1
కొన్ని పూలు వాడిపోతాయి
కొన్ని పూలు రాలిపోతాయి
కొన్ని పూలు ప్రేమిస్తుంటాయి
పూల సుగంధాలు అజరామరం..!
జనారణ్య నగరాల పైన
పూల గుత్తులు వేలాడుతుంటాయి
దారుల వెంట పరిమళాల కౌగిలింతలు
అడవుల పైన నదుల పైన
కొండలపైన లోయల పైన
రంగు రంగుల పూలు
విలసిల్లుతూనే ఉంటాయి..!
కొన్ని పూలకైతే అద్భుతమైన రంగులుంటాయి
కొన్ని పూలైతే ఒకే రంగుతోనే ఆకట్టుకుంటాయి
కొన్ని పూలైతే గుండె గుడిలోనే సేదతీరుతుంటాయి
కొన్ని పూలైతే సౌందర్యానికి సింధువులా ఉంటాయి..!
ఉత్తేజపరిచే కొన్ని పూలుంటాయి
కొందరు పూలనే ఆరాధిస్తారు
పూలు మనల్ని సమ్మోహన పరుస్తాయి
సమర శంఖారావానికి
పూలు ప్రేరణగా నిలుస్తాయి..!
ఆకాశంలో విరగబూసిన వెన్నెలను చూసిన
నవ్వులతో చిందులేస్తున్న పిల్లల్ని చూసిన
గలగల మంటూ కదిలే పడుచులను చూసిన
వర్ణ శోభితాలైన సుమాలే
కళ్ళ ముందు కదలాడుతుంటాయి
పూలంటే అవిశ్రాంత పోరాటాలకు చుక్కాని
పూలంటే ఏటికి ఎదురీదడాలు
పూలు రాలినా.. వాడినా కానీ
అవి పుష్పిస్తూనే వుంటాయి…!
2
అతిథులకు ఆహ్వానం
భయంకరమైన నిశ్శబ్దాన్ని
నిర్విరామమైన ఆలోచనలను భంగపరుస్తూ
కిచకిచ మంటు పలకరిస్తుంటాయవి
ఏమి ఆశించని పిచుకలవి
కూలిన చెట్లతో గూళ్లను కోల్పోయి
నిర్వాసితులుగా వెతలు పడుతున్నవి.
మనమేమి పెట్టకున్నా పర్వాలేదు
నిలదీసే దమ్ము ధైర్యం వాటికి లెవ్వు
మన ఉనికిని కూడా పట్టించుకోవు
బతకడానికి కావాల్సిన ఆహారాన్ని
సక్రమంగానే సంపాదించుకుంటున్నవి
వక్ర మార్గం తెలియని స్వేచ్ఛా ప్రాణులవి
ఆత్మీయంగా మన చెంతకు చేరుతున్న
ఆ అతిథులకు ఆహ్వానం పలుకుదాం..!
*
కూలిన చెట్లతో గూళ్ళను కోల్పోయి
పూల సోయగం వాటి మనోగతం అవి పులకించే తీరు
వాటి మూగ భాషను బాధను వేదనను భలేగా ఆవిష్కరించారు.
వెన్నెల మల్లికార్జున
నందికొట్కూరు
Vennela Flutes- maker
మీ కవిత్వం బాగుంది సార్