క్రిమి

నాకు కులం, మతం లేదు, ఏ సమూహాలపైన మీరు ఇప్పుడు దాడి చేస్తున్నారో, ఆ సమూహాలను తరలి వెళ్లేలా చేసింది నేనే.

వాతావరణం చల్లగా వుంది. గత కొద్దిరోజులుగా అన్నింటా… అంతటా నెమ్మదిగా నిశ్శబ్దం అలుముకుంటుంది. నడిరోడ్లుపై నత్తగుల్లలు నెమ్మదిగా పాకుతున్నాయి. ఆగివున్న కార్లుపైకి తలకిందులుగా వేలాడుతూ గొంగళిపురుగులు జాయిగా దిగుతున్నాయి. మూసివున్న థియేటర్ల తెరలపై సాలె పురుగులు గూళ్ళు కట్టుకుంటున్నాయి. ఆగివున్న విమానం రెక్కలపై పిట్టలు రెట్టలు వేసుకుంటున్నాయి. నగరానికి అడివికి అట్టే తేడా తెలియక జంతువులు నిర్భయంగా సంచరిస్తున్నాయి.

అది ఒక సమావేశ మందిరం. ఆ సమావేశానికి సమయానికి అన్ని హాజరైనాయి. రావాల్సిన  ఒక్క దానికై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆ సమావేశమందిరంలో ఒకవైపు వివిధరకాల  బ్యాక్టీరియాలు  కలరా, క్షయ, లెప్రసి, ప్లేగు, ఆంత్రాక్స్ లాంటివి.  మరోవైపు వివిధ రకాలైన వైరస్ లు రేబిస్, పోలియో, హెపటైటిస్, డెంగ్యూ, ఫ్లూ,మలేరియా,  ఎబోలా, ఎయిడ్స్, లాంటివి  కూర్చొని వున్నాయి. సార్స్ ఫ్యామిలీ రాకకై ఎదురుచూస్తున్నాయి. ఈసారి ఏ కుటుంభం నాయకత్వ స్థానం చేపట్టాలో అన్న దానిపై ఏర్పాటైన  అత్యవసర సమావేశం అది. తమలో ఒకడిని నాయుకుడిగా ఎన్నుకోవాలస్సిన సమయమది.

తమ కులానికే నాయకత్వ పీఠం దక్కాలని బ్యాక్టీరియా కులం ఆశిస్తుంటే ఈ సారి తమకే నాయకత్వ పీఠం దక్కాలని వైరస్ కులం కోరుకుంటుంది. ఈ కులాలలో గల వివిధ కుటుంబాల  మధ్య అంతర్గత కుమ్ములాట కొనసాగుతుంది. అయనప్పటికీ ఈ మధ్య ప్రపంచమంతా వినబడుతున్న పేరు వైరస్ కులానికి మరియు సార్స్ కుటుంభానికి చెందిన ‘కరోనా'(కోవిడ్ – 19) పేరే తుమ్ములు, దగ్గులు, రూపంలో అధికంగా వినబడుతుంది.

ఈ ఎన్నిక మనుష్య జాతిపై తాము యుద్ధం నెరిపి విజయం సాధించిన ప్రతిసారి జరుగుతుంది. గతసారి  నాయకత్వ స్థానాన్ని గెలుచుకున్నది వైరస్ కులానికి చెందిన కుటుంబమే. కావున ఈసారి మాకు నాయ కత్వ పీఠాన్ని ఇవ్వండి అని బ్యాక్టీరియా కులం పట్టుపడుతుంది.

“గతసారి మీరే నాయకత్వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈసారి మాకు అవకాశం కల్పించండి” అని ‘క్షయ’ ముని ముని ముని….. మనవడు వైరస్ కులాన్ని అడిగాడు.

“ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరిచిపోయారా? మీకో రూల్ మాకో రూలా? గతంలో విజయం సాధించిన ప్రతిసారీ మీరు అధికారాన్ని దక్కించుకున్నారు. ఈసారి మావంతు వచ్చేసరికి మాత్రం… ‘గతంలో మీరు నాయకత్వ స్థానాన్ని అధిష్టించారు ఈసారికి మాకొదిలేయండని’ అంటారా. చరిత్రలో మీ కులానికి చెందిన మశూచి, ప్లేగు, క్షయ, కలరా వంటి కుటుంబాలు చాలా ఏళ్ళు నాయకత్వ స్థానాన్ని అనుభవించాయి  గుర్తుకు తెచ్చుకోండి” అంది ‘ఎబోలా’.

“మీకంటూ ఓ దేహమే లేదు మీకెందుకు అధికారంపై అంత ఆరాటం”అని ‘లెప్రసీ’ హేళనగా నవ్వింది.

“మేము అదేహులం(దేహం లేనివారం). మనుషుల కంటే ముందు నుంచి జీవనం కొనసాగిస్తున్న వాళ్ళం.  మేము నచ్చిన ప్రాణులను (మొక్కలు, జంతువులు, పక్షులు, మనుషులు వగైరా) మా దేహాలుగా మలుచుకుంటాము. మా సంతతిని వృద్ధి చేసుకుంటాము. మీ అంత తేలికగా మనుషులకు చిక్కే ప్రాణులం కాదు మేము. మీకో దేహం ఉండబట్టే  మనుషులు యాంటీబయోటిక్ తో మిమ్మల్ని అంతమొందిస్తున్నారు. మమ్మల్ని అంతమొందించే శక్తి లేకనే మేము రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా మీ కుటుంభంలో నువ్వే చివరిదానివి అనుకుంటాను. మనుషుల కంట పడకుండా మొండి వేళ్ళ చేతులతో డేక్కుంటూ ఎక్కడికైనా జాగ్రత్తగా పారిపో…. లేదంటే నిన్ను అంతమొందించి నీ వంశాన్ని నిర్వీర్యం చేసేయగలరు” అని ‘లెప్రసి’కి బదులిస్తూ  ‘క్సు… క్సు’ అంటూ పగలబడి నవ్వింది ‘ఫ్లూ’.

“చరిత్రలో మేము సృష్టించిన విధ్వంసం ముందు మీరు సృష్టించింది ఏపాటి. మేము మా శక్తిని నిరూపించుకున్న ప్రతిసారి లక్షల్లో మనుషుల ప్రాణాలను తిన్నాం. ఊర్లకు ఊర్లను ఊడ్చి పెట్టేసాము. మా పేరు మీద ఈఫిల్ టవర్, చార్మినార్ లాంటి చారిత్రక కట్టడాలే  వివిధ దేశాలలో వున్నాయంటేనే మా శక్తి మీకు అర్ధమయ్యుంటుంది” అని ‘ప్లేగు’ ‘క్షయ’కి వంత పాడింది.

“తాతల నాడు నేతులు  తాగాం – మా మూతులు నాకండి అన్నట్టు వుంది మీ వాలకం. గతంలో మీరు ఇలాగ విర్రవీగబట్టే మిమ్మల్ని కట్టడి చేశారు మానవులు. అయినా ఎప్పుడో వారికి రవాణా మరియు సమాచార సదుపాయాలు సాంకేతికత సరిగా అభివృద్ధి చెందని కాలంలోని మీరు చేసే వీరంగం గూర్చి ఇప్పుడు ఎవడికి కావాలి? వర్తమానంలోకి రండి మనుషులు ఎలా వున్నారో మీకు తెలుస్తుంది.” అంది ‘పోలియో’.

“ఆడికి నోట్లో రెండు చుక్కలు ఎయ్యండిరా నోరు మూసుకొని ఊరుకుంటాడు” అని ‘ఆంత్రాక్స్’ గోక్కుంది.

“ఇప్పుడు గొర్రె తోక బెత్తుడులా మారిందిగా మనుషుల చేతిలో నీ బతుకు” అని ‘ఎయిడ్స్’ ‘ఆంత్రాక్షు’ను  హేళన చేసింది.

“దానికి కండోమ్ తొడగండిరా… అదే నోర్మూసుకొని ఊరుకుంటుంది” అని ‘క్షయ’ ‘ఎయిడ్స్’ వైపు చూసి కెళ్ళు కెళ్ళుమని దగ్గింది.

రెండు కులాల మధ్య ఈ వాదన ఇలా సాగుతుండగా ఇంతలో అందరికి ఒక్కసారిగా ముక్కుకారడం మొదలయ్యింది. తుమ్ములు దగ్గులుతో పాటు ఒళ్ళు వేడెక్కడం మొదలయ్యింది. సమావేశ మందిరంలోకి ప్రవేశించింది ‘కరోనా’.

‘కరోనా’ని చూడగానే తమకు తెలియకుండానే అక్కడున్న చాలామటుకు జీవులన్నీ లేచి నిలబడ్డాయి. హాలులోకి ప్రవేశిస్తూనే నవ్వుతూ అందరికీ నమస్కరించి ఇలా చెప్పడం ప్రారంభించింది. “సభలోని కురువృద్దులు (మూలపురుషులు, అనుభవజ్ఞులు అన్న అర్ధంలో) నాతోటి సహచరులు ముందుగా నా ఆలస్యానికి మన్నించాలి. నా ఆలస్యానికి కారణం మీకు తెలిసినదే. మనం ఇలా ప్రతి శతాబ్దానికి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. మనలో ఒకరిని నాయకునిగా ఎన్నుకుంటున్నాం. గతంలో బ్యాక్టీరియాలు  మనుష్య జాతిపై హననం సాగిస్తే ఇప్పుడు వైరస్ ల వంతయ్యింది.

ఇప్పటికీ నువ్వెంతంటే నువ్వెంత అంటూ మనం కులాల వారీగా కొట్టుకుంటున్నాము. మనుష్య జాతి మనుగడ ప్రారంభంకు ముందు నుంచే  మన చరిత్ర మొదలయ్యింది అని మీకు తెలుసు. ఇప్పుడు ఈ సభలో చాలా మంది వృద్దులు వున్నారు. వారికి ఈ విషయాన్ని నేను చెప్పాల్సినంతవాన్ని కాను, అంత వయస్సు అనుభవం నాకు లేవనుకుంటున్నాను. అయినా ఇది నేను మాట్లాడాల్సిన సందర్భమని  తప్పనిసరై మాట్లాడుతున్నాను” అని కరోనా గౌరవసూచకంగా తలలాంటి తన తొండాన్ని వొంచింది.

అది గమనించిన పెద్దలందరూ కరోనా తమకిచ్చే మర్యాదికి మనస్సులోనే ఉప్పొంగిపోయారు.

ఎవరికి ఏ తుంపర (బిస్కెట్) ఎలా వెయ్యాలో తెలిసిన కరోనా తన ప్రసంగాన్ని కొనసాగించింది. “ఇప్పుడు నన్ను చూసి ఇళ్లల్లో దాక్కుంటున్నారని, కనీసం తుమ్మడానికి దగ్గడానికి భయపడి పోతున్నారని, తమ తోటి మనిషినే అనుమానంగా చూస్తున్నారని మనం మనుషులను చూసి  విర్రవీగనక్కర్లేదు. చరిత్రలో ఇలాంటి భయాలను మారణహోమాలను సృష్టించిన ప్రతిసారీ వారు మనల్ని కట్టడి చేశారు. మీ బాక్టీరియా కులాన్ని యాంటీ బయోటిక్ రూపంలోనూ, మా వైరస్ కులాన్ని వ్యాక్సిన్ల రూపంలోనూ. ఈ మందుల తయారీకీ మరలా మనల్నే వాడుకున్నారు. అడివిని నరకడానికి గొడ్డలికి ఆ అడివి కర్రే సాయం చేసినట్టు మనలోనే కొందరు మానవులకు సహకరిస్తున్నారు.

