తెలుగు చదివేవాళ్లు తక్కువైపోతున్నారన్న బాధ ఎక్కువైపోతున్నా, తెలుగు సాహిత్య సభలకు తక్కువేమీ లేదు. అనుదినం ఎక్కడో వొక చోట పెద్దదో, చిన్నదో సభ జరుగుతూనే వుంది. సాహిత్యం ఆ విధంగా రోజువారీ బతుకులో భాగంగానూ మారిపోయింది. అయితే, ఈ వారాంతం డాలస్ లో జరిగిన అమెరికా తెలుగు రచయితల సదస్సు సగటు సభలకు భిన్నంగా వుందనే చెప్పాలి. చాలా కారణాలు చెప్పచ్చు కానీ, చిన్నప్పటి నించీ వందల సాహిత్య సభలు చూసిన అనుభవంలోంచి నాకు మూడు బలమైన కారణాలు కనిపించాయి: 1) సభలో ప్రసంగాల కన్నా చర్చలు ప్రధానంగా సాగడం, 2) పొగడ్తలూ తెగడ్తల కన్నా విషయ విశ్లేషణ మీద ఆసక్తి, 3) తెలుగు నాట సభల్లో కన్నా ఈ డాలస్ సభలో మహిళలు ఎక్కువగా కనిపించడం!
ఇక్కడ ఈ సదస్సు నిర్వహకులలో వొకడిగా మాట్లాడడం లేదు. వొక మామూలు శ్రోతగా, ప్రేక్షకుడిగా మాత్రమే మాట్లాడుతున్నాను. ఇక్కడ వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు నావే కాకుండా, నాతోపాటు సదస్సులో వున్న అనేకమంది అభిప్రాయాల echo కూడా ఇందులో వినిపించవచ్చు.
సాధారణంగా సాహిత్య వేదికల మీద మాట్లాడేవాళ్ళకి ఎంత సమయం ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది. విషయం సూటిగా వున్నప్పటికీ, చెప్పాల్సిన సంగతులు బోలెడు వున్నాయన్న భావన వక్తల్లో మిగిలిపోతుంది. కానీ, డాలస్ సదస్సులో అట్లాంటి అత్యుత్సాహం ఆట్టే కనిపించలేదు. నిజానికి కొందరు వక్తలు వాళ్లకిచ్చిన నాలుగు నిమిషాల లోపే హాయిగా ముగించేశారు. చర్చకిచ్చిన సమయంలో వొకరిద్దరు బలవంతంగా, అనవసరంగా దూసుకొచ్చే ప్రయత్నాలు చేయకపోలేదు. కొందరు ప్రశ్నల పేరుతో వాళ్ళ సొంత ప్రసంగాలిచ్చిన సందర్భాలూ లేకపోలేదు. ఎంత పకడ్బందీగా నియమనిబంధనలు పెట్టుకున్నా, అప్రస్తుత ప్రసంగీకులు హమేషా వుంటారు. డాలస్ సదస్సులో మోడరేటర్లుగా వ్యవహరించిన వారు సున్నితమైన క్రమశిక్షణతో అలాంటివి బాగానే కట్టడి చేశారు. ఎంత చేసినా, నేర్చుకోవాల్సిన పాఠాలు ఎప్పుడూ కొత్తగానే వుంటాయి. ఈసారి నేర్చుకున్న పాఠం: పదేపదే ప్రశ్నా ప్రసంగాలతో ఉక్కిరిబిక్కిరి చేసే వాళ్ళని ఎలా కట్టడి చేయాలా అని!
మనమంతా పొగడ్తలకూ తెగడ్తలకూ తెగ అలవాటు పడిన వాళ్ళం. డాలస్ సదస్సులో మటుకు అలాంటివి అరుదు. వొకరిద్దరు వొకటికి మించి రెండు సార్లు అవసరానికి మించి పొగడ్తలకి పూనుకున్నా , మోడరేటర్లు సంయమనంతో వ్యవహరించి, నైపుణ్యంతో వెనక్కి లాగేశారు. ఆ పొగడ్తలోని “అతి” తెలిసిన సునిశితమైన ప్రేక్షకులు నవ్వి వూరుకున్నారు. ఇక తెగడ్తలు తక్కువేమీ కాదు. గత నాలుగైదు ఏళ్లుగా అమెరికా తెలుగు రచనలు రాశిలోనే కాకుండా వాసిలో కూడా బలపడ్డాయి. వాటివైపు కన్నెత్తి కూడా చూడకుండా పెద్ద పెద్ద తీర్పులు వదిలిన వాళ్ళు లేకపోలేదు. అయినా, చాలా మటుకు ప్రసంగాలూ, చర్చలూ విశ్లేషణ వైపు మొగ్గు చూపడం ఆహ్వానించ దగిన మార్పు. సాహిత్యానుశీలన అనేది వ్యక్తిగత అభిరుచి అనడంలో సందేహం లేదు గాని, వీలైనంత objectivity వైపు ప్రయాణించడం వల్ల ఎక్కువ నేర్చుకునే అవకాశం వుంటుంది. ఎక్కువ ప్రసంగాల్లో ఆ సానుకూల ధోరణి కనిపించడం వల్ల ఈ సదస్సుకి హాజరయిన కొత్త సాహిత్యాభిమానులు కూడా హాయిగా ఫీల్ అయ్యారు. మిగిలిన సభల్లో కంటే ఈ సారి ఎక్కువమంది కొత్తవాళ్లని, నలభై లోపు వయసు వాళ్ళనీ చూడడం, వాళ్ళతో మాట్లాడే అవకాశం రావడం నా మటుకు నాకు ఆహ్లాదంగా అనిపించింది.
సాహిత్య సభల్లో మహిళల ప్రాతినిథ్యం గురించి హైదరబాద్ స్నేహితులు (ముఖ్యంగా రచయిత్రులే !) చాలా మంది ఎంతో బాధపడడం గత ఏడాదిగా వింటున్నాను. నిజంగానే హైదరబాద్ సాహిత్య సభల్లో మహిళల హాజరీ తగ్గుతూ పోతోంది. అందుకు భిన్నంగా డాలస్ సదస్సులో సగం పైగా మహిళలు పాల్గొనడం సంతోషంగా అనిపించింది. ఇది కేవలం హాజరీ కాకుండా, వేదిక మీద వక్తల్లోనూ, వేదిక కింద చర్చల్లోనూ వాళ్ళ భాగస్వామ్యం నాకు ఆదర్శంగా కనిపించింది.
ఇలాంటి పెద్ద పని పెట్టుకున్నప్పుడు, కొన్ని చిన్న లోపాలు సహజం. అయితే, అది నిర్వహకుల పొరపాటు కాదు. కనీసం సదస్సులో మాట్లాడడానికి వచ్చే ముందు అయినా కొందరు వక్తలు కొన్ని రచనలైనా పైపైన చదివి వుంటే బాగుండేదని చాలా సార్లు అనిపించింది. నిర్వాహకులు ప్రశ్నలు ముందే పంపించారు కాబట్టి, ఆయా విషయాల గురించి కొంత హోం వర్క్ చేసి వస్తే ఇంకాస్త నిర్దిష్టమైన చర్చకి తావుండేది.
ఇది రెండో అమెరికా తెలుగు రచయితల సదస్సు . కోవిడ్ కి ముందు కాలిఫోర్నియాలో మొదటి సదస్సు జరిగింది. మొదటి ప్రయత్నమే అయినా, కాలిఫోర్నియా సదస్సు సక్సెస్ చిన్న విషయమేమీ కాదు. కచ్చితమైన నియమ నిబంధనలతో, సమయ పాలనతో, నిర్దిష్టమైన విషయ చర్చలతో ఆ సదస్సులోనే పునాది పడింది.
డాలస్ సదస్సుతో ఆ పునాది ఇంకాస్త బలపడింది. ఇక మూడో సదస్సు ఎక్కడ ఎప్పుడు ఎలా అన్న చర్చలూ ఎదురుచూపులూ ఇప్పటికే మొదలయ్యాయి!!
*
డాలస్ సదస్సు ఫోటోలు: ఇస్మాయిల్ సుహైల్ పెనుకొండ
నలభై లోపు వయసు వాళ్ళనీ చూడడం, వాళ్ళతో మాట్లాడే అవకాశం ఆహ్వానించదగ్గ పరిణామం!
అలాగే సదస్సులో సగం పైగా మహిళలు పాల్గొనడం కూడా అభిలషణీయం.
బావుంది బావుంది
Good review of the sadassu. Substantial number of women participation is quite good. As you have put it mike veerulu untaru tappadu.