రేపు
నీకో కొత్త స్నేహితుడు
పరిచయం కాబోతున్నాడని తెలిసినప్పుడు
నాకు గొప్ప దుఃఖమే కలిగింది.
కొంత నీ గురించీ మరికొంత తన గురించీ
తను నిన్ను తీసుకెళుతున్నాడో
నువ్వు తనతో వెళుతున్నావో
నాకర్థం కాలేదు.
యెందుకంటే అప్పటికే నీటిమూటలు నా కళ్ళనిండా నిండిపోయాయి
ఆ రాత్రి మేడ మీద కొన్ని కబుర్లు చెప్పుకున్నాం
ప్రతి వొక్కరికీ వొక స్నేహం తప్పదనీ
తను కలుపుకునే స్థితి నిశ్చితమనీ
తెలిసే వుంటుంది.
రెక్కల పక్షి యేర్పడ్డ కొత్త రెక్కలతో యెగరడం
ఆకాశం పోసిన నీళ్ళతో నది నడవడం
నీటివల్లో తడిజీవాలు చేరడం యిలా చాలానే చూశాం
వెళ్ళొద్దనీ
వెళ్లక తప్పదనీ
నీకూ నాకూ
తెలుస్తూనే వుంది.
తన పరిచయం కూడా
నాకొద్దన్నావు
నేను పొర్లిపొర్లి నీ మెడ చుట్టూతా
అల్లుకున్నా నీ విరమణ తధ్యమన్నావు.
ఆ క్షణం
ఆ వొక్క క్షణం
నేనేమని వివరించను నిన్ను
నాకేమవుతావని చెప్పడం
వొక్క సహవాసమేగా మన మధ్యన వున్నది
సరే నీ కొత్త స్నేహితుడిని అడ్డుకుందామని అనుకున్నా నా వల్ల కాలేదు
మరుసటి వుదయం తను రానే వచ్చాడు
నిన్ను తీసుకుని వెళ్ళాడు.
వొక శూన్య వూపిరి
వొక నిశ్శబ్దం
వో అనిశ్చల శరీరం
నాకు మిగిలాయి.
యిప్పుడు తను నాక్కూడా స్నేహితుడయ్యాడు నువ్వెళ్లిన క్షణమే.
అవును నీ స్నేహితుడి పేరు చెప్పలేదు కదూ,
మరణం.
*
Superb poem.. Congrats