మనుషులలో వచ్చే మశూచి నివారణకు ఆవులలో వచ్చే మశూచిని మందుగా వాడుకున్నారు. రేబిస్ వ్యాధిని నివారించడానికి రేబిస్ వచ్చి చచ్చిన కుక్కల వెన్నెముకలనే  మందు తయారీకి వాడారు. బ్యాక్టీరియాని నాశనం చేయడానికి మరో బ్యాక్టీరియాని మందుగా వాడుకున్నారు. మనుషులు అంత ఖతర్నాకులు. వారినంత తేలికగా తీసుకోవొద్దు. మనుషులు సమూహాలుగా విస్తరించిన కొద్దీ మనం మనల్ని పదే పదే అభివృద్ధి చేసుకున్నాం. మనలో వందల, వేలు రకాలున్నాయి. మనందరం చెడ్డవాళ్లమా అంటే కాదు. మనలో మనుషులకు కీడు చేసేవి కంటే మేలు చేసేవే ఎక్కువ. ఉదాహరణకు మనుషులు రోజూ వాడే పెరుగు తయారీకి మీ బ్యాక్టీరియా కులంలోని ఓ కుటుంభం అవసరం. వదిలితే మొత్తం సముద్ర జీవులను తినేసే ఆల్గే లాంటి జీవుల నియంత్రణకు మా వైరస్ కులంలోని ఓ కుటుంభం అవసరం. కాకపొతే వారెప్పుడూ మనలోని కీడునే చూస్తారు. కృతజ్ఞతా హీనులూ” అని కరోనా చెబుతుండగా కలరా లేచి నిలబడి.

“ఈ సోదంతా ఎందుకూ మనం వచ్చిన పని కానిచ్చేస్తే సరి!” అని ఒక వాంతూ ఒక విరేచనం చేసి కూర్చుంది.

“పెద్దయ్యా! ఆ కంగారే ఇప్పుడు మనకు వద్దని నేను అంటున్నది. గతంలో నువ్వలా కంగారుపడి విజృంభించబట్టే నీ కుటుంబాన్ని చాలా తెలివిగా మనుషులు కట్టడి చేశారు. ఇప్పుడేది ఇదివరకటి  నీ కుటుంభమూ దాని ఘన చరిత్ర.” అని ‘కరోనా’ ఒక నవ్వు నవ్వి మరలా తన మాటలను కొనసాగించింది “ఇప్పటివరకు మనలో మనం మేము గొప్పా అంటే మేము గొప్పా అని గొడవపడుతున్నాము. ఇలా గొడవలపడి మనం విడిపోబట్టే మనుషులు దీనిని ఆసరాగా చేసుకొని మనల్ని కట్టడి చేయడానికై మనలో కొందరిని వాడుకొని మందులు తయారుచేస్తున్నారు. ప్రతిసారీ మనల్ని కట్టడి చేస్తున్నారు. ఇప్పుడు మనలో ఎవరు నాయకుడుగా ఉండాలన్నది ప్రధానాంశం కాదు. మనందరం కలిసికట్టుగా ఒకే మాటపై నిలబడి మనుషులపై విజయం సాదించాలన్నదే నా ఆకాంక్ష.

నేనిప్పుడు ప్రపంచమంతా విస్తరించానని మనుషులలో భయాందోళనలు కలిగించానని మిడిసి పడిపోనక్కర్లేదు. గతంలో ఇంతకన్నా మనుష్యజాతిపై విజృంభించి వీరంగం సృష్టించిన మన పూర్వీకులలో కొందరిని వారు నామరూపాలు లేకుండా చేశారు. ముందుచూపు లేకపోతే మనం మందగించిపోతాం” అని ‘కరోనా’ అంటుండగా

“శభాష్ రా మనవడా….నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. ఇన్నాళ్లు మనలో మనం కొట్టుకుంటున్నాం. ఇలా కొట్టుకుంటూ మన అసల శత్రువెవరో మరిచిపోతున్నాం. ఇక్కడున్న అందరికీ నువ్వు అసలు కర్తవ్యాన్ని భోదించావు. మనవి వేరు వేరు కులాలే కావొచ్చు. మనమంతా ఒకే జాతి అని గుర్తుకొచ్చేలా చేసావు. ఎవరు అవునన్నా… కాదన్నా నిన్ను నాయకుడిగా నేను సమర్దిస్తున్నా. గతాన్ని గుర్తెరిగి భవిష్యత్తును చూడగలిగే వాడే నాయకుడు” అని ప్లేగు అనేసరికి అక్కడున్న అందరికీ నోట మాటపడిపోయింది. ఎందుకంటే బ్యాక్టీరియా కులానికి ప్లేగు ఎంత చెబితే అంతే.

ఒక్కసారిగా ఆ సమావేశ మందిరంలో గుస గుసల రూపంలో ఓ చిన్న కలకలం మొదలయ్యింది. తను వేసిన పాచిక పారిందని ‘కరోనా’ మనసులోనే మురిసిపోతుండగా

ఇంతలో ఓ ‘క్రిమి’ లేచి నిలబడింది.

“మిత్రులారా! నాకు అవకాశమిస్తే ఓ రెండు నిమిషాలు మీముందు మాట్లాడుతాను” అంది.

“ఇంతకీ ఎవరయ్యా నువ్వు?”

“ఎక్కడ్నుంచి వచ్చావు? ఎలా వచ్చావు?”

“నీ కులమేమిటి?”

“అసలు నిన్నెవరు లోపలికి రానిచ్చారు?” అని సమావేశ మందిరంలో ఒక్కసారిగా ప్రశ్నల వర్షం కురిసింది. ఇన్ని ప్రశ్నల మధ్య ఆ క్రిమి నవ్వుతూ నిలబడింది.

దాదాపుగా నాయకుడిగా తన ఎన్నిక ఖారారయ్యిందన్న సమయంలో ‘ఈడెవడురా బాబు ఇప్పుడు పానకంలో పుడకలాగ..’ అని ‘కరోనా’ లోలోన అనుకుంటూ ఆ క్రిమిని ఆపే ప్రయత్నం చేసేంతలో

“మాట్లాడు నాయినా … మాట్లాడితే ఏమి పోతుంది నాలుగు విషయాలు నలుగురికి తెలుస్తాయి కదా!” అని ‘ప్లేగు’ అనేసరికి ‘కరోనా’ తన ప్రయత్నాన్ని విరమించుకుంది. కొద్ది క్షణాల క్రితమే ‘ప్లేగు’ తనకు మద్దతుగా నిలిచింది. తను ఇప్పుడు కాసింత వెనక్కి తగ్గడం ద్వారా తనపై మరింత మంచి అభిప్రాయం ‘ప్లేగు’ లాంటి వృద్దులలో ఏర్పడుతుందని కాసేపు మౌనంగా ఊరుకుంది.

“మిత్రులారా! నేనెవరు? నా పుట్టుకేమిటి? నేనెక్కడ్నుంచి వచ్చాను? ఇక్కడ నాకేమిటి పని? అని చాలా ప్రశ్నలు మీ నుంచి నేను విన్నాను. ముందుగా ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాను” అని ఆ క్రిమి మాట్లాడటం మొదలు పెట్టింది.

“నేనూ మీలాగే ఓ క్రిమిని, కానీ నాకు మీలా ఓ దేహముండదు, రూపముండదూ. నా పుట్టుక 400 ఏళ్ల క్రితం నాటిది. మీలో వున్న కొందరిలా వేల ఏళ్ళ నాటిది కాదు నా చరిత్ర. నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు. ఏ సమూహాలపైన అయితే మీరు ఇప్పుడు దాడి చేస్తున్నారో, ఆ సమూహాలను నగరాలకు తరలి వెళ్లేలా చేసింది నేనే.

