దాచడం కష్టం…
చలిమంట చిటపటలు సద్దుమణిగాక కూడా
పొగలాగే చీకట్లో పాకుతుంటాయి, ఆపేక్షలు.
నివురు దుప్పట్లో వాటిగుట్టు
మినుకుమినుకు మంటూ అదను కోసం చూస్తూ.
ఏదో రాలే చుక్కని చూపుల్తో పట్టుకుంటే
మనసు కరువు తీరుతుందని
ఎవడు పలికాడో
చందమామ సంపుటిలో
దాచిన నెమలీకకి పిలకలు రావు, లేవు
కంచికి చేరేలోపే కథలు మట్టిరంగు లోకి-
మసక తెల్లారి
మట్టిపాలైన మంచు చుక్కలు
రాలిన ఆకుల వెర్రి ముగ్గులు
కోరికలు దాచడం, సాధించడం కష్టమే
కానీ, కాలం నిన్ను దిసెమొలతో నిలబెట్టినా
నీ పిడికిల్లోని ఈక్షణాన్ని తాకలేదులే
నీ కోరికల్ని దూయలేదులే,
అసలు మనిషంటేనే కోరికల అక్షయపాత్ర కాదా?
*
Add comment