కొత్త ఆలోచనలూ- కొత్త శీర్షికలూ

గస్టు వెళ్లిపోయింది. మనకి స్వాతంత్ర్యం వచ్చిందన్న విషయం యెంత అబద్ధమో చెప్పడానికి కొన్ని సాక్ష్యాలు చూపిస్తూ-

దేశం రూపం మారిపోతోంది. పౌరుల గొంతు మీద కత్తులు కరాళ నృత్యం చేస్తున్నాయి. దేశాన్నే జైలుగదిగా మార్చేస్తున్న కాలంలోకీ, ఆకుపచ్చదనం మీద యుద్ధాలు ప్రకటిస్తున్న దశలోకీ, కొన్ని పుస్తకాలు “ప్రమాదకర వస్తువులు” అని కొత్వాల్ తీర్పులు ప్రకటితమవుతున్న అకాలంలోకీ నెట్టేసే సెప్టెంబర్ నెల వచ్చింది.

బహుశా, పుస్తకం ఏం చేయాలో ఇప్పుడింకాస్త స్పష్టంగా, గట్టిగా గుర్తించాల్సిన క్షణం వచ్చేసింది.అట్లాగే, మనకి యెలాంటి చదువు కావాలో, ఆ చదువు సారం మన జీవితాల్లోకి ఎట్లా ఇంకిపోవాలో మరోసారి మాట్లాడుకోవాల్సిన సందర్భమే ఇది. కచ్చితంగా ఇదే సమయంలో మిత్రుడు వేణుగోపాల్ అనువదించిన సఫ్దర్ హష్మి కవితలోని ఈ పంక్తుల్ని మరోసారి “సారంగ” గుర్తుచేయాలనుకుంటోంది.

పుస్తకాలు మాట్లాడతాయి
గడిచిన దినాలను తలపోస్తాయి
పాత ప్రపంచాన్నీ
వెళిపోయిన మనుషులనూ
ఇవాళనూ నిన్ననూ రేపునూ
ప్రతి ఒక్క క్షణాన్నీ
ఆనందాలనూ విషాదాలనూ
వికసిత పుష్పాలనూ
విస్ఫోటక వస్తువులనూ
విజయాలనూ అపజయాలనూ
అనురాగాన్నీ ఆఘాతాన్నీ
అన్నీ తలపోస్తాయి.

ఏం, నువ్వా పుస్తకాల మాటలు వినవా?

పుస్తకాలు నీతో మాట్లాడదలచుకుంటాయి
పుస్తకాలు నీదగ్గరే ఉండదలచుకుంటాయి
పుస్తకాల్లో పిట్టలు కిచకిచలాడతాయి
పుస్తకాల్లో పంటలు కళకళలాడతాయి
పుస్తకాల్లో జలపాతాలు పాటలు పాడతాయి
అద్భుతాశ్చర్య గాథలు వినిపిస్తాయి

పుస్తకాలలో రాకెట్ల రాజ్యం ఉంటుంది
పుస్తకాలలో విజ్ఞాన స్వరం ఉంటుంది
పుస్తకాలలో విశాల ప్రపంచం ఉంటుంది
పుస్తకాలలో జ్ఞాన సర్వస్వం ఉంటుంది
ఏం, నీకా ప్రపంచంలోకి వెళ్లాలని లేదా?
పుస్తకాలు నీతో మాట్లాడదలచుకుంటాయి
పుస్తకాలు నీదగ్గరే ఉండదలచుకుంటాయి.

అది టాల్ స్టాయ్ “వార్ అండ్ పీస్” కావచ్చు, మరో బిశ్వజిత్ రాయ్ “జంగల్ మహల్” కావచ్చు. అసలు యే చిన్న ప్రతిఘటన అయినా రాజ్యం మీద యుద్ధంగానే లెక్క తేలుతున్న కాలంలో – పుస్తకాలు అనే bounded entities మన దగ్గిర వుండడం అనేది “నేరం”గా పరిగణించే దశ దాకా చేరుకున్నాం. మొత్తంగా “bonded labor” లాంటి బుర్రల్ని మాత్రమే అక్కున చేర్చుకునే హీనత్వంలోకి, రాజ్య అధిపత్యంలోకి తోసుకుంటూ వెళ్లిపోతున్నాం తెలిసి కొంతా, తెలియక కొంతా!

2

ఇక ఈ నెల “సారంగ” విషయానికి వస్తే- నాలుగు కొత్త శీర్షికలు మీ ముందుకు వస్తున్నాయి. స్థానిక చరిత్రనీ, సంస్కృతినీ, జీవితాన్నీ మీకు పరిచయం చేసే రెండు శీర్షికలు – పల్నాటి వాకిట్లో, పులివెందుల మ్యూజింగ్స్- రెండు భిన్నమైన ప్రాంతాల మనుషులూ, జీవితాల portraits. ఈ రెండు శీర్షికలు అందిస్తున్న వారు సుజాత వేల్పూరి, రాళ్లపల్లి రాజావలి.

మరో శీర్షిక –కథాంతరంగం- ప్రసిద్ధ విమర్శకులు ఎ. వి. రమణ మూర్తి గారి శీర్షిక. చాలా కాలంగా రమణ మూర్తిగారు యేమైనా రాస్తే బాగుంటుందన్న కల ఇవాళ “సారంగ”కి అక్షర ప్రత్యక్షమైంది.

ఇక–మూడు పుస్తకాల ముచ్చట—అనే శీర్షిక మనకి తెలిసిన ప్రసిద్ధ రచయితలూ కవులూ వాళ్ళ మనో ఆవరణలోకి ప్రవేశించి, మనసంతా ఆవరించిన మూడు పుస్తకాల గురించి మీతో మాట్లాడబోతున్నారు. ఈ శీర్షిక కింద తొలి ముచ్చట సునిశితమైన చదువరీ, సున్నితమైన వచన శిల్పీ మెహెర్ అందిస్తున్నారు.

ఈ కొత్త శీర్షికలతో పాటు మరిన్ని కానుకలతో సారంగ సెప్టెంబరు వొకటో తేదీ సంచిక మీ ముందుకు వచ్చింది, మీ అభిప్రాయాల కోసం ఎదురుచూస్తూ-

ఇక చదవండి, మీ అభిప్రాయాలు మనస్ఫూర్తిగా రాయండి.

*

ఫోటో: దండమూడి సీతారాం

ఎడిటర్

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “దేశం రూపం మారిపోతోంది. పౌరుల గొంతు మీద కత్తులు కరాళ నృత్యం చేస్తున్నాయి. దేశాన్నే జైలుగదిగా మార్చేస్తున్న కాలంలోకీ, ఆకుపచ్చదనం మీద యుద్ధాలు ప్రకటిస్తున్న దశలోకీ, కొన్ని పుస్తకాలు “ప్రమాదకర వస్తువులు” అని కొత్వాల్ తీర్పులు ప్రకటితమవుతున్న అకాలంలోకీ నెట్టేసే సెప్టెంబర్ నెల వచ్చింది.”
    చాలా బాగా చేప్పారు

  • ఏం, నువ్వా పుస్తకాల మాటలు వినవా?

    పుస్తకాలు నీతో మాట్లాడదలచుకుంటాయి
    పుస్తకాలు నీదగ్గరే ఉండదలచుకుంటాయి
    పుస్తకాల్లో పిట్టలు కిచకిచలాడతాయి
    Wow!

  • పుస్తకాలునీతో మాట్లాడదలుచుకుంటాయి,.. yes. నేను. చదివే ప్రతి పుస్తకం, నాకు ఏదోఒకటి, చెపుతుంది.. మంచి, చెడు, తప్పు, ఒప్పు,, వాటినుంచే నేర్చుకున్నా నేను.చాలావరకు.ధన్యవాదాలు .సర్!💐👌

  • అది టాల్ స్టాయ్ “వార్ అండ్ పీస్” కావచ్చు, మరో బిశ్వజిత్ రాయ్ “జంగల్ మహల్” కావచ్చు. అసలు యే చిన్న ప్రతిఘటన అయినా రాజ్యం మీద యుద్ధంగానే లెక్క తేలుతున్న కాలంలో – పుస్తకాలు అనే bounded entities మన దగ్గిర వుండడం అనేది “నేరం”గా పరిగణించే దశ దాకా చేరుకున్నాం. మొత్తంగా “bonded labor” లాంటి బుర్రల్ని మాత్రమే అక్కున చేర్చుకునే హీనత్వంలోకి, రాజ్య అధిపత్యంలోకి తోసుకుంటూ వెళ్లిపోతున్నాం తెలిసి కొంతా, తెలియక కొంతా!

    ఎడిటర్ సర్ ..
    ధన్యవాదాలు. వాక్యం కన్ఫ్యూజన్తో రాస్తూన్న నాకు .. ఇక రాయటం వ్యర్థం.. మనం రాస్తే ఎవరు చదువుతారని డీలాపడ్డ సందర్భంలో ఇలా మంచి మనసుతో వెన్నుతడుతున్నందుకు…, ఎలా కృతజ్ఞతలు చెప్పనూ?
    ధన్యవాదాలతో
    రాజావలి రాళ్లపల్లి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు