అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళింది
గాజుల్నీ చీరల్నీ
ఎంతో ఇష్టపడి వేసుకున్న బొమ్మల్ని
ఎవర్నీ తనతో తీసుకెళ్లలేదు
వెళ్ళిపోవడాన్ని
ఎందుకంత ఇష్టపడింది?
చివరి రోజుల్లో
ఊపిరి ఆగిపోవడాన్ని
ఎందుకు అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమించింది?
జీవితం కింద
అంతలా నలిగిపోయిందా.
పరోక్షంలో
తన బొమ్మల ఆటను చూడాలన్నది
అప్పటికప్పుడు పుట్టిన ఊహా?
లేక అదీ పాతదేనా.
కాలం అవునని తలాడించకపోతే
కేవలం చేతులతో
మీసాల చుట్టూ తిరగని
అంత సున్నితమైన బొమ్మల్ని నిర్మించిందంటే
ఎవరూ నమ్మలేరు
రోజూ వాక్యాలతో
ఆమె బొమ్మను గీస్తూనే వున్నాను
చివరాఖరి రోజు
నేనూ అన్నీ వదిలేసి వెళ్తాను
అమ్మ బొమ్మతో సహా.
ఒక అంతర్ధానం వెనుక దాగిన
రహస్యం ఎప్పుడూ పాతదే
మెలకువగా ఉన్నప్పుడు
మన చేతులతో మనం గీసుకున్న బొమ్మలే
కొత్తవి.
*
చిత్రం: సృజన్ రాజ్
Add comment