కొన్నిసార్లు అనిపిస్తుంది

1
ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది
నల్లని మబ్బులోంచి జారిన చినుకునై
మోహాల వెంట పడకుండా
నదిలోనో, సంద్రంలోనో కలిసిపోతే బావుండునని.మరోసారి అనిపిస్తుంది
ఏ దారానికి బందీ కాకుండా
మొక్కలో పుట్టి మట్టిలో కలిసిపోయే
పువ్వునైతే బావుండునని.ఇంకోసారి అనిపిస్తుంది
ఏ వేటకూ బలికాని
విహంగాన్నై గాలిలో తేలుతూ,
ఎగరడమే సుఖమనికొన్నిసార్లు అనిపిస్తుంది
ఆకలి, నిద్ర తప్ప
ప్రపంచంతో సంబంధం లేని
పసిపాప బోసినవ్వైపోతే బాగుండునని

చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది
నీ కన్నీటి చుక్కనై
రాలిపోయి ఇంకిపోతే గానీ
తృప్తి రాదని….

పదే పదే అనిపిస్తుంది
నేను నేనుగా….
నాదైన ప్రపంచంలో బతకగలిగే
లోకాలకు తరలిపోవాలని.

2

వాన అంటే నువ్వే

ఉదయం పదకొండు
అప్పటి వరకు మెరిసిన ఎండ
అప్పుడే చెప్పాపెట్టకుండా
మొదలైన వానలో కరిగిపోయింది
ఎండలో పొడిబారిన నేల
చల్లటి చినుకులకు తడిసి ముద్దవుతోంది.
తడి మట్టి వాసన
నన్ను సూటిగా తాకే నీ చూపులా
గమ్మతైన అనుభవం.
వాన అంటే నువ్వే గుర్తొస్తావు నాకు
ప్రతీ చినుకును దోసిటపట్టి
మనం ఆడుకున్న ఆటలు
కలిసి తాగిన కాఫీలు
ఓహ్ ….వానతో పాటు జ్ఞాపకాల జడివాన
బోలెడన్ని కబుర్లు
మరెన్నో నవ్వులు
తీయనైన ఊహలూ
అన్నీ దాచుంచాను నీ కోసం
వానలో నీతో మళ్ళీ మళ్ళీ గడిపే క్షణాల కోసం
జలాజలా రాలిపడుతున్న వాన చినుకులు
చెబుతున్నాయి ఎన్నో ఊసులు అచ్చం నీలానే
నన్ను తాకే ప్రతీ నీటిబొట్టు
తలపిస్తున్నాయి నీ స్పర్శనే
ఎప్పటికీ కలవని
నింగిని నేలని కలుపుతున్న వాన
నిన్నూ నన్నూ కూడా చేరువ చేస్తోంది
మనిద్దరి కలయికకు సజీవ సాక్ష్యం
అందుకే వాన అంటే నాకిష్టం
వర్షంలా తడిపేసే నీ ప్రేమంటే మరింతిష్టం.
*

మనోజ్ఞ ఆలమూరు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రెండు కవితలూ , నిర్మలంగా వున్నాయి . సరళంగా
    స్వఛ్ఛంగా , అమాయకమైన పడుచుహృదయం పాడిన
    పాటల్లాగా… అభినందనలు మనోజ్ఞ.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు