్లనాటి బ్యాంక్ వ్యవస్థ/వ్యవహారాల్లోని లొసుగులని వాడుకోవడానికి, అసాధారణమైన తెలివితేటలతో మోసకారితనాన్ని రంగరించగల ‘బ్రెయినీ ఫెలో’ గా దుల్కర్ సల్మాన్, తన రొమాంటిక్ హీరో పోకడలు వదుల్చుకోలేకపోయి అంతగా రాణించలేదని అనిపించింది. ఇందులో కథకి కూడా పృష్ట భూమి బ్యాంకింగ్ వ్యవస్థే. హీరో సత్యదేవ్ (సూర్య) బ్యాంక్ ఉద్యోగే. కానీ ఇతనికి ఎదురైన సమస్యలు వేరు. ఆ సమస్యలని సృష్టించే ధనంజయ్ (ఆది) మరో హీరో. సూర్య కథానాయకుడు కాగా, ఆది ప్రతినాయకుడే కానీ, పాజిటివ్ విలన్. పుష్పలో ఒక విలన్ గా సత్తా చూపించిన సునీల్ కి ఇది అలాంటి మరో విలన్ పాత్ర. కాకపోతే ‘పుష్ప’లో పూర్తి స్థాయి దుష్ట పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన అతనికి, ఈ సినిమాలో కొద్దిపాటి కామెడీ ఒలికించక తప్పలేదు. పెద్దగా ప్రాముఖ్యతలేని పాత్రే అయినా, కథానాయకి పాత్రకి కథాపరంగా ఉన్న పరిథిలో ప్రియా భవానీ శంకర్ చక్కగా అభినయించింది. అవసరమున్నా లేకున్నా అదే పనిగా దాదాపు ప్రతి సినిమాలోనూ కనిపించే కమెడియన్లుగానీ స్త్రీపాత్రధారులుగానీ లేకుండా, చూస్తున్నంత సేపూ సినిమా అబ్బురంగా నడుస్తుంది. మిగిలిన పాత్రలన్నిటినీ కూడా ఎంతో శ్రద్ధగా ట్రీట్ చేశారనిపించింది. ‘థానోస్’ తో సహా!
పాత్రల్లో ఒక ముఖ్యపాత్రని పోషించింది – ఈ సినిమాకి సత్య పోన్మర్ సమకూర్చిన ఛాయాదర్శకత్వం. తెలుగు సినిమాల్లో చాలా ఎత్తులకి ఎదిగిన సాంకేతిక విలువలని సత్య ఛాయాగ్రహణం భవిష్యత్తులో మరో మెట్టు పైకి ఎక్కిస్తుందో లేదో చెప్పలేం గానీ, ఈ సినిమాలో కిందికి మాత్రం దించలేదు. నిస్సంశయంగా.
సంగీతం సంగతికొస్తే, ఒక పాట మాత్రం అటు పాతగా మోగినా ఇటు కొత్తగానూ ధ్వనించింది. పాతకాలపు బాణీలో ధ్వనించే ఆ పాటని, అందుకు తగినట్లు ఘంటసాల స్వరంలా తోచే కంఠంతో సంతోష్ వెంకీ (‘గాయాలైన ఓ నరుడా – నీకెందుకంట ఈ వారూ..’) పాడాడు. ఆ పాట సాహిత్యం నిండా ప్రాసలున్నాయి. విశేషం అది కాదు. ఆ ప్రాసలన్నీ ఆంగ్ల పదాలతో కూర్చినవి. ‘నీకెందుకంట ఈ వారూ…..నీ ఫేటు సో ఫారూ; ఓటమి గెలుపూ నో సెపరేటూ – టేకిట్ లైటూ లైఫీజ్ గ్రేటూ..” ఇలా విలక్షణంగా సాగుతుంది ఆ పాట. ఈ సినిమాకి సంగీతాన్ని కూర్చిన రవి బస్రూర్, సన్నివేశాల్లోని టెంపోకి, బిగువుకి సరిగ్గా సరితూగేలా సంగీతాన్ని సృష్టించాడు.
సినిమా మొదలైన కాసేపటినుంచీ కుర్చీ అంచుకి చేరి కూర్చుని మరీ చూసేలా మార్చుతూ షాట్లని పేర్చిన ఘనత, ఈ సినిమాకి తన ‘ఎడిటింగ్’ సామర్థ్యాన్ని అందించిన అనిల్ క్రిష్ ది. చాలా చోట్ల కథ మరీ సినిమాటిక్ గా పరుగెట్టేది కూడా ఈ కూర్పు వల్లనే. చప్పట్లు.
ఇన్ని విశేషాలు చెప్పాక కథని క్లుప్తంగా చెప్పక పోవడం ఒక గతుకు అవుతుంది. అంచేత: బ్యాంక్ ఉద్యోగి ‘సూర్య’, మరో బ్యాంక్ లో పని చేసే తన గర్ల్ ఫ్రెండ్ స్వాతి చేసిన ఒక పొరపాటుని సరిదిద్దడానికి బ్యాంకింగ్ వ్యవస్థలోని లొసుగులని వాడుకోవడానికి సిద్ధపడతాడు. ఆ క్రమంలో అతనికో పాజిటివ్ విలన్ ‘ఆది’ తారసపడి – నాలుగు రోజుల్లో అయిదు కోట్ల రూపాయలు తనకు చెల్లించకపోతే తీవ్రమైన పరిణామాలని చవి చూడాల్సి వస్తుందని బెదిరిస్తాడు. ముఖ్యమైన ఈ మోటివ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, అనేకమైన ట్విస్ట్ లతో కథ ఆసక్తిగా కొనసాగుతుంది. చివరికి ఏమౌతుంది? అది మీకూ తెలుసు. ఎలా అవుతుందో చూడాలనిపిస్తే చూడవచ్చు. అందుకుగాను రెండున్నర గంటలకు పైగా పట్టే మీ సమయం వృధా మాత్రం కాదు. ఈ కథకి అంత చక్కటి స్క్రీన్ ప్లే రాసి, దర్శకత్వం వహించింది ఈశ్వర్ కార్తీక్. సినిమాలో చాలా చోట్ల అతనికున్న నాయకత్వ ప్రతిభ చక్కగా ప్రదర్శితమయింది. అతని విజన్ కి సరితూగేలా పనిచేసి తెరకెక్కించిన టీమ్ మొత్తానికీ చప్పట్లు.
వీలైతే తప్పకుండా చూడండి. ‘ఆహా’లో ఉంది…
*
Add comment