ఇంతకు ముందు మాట్లాడిన వారిలో ఓ మిత్రుడన్నాడు. ప్రపంచంలో కొన్ని చారిత్రిక కట్టడాలను మీ భీభత్సాల జ్ఞాపకార్ధమే కట్టారని! కానీ ఆ మిత్రుడికి తెలియని విషయమేమిటంటే ఈ భూ ప్రపంచంపై అన్ని కట్టడాలను నేనే కట్టించాను. ఇంకో విచిత్రమైన విషయమేమిటంటే మిమ్మల్ని మనుషులు అదుపు చేయగలరని మీరనుకుంటున్నారు! అది నిజమే కానీ మిమ్మల్ని మనుషుల చేత అదుపు చేయిస్తున్నదీ నేనే! అభివృద్ధి చేయిస్తున్నదీ నేనే!!” అని ఆ క్రిమి కాస్త గ్యాప్ ఇచ్చేసరికి

“అయితే తమ్ముడూ నువ్వు అంత పనోడివన్న మాట. ఇంతకీ ఏటంటావ్?నువ్వందరినీ అదుపు చేస్తే మరి నిన్నెవరు అదుపు చేయగలరు?” అని ఎబోలా ఎకిలిగా నవ్వేసరికి. అంతవరకూ ఇదంతా ఓపికగా వింటూ ‘ఈడుకెందుకు మాట్లాడడానికి అవకాశమిచ్చానురా!నాయినా’ అని తనలో తానే నలిగిపోతున్న ‘కరోనా’కి ‘ఎబోలా’ చేసిన ఎటకారానికి నవ్వొచ్చింది.

“అక్కడికే వస్తున్నాను అన్నయ్యా! నేను ఈ సమావేశంలో మీరందరూ మాట్లాడిన మాటలను మొదటి నుండి విన్నాను. మనుష్య జాతిని నామరూపాలు లేకుండా చేయాలని మీరందరూ ముక్తకంఠంతో కోరుకుంటున్నట్టు ఈ సమావేశం ద్వారా నాకర్ధమయ్యింది. అసలు మనుషులే లేకపోతే మీ మనుగడెక్కడ నా మనుగడెక్కడ అని మీకు గుర్తు చేయడానికే నేను లేచి నిలబడి మాట్లాడుతున్నాను. మరో విషయం నన్నెవరు కంట్రోల్ చేయగలరని ఓ అన్నయ్య అడిగాడు. ఎవరి మరణ రహస్యమైన వారి పుట్టుకలోనే దాగి ఉంటుంది. కాకపోతే దానికో సమయం సందర్భం ఉంటుంది. నేనే శాశ్వతం అని నేను చెప్పుకోవట్లేదు” అని చెప్పి కూర్చుంది క్రిమి.

కాసేపు ఆ ప్రాంతమంతా నిశ్శబ్దం ఆవరించింది. గొట్టం, బంతి, స్ప్రింగ్ వంటి రకరకాల ఆకారాలలో వున్న బాక్టీరియాలు మరియు వైరస్ లు ఒకరి ముఖాలు మరొకటి చూసుకోవడం ప్రారంబించాయి.

అంతలో “కరోనా తమ్ముడూ! నిన్ను నివారించడానికై ఓ మనిషి మందు కనిపెట్టాడట!” అంటూ ‘హంటా వైరస్’ రొప్పుతూ ఆ మందిరంలోకి ఓ వార్తను మోసుకొచ్చింది.
బయట ఎండ తీవ్రంగా వుంది. కొందరి గొంతులలోని తడారడం మొదలయ్యింది. ఉక్కిరి బిక్కిరి అవుతున్న కొన్ని బ్యాక్టీరియాలు వైరస్ లు అప్పటికే చీకటిగా వున్న తడి ప్రదేశాలను వెతుక్కోవడం మొదలెట్టాయి.

“ఈ రోజుతో ఈ మనుషులను అంతం చేసేస్తాను” అంటూ కోపంగా అంతవరకూ ఓపిక పట్టిన ‘కరోనా’ పైకి లేచింది.

“వెళ్లి ఏమి చేస్తావు… ఎంతమందినని చంపుతావు. అసలే వాళ్ళు నిన్ను నివారించడానికై మందును కనిపెట్టి కూర్చున్నారు. ఇలాగే తిన్నగా వెళ్ళు నీ తాట తీస్తారు” అని ఆ క్రిమి ‘కరోనా’ భుజంపై అనునయంగా చెయ్యేసింది.

మరిప్పుడు నన్నేమి చేయమంటావన్నట్టు (ఇక చేసేదేమీ లేక) ‘కరోనా’ ముల్లులాంటి తన తొండాన్ని స్నేహపూర్వకంగా ముందుకు సాచింది.

“నువ్వేమీ చెయ్యక్కర్లెద్దు. నేను చెప్పినట్టు నువ్వు విను చాలు. ఇప్పుడు నువ్వు ముందుకెళితే నిన్ను ఆపగలరు. అదే ఆ మందు కనిపెట్టినోడిని నేను కబళించాననుకో … నువ్వూ సేఫ్… నేనూ సేఫ్” అని ఆ క్రిమి ముందుకు కదిలింది.

ఆ మాట విన్న వెంటనే, ముఖంపై వున్న వేయి తొండాలు ఒక్కసారిగా వికసించిన ‘కరోనా’ “ఇంతకీ నువ్వెవరు అన్నయ్యా!” అని సందేహంగా అడిగింది.

ఆ క్రిమి చెప్పే సమాధానంకై అన్నీ ఆసక్తిగా ఎదురుచూసాయి.

“మీ దృష్టిలో మనుషులందరూ సమానమేనని అందరూ అనుకునేలా చేయించిందీ నేనే! అందరూ సమానమనుకున్నది అసమానంగాను… అందరూ అసమానమనుకున్నది సమానంగానూ చేయించిందీ కూడా నేనే!!… ఇక అన్నీ నేనే!!!….ఇక అంతా నేనే!!!!” అని చెప్పి ఆ క్రిమి అలా నవ్వుతూ ముందుకు సాగిపోయింది.

‘ఇక ఈడే మన నాయుకుడులా వున్నాడను’కుంటూ ఆ సమావేశ మందిరంలోని మిగిలిన బ్యాక్టీరియాలు, వైరస్ లు ఆ క్రిమి వెళ్లే వైపు చూస్తూ నోళ్లు (ముల్లు లాంటి తొండాలను) యెళ్ళబెట్టాయి.

* * *

మొయిదా శ్రీనివాస రావు

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మొయిద శ్రీనివాసరావు గారు మీకు శుభాకాంక్షలు. క్రిమి కథా కథనం చాలా బాగుంది.

  • మితృలారా! కథలో ఒక చోట “నేనూ.. మీలాగే ఓ క్రిమిని” అనే వాక్యానికి బదులుగా “కొందరు మానవులు నన్ను క్రిమిగా సంభోదిస్తారు”గా
    చదువుకోగలరు.

  • Story Chala bagundi bavagaru…sathabdhalu kritham nunchi eppati varaku kuda antu vyadula Valla prajalu padutunna kastalu ebbandulu eee generation ki kuda easy ga ardam iyyela undi…elanti stories miru enka rayalani korukuntunnanu…abhinandhanalu…

  • Communisim capitalistic ga marina Vela , prapanchapu capitalisanni kuladhose aadhipathya poru lo ee krimulanni pavulu ga Mari vundavochu…ippudu communism, capitalisam rendu lockdown lo safe ga ne struck ai vunnai. Papam shrame…bayatakosthe krimi tho chavu…lopalunte aakalitho chavu.
    Inka nuvvu cheppinattu vaccine ki kuda capitalisam krimi padithe, 1920 french flu varaku panichesina natural selection kuda thappani Darwin ee sari capitalist selection ani theory marchukuntademo….

  • I never thought that we can aware people in this way..The story tells us that we people can conquer over these viruses and bacteria…it fills lot of courage into our hearts …It’s full of sarcasm through some useful facts ..You r truly a great writer sir..Keep inspiring with your writings.

  • శ్రీను నీ కథ చదివాను .బాగుంది. కానీ ఆ క్రిమి ఎవరో ఏమిటి అన్న సందేహాన్ని పాఠకులమైన మాపైనే ఒదిలేసావు.కాబట్టి ఒకటికి రెండుసార్లు చదివితే గానీ అర్ధం కాదనిపించింది. జాగ్రత్తగా చదివితే మూడునాలుగు వాక్యాలో నువు హింట్సిచ్చావు.కానీ అది చాలదు.సాధారణంగా పదార్ధాన్ని నోట్లో పెట్టగానే రుచితెలిసినట్టుంటే గానీ గ్రహించలేము.నువు చూసి రుచి చెప్పమంటున్నావు.

    మార్కిస్టులకు గానీ ఈ కధ అర్ధం కాదని నానమ్మకం.అదికూడా అంత సుళువుగా అర్ధమవ్వదని నేననుకుంటున్నాను.కానీ నువ్వు యిచ్చిన హింటస్ మాత్రం చాల గొప్పవే.
    నీవాక్యాల ద్వారానేను గ్రహించినది.

    1.”ఏ సమూహాలపైన అయితే మీరు ఇప్పుడు దాడి చేస్తున్నారో, ఆ సమూహాలను నగరాలకు తరలి వెళ్లేలా చేసింది నేనే.”

    2.”మిమ్మల్ని మనుషులు అదుపు చేయగలరని మీరనుకుంటున్నారు! అది నిజమే కానీ మిమ్మల్ని మనుషుల చేత అదుపు చేయిస్తున్నదీ నేనే! అభివృద్ధి చేయిస్తున్నదీ నేనే!!”

    3.”ఇప్పుడు నువ్వు ముందుకెళితే నిన్ను ఆపగలరు. అదే ఆ మందు కనిపెట్టినోడిని నేను కబళించాననుకో … నువ్వూ సేఫ్… నేనూ సేఫ్”

    4.”ఎవరి మరణ రహస్యమైన వారి పుట్టుకలోనే దాగి ఉంటుంది. కాకపోతే దానికో సమయం సందర్భం ఉంటుంది”

    ఈ నాలుగు వాక్యాల ఆధారంగా ఆక్రిమి పేరు “పెట్టుబడి” అనుకుంటున్నాను.ఎందుకనిపించిందో చెప్తాను

    1.ఈ క్రిమి మూలంగా అటూ శ్రామికులు పొట్టచేత్తో పట్టుకొని పట్నాలకు వలసపోతే. పెట్టుబడిదారుడు డబ్బు సంచులతో అక్కడికే వలసపోతున్నాడు.మరింత సంపాదించడానికి

    2.ఏ క్రిమినైనా మనుషులనచేత అదుపు చేయించేది కూడా పెట్టుబడే.మందులు కనిపెట్టడానికి పెట్టుబడే కావాలి.

    3.నేను ముందు వెళితే అనడములో పెట్టుబడి యొక్క వికృత రూపం చూపించదలిచావు.మందు కనిపెట్టిన పెట్టుబడిదారుడి స్వార్ధంకారణం.అందరికీ దానిని అందనివ్వడు.కనక వెనక వెళ్ళిన క్రిమి సేఫ్

    5.ఎవరి మరణ రహస్యమైనా దానిపుట్టుకలోనే వుంటుంది అనడం తాత్విక నేపధ్యం కనపడిన నిజం మాత్రం అదే .ఏ శ్రామికుల,చెమట ద్వారా పుట్టిందో ఆ శ్రామికులచేతిలోనే దాని మరణమూ వుంది.

    ఇంత ఫజిలింగ్ కధలు ఎక్కువమంది పాఠకులని చేరలేవు అని అనుకుంటాను.కథ ఇలా వున్నా హేడ్డింగులోనో లేదా చివరనైనా అందరికీ తెలిసేటట్టు హింట్ వుండాలి.
    అభినందనలు

  • భలే ఆలోచన సర్ ! వ్యాధి క్రిమిలు మాట్లాడుకోవచమే వెరైటీ. కరోనా తోపు అనుకున్యా. క్రిమి లాస్ట్ పంచ్ సూపరు. ఆద్యంతం ఆసక్తికరం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు