కొత్త చొక్కా

“ఆయన పేరు పెట్టినందుకు నీకంతా మీ తాత పోలికలేరా బాబి” అంది బుచ్చప్ప తన పెద్ద మనవడు కృష్ణ వంక మురిపెంగా చూస్తూ.

వేసవి సెలవల్లో మనవలందరూ మధ్యాన్నం పెరట్లో గట్టుమీద చొక్కాలు విప్పి బంగినపల్లి మామిడిపళ్ళు  తింటోంటే బుచ్చప్ప పడకకుర్చీలో కూర్చొని మనసునిండా  వారిని చూసుకుంటోంది. రోజుకి రెండుకాయలే కోసి వంతులవారీగా చెంపలోకరోజు, టెంకలోకరోజు యిస్తుంది మనవలకి. ఎక్కువగా తింటే పిర్ర మీద సెగ్గెడ్డలు వస్తాయని ఆ రేషను.

ఆ రోజు టెంక వంతు కృష్ణగాడి బాబాయ్ కొడుకు అంజిగాడిది. టెంక పట్టు దొరకక జారిపోతుందన్న భయంతో అవస్థపడుతున్న అంజిగాడిని చూసి ” ఒరేయ్ నా చెంప నువ్వు తీసుకొని నీ టెంక నాకివ్వరా” ప్రేమగా అందించాడు పదేళ్ల వయసున్న కృష్ణ.

“ఆహా! నువ్వు గాంధీగారి కన్నా గొప్పవాడివిరా కృష్ణా” నవ్వుతూ అన్నాడు పక్కనే అరుగు మీద కూర్చున్న బాబాయ్.

“ఎలా బాబాయ్?” అడిగాడు అర్థంకాక అమాయకంగా కృష్ణ.

“గాంధీగారు చెంపకి చెంప ఇవ్వమన్నారు. నువ్వు ఒక అడుగు ముందుకేసి టెంకకి చెంప ఇస్తున్నావురా! శభాష్” అన్నాడు మెచ్చుకోలుగా బాబాయ్.

“చాల్లే వేళాకోళం. కృష్ణగాడిది దొడ్డ మనసు” అని పొంగిపోతూ బుచ్చప్ప వాడిని తాతగారితో పోల్చింది.

బుచ్చప్పకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు. అందరికీ తలా ఒకరు పిల్లలు. పెద్దకొడుకు విజయవాడలోను, కూతురు హైద్రాబాదులోను వుంటారు. తాను చిన్నకొడుకు కుటుంబంతో కాకినాడలో కాలక్షేపం చేస్తోంది.
ప్రతి వేసవిసెలవల్లాగే ఈసారి కూడా పెద్దకొడుకు పెళ్ళాం పిల్లలతో వచ్చాడు. కూతురు వచ్చేవారం వస్తోంది.

“తాతగారు ఇంకా ఎం చేసేవారే” ఉత్సాహంగా అడిగాడు కృష్ణ బామ్మ పొగడ్తకి ఆనందపడుతూ.

ఆయన గురించి అడగటమే ఆలస్యం.. మాధవుడి గురించి రాధలా ఎంత చెప్పినా తనివి తీరదు బుచ్చప్పకి.

“అసలు ఆ రోజుల్లో ఆయన దర్జా అవీ ఇప్పుడు ఎవరికున్నాయిరా?” అని మొదలుపెట్టింది.
“ఆయన అప్పర్ సీలేరులో ఇంజినీరుగా పనిచేసేవారు. ఆయన నిజాయితీకి పై ఆఫీసర్లు కూడా హడలిపోయేవారు. పని దగ్గర అంత నిక్కచ్చిగా ఉండేవారు. అయితే పైకి గంభీరంగా వున్నా మనసు మాత్రం కర్ణుడిది. ఎన్ని దానాలో, ధర్మాలో! అప్ప్పుడప్పుడు మనకీ ముగ్గురుపిల్లలున్నారు కొంచెం ఆలోచించండని వారించేదాన్ని.

ఒకసారి సీలేరులో ఏంజరిగిందంటే … సీలేరంటే వైజాగ్ దగ్గర చిన్న ఏజెన్సీ ప్రాంతం. మీరెప్పుడూ  వినుండరు. అక్కడ ఎముకలు కొరికే చలి. ఒకరోజు సాయంత్రం తాతగారు ఆఫీస్ నుండి జీపులో చొక్కాలేకుండా ఉత్తి బనీనుతో ఇంటికి వస్తే మతిపోయి ఏమిటని డ్రైవర్ వంక ఆశ్చర్యంగా చూస్తే “దార్లో బస్సు స్టాండ్ దగ్గర ఒకతను సొక్కా లేకుండా సలిలో ముడుసుకోవడం సూసి .. బాబుగారు ఆయన సొక్కా ఇడిసి ఆ మడిసికి ఇచ్చేసారమ్మ” అన్నాడు ఆదర్శభావంతో డ్రైవరు

భోజనం వడ్డిస్తూ “అదేమిటండీ చోద్యం కాకపొతే.. ఇంత చలిలో ఒంటి మీద గుడ్డ ఇచ్చేస్తారా? మీకు జలుబు చేస్తే?” అన్నాను మందలింపుగా…

“మహా అయితే నా చలి ఐదు పది నిమిషాలు. నాకంటే ఆ చొక్కా వాడికే ఎక్కువ అవసరం బుచ్చి” అని ఒక్క మాటలో తేల్చేశారు అని ఆ సంఘటన చెప్పి బుచ్చప్ప ఒక నిమిషం కళ్ళు మూసుకుని గతం తాలూకు తీపి జ్ఞాపకాలని ప్రశాంతంగా ధ్యానించుకుంది.

“అవునమ్మా.. ఈ సినబాబుగోరు కూడా… బాబుగారి లాగానే ఎప్పుడూ.. “భోంచేసావా ఈరయ్య” అని ఆప్యాయంగా పలకరిత్తారమ్మా” అని ఆస్థాన పనివాడు వత్తాసు పలకగా.. మళ్ళీ బుచ్చప్ప ఈ లోకంలోకి వచ్చింది.

“ఇంకా” అన్నాడు ఆసక్తిగా కృష్ణ మిగిలిన మనవలతో కలిసి. ఈ తాతగారి కథలు మనవలందరికీ, ముఖ్యంగా కృష్ణకి బాగా నచ్చాయి.

“ఇంక అంతే ఇవాళ్టికి. వీరయ్య బోరింగ్ కొడతాడు వెళ్లి మూతులు కడుక్కోండి” అని చెమర్చిన కళ్ళతో అక్కడినించి లేచి వంటింటిలోకి వెళ్ళింది బుచ్చప్ప.

ఈ ఉదంతం విన్న తరవాత కృష్ణకి తాతగారంటే ఆరాధనాభావం పెరిగింది. తనకి కూడా ఇలాంటి గొప్ప సాయం చేసే అవకాశం వొస్తే ఎంత బాగుణ్ణు అనుకున్నాడు. ఆ రోజు సాయంత్రం బజ్జీలు తినడానికి  కరణంగారి జంక్షన్ కెళ్ళినప్పుడు.. ఎవరైనా చొక్కాలేని  పిల్లలు వీధిలో కనపడతారేమోనని ఆతృతగా చుట్టూ కలియ చూసాడు.

మరనాడు బామ్మతో “త్రిపురసుందరి గుడికి వెల్దామే బామ్మ” అన్నాడు కృష్ణ.

“ఎరా?” అని ఆరా తీస్తే… “వూరికేనే  చాలా రోజులు అయ్యింది కదా” అని మాట దాటేశాడు.

త్రిపురసుందరి గుడి దగ్గర వీధిపిల్లలు ఉన్నట్టు గుర్తు కృష్ణకి. తీరా అక్కడకి వెళ్ళేదాకావుండి అంబారావం చేస్తున్న ఒక ఆవు..బద్దకంగా ముడుచుకు కూర్చున్న రెండు ఊరకుక్కలు తప్పితే.. ఆ రోజు గుడి బయట చొక్కాలేని వాళ్ళు ఎవరూ కనపడలేదు.

ఒకటి రెండు రోజులు పక్క సందులో ఉన్న గుడిసెల్లో వెదికాడు. ఎవరైనా తన ఈడు పిల్లలున్నారేమోనని. కానీ అక్కడ అందరూ అచ్చాదనతోనే ఉన్నారు. ఎదో ఒక రోజు కనపడతారులే అని ఊరుకున్నాడు.

తరవాత వారం రానే వచ్చింది..  బుచ్చప్ప కూతురు హైదరాబాదునుండి దిగింది.

మేనత్త రాకతో ఇంట్లో సందడి పెరిగిపోయింది. హైద్రాబాదు నుండి పిల్లలందరికీ ఎప్పుడూ ఏదో ఒకటి తీసుకొస్తుంది ముద్దుల మేనత్త. బుచ్చప్పకి కొత్త వ్యాసపీఠం, యోగవాశిష్ట్యం సీడీలు, పిల్లలకి బట్టలు, వాచీలు తీసుకొచ్చింది.

“ఇదిగోరా కృష్ణ క్రితం సారి నువ్వడిగిన చేర్మాస్ (‘Chermas) రెడీమేడ్ చొక్కా. సైజు సరిపోయిందేమో వేసుకు చూడు” అని అత్త పచ్చరంగు చేర్మాస్ చొక్కా తన చేతికిచ్చింది.

కృష్ణ ఆనందానికి ఆనాడు అవధుల్లేవు. ఈ చేర్మాస్ బ్రాండ్ ఒక్క హైద్రాబాదులోనే దొరుకుతుంది. గ్రీన్ తన ఫేవరట్ కలర్. పైగా చొక్కాకి కింద సైడులో కట్ ఉంటే కృష్ణకి మహా ఇష్టం. షర్ట్ టక్కు చెయ్యక్కరలేదు. కట్ వల్ల చొక్కా మరీ పొడుగ్గానూ కనిపించదు. విజయవాడలో ఆనంద్ టైలర్స్ లూసు చొక్కాలు వేసుకొని విసుగొచ్చింది.

అర్జెంటుగా చొక్కాకి పసుపుబొట్టు పెట్టి ఎంతో అపురూపంగా వేసుకున్నాడు. తాను అనుకున్నదానికన్నా బాగా ఫిట్ అయ్యింది. భుజాలు, పొడుగూ అన్ని సరిపోయాయి. గుడ్డ కూడా మెత్తగా హాయిగా ఉంది వంటిమీద. ఎప్పుడు ఎప్పుడు బయటకి వేసుకెడదామా అని ఉవ్విళ్ళూరాడు.

కాగల కార్యం… అన్నట్టు.. ఆ రోజు సాయంత్రం పిల్లకాయలందరినీ  పక్కనున్న గాంధీనగరం పార్కికి తీసుకెళ్తానని బాబాయ్ ప్రతిపాదించాడు. పిల్లలందరూ ఎగిరి గంతేశారు. కృష్ణ అందరికన్నా ఒకడుగు ఎక్కువే గెంతాడు. నాలుగింటికల్లా  స్నానాలు చేసి హుషారుగా తయారయ్యి కూర్చున్నారు కొంచెం చల్లపడితే బయలుదేరుదామని. అంత అర్జెంటుగా ఎందుకురా అని అమ్మ అంటున్నా  వినకుండా కృష్ణ  చేర్మాస్ చొక్కా వేసుకుని పౌడర్ పూసుకొని ప్యాంటు జేబుల్లో రెండుచేతులూ దోపి స్టైల్గా అద్దం ముందు సుమారు ఒక గంటదాకా స్వముద్దులో గడిపాడు. దారి పొడుగునా తాను వేసుకున్న చొక్కాని చూసుకొని మురిసిపోయాడు.

పార్కు చేరేకా గేటు బయట పిడతకిందపప్పు బండి వాడి నిమ్మకాయ, ఉల్లిపాయ వాసనకి పిల్లలందరికీ నోట్లో నీళ్ళూరాయి.

“బాబాయ్” అని బండి దగ్గర ఆశగా ఆగారు పిల్లలందరూ. బండివాడు టకటకా మరమరాలు, ఉల్లిపాయ, కొత్తిమీర, కారప్పూస, నిమ్మరసం, కారం, పల్లీలు కలిపి ఘుమఘుమలాడే మిక్స్చర్ కాయితం పొట్లాల్లో చుడుతున్నాడు.

“నాకు కొంచెం నిమ్మకాయ ఎక్కువ పిండండి” అని బండివాడితో చెప్తుండగా.. హఠాత్తుగా కృష్ణ చూపు బండికి అవతల ఉన్న ఇద్దరి వీధి పిల్లలమీద పడింది. ఒక్కసారిగా నీరుగారిపోయాడు. అందులో ఒకడికి చొక్కా లేదు.

రెండడుగులు ముందుకేసి శ్రద్ధగా చూసాడు. ఆ చొక్కాలేని పిల్లాడు దాదాపు తనంత ఎత్తే! కృష్ణ గుండె  వేగంగా కొట్టుకుంది.

ఆ పిల్లవాడు తనని చూడలేదు కదా అనుకుని చకచకా పార్కులోకి వెళ్ళిపోయాడు. జారుడుబల్ల మీద జారుతున్నా.. గుండె కడుపులోకి జారట్లేదు. బరువెక్కిపోయింది. ఏడుపు రావట్లేదు గాని ఎదో దిగులుగా అయితే ఉంది.

“అదేమిటి ఇన్నాళ్లూ కనపడని వాడు ఈ రోజు కనపడ్డాడు? అయినా తాతగారు చేసినపనే నేను కూడా చెయ్యాలని ఏమి లేదు కదా. ఇదేమి మొక్కు కాదుగా. అయినా ఈ చొక్కా అతనికి కొంచెం లూస్ అయ్యేలా వుంది. రేపు యింకో చొక్కా తెచ్చిస్తా. ఈ పచ్చరంగు నచ్చక పోవచ్చు అతనికి. నా ఇష్టం తనమీదకి ఎందుకు రుద్దడం? బాబయిని అడిగి కొంత డబ్బు ఇప్పించ్చచ్చు. అప్ప్పుడు కావలసిన చొక్కా అతనే కొనుక్కుంటాడు. లేకపోతే చొక్కా బదులు ఆ పిల్లాడికి మంచి భోజనం పెట్టిస్తా. స్కూల్ బోర్డు మీద అన్నిదానముల కన్నా అన్నదానమే గొప్ప అని రాశారు కూడా.

ఇలా పరిపరి విధాల ఆలోచించాడు. జారెడుబల్ల నుండి రాకెట్ దగ్గరికి వెళ్ళాడు. ఒకటి ఒకటిగా ఆ ఇనపమెట్లు ఎక్కసాగాడు. పక్కనే పిల్లలు చేస్తున్న రొద తన చెవికి ఎక్కట్లేదు. “అన్నయ్యా.. చూడు.. ఇటు.. ఇటు… అని అంజిగాడు అరుస్తొంటే పరధ్యానంగా ఒక నవ్వు నవ్వి మళ్ళీ ఆలోచనలలో మునిగాడు..

“సీలేరులో అంటే చలి కాబట్టి చొక్కా ఇచ్చినా అర్థముంది.. కాకినాడలో చలేమిటి? ఉక్కపోసి ఉన్నవాళ్లే చొక్కాలిప్పేస్తోంటే” అని తనను తానె సమర్ధించుకున్నాడు.

కానీ చొక్కా వుంటే పాపం రాత్రి పూట దోమలు కుట్టవుగా అని అనిపించింది మళ్ళీ తనకే. రాకెట్టు రెండో అంతస్తు ఎక్కాడు.. తాతగారు నా చోట్లో వుంటే ఇంత ఆలోచించేవారా. ఆ బండి దగ్గర వాణ్ని మొదట చూసినప్పుడే ఇచ్చేసి చక్కావచ్చేవారేమో అనుకున్నాడు. బాబాయి చేత డబ్బు ఇప్పిస్తే అందులో తన ఇచ్చినదేముంది? ఆ డబ్బు తనది కాదు. ఈ చొక్కా అయితే తనకి బహుమానంగా వచ్చింది కాబట్టి దానితో ఏమి చేసినా ఆ ఫలితం తనకి వర్తిస్తుంది అని తర్కించుకున్నాడు.

మూడో అంతస్తు ఎక్కాడు.. “దాని అవసరం నాకంటే వాడికే ఉంది బుచ్చి” అన్న తన తాత మాట గుర్తుకు వచ్చింది. క్రితంవారం ఎలాగైనా సరే చొక్కా ఇద్దామని అన్ని చోట్లా తిరిగాను. ఇవాళ నా ముందు కనపడేసరికి వంకలు వెతుకుతున్నాను. తనకి అక్కరలేనిది పక్కవాడికిస్తే అది దానం ఎలా అవుతుంది? తనకి కావలసిందీ ఇంకొకడికి దాని అవసరం ఇంకా ఎక్కువవుండీ అది వారికిస్తే .. అది కదా నిజమైన దానం.. అని మనుసులో స్ఫురించింది.

పై అంతస్తు నించి చుట్టూ కలియ చూసాడు.. దూరంగా అదే బండి దగ్గర ఆ పిల్లవాడు కనపడ్డాడు. హమ్మయ్య అనుకున్నాడు.

గబగబా రాకెట్ దిగి.. తన చొక్కా గుండీలు ఒక్కొక్కటిగా తీస్తూ “ఈసారినించి అత్తని రెండు ఒకే రంగు చేర్మాస్ చొక్కాలు తెమ్మని అడగాలి” అనుకుంటూ ఆ బండి వైపుగా నడిచాడు.

చొక్కాలేకుండా ఇంటికి వచ్చిన మనవడిని ఆశ్చర్యంతో చూసిన బుచ్చప్పతో… “వీడికి నాన్న పోలికలు బాగా వచ్చాయమ్మా” అన్నాడు బాబాయ్.

*

రాజశేఖర్ తటవర్తి

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథరాసే నేర్పు ఉండాలిగాని, ఎలాంటి
    సంఘటననైనా అందమైన కథగాఅల్లొచ్చు అని
    మరోసారి నీద్వారా తెలిసింది.
    సాధారణంగా ఈతరం యువకులలో కొంచెం
    తక్కువగా కనిపిస్తున్న తెలుగు పలుకుబడి నీదగ్గర
    మాత్రం పుష్కలంగా కనిపిస్తోంది.
    కథ చెప్పడంలో మంచి ఒడుపు ఉంది. కనక
    మంచి మంచి అంశాలు స్పృశిస్తూ, ఇంకా విస్తృతంగా
    కథలు రాయాలని ఆశిస్తూ… సి.యస్.

  • కథ చెప్పడంలో మంచి ఒడుపు ఉంది.
    కథ రాసేనేర్పు ఉండాలే కానీ, ఎలాంటి సంఘటననైనా తీసుకుని, అందంగా కథ
    అల్లొచ్చు అని మరోసారి నీకథద్వారా చెప్పావు.
    సాధారణంగా ఈతరం యువకులలో కొంచెం
    తక్కువగా కనిపిస్తున్న తెలుగు పలుకుబడి,
    నీదగ్గర మాత్రం పుష్కలంగానే కనిపిస్తోంది.
    ఇంకా మంచి మంచి కథాంశాలు తీసుకుని,
    మరిన్ని కథలు రాయాలని ఆశిస్తూ…సి.యస్.

  • చాలా చక్కగా ఉంది కథానిక. చదువుతూ ఉంటే హాయిగా అనిపించింది మనసుకి కూడా. నువ్వు ఎంచుకున్న పదాలు కూడా కథకి అనుకూలంగా పద్ధతిగా ఉన్నాయి.

  • ఎంత చక్కని తెలుగు!! ఎంత బాగుందో కథ చదువుతుంటే!! హ్యాట్సాఫ్ రాజ్ గారు.. చాలా బాగా రాశారు 👌

  • My childhood was spent in kakinada. going to the park in the evening was our regular habit.enjoying pidathakindapappu was another very enjoyable habit. Your story took me decades back in time.
    I like your writing style and your command over telugu is awesome.
    Thank you.
    Ps: your mil is my best friend
    Thanks to her too for sharing your stories.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు