వాయిస్ లేని వారికి వాయిస్:దగ్గుమాటి పద్మాకర్
-మీ కథల మీద ఒక అభిప్రాయం ఏమంటే… ముందే ఒక వాదం/ ఆర్గ్యుమెంట్ ని అనుకుని దానికి అనుగుణంగా, దాన్ని నెగ్గించుకునేందుకు కథ రాస్తారని. దీన్ని మీరు ఒప్పుకుంటారా.. ?
నా కథల్లో వాదన (ఆర్గ్యుమెంట్) ఉంటుంది. నిజమే, ఐతే నా ఆర్గ్యుమెంట్ దీనులకు, వాయిస్ లేని వారికి వాయిస్ గా ఉంటుంది. ఇలాంటి వర్గాలకు నా కథలు వాయిస్ ఇస్తున్నందుకు గర్వపడతా కూడా. కథల్లో వాదం ఉండకూడదూ అని ఎవరైనా అంటే అది తప్పుడు వాదన. కథల్లో వాదన ఉండకూడదన్న రూల్ ఏమీ లేదు కదా. నా కథలో వాదన కేవలం ఆర్గ్యుమెంట్ రూపంలో ఉండదు. కథా రూపంలో ఉంటుంది. పైగా నా కథల్లో ఉంది కేవలం ఆర్గ్యుమెంట్ మాత్రమే కాదు. వాస్తవానికి ఒక అంశం లేదా కేసు గురించి లాయర్లు ఫీజు తీసుకుని వాదిస్తుంటారు. నేను సమూహం కోసం ఉచితంగా వాదిస్తున్నాను. పైగా నాకథల్లో ఆర్గ్యుమెంట్ ఆసక్తిలేకుండా ఉండందు. అంతర్లీనంగా ఉంటుంది. ఒక వేళ నా కథల్లో ఆర్గ్యుమెంట్ఎవరికి ఇబ్బందిగా ఉంటుందంటే ….. ప్రజా వ్యతిరేకులకు, ప్రజా వ్యతిరేక విధానాలను సమర్థించే వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. అది అవసరం కూడా అని నేను అనుకుంటాను.
-సుమారు ముప్పై ఏళ్లుగా కథలు రాస్తున్నారు. కొందరు రెండు మూడేళ్లలో సంకలనాలు తీసుకొస్తున్న తరుణంలో మీకు ముప్పై ఏళ్లు పట్టడం ఆశ్చర్యమే.
– మొదట ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఒక రచయిత ప్రతిభకు కథలు ప్రామాణికం అవుతాయే కానీ రచయిత రాసిన కథల సంఖ్య, కథా సంకలనాల సంఖ్య కాదని బలంగా నమ్ముతాను. నేను గత మూడేళ్ల కిందట వరకూ కూడా అసలు కథా సంకలనం వేయాలని అనుకోలేదు. కథా సంకలనం వేద్దాం అని అనుకున్న తర్వాత అనేక సంఘటనలను గమనించాను. మరీ ఆశ్చర్యం కలిగించే సంఘటన కథా సంకలనం వేసుకోగల ఆర్ధిక స్థోమత, తాహతు ఉన్న వాళ్లు కూడా దాతల దగ్గరనుంచి చందాలు అడుక్కొని సంకలనం తీసుకురావడం. కార్లల్లో తిరిగే వాళ్లు కూడా దాతల చుట్టూ చందాల కోసం తిరగడం ఎంతవరకూ సమంజసం…? అంటే రచయితలకు తమ రచనల మీద, తమ కథల పట్ల నమ్మకం, విశ్వాసం లేకపోవడమా, మరేదైనానా…? నేను నా కథా సంకలనం నా కష్టార్జితంతో, నా సొంత డబ్బుతో వేయాలనుకున్నాను. ఆ డబ్బు నాకు సమకూరాక నా సంకలనం తీసుకొచ్చాను.
***
సొంతగా ఆలోచనలు :అక్కిరాజు భట్టిప్రోలు
1. మూడు బీర్ల తర్వాత….. పాఠకులు ఎలా స్పందిస్తున్నారు.?
– స్పందన బాగానే ఉంది. విడివిడిగా కథలు చదివినప్పుడు రచయితగా నా నేపథ్యం, నా మొత్తం ఆలోచనా సరళి తెలియలేదనీ, పుస్తకం మొత్తంగా చదవడంతో ఓ అవగాహన వచ్చిందనేది ముఖ్యమయిన కామెంట్. ఇంకా ఎవరయినా క్రిటికల్ రివ్యూ రాస్తారేమో నని ఎదురుచూస్తున్నా.
2. కథా రచయితలు తమ కథల్లో సమస్యలు ఎత్తి చూపడమేనా..?పరిష్కారం కూడా చూపాలా..? వ్యక్తిగతంగా మీరేమనుకుంటారు..?
సమస్యలు చూపడం, పరిష్కారం సూచించడం చేసే కథలు నేను కూడా రాశాను. కానీ జీవితాన్ని చూపించి అందులో ఏ విషయాలు సమస్యలుగా పరిణమిస్తాయో చూపించే రచనలు నాకిష్టం. వాచ్యంగా సమస్య మాత్రం ఎందుకు చెప్పడం? మనల్ని నడిపించే శక్తులూ, ఆలోచనలూ, జీవనం చూపిస్తే సమస్యల మొదలు అదే తెలుస్తుంది. అక్కడే పరిష్కారం కూడా ఉంటుంది. సొంతగా ఆలోచనలు రేకెత్తించితేనే రచన ప్రభావం పాఠకుల మీద స్థిరంగా బలంగా ఉంటుంది.
***
రిస్క్ చేస్తున్నామనే భయం లేదు:వెంకట్ శిద్ధారెడ్డి
1. చిత్వాన్ తెలుగు పాఠకులకు పరిచయమై నాలుగేళ్ళు కావస్తోంది. ఈ నాలుగేళ్లలో మీ కథల క్రమం పరిశీలిస్తే ఒక మార్పు కనిపిస్తోంది. ఒక వేళ ఇప్పుడు సోల్ సర్కస్ కథ రాస్తే….. చిత్వాన్ చనిపోతాడా..?
సోల్ సర్కస్ కథ ఇప్పుడు రాస్తే కూడా చిత్వాన్ ఖచ్చితంగా చనిపోతాడు, కానీ అంతకుముందులా ఆత్మహత్య చేసుకుని చనిపోడు, గొడవల్లో ఎవరో అతన్ని చంపెయ్యవచ్చు. లేదంటే ఎవరితోనో గొడవపడి వాళ్లతో యుద్ధం చేస్తూ చనిపోవచ్చు, ఏదో చెయ్యాలని ఏమీ చెయ్యలేక కుళ్లికుళ్లి ఏడ్చి చచ్చిపోవచ్చు. ఇలా ఏదైనా జరగొచ్చు, కానీ చనిపోవడం మాత్రం ఖాయం.
2.ఇప్పటికే తెలుగు లో చాలా ప్రచురణ సంస్థలు ఉన్నాయి. పుస్తక ప్రచురణ లాభదాయకమైన పని కాదన్న వాదన వినిపిస్తోంది. కానీ మీరు ఇప్పుడు ప్రచురణ రంగంలో కి వస్తున్నారు..? ఒక రకంగా రిస్క్ చేస్తున్నారు కదా..?
ఎన్ని ప్రచురణ సంస్థలున్నాయో నాకు తెలియదు. ఎమెస్కో, విశాలాంధ్ర, నవోదయ, పీకాక్, ప్రిజమ్ ఇలా కొన్ని తెలుసు.పుస్తక ప్రచురణ లాభదాయకం కాదో కూడా తెలియదు. ఇవన్నీ స్టడీ చేసి రంగంలోకి దిగలేదు.తెలుగులో వెయ్యి పుస్తకాలు ఎందుకు అమ్మలేకపోతున్నామనే ఒక చిన్నపాటి ఫ్రస్ట్రేషన్ లో ఈ సంస్థ మొదలుపెట్టాం. కొత్త జెనెరేషన్ కి కావాల్సిన కొత్త సాహిత్యాన్ని అందిస్తే వెయ్యికంటే ఎక్కువ పుస్తకాలే అమ్మొచ్చన్నే నమ్మకంతో మొదలుపెట్టాం.
పదికోట్లమంది తెలుగువాళ్లున్నారు, అందులో కనీసం లక్షమంది పాఠకులు ఉండరా? వాళ్లల్లో మనం పది శాతం మందికి చేరినా ఒక పుస్తకం పదివేల కాపీలు అమ్మొచ్చు. కానీ మనం వెయ్యి కాపీలు కూడా అమ్మలేకపోతున్నాం. ఎందుకని? ఈ ప్రశ్నకు సమాధానం నాకు ఎక్కడా దొరకలేదు. సినిమా ఒక ఆల్కెమీ నెలలో వెయ్యి కాపీలు అమ్మాం. ఇన్ ది మూడ్ ఫర్ లవ్ పుస్తకం బుక్ ఫెయిర్ లోనే వెయ్యి కాపీలు పైగా అమ్మాం. సోల్ సర్కస్, సినిమా కథలు రిలీజయిన వారం రోజుల్లో నాలుగొందల కాపీలు దాకా అమ్మాం. నవోదయ బుక్ స్టోర్ లో తప్ప మిగతా అన్నీ ఆన్ల్లైన్ లో అమ్మగలిగాం.
సినిమా ఒక ఆల్కెమీకి, ఇన్ ది మూడ్ ఫర్ లవ్ కి మాకు చాలా మంచి స్పందన లభించింది. ఇప్పుడు సోల్ సర్కస్, సినిమా కథలకు కూడా చాలా మంచి స్పందన వస్తోంది. అయితే ఇన్ ది మూడ్ ఫర్ లవ్ వచ్చినప్పుడు చెత్త కథలని మమ్మల్ని క్రిటిసైజ్ చేసిన చాలామంది పెద్దవాళ్లు ఇప్పుడు సోల్ సర్కస్, సినిమా కథల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విచిత్రంగా ఉంది. మా ప్రయత్నం ఒకటి బాగోలేదని గట్టిగా అరిచి గీపెట్టినప్పుడు మరో ప్రయత్నం బావుంటే బావుందని చెప్పలేకపోతున్నారో, లేక ఇదీ బావోలేదని మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇలాంటి విషయాలే కొంతపాటి ఫస్ట్రేషన్ కి గురిచేశాయి. అందుకే కొత్త పాఠకుల అన్వేషణలో ఆన్వీక్షికి మొదలుపెట్టాం.
ఇది బిజినెస్ అయితే కాదు. అలా అని సాహితీసేవ అని కూడా చెప్పను. తెలుగు సాహిత్యం పట్ల కోల్పోయిన ఆసక్తిని తిరిగి తేవాలనే ఒక ప్రయత్నం.
ఇక రిస్క్ సంగతంటారా? పదేళ్ల క్రితమే నెలకు మూడు లక్షలొచ్చే ఉద్యోగం వదిలేసి నాకిష్టమైన పని చేస్తూ ఇక్కడివరకూ వచ్చాను. అలాగే నాతోపాటు ఆన్వీక్షికిలో భాగస్వాములైన మహి, వందనలు కూడా జీవితంలో చాలా రిస్క్ చేసినవాళ్లే. సో రిస్క్ చేస్తున్నామనే భయం లేదు. కానీ మేమిదంతా ఎవరి కోసమైతే చేస్తున్నామో వాళ్లల్లో ఎక్కువ శాతం మంది ఈ ప్రయత్నంలో మాకు సహకారం అందించరేమో అనే భయమైతే ఉంది.
*
మీ , పుస్తకాలు,రెండు, చాలా బాగున్నాయి, కాబట్టి, మీరు చేసిన కృషి,శ్రమ, ఫలించింది కావున ఎవరు విమర్శ చేయటం లేదని,నేను భావిస్తున్న, నాకు అయితే బాగా నచ్చాయి.. అభినందనలు!మీకు
వెంకట్ శిద్దారెడ్డి గారు,
మీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నా.
“తెలుగు సాహిత్యం పట్ల కోల్పోయిన ఆసక్తిని తిరిగి తేవాలనే ఒక ప్రయత్నం.” అన్నారు.
మీ పబ్లిషింగ్ సంస్థ నుండి ఇప్పటివరకు ఎన్ని పుస్తకాలను ప్రచురించారు? వాటి పేర్లు, అవి రాసిన రచయితల పేర్లు చెప్పగలరా?
అవి ఎందుకు ప్రచురించారో, ఆ సెలక్షన్ ప్రాసెస్ ఏమిటో చెప్పగలరా?
మా పబ్లిషింగ్ హౌస్ మొదలు పెట్టింది ఈ రెండు పుస్తకాలతోటే. కాకపోతే మేము ఇది వరకే ఇన్ ది మూడ్ ఫర్ లవ్ ప్రచురించాం. అప్పుడే మాకు పబ్లిషింగ్ చెయ్యాలనే ఐడియా వచ్చింది మాత్రం ఆ పుస్తకంతోనే. సెలక్షన్ ప్రాసెస్ పూర్తిగా నాదే. త్వరలో పెద్దింటి రాసిన లాంగ్ మార్చ్ నవల వస్తోంది. ఇంకా ఒక ఇరవై పుస్తకాలు వరుసలో ఉన్నాయి
బావున్నాయి.
ఈ కథల పరిచయాలు.
వీటిల్లో నేను సీరియస్ గా చదివిన కథలు పద్మాకర్ గారి ఈస్థటిక్స్ స్పేస్ కథలు. మీరన్నట్టు, ఆయన ఈ వ్యాసంలో తొలిలో చెప్పినట్టు మానవీయ లోకం వైపు నడిపించే ఒక వాదన/ తర్కం ఈ కథల్లో తడి స్పర్శతో లాక్కెళ్లడం కనిపిస్తుంది.
ఈ శీర్షిక కొనసాగుతుందా లేక ఈ కొన్ని పుస్తకాల గురించి చెప్పి ఆగిపోతుందా?
హాసన్ గారు, ఇది కొనసాగుతుంది!
ఎందుకు అడిగానంటే …మీరు పేర్కొన్న పుస్తకాల వరుస లో నా కధల పుస్తకం కూడా విడుదల అయింది. ఈ శీర్షిక ప్రయార్టీలు వేరేగా ఉన్నాయేమో , కొందరి ,కొన్ని పుస్తకాలకే పరిమితం అనిపించి అడిగా. అంతేనండీ.
” ఒక పుస్తకం పదివేల కాపీలు అమ్మొచ్చు. కానీ మనం వెయ్యి కాపీలు కూడా అమ్మలేకపోతున్నాం. ఎందుకని? ” అంటున్న వెంకట్ శిద్ధారెడ్డీ! ఈ ప్రశ్న భాషాభిమానులైన పెద్దలతో పాటు నాలాంటి సాధారణ పాఠకుడిని కూడా తొలుస్తోంది. కనీసం లక్షమంది తెలుగు పాఠకులు ఉండరా? మరి నేటి ప్రచురణలు వెయ్యి కాపీల కంటే ఎందుకు అమ్ముడవ్వడం లేదు ?
కార్పొరేట్ స్కూళ్లలో విద్య, ఎంసెట్ పరీక్షల్లో గెలుపుకై పరుగులు తప్ప బాల్య కౌమార దశల్లో అలవడాల్సిన పుస్తక పఠనం జరగక పోవడం ఓ కారణమా? ఇంగ్లీష్ మీడియం చదువులు, టీవీలు, ఇంటర్నెట్‌ల వల్ల పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటే లేకుండా పోతోందా ?
ప్రపంచ వీక్షణానికి పుస్తకం తొలిమెట్టు. పుస్తక పఠనం మన జీవితంలో ఒక భాగం కావాలి. ‘చిరిగిన చొక్కా అయిన తొడుక్కో… కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అని కందుకూరి వారు చెప్పినట్లుగా మంచి పుస్తకాన్ని కొందాం. పుస్తకాన్ని బ్రతికించు కొందాం. భాషపై మమకారం పెరగాలంటే సాహిత్యం చదవాలి. పిల్లలకు విద్యార్థి దశలోనే సృజనాత్మకత అలవడుతుంది. భావవ్యక్తీకరణ సామర్థ్యం పెరుగుతుంది. ఆధునిక సహేతుక భావనలను విస్తరించడంలో పుస్తక పఠనం పాత్ర కీలకమైంది.
పుస్తకాలు చదవని వారికంటే… చదివే వారే లోకజ్ఞానంతో పాటు, రకరకాల సామర్థ్యాలలోనూ మెరుగైన ప్రతిభను కనబరుస్తున్నారని బ్రిటన్‌లోని నేషనల్ లిటరసీ ట్రస్ట్ (ఎన్‌ఎల్‌టి) తాజా అధ్యయనం ప్రపంచానికి చాటింది.
తమ డ్రస్సులు, బూట్లు, ఆహార పానీయాలు, సినిమాలు, షికార్లు, విలాసాలకు విరివిగా డబ్బు ఖర్చు చేస్తున్న విద్యావంతులైన, ఉద్యోగవంతులైన నేటి యువతరానికి తెలుగు సాహిత్య పుస్తకాలు కొనడం పెద్ద శ్రమేవీ కాదు. కానీ వారికి ఆ మంచి అలవాటు ఎందుకు అలవడటం లేదు ?
మా చిన్నప్పటి ఎమెస్కో బుక్ హౌస్ వారి ఇంటింటా గ్రంధాలయం లాంటిది మళ్లీ రూపు దిద్దుకోవాలి.
ఆధునిక సాధనాలైన ఇంటర్నెట్, అంతర్జాల పత్రికలు, e-బుక్ స్టోర్స్ ల ద్వారా పుస్తకాలను అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు మరింత విజయవంతంగా చెయ్యాలి.
సోల్ సర్కస్ కథ చదివి చిత్వాన్ ని కలవరించేలా చెయ్యగలిగిన పటుత్వమైన కధా సాహిత్యం, కవిత్వం ఇంకా ఇతర ప్రక్రియల సాహిత్యం సృష్టి జరుగుతూనే ఉంది. పుస్తక ప్రచురణ, వాటి మార్కెటింగ్ విధానాలు మరింతగా పుంజుకోవాలేమో.
ప్రభుత్వ గ్రంధాలయోధ్యమాన్ని తిరిగి పునర్జీవించేలా చెయ్యాలి.
ప్రభుత్వ, కార్పొరేట్ విధ్యాలయాలన్నింటిలోనూ లైబ్రరీలు తప్పనిసరిగా ఉండేలా చెయ్యాలి.
( ఏంది గొరుసన్నా! ఆవేశంలో లక్ష్మణ రేఖలు దాటేస్తున్నా నంటావా? సరే ఇక
విరమించుకుంటా. నువ్వు మాత్రం ప్రతిభావంతులైన ఎందరెందరో యువ సాహితీ
వేత్తలను వెంకరేజిమెంటు చెయ్యి )
1.Every book should cost below Rs. 150/-
2.Every parent should encourage their children to read books.
3.Every writer..Every publishers..EVERY TEACHER…or any one …I.e.BOOK LOVERS….should create awareness about BENEFITS OF BOOK READING..
4.EVERY writer should bring GOOD content….in their books..