ఉన్నపళంగా
ఖాళీ చేసి వెళ్లిపోడానికి
ఈ దేహమేమీ అద్దిళ్ళు కాదు
దేహం లోపల
గుండె గూట్లో
పిట్టలు పొదిగిన తుపాకీ గుళ్లున్నాయ్
ఛిద్రమైన కలల కనురెప్పలకు
పైరుపచ్చని రెక్కలు కట్టుకొని
నింగిని ఎంగిలి చేసిన
ఎర్రముక్కు పావురాల గుంపులున్నాయ్
జీరబోయిన గొంతు గోడలను చీల్చుకుంటూ
చురకత్తులను ముద్దాడిన
పచ్చి గేయాల గాయాల నొప్పులున్నాయ్
మేకులు మొలిచిన దారి మీదుగా
మట్టి పాదాలతో నడిచినంతమేర
పారిన నెత్తుటి ప్రవాహాలున్నాయ్
మూసిన అరచేతుల నిండా
నేలకొరిగిన పుడమి బిడ్డల
ముఖచిత్రాల మందహాసాలున్నాయ్
అరే బిడ్డా…
నువ్ సైగ చేయగానే
కాళ్ళ మీద పడి బూట్లు నాకడానికి
ఈ దేహమేమీ
గద్దె మీద కులికే తోలుబొమ్మ కాదు
నీ ముడ్డిమీద లాగితన్నే
భగత్ సింగ్ మెలేసిన కోరమీసం…!
( అన్నదాతల పోరాటానికి మద్దతుగా )
చాలా బాగుంది ఉత్తేజకరంగా..
Good poem bhai
Superb. కోరమీసం మెలే ద్దాం
ఒక దేశద్రోహి ప్రేమకథ ద్వారా తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక గుర్తింపు పొందిన కవి సాబీర్ ” కోరమీసం” చాలా బాగుంది. ప్రజా వ్యతిరేక సాగు చట్టాల రద్దు కోసం గత 100 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తున్నా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం , ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్రలకు పాల్పడింది. కేంద్ర ప్రభుత్వం తీరును గర్హిస్తూ సాబీర్ రాసిన కవిత్వం చక్కటి జవాబు అని చెప్పొచ్చు.
చాలా గొప్ప ప్రకటన…చాలా ఉత్తేజకరంగాఉంది.