సిద్దాంతం మనుషులపై పట్టు సంపాదించినప్పుడు అది భౌతిక శక్తిగా మారుతుంది.. అన్నాడొక మహానుభావుడు. చెట్లు కూలుతున్న చప్పుడుది ఏ సిద్దాంతం? మనుషులు శవాలై బుడగలుగా మారినప్పుడు ఆ నీరు దుర్వాసన కొట్టినప్పుడు ఏ సిద్దాంతం?
కళ ఒక మాంత్రిక శక్తి నుంచి వచ్చిందన్నాడు మరో మహానుభావుడు. కళాకారుడు ఒక ఆదిమ మాంత్రికుడై జనాన్ని మంత్రముగ్ధులు చేసే సామాజిక కర్తవ్యాన్ని నెరవేర్చాలన్నాడాయన. కళలో మర్మజ్ఞానాన్ని జీర్ణించుకుని అక్షరాల్లో, చక్షువుల్లో, కదలికలో, హృదయ స్పందనలో వ్యక్తీకరించి నీ అడుగుల చప్పుడులో వేలాది మంది అడుగుల చప్పుడు విలీనం కాలేనప్పుడు అదేం కళ?
మనిషి బాధను భరించలేనప్పుడు ఆ బాధను వ్యక్తీకరించేందుకు ప్రకృతి మనకు కళ్లనీళ్లను ఇచ్చింది. నా ఆవేదనలోని అగాధమైన లోతును చెప్పేందుకు నాకు స్వరాన్నీ, భాషనూ ఇచ్చింది. మనిషి తన బాధలో మౌనంగా ఘూర్ణిల్లినప్పుడు నా వేదనను ఉచ్చరించగల కళను దేవుడు నాకు కానుకగా ఇచ్చాడు.. అన్నాడు జర్మన్ తత్వవేత్త, కవి గోథే. మరో ఇటాలియన్ కవి టాస్సో గురించి రాస్తూ..
హృదయాన్ని పలికించగల కళ, కళ్లనీళ్లు అక్షరాలుగా మారగలిగిన కళ, అగాధమైన లోతును అభివర్ణించగల స్వర భాషా మిళితమైన కళ గురించి నేను ఎదురు చూస్తున్నాను.
రోడ్డు ప్రక్కన 20 ఏళ్ల యువకుడు వాహనం ఢీకొంటే తలపగిలి రెక్కలు తెగిన పక్షిలా కొట్టుకుంటుంటాడు. చుట్టూ ఉన్న మనుషులు మొబైల్స్ లో ఆ దృశ్యాన్ని చిత్రీకరిస్తుంటారు వాట్సాప్ ల్లో పంపించేందుకు. పోలీసులు ఈ ప్రమాదం తమ పరిధిలోకి వస్తుందో కాదో చర్చించుకుంటారు. రాజకీయ నాయకులు ప్రభుత్వం విఫలమైందని ప్రకటనలు గుప్పిస్తుంటారు. ఈ దుర్భర, దుస్సహ, దుర్మార్గ వాతావరణంలోంచి తప్పించుకుని ఒక తేజోమయమైన ఆత్మ శరీరం నుంచి వెళ్లిపోతుంది . ఆ వెలుగులో మనుషులు ప్రేతాత్మల్లా మారిపోతారు. ఆ ఆత్మ కళ్లనీళ్లలో ఇంకిపోతుంది. నిశ్చేష్టంగా చూస్తున్న చెట్ల ఆకుల్లోని పత్రహరితంలో కలిసిపోతుంది. ‘ఏ దునియా అగర్ మిల్ భీ జాయేతో క్యాహై’ అని పాడుకుంటూ షాహర్ లూధియాన్వీని వెతుక్కుంటూ వెళ్లిపోతుంది.
‘మీ చిత్రాన్ని గీస్తాను సార్, ఒక్క వందరూపాయలు ఇవ్వండి..’ అంటుంది ఒక చిత్రకారిణి ఇండియాగేట్ నీరెండలో కూర్చుని. వాహనాలు రొదచేస్తూ వెళ్లిపోతుంటాయి. చుట్టూ అంతా జనం గందరగోళం మధ్య తిరుగుతుంటారు. రకరకాల వస్తువులు అమ్మేవారు అరుస్తుంటారు. నీవు నిశ్చలంగా కూర్చోలేవు.కాని ఆమె నిశ్చలంగా తన పెన్సిల్ కు పని చెబుతుంటుంది. కేవలం ఆమె ముంగుర్లు మాత్రమే కదులుతుంటాయి. ఆ గీతలు ఆమె చేతి వ్రేళ్లను చూస్తూ మంత్రించినట్లు సాగుతుంటాయి. నీ రూపం పూర్తవుతుంది. నీవిచ్చిన డబ్బుతీసుకుని ఆమె నుదుటిపై చెమట తుడుచుకుంటూ ‘థాంక్స్’ అని చెబుతుంది. రెండు కిలోమీటర్ల దూరంలో నార్త్ బ్లాక్ లోంచి సూట్ కేసుతో వచ్చి కారు ఎక్కిన కాంట్రాక్టర్ నుదుటిపై ఒక్క చెమట చుక్కా కనపడదు. కళకే మంత్ర శక్తి ఉంటే ఆమెను ఆ కారులో కూర్చోబెట్టగలదనిపిస్తుంది. కాని కళ కవిత్వంలో తమ మంత్రశక్తిని వ్యక్తం చేయగలదు.
అంతా ఎందుకు వస్తారో తెలియదు, మాననీయ సభాపతీ… అని అంటుండగానే వారు సభా మధ్యలోకి దూసుకువచ్చి నినాదాల చేస్తారు. ప్రభుత్వాధినేత గడ్డం నిమురుకుంటూ చిద్విలాసంగా చూస్తుంటాడు. గందరగోళం మధ్యే కొందరికి వేలకోట్ల ప్రయోజనాలు కట్టబెట్టే బిల్లులు ఆమోదం చెందుతాయి. సభ వాయిదా పడుతుంది. సెంట్రల్ హాలులో అంతా కలిసి భోజనం చేస్తారు. సాయంత్రం తాజ్ మాన్ సింగ్ హోటల్ లో ఏదో పార్టీలో అంతా కలిసి కరచాలనాలు చేస్తుంటారు. పార్లమెంట్ లిఫ్ట్ నంబర్ 6 వద్ద పై గోపురం లోపలి భాగంలో సంస్కృత శ్లోకం ఇలా రాసుంటుంది. ‘ప్రజాహితం సుఖం రాజః, ప్రజానాంచ హితేహితం, నాత్మ ప్రియం హితం రాజః, ప్రజానాంతు ప్రియేహితం అని కౌటిల్యుడి అర్థశాస్త్రంలోని వాక్యాలు చెక్కి ఉంటాయి. ప్రజల సంతోషమే రాజు సంతోషం, వారి సంక్షేమమే ఆయన సంక్షేమం. తనకు సంతోషకరమైనదే మంచిదని అతడు భావించవద్దు. అందరికీ సంతోషకరమైనదేమిటో అతడు గ్రహించి పనిచేయాలి.’. అన్నదే ఈ వాక్యాల అర్థం. పార్లమెంట్ లోంచి వినపడే రణగొణ ధ్వనుల మధ్య ఈ వాక్యాలు నివ్వెరబోతాయి.
‘హిమాలయ శీతలత్వంలో శవం చెడిపోని తాజాదనం. రేగిస్తాన్ ఇసుక రేణువుల్లో దారుణాలపై కప్పిన మార్దవం, శ్మశానాల నగరంలో సమాధులే సౌందర్య చిహ్నాలు, పార్లమెంట్ లో ఆత్మహత్యలు చూడలేక స్వేచ్ఛ మళ్లీ పల్లెకు చేరుకుంది. ఎదురుకాల్పుల్లో ఊపిరి తీసుకుంది..’ అని దాదాపు దశాబ్దం న్నర క్రితం రాశాను. ‘నగరం నగరమంతా కటకటాల వెనుకే, ఆకాశం కటకటాల వెనుకే, పక్షులూ కటకటాల వెనుకే.’ అన్నది నా తొలి కవితల్లో ఒకటి. ఇప్పుడు మనిషికీ మనిషికీ మధ్య కటకటాలు మొలుస్తున్నాయి.
ఇప్పుడు మౌనంగా ఉండడమే స్వేచ్చా, గొంతు పెగలకపోవడమే స్వేచ్ఛా? లేదా ఏదో ఒకటి గిలకటమో, పలకటమో స్వేచ్ఛా? ఎవడో ఏదో వాగుతాడు. అంతా వాడిని ఖండించడమో, మోయడమో చేస్తారు. యజ్ఞాలు, యాగాలూ జరుగుతూనే ఉంటాయి. ఏడాది ఏడాదికీ ఆలయాల ముందు లైన్లలో నిలుచునే జనం పెరుగుతూనే ఉంటారు మహానగరాల్లో కూలీల అడ్డా ల్లో పనులకోసం వలస వచ్చిన వారు తమను తాము అమ్ముకుంటూనే ఉంటారు. కన్నాట్ ప్లేస్ లో, జీబీ రోడ్డులో, ఆన్ లైన్లలో కాటుక కళ్లు ఆశతో వేటాడుతూనే ఉంటాయి. మనం ధార్మిక చర్చల్లో తలలు బ్రద్దలు కొట్టుకుంటుంటే, ఫేస్ బుక్కుల్లో మన వికృత రూపాల్ని ప్రదర్శించుకుంటుంటే వాళ్లు ఓట్లు, నోట్లు లెక్కపెట్టుకుంటుంటారు. కొందరు మతవాదంలో ఉనికిని వెతుక్కుంటే, మరికొందరు అస్తిత్వవాదాల్లోతమ అస్తిత్వాన్ని వెతుక్కుంటుంటారు. మనం మన లక్ష్యాన్ని పోగొట్టుకుంటాం. వాడికి వాడి లక్ష్యం ఏమిటో ఖచ్చితంగా తెలుసు. ‘కోయీ హస్ రహాహై, కోయీ రోరహాహై, కోయీ పా రహాహై, కోయీ ఖో రహాహై, యహ్ క్యా హోరహాహై, యహ క్యోంహో రహాహై (ఎవరో నవ్వుతున్నారు, ఎవరో దుఖిస్తున్నారు, ఎవరికో ఏదో లబించింది, ఎవరో ఏదో పోగొట్టుకున్నారు. ఇక్కడేం జరుగుతోంది, ఇక్కడ ఎందుకిలా జరుగుతోంది)..’ అని ప్రశ్నిస్తూ అక్బర్ అలహాబాదీ రాసిన కవిత్వం ఢిల్లీ వీధుల్లో ప్రతిధ్వనిస్తోంది.
‘నా హృదయంలో ఎంతోకాలంగా అన్వేషిస్తున్నది నాకు ఎండమావిలా లభించింది. నా చేతులు చాపి గుండెలో లాక్కుందామనుకున్నాను. కాని అది చేతికి అందలేదు..’అన్నాడు టాగోర్.
కళ ఎండమావి కాదు, అదొక మర్మం, అదొక మంత్రం. కాళ్ల క్రింద ఎండుటాకుల పదధ్వని విని చూస్తే కనపడే అకాల శిశిరం. నిరంతరం ప్రకంపిస్తున్న రుద్రవీణ తీగలు తెగిన చప్పుడు. అర్థరాత్రి సూర్యోదయం. కాలం చెక్కిలిపై తడి ఆరని కన్నీరు. నిద్దట్లో పలకరించే పసిపాప నవ్వు. చెదలు పట్టిన పుటల్లోమట్టి వాసన. కడుపు రగులుతూ కనులు మూసుకున్న వాడి భ్రుకుటిని బ్రద్దలు కొట్టుకుని లోకాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్న మూడోనేత్రంలోని అగ్ని జ్వాలలు.
రండి. మనం మరో ఆధునిక కవితా మేనిఫెస్టోను లిఖిద్దాం..
*
సర్ మీరు రాసిన వర్ణన అత్యధ్బుతంగా వుంది . నేను రాయలేకపోయినా చదివి మానసికంగా సంతృప్తి చెందుతుంటా. మీ శిష్యుడు అశోక్.కె
Thank you Ashok!
Nomorewords,ji
Thank you Padma garu!
చాలా ప్రగాఢంగానూ,నిజాయితీతోనూ రాసిందని తెలుస్తోంది.
వీరభద్రుడు గారూ నమోనమః
It’s such a wonderful feel. I never miss your articles in Andhra Jyoti.
Thanks Sharadasivapurapu garu!
కళ రహస్యం బద్దలుకొట్టారు. గాఢాతిగాఢంగా వుంది. ఇలాంటివి చదవడం గొప్ప ఉత్ప్రేరకం. కదలిక.అలజడి.
– బాలసుధాకర్ మౌళి
Thanks Sudhakar! Mee poetry kooda cgaduvutunna
చాలా ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. …
మీ ఈ ‘కృష్ణ పక్షం’ చదివాక ‘చాలా బావుంది’ అని చెప్పేసి ఊరుకోలేక అడుగుతున్నాను – మీ కవితలు చదవాలని వుంది. అవి ఎక్కడ లభ్యమో తెలుపగలరు.
చాలా బాగుంది, మీరు మా (మన) హైదరాబాదు oldcity అందులోనూ గౌలీపురా నుండి రావటం మరింత ఆనందం , కాస్త గర్వం గాను ఉంది
—-వేణు వింజమూరి , Washington DC