కోయిల పాట లేదు నీలో ……

ప్రియమైన నగరమా,
నువ్వో కోతి కొరికేసిన పుల్లటి దొర చింతకాయవి
క్షణక్షణము నీలో కత్తులు నూరుతున్న చప్పుడు నాకు తెలుసు
ఇక్కడ రోజుకో మనిషి హతుడని,
తను శవమై సంచరిస్తాడని
ఇది శవాల కార్యక్రమాల కార్యశాలని తెలుసు
కానీ నిన్ను ప్రియా అని,
పొదుగు కుడిసిన
మా పాల మూతి కర్రెదూడని చూసినంత సంబరంగా,
అంత బెమతో ఎందుకు పిలిచానో తెలుసా?
నువ్వో కన్నీటి సమాధివని
అవి ఇంకా నీలో ఇంకిపోలేదని గుర్తుపట్టగలిగాను కనుక
నీ కడుపులోని ఉప్పంతా మానవుడి కళ్ళలో పేరుకున్న విషాదమని,
అది గుండెను పెరికి యంత్రాన్ని తగిలించుకున్న దిగులని,
నాలుగు నీలవన్నే పూల మొక్కలు పూయలేని కాంక్రీటని
అది చీకటని నాకు తెలుసు కనకా..!
నీ చెంపల మీద పారికాడిన
చల్లని గాలి ప్రేమలేఖను చదివే తీరికుంటే నీకు
ఆకాశపు రహస్యం నీకు తెలిసుండేది
నీ నక్షత్రపు ముని గోళ్ళను ఒక్కసారి నువ్వు చూసుకొని ఉంటే
ఇంద్రధనస్సు రంగుల కొలను దర్శనమయ్యేది
నీకు తెలుసా??
ఈ అనంత విశ్వంలో తరతరాల తల్లి లేని ఒంటరి తనం నీది
అందుకే నువ్వు కన్నీటి సమాధివని చెబుతున్నాను
ప్రియా నీ అధరాలపై
ఒక్క తుమ్మెదైనా వాలిన జ్ఞాపక ముందా నీకు?
అలలపై చేప పాటను విన్నావా నువ్వు
నీ గొంతుపై
చల్లని చెట్టు నీడలాంటి వాన
ఎపుడన్నా మెత్తగా రాలిందా?
నువ్వు నిట్ట నిలువుగా పెరిగిన రాళ్ళ కొండవే కానీ
పారే కోయిల పాట లేదు నీలో
ఒక్క పిలుపు కోసం జీవితమంతా కాచుకునే
ఎదురుచూపు లేదు నీలో
నీ మీద నాకు జాలంటే నవ్వుతావేమో
కానీ నీ నవ్వుల్లో చితి మంటల రవ్వలు నాకు బాగా తెలుసు
ప్రియమైన నగరమా
మానవుడి కన్నీటి సమాధీ
ఎప్పటికైనా ఒక పుష్పంగా పుస్తావని
సూర్యుడి కోసం తూర్పు దిక్కుని శుభ్ర పరుస్తున్నాను
పల్లెలో కొమ్మపై చిరు పిట్ట ఎగిరే వేళకి సిద్దంగా ఉండు
అది సూర్యుణ్ణి రుచి చూసి నీకు బహుమతిగా ఇస్తుంది.
*

గూండ్ల వెంకట నారాయణ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తమ్ముడూ…అద్భుతమైన కవిత చదివించావు..
    కవిత చెప్పే స్టయిల్ చాలా నచ్చింది.. శుభాకాంక్షలు💐💐

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు