1
“ఈ పర్వతారోహకులకు ఏం పోయేకాలం! హాయిగా తిని వెచ్చగా ఇంటిలో ఉండలేక ఎక్కడికోపోయి చస్తారు” అంటూ నాన్నగారు పర్వతారోహకుల్ని ఎప్పుడూ విమర్శించేవారు, ఆయన హిమాలయాలను చూసే వరకూ.
ఒక్కసారి హిమాలయాలను చూశాక ఆయన ఇంకెప్పుడూ పర్వతారోహకులను విమర్శించలేదు. వయసులో ఉన్నప్పుడే హిమాలయాల్లో ట్రెక్ చేసి ఉండాల్సింది అని బాధ పడుతూ, వాటి గొప్పతనం గురించి అనర్గళంగా అందరికీ చెబుతూ ఉండడం ఆయన దినచర్యలో ఇప్పుడు భాగమైపోయింది. అంతేకాదు హిమాలయాలను చూడడం మూలంగా ఆయన తన జన్మ ధన్యమైనట్టుగా భావిస్తున్నారు.
2
నా వరకూ నేను హిమాలయాలను చూశాక అప్పటివరకు నాకున్న ఆనందాలన్నింటినీ కోల్పోయాను. మహాద్భుతాన్ని చూశాక ఏ అద్భుతమూ ఇక అద్భుతం కాకుండా పోయింది. ఏ సౌందర్యమా ఇక సౌందర్యం కాకుండా పోయింది. హిమాలయాలు నన్ను నా జీవితానికి వ్యర్థుడ్ని చేశాయి. దైహికంగా నేనీ ముతక ప్రపంచంలో ఉన్నా నా మనసెప్పుడూ హిమాలయాలలోనే వసిస్తోంది.
పర్వతాలు, పర్వతాలు, పర్వతాలు!
ఈ పర్వతాలలో ఏముంది? ఎందుకు ఈ పర్వతాలు నా ఆత్మను తమ వైపు గుంజుకుంటాయి. నా గమనికకు అందినంత వరకు ఈ strong pull నాకు పుట్టుకతోనే వచ్చింది. ఉద్యోగరీత్యా మా కుటుంబం పర్వతాల్లో నివసించడం వల్ల నా బాల్యమంతా పర్వతాల్లోనే గడిచింది.
నా బాల్యంలో నాన్నగారిని నేను కోరిన కోరికలు ఏమైనా ఉంటే అవి పుస్తకాలూ, పర్వతాలే. అంటే ఏదో ఒక భారీ పర్వతాన్ని ఎంచుకోవడం. దానిపైకి ఎక్కించమని కోరడం. నేను రెండవ తరగతి చదివే కాలం నుండి ఇంటర్ పూర్తి చేసే వరకూ నాన్నగారూ – నేనూ విశాఖ మన్యంలో ఎన్నో పర్వతాలను ఎక్కాము. వాటిలో కొన్ని చాలా దుర్గమమైనవి, ఎంతో కష్టసాధ్యమైనవి.
పర్వత శిఖరాల పైకి ఎక్కాక అమ్మ ఇచ్చిన క్యారియర్ విప్పి పెరుగన్నాన్ని, ఉసిరికాయ పచ్చడితో నంజుకొని తినేవాళ్ళం. ఈ కాంబినేషన్ పర్వతాలపై అద్భుతమైన రుచిని ఇస్తుందని నమ్ముతూ, ఎప్పుడు పర్వతాలు ఎక్కినా ఈ కాంబినేషన్ కోసం అమ్మని పట్టుబట్టేవాడిని. పర్వతాలను ఎక్కినప్పుడు ఈ కాంబినేషన్ మీరూ ప్రయత్నించి చూడండి. High altitudeలో ఆ ప్రత్యేక రుచిని మీరూ పొందితే నాకు తప్పక తెలియజేయండి.
3
హిమాలయాలను చూసే వరకూ ఈ తూర్పు కనుమలే నాకు లోకం. ఈ కనుమల్లో మహా పర్వతాలను అన్వేషిస్తూ గడిపాను, కొన్నిసార్లు కాలి నడకన, కొన్నిసార్లు గుర్రం మీద. ఆ క్రమంలో రమణ మహర్షిని లోకానికి పరిచయం చేసిన, “Who Am I” పుస్తకానికి కారకుడైన కావ్య కంఠ గణపతి ముని శిష్యుడైన దామరాజు వెంకట రామయ్య(పాకలపాడు గురువు గారు) ఏయే పర్వతాలలో తపస్సు చేసుకున్నారని గిరిజనులు చెప్పారో ఆ ప్రదేశాలు చూశాను. అవన్నీ చేరుకోవడానికి చాలా కష్టపడాల్సిన ప్రాంతాలు. ఒకటి గమనించాను, దామరాజు వెంకట రామయ్య గారు నివసించడానికి ఎంచుకున్న ప్రాంతాల నుండి చూస్తే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు కనిపిస్తాయి. ఆయన అభిరుచి మనకు అర్ధం అవుతుంది. ఆయన నివసించిన గిరిజన ప్రాంతాలలో ఆశ్రమాలు వెలిశాయి. ఆ ఆశ్రమాలలో దేహ స్పృహ లేకుండా ధ్యానంలో ఉన్న చదువురాని గిరిజనులను నేను చూశాను.
కొందరు కొందరు ఆయనను అవధూత అంటారు. మరికొందరు యోగి అంటారు. భారతదేశములో ఆయన ఎక్కని పర్వతం లేదని అంటారు. సాధకునిగా ఆయన తిరగని చోటు లేదని వారు తరచూ చెబుతూ వుండేవారు. హిమాలయాలు, వింధ్య పర్వతాలు, టిబెట్, శ్రీలంక, నేపాల్, బర్మా వరకూ ఆయన తాను తిరిగానని స్వయంగా ఎక్కిరాల భరద్వాజ గారికి చెప్పినట్టుగా రికార్డ్ చేయబడింది. ఇంకా ఆయన విశ్వవిఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారి స్నేహితుడని చెబుతారు. కృష్ణమూర్తి గారు మద్రాస్ వచ్చినప్పుడు ఆయన్ను తప్పక కలిసేవారట.
విశాఖ గిరిజన ప్రాంతాలలో ఆయనను భక్తితో ఆరాధిస్తారు. ఆయన నివసించిన చోటల్లా ఒక ఆశ్రమం ఏర్పడింది. గిరిజనులే ఆ చోట్లను దేవాలయాల్లా పూజిస్తారు. ఆయన ప్రకృతి సౌందర్యాన్ని అమితంగా ప్రేమించడం వల్ల ఆయనకి ఆత్మసాక్షాత్కారం అయిందని కొందరు చెబుతారు.
లంబసింగి దగ్గరలోని కిటుమల ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆయనలో కుండలిని శక్తి మేల్కొని ఆయన దేహం విపరీతంగా వేడెక్కేదని, ఆ వేడిని చల్లార్చడానికి వందలకొద్దీ కడవలతో నీళ్ళు ఆయనపై పోసేవారమని అక్కడి వృద్ధ గిరిజనులు నాకు చెప్పారు. ఈ ఘటనను పోలిన ఘటనల్ని జిడ్డు కృష్ణమూర్తి, సౌరిస్ గార్ల జీవిత చరిత్రలలో చూడొచ్చు. Awakening సమయంలో కృష్ణమూర్తిగారి దేహం వేడెక్కి ఆయన ఒక సెలయేటిలో కూర్చునేవారట. అలాగే సౌరీస్ గారు రోజంతా అభ్యంగన స్నానం చేస్తూ గడిపేవారని, చర్మం కాలుతున్న వాసనను అనుభూతి చెందేవారని రాయబడి ఉంది.
దామరాజు వెంకట రామయ్య గారి జీవితం గురించి తెలుసుకోవాలని అనుకునేవారు
ఎక్కిరాల భరద్వాజ గారు రాసిన ‘నేను దర్శించిన మహాత్ములు – పాకలపాటి గురువు గారు’, యు. వి. ఏ. యన్. రాజు గారు రాసిన ‘సన్నిధి ‘ పుస్తకాల్ని చదవవచ్చు.
4
ఈ తూర్పు కనుమల్లో అత్యంత ఎత్తైన పర్వతాలైన దారకొండ, గాలి కొండలను సైతం నాన్న గారు, నేనూ కలిసి ఎక్కాము. ఒక బంతి సైజులో ఉన్న అడవి ఉసిరి కాయలను, తేనెను, ఒక్కోసారి పుట్ట గొడుగులనూ ఇంటికి తెచ్చేవారము.
హిమాలయాలను చూశాక, Tibetan Plateau అంచుల వరకూ వెళ్ళొచ్చాక- ధవళగిరి, మనస్లు, అన్నపూర్ణ లాంటి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 14 శిఖరాల్లో కొన్నింటిని ప్రత్యక్షంగా దగ్గర నుండి చూశాక- ఈ తూర్పు కనుమల సౌందర్యం ఇప్పుడు వెలవెలబోతోంది.
“నాకున్నదానితో
నేనెప్పుడూ
సంతోషంగా ఉండేవాడిని
నిన్ను చూశాక
నా సంతోషాలన్నీ కోల్పోయాను
నన్ను నేనే కోల్పోయాను
నీ దగ్గరకు శాశ్వతంగా రాలేను
ఇక్కడ ఉండనూ లేను”
అని తలచుకుంటూ కొన్నాళ్లు గడిపాక నాకు అర్థమయింది. బుద్ధుడిలా ఒక మధ్యే మార్గాన్ని కనుగొన్నాను. ప్రతి సంవత్సరం కొంత కాలం నేపాల్ లో గడపాలని నిశ్చయించుకున్నాను.
నేపాల్‌లో 6,000 మీటర్ల ఎత్తుకు పైగా ఉన్న 1310 పర్వత శిఖరాలు గుర్తించబడ్డాయి, వీటిలో 414 శిఖరాలు అధిరోహణకు అధికారికంగా తెరవబడ్డాయి. నేపాల్‌లో ప్రపంచంలోని 14 అత్యంత ఎత్తైన పర్వతాలలో 8 ఉన్నాయి, వీటిని 8,000 మీటర్ల శిఖరాలు అని పిలుస్తారు, వీటిలో:
1. మౌంట్ ఎవరెస్ట్ (8,848.86 మీ.) – ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం.
2. కాంచనగంగ (8,586 మీ.) – మూడవ అత్యంత ఎత్తైనది.
3. లోట్సే (8,516 మీ.) – నాల్గవ అత్యంత ఎత్తైనది.
4. మకాలు (8,485 మీ.) – ఐదవ అత్యంత ఎత్తైనది.
5. చో యు (8,188 మీ.) – ఆరో అత్యంత ఎత్తైనది.
6. ధవళ గిరి (8,167 మీ.) – ఏడవ అత్యంత ఎత్తైనది.
7. మనస్లు (8,163 మీ.) – ఎనిమిదవ అత్యంత ఎత్తైనది.
8. అన్నపూర్ణ (8,091 మీ) – పదవ అత్యంత ఎత్తైనది.
ఈ పర్వతాలన్నింటినీ అధిరోహించాలనే అత్యాశ నాకు లేదు. ఎంతో కఠినమైన శిక్షణ అవసరమైనటువంటి, కఠోర శ్రమతో కూడిన హిమాలయ శిఖర పర్వతారోహణకు నా శారీరక ధారుఢ్యం, మానసిక సంకల్పం ఇప్పటికిప్పుడు సరిపోతాయని అనుకోను. ఇప్పటికైతే నాకు నమ్మకం లేదు. రేపు ఎప్పుడైనా నాకు నమ్మకం కలగవచ్చు. అయినప్పటికీ వీటన్నిటి base camp వరకూ అయితే నేను చేరుకోగలను. ప్రత్యక్షంగా వీటిని ఎదురుగా నిలబడి చూడగలను. వీటి మహిమను అనుభవించగలను. కొంత ఎత్తు వరకూ ఎక్కగలను. కానీ శిఖరం వరకూ అంటే నాకు నమ్మకం లేదు. బహుశా 6000 మీ విభాగంలో కొన్ని పర్వతాలను ఎంచుకుంటే శిఖరం వరకూ చేరగలుగుతానేమో!
ఇదే ఇప్పుడు నా జీవిత లక్ష్యం. ఇంతకన్నా నేను చెయ్యగల గొప్ప పని జీవితంలో ఏదీ ఉండబోదని అర్థమయింది.
నాన్నగారు చెప్పారు, వయసులో ఉన్నప్పుడే హిమాలయాల్లో ఎంత అన్వేషణ చెయ్యగలిగితే అంతా అన్వేషణ చెయ్యమని, లేదంటే తరువాత నేను పశ్చాత్తాపపడతానని. అటువంటి పశ్చాత్తాపపడే పరిస్థితిని మాత్రం నేను తెచ్చుకోను. అంతవరకు చెప్పగలను.
*
Add comment