విశాలమైన ప్రపంచం గుప్పెట్లోకి చేరాక
వైరస్ వైరల్ అవ్వడం చాలా తేలికైంది
భూమి అంచులదాకా విస్తరించిన గోడలు
నా ఇంటి గోడలుగా పరిమితమయ్యాక
ముప్పై అడుగుల దూరమే నడవలేక నడవలేక నడుస్తున్నాను
సోఫాలోనే రోజంతా పరుగెత్తి పరుగెత్తి అలసిపోతున్నాను
ఇప్పటిదాకా పరుగెత్తిన కాలాన్ని
నిదానించి పరకాయించి చూస్తు
నన్ను నేను పునర్నిర్మించుకొనే పనిలో పడ్డాను
ఎప్పటికీ తీరం చేరని పరుగులో
అమ్మల్నీ అడవుల్నీ
కొండల్నీ గుట్టల్నీ
అనంతానంత ఆకాశాన్ని
నిర్దాక్షిణ్యంగా ఆక్రమించుకొన్న వైనాలు
హతమార్చేసిన సహప్రాణులూ
ఇప్పుడు నా ఎదురుగా నిలబడి వికటాట్టహాసం చేస్తున్నాయి
ఎక్కడికీ పరుగు
నా అనంతర కాలాన
నేను దాటొచ్చిన మైలురాళ్లు
శ్మశాన దిబ్బలై నన్నూ లోకాన్ని తనలో ఇముడ్చుకొంటుంటే
నిన్నటి పరుగుల్ని రేపటి అడుగులు
కొత్త ప్రశ్నలతో నిలదీస్తున్నాయి
ఆకు ఆకాశమూ
చెట్టూ పిట్టా
కొత్త చిగుళ్లకోసం చేసే నిరీక్షణ
కళ్ల ముందు కదలాడుతుంటే
సమస్త లోకపు సౌబ్రాతృత్వం కోసం
లోకాన్నీ నన్నూ శానిటైజ్ చేసే పనిలో పడ్డాను
ఈ మలినాల్ని వదిలించాలంటె
ఎంత కాలం నన్ను నేను కడుగుతూ పోవాలో
* * *
Add comment