క్రీస్తు పుట్టిన పుణ్యభూమి పాలస్తీనా!

న్నో  దేశాలు తిరిగిన నాకు ఎప్పటినుంచో యేసుక్రీస్తు పుట్టిన పుణ్యభూమి పాలస్తీనాను చూడాలని కోరిక. యేసుక్రీస్తు ప్రబోధించిన  అహింస, ప్రేమభావం, మానవతావిలువలు, ‘నీవలే నీ పొరుగువారిని ప్రేమించమనే’ మాటా,  కొండమీద ప్రసంగం నాకు మొదటినుంచీ నచ్చేవి. ‘అది పాలస్తీనా కాదు ఇజ్రాయేల్’ అని మా ఆవిడ అన్నది.1948 లోనే కదా ఇజ్రాయేల్ పుట్టిందీ అని అందామనుకున్నా. మా ఆవిడకేమో అక్కడకు వెళ్ళడం పుణ్యాన్ని వెదుకుతూ చేసే యాత్ర. నేను మరో కోణంలో ఆలోచించాను.
యేసుక్రీస్తు చారిత్రక పురుషుడు కదా. ఈజిప్ట్, జోర్దాన్, ఇజ్రయేల్, పాలస్తీనాలలో యేసు ప్రభువు నివసించినట్లు, సంచరిస్తూ బోధించినట్లు ఇజ్రయేల్ చరిత్రకారులూ, యేసు శిష్యులూ, బైబుల్,  ఖురాన్  ఇంకా ఆనేక గ్రంధాలు రాసాయి. బైబుల్ లో కొత్త నిబంధన గ్రంధం యేసుక్రీస్తు గురించి చెబుతోంటే, పాత నిబంధన గ్రంధం యూదుల వంశావళి, ప్రవచనాలు, యూదుల బానిసత్వం, అనేక ప్రవక్తలు, ప్రవచనకారుల గురించి చెబుతుంది. కాబట్టి యూదులకూ, స్వయంగా యూదుడైన  యేసుక్రీస్తు బోధనలకూ గల ఔచిత్యం గురించి నేను చేయబోయే విదేశీ యానంలో  తెలుసుకోవడం ఎంతో  ముఖ్యం అనిపించింది.
క్రిస్టియన్లు వేటిని పవిత్రమైన ప్రదేశాలుగా భావిస్తారు ?
కాథలిక్కులు, అనేక ఇతర క్రైస్తవులలానే, జెరూసలేంలో యేసుక్రీస్తు మృతదేహాన్ని ఉంచిన గుహను, సిలువ మార్గమైన 14 స్థలాల్నీ(వయా డోలొరోసా), గొల్గొతా కొండనూ  అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా భావిస్తారు. నజరేత్, బెత్లెహేమ్, కపెర్నహుమ్,ఇంకా పవిత్ర భూమిలోని ఇతర ప్రాంతాలను అపోస్టోలిక్ కాలం నుండి పవిత్రమైనదిగా భావిస్తారు. అపొస్తలుల సమాధులపై నిర్మించిన అభయారణ్యాలను కూడా ప్రత్యేక పవిత్ర స్థలాలుగా భావిస్తారు. అలాగే పోప్ అధికార నివాసం ఉన్న వాటికన్ కూడా వెళ్లాలని కేథలిక్కులు కోరుకుంటారు

(భౌగోళికంగా “హోలీ లాండ్ ” ఆంటే ఆధునిక ఇజ్రాయెల్, పాలస్తీనా భూభాగాలు, లెబనాన్, పశ్చిమ జోర్డాన్ నైరుతి సిరియాలు). కానీ ఇజ్రాయెల్ నుంచి లెబనాన్ వెళ్లడం కష్టం. యేసుక్రీస్తు నీటిని ద్రాక్షారసంగా మార్చి చేసిన అద్భుత సంఘటన జరిగిన ప్రదేశం తమ భూభాగంలోని ‘ఖానా ‘ ఉందని లెబనాన్ అంటోంది. ఇది కూడా పురావస్తు ప్రదేశం. టెంపుల్ కోసం జ్ఞాని సోలొమాన్ రాజు ఉపయోగించిన సెడార్ వృక్షాలు, బైబుల్ ప్రవక్తలు నివసించిన ప్రదేశాలు లెబనాన్ లో ఉన్నాయి.

ఒకాయన చెన్నై నుంచి హోలీ లాండ్ కు టూర్స్  itinerary లో లెబనాన్ లేకుండా ‘ఈజిప్ట్ నుంచి యూదులు వాగ్దత్తభూమికి (Promised land) వెళ్ళిన దారిలోనే యాత్రలు నిర్వహిస్తున్నాడు, ఆయనను సంప్రదించండి’ అని ఫ్రెండ్స్ సలహా ఇచ్చారు. హోలీ లాండ్ టూర్ అంటే మా దృష్టిలో యేసుప్రభువు కేంద్రకంగా జరిపే పర్యటన.  మొత్తానికి ఆ చెన్నై ఆయన యాత్ర ఖరారు చేశాడు. ఐతే itinerary చివరి వరకూ ఇవ్వలేదు. ఈజిప్ట్, ఇజ్రయేల్, పాలస్తీనా, జోర్దాన్ దేశాలకు వెళుతున్నట్లు హోటెల్ బుకింగ్స్ ద్వారా తెలిసింది. ఇది స్టడీ టూర్ అని ఆయన చెప్పాడు గనక  రిఫరెన్సుల కోసం బాగ్ లో లైట్వెయిట్ బైబుల్ మోసుకెళ్ళాము. ఒక సాదాసీదా పాస్టర్ టూర్ ఆర్గనైజ్ చేస్తే మేము ఒప్పుకునేవాళ్ళం కాకపోవచ్చు. కోన శౌరిబాబు గారు ఈ స్టడీ టూర్ కు కర్త క్రియ. బాగా చదువుకున్న వ్యక్తి. బైబుల్ గురించి ఈయనకు తెలిసినంత ఎవరికీ తెలియకపోవచ్చు అని నమ్మకంగా నేను చెప్పగలను.
అందరం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో  కలిశాము. టూర్ గ్రూప్ లో 30 కి పైగా ఉన్నాము. మక్కా మసీదు యాత్రకు వెళ్ళినట్లు జెరుసలేం యాత్ర పెద్ద తిరణాలలా ఉంటుంది గనక, ప్రపంచం నలుమూలలనుండి యాత్రికులు ఇక్కడికి వస్తారు గనక, రద్దీలో ఎవ్వరూ తప్పిపోకుండా యెల్లొ కలర్ కాప్స్ ఇచ్చారు.  గుర్తింపు కార్డులు కూడా ఇచ్చారు.  ఎంత పెద్ద గుంపులోనైనా ఎవరూ తప్పిపోకుండా గుర్తుపట్టొచ్చనేది  ఆపరేటర్ ఉద్దేశ్యం కావొచ్చు.
ఈజిప్టు యాత్రా విశేషాలు :
హైదరాబాద్ నుంచి మస్కట్, మస్కట్ నుంచి బోయింగ్ విమానంలొ కైరో వెళ్లాము. ఈజిప్ట్ కు దగ్గర దగ్గరగా విమానం ఎగురుతుండగా యూదులు ఎర్ర సముద్రం దాటిన ప్రదేశాల గురించి పైలెట్ వివరించినట్లు గుర్తు. విమానం లోంచి కిందకు చూస్తే ఈజిప్ట్ లో ఉన్న సినాయి పర్వత శ్రేణులు కనిపించాయి.
ఈజిప్టు ఒక పురాతన దేశం.  పూర్తి పేరు అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్.  కైరో అంతర్జాతీయ విమానాశ్రయం ఒక పెద్ద చేపల బజారులా ఉంది. లోకల్ గైడ్ల సహాయంతో  ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుని. బయటపడ్దాం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12 మిలియన్ల టూరిస్టులతో, $12.6 బిలియన్ల ఆదాయం పొందే దేశానికి ఎంట్రీ పాయింట్ గా ఉన్న కైరో ఏర్పోర్ట్ ఇంకా ఎంతో  సదుపాయంగా  యూజర్ ఫ్రెండ్లి గా  ఉండాలనిపించింది.  అన్నట్టు, ఈజిప్ట్ ఆఫ్రికా ఖండంలో ఉందని చాలామందికి తెలియదట. ఈజిప్ట్ లో కొంత భాగం ఆఫ్రికాలోనూ, కొంత భాగం ఆసియాలో ఉంది.
రాత్రి కైరోలోని  రాడిసన్ బ్లు అనే 5 స్టార్ హోటల్లో బస. అన్ని సార్లూ కాంటినెంటల్ ఫుడ్. నా కిష్టమైన ఫిష్, గ్రీన్, బ్లాక్ ఆలివ్స్, క్రీమ్, చీజ్, అసోర్టెడ్  ఫుడ్స్, క్రొసెంట్ అనే వెన్నతో చేసిన పేస్ట్రీ , ఇంకా అనేక రకాల బ్రెడ్స్ ప్రతిరోజూ భోజనంలో కనిపించేవి.
ఆఫ్రికా ఖండం నుంచి యాత్ర :
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత,  కైరోనుంచి మా యాత్ర మొదలయ్యింది. ఎవరైనా హొలీ లాండ్ టూర్ కు వెళ్లాలంటే ఈజిప్టు నుండే మొదలు పెడతారు. ఈజిప్టు హోలీలాండ్ లో భాగంగా పరిగణింపబడనప్పటికీ, పాతకొత్త నిబంధన గ్రంధాలలో రాసిన ఉదంతాలు ఎక్కువ భాగం నైలు నది, సీనాయి ద్వీపకల్పం ప్రాంతాలలో జరిగాయి గనక, పురాతన ఈజిప్టు ప్రాంతాలను చూడడం ముఖ్యం కాబట్టి, యాత్రను ఈజిప్ట్ నుండే మొదలు పెడుతుంటారు.
ఖర్జూరం చెట్లూ, ఆలివ్ వనాలతో  మొత్తం ఈజిప్టు, జోర్దాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాలు పచ్చగా కనబడతాయని చెప్పారు. అకాసియా చెట్లు(పసుపు తెలుపు రంగు పూలున్న చెట్లు), మడ ఆడవులు ఉంటాయని గుర్తుకొచ్చింది. సహారా ఎడారి కూడా దారి పొడవునా  వెన్నంటే ఉంటుందట నైలునది లోయ ప్రాంతం తప్ప ఈజిప్టు ఎక్కువ భూభాగం సహారా ఎడారిలోను, కొంత లిబియా ఎడారిలోను ఉంటుంది.
యూదులంటే రాజకీయంగా, మతపరంగా పెద్దగా పొసగని  ఈజిప్ట్ వారు కూడా (బైబుల్ లో ఐగుప్తీయులు అని పిలుస్తారు) యేసు ప్రభువుకు సంబంధించిన అన్ని పవిత్ర స్థలాలనూ, హొలీ ఫామిలీ(యేసు, మరియ, జోసెఫ్ లు) తిరిగిన ప్రదేశాలనూ టూరిజం అభివృద్ధిలో భాగంగా  జాగ్రత్తగా పరిరక్షిస్తుంటారు. పిరమిడ్లు, సెయింట్ కాథరిన్ వంటి ప్రదేశాలు, కట్టడాలు ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న  క్రిస్టియన్ పర్యాటకులను కూడా ఆకర్షించడం ఉద్దేశ్యం కావొచ్చు. మోషేకు చెందిన పవిత్ర స్థలాలకు కూడా ఈజిప్టు ప్రభుత్వం ఎంతో రక్షణ కలిపిస్తోంది. ఒకసారి ఆగ్రహోదగ్రుడైన ఫారో రాజు శిలాశాసనాలమీద ఉన్న మోషే పేరును చెరిపివేయమని ఆజ్ఞాపిస్తాడనిబైబుల్ లోనూ, శిలాఫలకాల మీద  రాసిఉంది.. ఇందుకు బైబుల్ లో రిఫరెన్సులు ఉన్నాయి. చరిత్ర ఎలా ఉన్నా మోషే పేరు మీద ఈజిప్తులో పర్యాటక పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతోంది.
గిజా పిరమిడ్లు :
ప్రపంచ ప్రఖ్యాత గిజా పిరమిడ్లను చూడడానికి వెళ్ళాము. కైరో నుంచి గిజా పిరమిడ్లకు  20 కిలోమీటర్లు. గిజా పిరమిడ్ కాంప్లెక్స్ (గిజా నెక్రోపోలిస్ అని కూడా పిలుస్తారు) గ్రేట్ పిరమిడ్, ఖాఫ్రే పిరమిడ్, మెన్‌కౌర్ పిరమిడ్‌లతో పాటు వాటి అనుబంధ పిరమిడ్ కాంప్లెక్స్‌లు మరియు గ్రేట్ sphinx కు నిలయంగా ఉంది. పురాతన ఈజిప్టు పాత రాజ్యానికి చెందిన నాల్గవ రాజవంశం కాలంలో 2600~ 2500 BC మధ్యకాలంలో ఇవన్నీ నిర్మించబడ్డాయి. ఈ స్థలంలో అనేక దేవాలయాలు, స్మశానవాటికలు, కార్మికుల గ్రామం అవశేషాలు కూడా ఉన్నాయి. నేను 2010లో ఈజిప్టు వెళ్ళిప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు కనిపించాయి. పిరమిడ్ల వద్ద చాలా సౌకర్యాలు ఏర్పరిచారు. హొలీ ఫామిలీ (యేసు, మరియ, జోసెఫ్) దక్షిణం వైపుగా ప్రయాణించినప్పుడు (ఓల్డ్ కైరో ) గిజా పిరమిడ్లమీదుగా వెళతారు. గిజాలో ఉన్న ఒక తాడిచెట్టు కింద వర్జిన్ మేరీ బాల యేసుకు పాలిచ్చినట్లు చెబుతారు.   వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియజెప్పువరకు అక్కడనే యుండుమని అతనితో చెప్పెను. హొలీ ఫామిలీ ఈజిప్టు ఎందుకు వెళ్లారో ఈ బైబుల్ రిఫరెన్స్ వల్ల తెలుస్తుంది.
మొదటిది హేరోదు ది గ్రేట్: 

 హేరోదు గురించి చెప్పకపోతే చరిత్ర అర్ధం కాదు.  మత్తయి సువార్తలో యూదాయాను పాలించిన హేరోదు రక్తపిపాసత గురించి రాయబడింది. ఇతన్ని యూదులూ, క్రైస్తవులూ ద్వేషిస్తారు.  తను ఇడుమియన్ సంతతికి చెందినవాడు (ఎసావు నుండి), తల్లి అరబ్బు. కానీ తాను యూదుడని చెప్పుకున్నాడు. ఇతని  సంతతి యూదులను చాలా ఇబ్బంది పెట్టింది. ఇతను క్రూరమైనవాడు, కానీ రోమన్లు, కొందరు ప్రముఖ యూదులను మాత్రమే కాకుండా, గ్రీకులు, ఇంకా  ఆ ప్రాంతంలోని చాలా విభిన్నమైన వ్యక్తులను సంతోషపెట్టడంలో చాకచక్యం ప్రదర్శిస్తాడు.  బాల యేసును చంపడానికి హేరోదు సైనికులను పంపుర్లతాడు. హొలీ ఫామిలీ తప్పించుని ఈజిప్టు పారిపోయారని తెలుసుకుని బెత్లేహెంలోని రెండు

సంవత్సరాలలోపు  మగ శిశువులనందరినీ చంపిస్తాడు. రోమ్ లో   మార్క్ ఆంటోనీ సహాయంతో తర్వాత రాజౌతాడు.
యూదులను సంతృప్తి పరచడానికి హేరోదు జెరూసలేం టెంపుల్ మౌంట్ విస్తరణ చేపట్టాడు. హేరోదీయం, .మసాద, సెజారియా మరిటిమ, ఎడారి రాజభవనాలు, కోటలు ఇంకా నిర్మాణాలు చేపట్టాడు. క్రీస్తుశకం మొదటి శతాబ్దంలో చరిత్రకారుడు జోసెఫస్ ఫ్లావియాస్  హేరోదు గురించిన వివరాలు రికార్డ్ చేసాడు.
ఇతని కుమారుడే  హేరోదు ఆంతిపాస్. తండ్రి మరణం తర్వాత అతనికి గలిలీ మరియు దాని పరిసరాల అజమాయిషీ ఇవ్వబడింది.  ఇతనే  జాన్ బాప్టిస్ట్ మరణానికి కారణమైనవాడు, క్రీస్తును సిలువ వేయడానికి జెరూసలేంలో ఉన్న పొంటియస్ పిలాతు వద్దకు క్రీస్తును తిరిగి పంపినవాడు.
ఈజిప్టు పర్యటన :

బెత్లేహెం నుంచి ఈజిప్టు సరిహద్దులో ఉన్న గాజాకు 75 కిలో మీటర్లు. అప్పట్లో గాజా ఈజిప్టు దేశంలో భాగంగా ఉండేది.

ప్రవాసంలో ఉన్న హొలీ ఫామిలీ ఓల్డ్ కైరో నుండి మాడి వరకు ప్రయాణం చేశారు, అక్కడినుండి దక్షిణ ఈజిప్తులో ఉన్న డెయిర్ ఎల్ గార్నస్- గబాల్ అల్-టీర్‌కు పడవలో వెళ్లారు. హోలీ ఫ్యామిలీకి ముఖ్యంగా వెళ్ళవలసిన ప్రదేశం గెబెల్ కుస్కామ్. ఈజిప్తులో  బేల్బేయిస్  లో  ఉన్నప్పుడు వర్జిన్ మేరీ యేసు ప్రభువు వస్త్రాల్ని ఉతికి ఆనీటిని నేలమీద పోసినప్పుడు పవిత్ర మిర్రా తయారీకి ఉపయోగించే బాల్సమ్ అను గుగ్గిలం కలప  మొక్క మొలిచినట్లు చెబుతారు. ఇప్పుడు అక్కడ వర్జిన్ మేరీ చర్చ్ కట్టారు.  ఈజిప్టులో నాలుగేళ్లపాటు హొలీ ఫామిలీ నివసించినట్లు చరిత్రకారుల అంచనా.
Sphinx:
గిజా పిరమిడ్లకు సమీపంలోనే ఉన్న గ్రేట్ sphinx చూడడానికి వెళ్ళాము. ఇది ఒకే సున్నపురాయి నుంచి చెక్కబడిన  విగ్రహం. ఇది ఖాఫ్రీ రాజు ముఖాన్ని పోలిఉంటుందనీ, BCE సి. 2575~c. 2465 కాలం నాటిదని భావిస్తున్నారు. స్పిన్గ్స్ కళకు అత్యంత ప్రసిద్ధ ఉదాహరణగానూ, ఈజిప్ట్ చరిత్రలోనే శిల్ప కళకు ఒక మైలురాయిగానూ ఈ సున్నపురాయి విగ్రహాన్ని భావిస్తారు. ప్రపంచ అతిపెద్ద శిల్పాలలో ఇది ఒకటి.ఇది దాదాపు 240 అడుగుల పొడవు, 66 అడుగుల ఎత్తు ఉంటుంది. Lkసింహం శరీరం, రాజ శిరస్త్రాణంతో అలంకరించబడిన మానవ తలని కలిగి ఉంటుంది. ఈ విగ్రహాన్ని చెక్కడానికి 100 మంది కార్మికులు రాతి సుత్తి, రాగి ఉలితో దాదాపు మూడేళ్లు పనిచేసి ఉండొచ్చునని ఒక అంచనా.
నైలు నదిమీద విహారం: 
నైలు నది అనగానే సికామోర్ చెట్లు, తామరలు గుర్తుకొచ్చాయి. నైలునదిని ఆసరాచేసుకుని పడవలపై బతికే నిస్సహాయ జనం గుర్తుకొచ్చారు. కానీ వారిని చూసేందుకు వీలుపడలేదు. అయినా నాలోని మాజీ జర్నలిస్ట్ కళ్ళు వారికోసం వెదికాయి.
రెండోరోజు నైలు నదిమీద క్రూస్ షిప్ పై  విహారయాత్ర కు వెళ్లాం.  ఈజిప్టు వాద్య పరికరాలైన తబలాలతో దలిడ పాటలు, అందుకు అనుగుణంగా బెల్లీ డాన్సులు చూసాము. (వాద్య కారుడు  అమిర్ ఖుస్రు మొదటగా తబలాను కనిపెట్టి/ తయారు చేసినట్లు చెబుతారు. అరబిక్ భాషలో ‘తబీ’ అంటే డ్రమ్ అని అర్ధం. ఆఫ్రికాలోనూ, మిడిల్ ఈస్ట్ లోనూ తబలా అంటే ఒకే వాద్య పరికరం ఉంటుంది). దూరంగా గిజా పిరమిడ్లు, దేదీప్యమానంగా వెలుగుతున్న కైరో నగరం నైలునది మీదనుండి కనిపిస్తాయి. మోషే పెట్టిన పది శాపాల్లో ‘నైలు నది నీటిని రక్తంగా మార్చడం’ ఒకటి  గనక ఆ మిషతో  నైలునది మీద విహారం మాకు దక్కింది (నిర్గమకాండం  7:14–24).
ఈజిప్టు మ్యూజియం:
అంతకు ముందురోజు ఎంతోకాలంగా ఎదురు చూసిన ఈజిప్టు మ్యూజియం, బెన్ ఎజ్రా సినగోగ్ చూసాం.  ఈజిప్టు మ్యూజియం గురించి ఒకటి రెండు లైన్లలో రాయలేము. మోషే పది శాపాల్లో ఒకటి ‘మొదట పుట్టిన బిడ్డలను చంపడం’. ఫారో రాజు మొదటి బిడ్డ దేవుని  శాపానికి గురై మరణిస్తాడు. బంగారు పూతపూసిన ఆ బిడ్డ మమ్మీని ఆ మ్యూజియంలో చూడొచ్చు. ఫారో రాజులు, రాణుల మమ్మీలు, ఫారో రాజు వాడిన బంగారు కుర్చీలు, ఆభరణాలు వేలాది  సంవత్సరాల ఈజిప్టు చరిత్రనూ, సంస్కృతినీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి.యూదులను నానా కష్టాలు పెడుతూ వారిని దేశాన్నుంచి బహిష్కరించినట్లు రాయబడ్డ పెద్ద శిలాఫలకాన్ని చూసాం.

నాటి  రాజ్యంలో 3వ రాజవంశానికి చెందిన పురాతన ఈజిప్షియన్ ఫారో Djoser విగ్రహం, పురాతన వస్తువులున్న విభాగంలో పురాతన పాపిరస్, వరసలుగా అల్మిరాలలో భద్రపరిచిన మమ్మీలు, ఫారో టుటెంకమన్  సింహాసనాలు,

టుటెంకమన్ బంగారు సింహాసనం పాదపీఠము, కొయ్యతో చేసిన నక్క అనుబిస్, ఫారో టుటెంకమన్ అధికారిక కుర్చీ, కుఫు రాజు విగ్రహం, పురావస్తుపరంగా, చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత పొందిన ఖుఫు ఐవరీ విగ్రహం, నైలునది కి 400 మైళ్ళ దూరంలో రాయల్ క్వారీలో దొరికిన కఠినమైన ముదురురాయితో చెక్కిన ఫారో ఖఫ్రే సింహాసనం, హరే నోమ్ దేవత, హతోర్ దేవత , ఫారో మెకౌరా ను వర్ణించే త్రయం విగ్రహం, పురాతన ఈజోప్టు ఫారో అమెనెంహాట్ III విగ్రహం, రాజవంశం XXI-XXII కు చెందిన  తానీస్ హైక్సోస్ స్పిన్గ్స్ విగ్రహం, ఆవు రూపంలో ఉన్న రాతి విగ్రహానికి బంగారు పూత పూసిన పురాతన ఈజిప్టు దేవత హతోర్, హతోర్ దేవత చాపెల్, మూడవ అమెంహోటెప్ రాజు  విగ్రహం చూసాము.  BCE 1213 -1203 వరకూ పురాతన ఈజిప్తును పాలించిన ఫారో మెర్నేప్తా లోహ యుగంనాటి శిలాఫలకాన్ని ఇశ్రాయేల్ శిలాఫలకం లేదా మెర్నెప్త విజయ శిలాఫలకం అని పిలుస్తారు. శిలాఫలకం చివరన కనాను దేశం పేరును ప్రస్తావిస్తూ ఇజ్రాయెల్ ను ఓడించినట్లు రాసిఉంది. బైబుల్ చరిత్ర అనడానికి ఇవన్నీ సాక్ష్యాలుగా చూపుతారు.
(త్వరలో ప్రచురణ కాబోతున్న “ఏసు చారిత్రక పురుషుడు” పుస్తకం నుంచి కొంత భాగం)

తుల్లిమల్లి విల్సన్ సుధాకర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు