“ఇప్పటికిప్పుడు యిల్లు మారాల్సిన అవసరం ఏమొచ్చింది? కొంపలో వొక ఆడమనిషుంది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేముందు దానితో కూడా వొక మాట అంటే బావుంటుందనే ఆలోచన కూడా లేదు గదా. సొంతిల్లు పెట్టుకోని ఎవరింట్లోనో పడుండాల్సిన కర్మ ఏంటంట” పెద్దపెద్దగా అరుస్తోంది ప్రమీల.
“అబ్బా వూరుకోవే. ముందు కాస్త గొంతు తగ్గించు. చుట్టుపక్కల వాళ్లు వింటే నేనింకా నీకు ఏం అన్యాయం చేశానో అనుకుంటారు” సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు చంద్రం.
“అనుకుంటే అనుకోనివ్వు. అయినా యింతకంటే పెద్ద అన్యాయం ఏవుండి చస్తుంది గనక. నేనూ, పిల్లాడూ యిక్కణ్నించీ కదలం. కావాలంటే నువ్వొక్కడివే పో” యింకాస్త స్వరం పెంచింది ప్రమీల.
“మధ్యలో పిల్లాణ్ని లాగుతావెందుకు? వాడెలాగూ వైజాగ్ కాలేజీలో చేరతానంటున్నాడుగా. నువ్వొక్కదానివీ యిక్కడుండి ఏం అఘోరిస్తావ్?” కోపంగా అన్నాడు చంద్రం.
“ఇంకా ఏం ఆలోచించుకోలేదు. నువ్వు యిల్లు మారాక.. ‘ఏవండీ శ్రీవారూ యిదిగో యీ పూట ఫలానాది అఘోరించాను’ అని ఏ పూటకాపూట వుత్తరం రాస్తాలే” వెటకారంగా చెప్పింది.
చంద్రం, ప్రమీల మాట్లాడుకుంటున్న మాటలు బెడ్రూమ్ లో వున్న హరికి వినిపిస్తున్నాయి. రోజూ చూసే అమ్మానాన్నలేనా వీళ్లు? ఎప్పుడు లేంది, చిన్న విషయానికి ఎందుకింత గొడవ పడుతున్నారు? వాడికి ఆశ్చర్యంగా వుంది.
“నువ్వు వంద చెప్పు. వెయ్యి చెప్పు. నా నిర్ణయం మారదు. రోజూ పొద్దున్నా సాయంత్రం పది కిలోమీటర్లు తిరగడం నా వల్ల కాదు. ఆఫీసుకి దగ్గర్లో ట్రిపుల్ బెడ్రూమ్, అది కూడా అంత చవకలో దొరకడం అదృష్టం. హాయిగా లంచ్ కి యింటికి రావొచ్చు. సాయంత్ర పనైపోయాక, బయల్దేరిన ఐదు నిముషాలకి ఠంచనుగా యింట్లో వుండొచ్చు”.
“ఇంత సుకుమారుడివి ఆరోజు అంతంత పెద్ద మాటలెందుకు చెప్పావ్?” ఇంకా ఏదో అనబోతూ హరిని చూసి ఆగిపోయింది ప్రమీల.
“నువ్వు చెప్పరా కన్నా. మూడు బెడ్రూములు, చుట్టూతా బోలెడు ఖాళీ స్థలం. ట్రాఫిక్, పొల్యూషన్ ఏమీ లేకుండా ప్రశాంతంగా వుండొచ్చు. సొంతిల్లు కదాని బతికినన్నాళ్లూ యిక్కడే పడివుండాలా”, కొడుకు వైపు చూసి అడిగాడు చంద్రం. కనీసం హరి అయినా తనకి సపోర్ట్ చేస్తాడేమో అన్నట్టు ఆశగా చూసింది ప్రమీల.
“మారితేనే బావుంటుందేమో అమ్మా. నాన్నకి యిబ్బంది తగ్గుతుంది కదా!”. అమ్మ ఎక్కడ హర్ట్ అవుతుందో అన్నట్టు అనునయంగా చెప్పాడు హరి.
“పిల్లాడికున్నపాటి ఆలోచన కూడా లేదు నీకు” హరి మాటలు యిచ్చిన సపోర్ట్ తో రెచ్చిపోయాడు చంద్రం.
“నేను జిమ్ కి వెళుతున్నా. వచ్చేసరికి లేటవ్వుద్ది. మీల్ మేకర్ కూర చెయ్యమ్మా యివాళ. ఫుల్లు స్పైసీగా వుండాలి” అమ్మ మెడ చుట్టూ చేతులేసి గారాలు పోతూ చెప్పాడు హరి.
అప్పటిదాకా వున్న కోపం ఎక్కడికి పోయిందో, “అలాగే” నవ్వుతూ బదులిచ్చింది ప్రమీల. విజిలేస్తూ హుషారుగా బయటికెళుతున్న కొడుకుని చూస్తూ నిలబడిపోయారు భార్యాభర్తలిద్దరూ. ఎన్నాళ్లయ్యింది వాడిలో ఆ మాత్రం వుత్సాహం కనిపించి!
*****
“నమస్తే మేడమ్. నా పేరు చంద్రం. హరి వాళ్ల ఫాదర్ ని. మాణింగ్ కాల్ చేశారు మీరు”
“నమస్తే. థేంక్యూ ఫర్ కమింగ్. రండి, నా రూమ్ లో కూర్చోని మాట్లాడుకుందాం” అంటూ ల్యాబ్ వైపు నడిచింది ప్రశాంతి. పదో తరగతికి క్లాస్ టీచర్ అంటే చాలా పెద్దావిడేమో అనుకున్నాడు చంద్రం. మహా అయితే ముప్పై ఐదేళ్లుంటాయేమో. హరిగాడు పద్దాకా ప్రశాంతి మేడమ్, ప్రశాంతి మేడమ్ అని కలవరిస్తా వుంటాడు.
ఒకసారి స్కూలుకెళ్లి ఆవిడని కలవాలి అని అనుకుంటుండగా, ఆవిడే కాల్ చేసింది. “వీలు చూసుకొని వొకసారి స్కూలుకి రాగలరా? డే టైమ్ కాదు, పిల్లలు వెళ్లిపోయాక రండి. స్కూల్ అయ్యాక కూడా వన్ అవర్ యిక్కడే వుంటాన్నేను. బైదవే, నేను మీకిలా కాల్ చేసినట్టు హరికి తెలియనివ్వొద్దు”.
“ఏం జరిగుంటుంది? పిల్లాడు సరిగ్గా చదవట్లేదా? ఎవరితోనైనా గొడవ పడ్డాడా? లేదా, ఏదైనా ప్రేమ వ్యవహారం లాంటిదా?” ప్రశాంతి మేడమ్ ఫోన్ చేసిన క్షణం నుండీ ఆలోచనలతో వుక్కిరిబిక్కిరి అవుతూనే వున్నాడు.
ఫ్యాను లైటు వేసి, కిటికీలు వోపెన్ చేసింది ప్రశాంతి. ఆవిడ ఏం చెప్పబోతోందో అని టెన్షన్ తో చచ్చిపోతున్నాడు చంద్రం. అతని ముఖంలో కనిపిస్తున్న కంగారు అర్థం చేసుకున్న దానిలా, “కంగారు పడకండి. పెద్ద విషయమేం కాదు. మీకు ఫోన్ చేసిన దగ్గర్నించీ నేను ఫీలౌతూనే వున్నాను, అనవసరంగా చేశానా అని” అంది.
“పర్వాలేదండీ. నేనే వచ్చి కలుద్దామనుకున్నా మిమ్మల్ని. మీ పేరు తలవకుండా మా హరిగాడికి నిముషం కూడా గడవదు” అన్నాడు చంద్రం.
“హి యీజ్ ఎ వెరీ గుడ్ కిడ్. సెన్సిబుల్ టూ” అంది ప్రశాంతి. హమ్మయ్యా అని వూపిరి పీల్చుకున్నాడు చంద్రం. ఆవిడ అలా అన్నదంటే మరీ పెద్ద యిష్యూ కాదన్నమాట.
“నేను టెన్ యియర్స్ నుండీ హైస్కూలు పిల్లలకి బయాలజీ చెపుతున్నాను. మీకు తెలుసుగా బయాలజీ అంటే కొంత యిబ్బందికరమైన విషయాలు కూడా పిల్లలతో డిస్కస్ చేయాల్సి వస్తుంది” గోడల మీదున్న బొమ్మలు వైపు చూస్తూ అంది ప్రశాంతి. ఆవిడ కళ్లు ‘రీప్రొడక్టివ్ సిస్టమ్’ అనే చార్టు మీద ఆగడం గమనించి తలాడించాడు చంద్రం.
“పది బ్యాచ్ లు, అంటే దాదాపు ఐదొందల మంది పిల్లలు. ఈ కాలం పిల్లలు ఎంత స్పీడ్ గా వున్నారో మీకు తెలుసుగా. వాళ్లకి చాలా విషయాలు తెలుసు. నా కొలీగ్స్ లో చాలామంది, పిల్లలు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక, స్టాఫ్ రూమ్ కొచ్చి తిట్టుకోవడం నాకు తెలుసు. కానీ, నాకెప్పుడూ అలాంటి సమస్య ఎదురు కాలేదు”.
ఆవిడ వొక్కొక్క వాక్యం పూర్తి చేస్తుంటే చంద్రానికి ధైర్యం సన్నగిల్లిపోతోంది. మొత్తానికి ఏదో జరగరానిది జరిగిందని అర్థమైపోతోంది. అతని ముఖంలో మారుతున్న ఫీలింగ్స్ గమనించకుండా ఆవిడ చెప్పుకుపోతోంది.
“హరి చాలా యాక్టివ్ గా వుంటాడు. ఏ వర్కూ పెండింగ్ పెట్టడు. వాడికి ఏదీ రెండోసారి చెప్పాల్సిన అవసరం వుండదు. ఐ కెన్ సే దట్ హి యీజ్ గిఫ్టెడ్. అలాంటివాళ్లు బ్యాచ్ కి వొకళ్లిద్దరు తగులుతూ వుంటారు. వాళ్ల కోసమైనా కష్టపడి చెప్పాలనిపిస్తుంది..”. ఆ తర్వాత విషయం చెప్పడానికి మాటలు దొరకనట్టు కాస్త గ్యాప్ తీసుకుంది ప్రశాంతి.
“మావాడేమైనా యిబ్బంది పెట్టాడా మిమ్మల్ని? అనకూడని మాటేదైనా అన్నాడా? ఈ వొక్కసారికీ ఎక్స్యూజ్ చేసెయ్యండి. ఇంకోసారి వాడితో మీకు ఏ ప్రాబ్లెం రాకుండా చూసుకునే బాధ్యత నాది”, విషయం ఏంటో తెలియకుండానే అన్నాడు చంద్రం.
“ఛ ఛ అలాంటిదేమీ లేదు. నేను చెప్పబోయేది విన్నాక, మీరు హరిని ఏమైనా అన్నారని తెలిస్తే చాలా ఫీలవుతాను నేను. మీరు కాకుండా యింకెవరినైనా అయితే, అసలిలా పిలిచి మాట్లాడేదాన్ని కాదు. హరిని క్లోజ్ గా అబ్జర్వ్ చేసిన మీదట, మీ యింట్లో ఎంత హెల్దీ ఎన్వైర్న్మెంట్ వుందో ఐడియా వుంది నాకు. ఆ ధైర్యంతోనే చెపుతున్నాను”.
చంద్రానికి అయోమయంగా వుంది. హరిగాడు ఏదో తప్పు చేశాడు. కానీ, దానికి వాడిని పనిష్ చేయడం ప్రశాంతి మేడమ్ కి యిష్టం లేదు అన్నంతతరకూ మాత్రం తెలుస్తోంది.
“మిగతా పిల్లలకి రాని చాలా డౌట్లు అడుగుతుంటాడు హరి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, హి హ్యాజ్ బీన్ వెరీ క్యూరియస్ అండ్ యీగర్ టు లెర్న్. కానీ యీ మధ్య, వొక నెల రోజుల్నించీ వాడిలో ఏదో తేడా కనిపిస్తోంది. టెక్స్ట్ బుక్ లో వున్న కాంటెంట్ ఎంత లోతుగా తెలుసుకోవాలనుకున్నా ప్రాబ్లెం లేదు. కానీ వాడు అంతటితో ఆగడం లేదు. ఇంటర్ కోర్స్ గురించి ఎక్కడెక్కడో మాగజీన్స్ లో, నెట్ లో దొరికిన మ్యాటర్ తెచ్చి చూపిస్తాడు. అందులో వున్న యిన్షర్మేషన్ అథెంటిక్ అవునా, కాదా అని అడుగుతాడు. అకడమిక్ బుక్స్ లో వున్న వాటితో ఆగకుండా, బయటి రీసోర్సెస్ నుండీ పిల్లలు ఎక్స్ ట్రా నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకోవడం మంచిదే. కానీ, హరి తెలుసుకోవాలనుకునే విషయాలు టెంత్ క్లాస్ కన్నా చాలా హై స్టాండర్డ్. ఒక మెడికల్ కాలేజీలోనో, సైకాలజీ క్లాసులోనో డిస్కస్ చేయాల్సిన మెచూర్డ్ విషయాలు అవి”.
చంద్రానికి మాట పడిపోయింది. ఇంక చెప్పడానికేం లేదు. ఏదో తెలియక చేశాడని ఆవిడని కన్విన్స్ చేయడానికి లేదు. హరిగాడు యిలా చేస్తున్నాడంటే నమ్మలేకుండా వుంది. కానీ, ప్రశాంతి మేడమ్ ని చూస్తుంటే, పిల్లల మీద లేనిపోనివి కల్పించి చెప్పే తరహా మనిషి కాదని తెలుస్తూనే వుంది.
“వాడిని ఎంటర్టెయిన్ చేయలేను. అలాగని డిస్కరేజ్ చేయలేను. ఒక్కటి మాత్రం చెప్పగలను. నన్ను యిన్సల్ట్ చేయాలనో, యింబేరస్ చేయాలనో వాడు అనుకోవడం లేదు. నాతో మాట్లాడేటప్పుడు వాడి మొహంలో గిల్ట్, మొహమాటం నాకు అర్థమవుతున్నాయి. ఇష్టం లేని పనేదో చేస్తున్నట్టు, ఎవరో బలవంతంగా తనతో అడిగిస్తున్నట్టు వుంటుంది వాడిని చూస్తుంటే. నాకేదో దీనివల్ల చికాకుగా వుందని చెప్పట్లేదు మీతో. నాకు అర్థం కాని సమస్య ఏదైనా వుంటే, వొక తండ్రిగా మీకు అర్థం అవుతుందేమో అని మాత్రమే నా హోప్. మళ్లీ చెపుతున్నా, నా మాటలు బేస్ చేసుకోని మీరు వాడిని ఏదైనా చేస్తే, నేను చాలా హర్ట్ అవుతాను. ప్లీజ్”, బతిమలాడున్నట్టు చెపుతుందామె.
“వాడిలా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు మేడమ్. వాడి గురించి యింతలా పట్టించుకునే టీచర్ దొరకడం మా అదృష్టం. ఇక నుంచీ కాస్త కీన్ గా అబ్జర్వ్ చేస్తాను. వాడు చేస్తున్నది కరెక్ట్ కాదని వాడికి తెలిసేటట్లు ఇండైరెక్టుగా మీరు కూడా చెప్పిచూడండి. నా ప్రయత్నం నేను చేస్తాను”.
“ఐ స్టిల్ బిలీవ్ దట్ హి యీజ్ ఎ సెన్సిబుల్ కిడ్. అయామ్ జస్ట్ వర్రీడ్ అబౌట్ హిమ్, దట్సాల్”, అంటూ లేచి నిలబడింది ప్రశాంతి మేడమ్.
*****
“ఏంటీ లేటైంది యివాళ?” అడిగింది ప్రమీల. తనకీ, ప్రశాంతి మేడమ్ కీ మధ్య జరిగిన సంభాషణ భార్యకి చెప్పదల్చుకోలేదు చంద్రం. ప్రమీల మరీ పాతకాలం మనిషేమీ కాదు. ఆ మాటకొస్తే తనకంటే కాస్త మోడర్న్ అనే చెప్పాలి. కానీ యీ విషయాన్ని ఎలా తీసుకుంటుందో అనే భయం వుంది అతనికి.
“హరిగాడి స్కూలుకి వెళ్లాలే. ఊరికే, ఎలా చదువుతున్నాదో ఏంటో కనుక్కుందామని”.
“నా కొడుక్కేంటీ, బంగారం”, మురిసిపోతూ చెప్పింది ప్రమీల.
ఆ రోజు నుండీ హరిని గమనించడం మొదలెట్టాడు చంద్రం. నిజంగానే వాడిలో ఏదో తేడా కనిపిస్తోంది. గతంతో పోలిస్తే కాస్త పరధ్యానంగా వుంటున్నాడు. బాగా పొద్దు పోయాక, ఫ్రెండ్ యింటికి వెళ్లాల్సిన పనేదో గుర్తుకొచ్చిందంటాడు. బయటికెళ్లిన కాసేపటికి ఫోన్ చేసి, “ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం. ఈ పూటకి యిక్కడే పడుకుంటాలే” అంటాడు. ఇంటర్ చదవడానికి రెసిడెన్షియల్ స్కూలుకి పోననీ, వూళ్లోనే చదువుకుంటాననీ అనేవాడు యిదివరకెప్పుడూ. ఇప్పుడు కొత్తగా, సిటీలో చదవాలని వుందని చెప్పాడట వొకట్రెండుసార్లు వాళ్లమ్మతో.
ఎక్కడ చదివినా వాడికి మంచి మార్కులే వస్తాయని చంద్రానికి నమ్మకం వుంది. హరి వైజాగ్ వెళ్లాలని అనుకుంటే పంపడానికి తనకేం అభ్యంతరం లేదు. కానీ ప్రశాంతి మేడమ్ చెప్పిన మాటలు, హరి ప్రవర్తనలో వచ్చిన మార్పు గమనించాక.. వాడు వైజాగ్ లో చదువుకోవాలని అనుకోవడం వెనక ఏం కారణం వుండి వుంటుందా అనే ఆలోచన పట్టుకుంది చంద్రానికి. ఆఫీసులో పని వొత్తిడి వల్ల తాను కొడుకుని సరిగ్గా పట్టించుకోవట్లేదా? తనకీ, వాడికీ మధ్య గ్యాప్ పెరిగిపోతోందా?
ఆ రోజు నుండీ పనిగట్టుకొని కొడుకుతో టైమ్ స్పెండ్ చేయడం మొదలెట్టాడు. హరికి ఏదైనా సమస్య వున్న పక్షంలో, చిన్నగా తనతో వోపెన్ అవుతాడని ఆశించిన చంద్రానికి నిరాశే మిగిలింది. వాడు అమ్మాయిల వైపు అట్రాక్ట్ అవుతున్నట్టు కానీ, అమ్మానాన్నలతో గ్యాప్ వచ్చినట్టు కానీ బిహేవ్ చేయట్లేదు.
“వైజాగ్ లో చదవాలని వుందటగా నీకు. అమ్మ చెప్పింది” అడిగాడు చంద్రం వొకసారి.
“అవును నాన్నా. ప్లీజ్. ఇంటికి దూరంగా వుండి చదువుకుంటేనే మంచిదంటున్నారు మా ఫ్రెండ్స్” అన్నాడు హరి. నిజంగా యింటికి దూరంగా వెళ్లాలన్న ఆత్రం వాడి మాటల్లో కనిపించలేదు చంద్రానికి. ప్రశాంతి మేడమ్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. “నాతో మాట్లాడేటప్పుడు వాడి మొహంలో గిల్ట్, మొహమాటం నాకు అర్థమవుతున్నాయి. ఇష్టం లేని పనేదో చేస్తున్నట్టు, ఎవరో బలవంతంగా తనతో అడిగిస్తున్నట్టు వుంటుంది వాడిని చూస్తుంటే”. నిజమే! తనకీ సరీగ్గా అలాగే అనిపించింది హరిగాడిని చూస్తే అనుకున్నాడు చంద్రం.
*****
“నేను జిమ్ కి వెళుతున్నా. వచ్చేసరికి లేటవ్వుద్ది. మీల్ మేకర్ కూర చెయ్యమ్మా యివాళ. ఫుల్లు స్పైసీగా వుండాలి” అమ్మ మెడ చుట్టూ చేతులేసి గారాలు పోతూ చెప్పాడు హరి.
అప్పటిదాకా వున్న కోపం ఎక్కడికి పోయిందో, “అలాగే” నవ్వుతూ బదులిచ్చింది ప్రమీల. విజిలేస్తూ హుషారుగా బయటికెళుతున్న కొడుకుని చూస్తూ నిలబడిపోయారు భార్యాభర్తలిద్దరూ. ఎన్నాళ్లయ్యింది వాడిలో ఆ మాత్రం వుత్సాహం కనిపించి!
హరి గేటు దాటాడో లేదో, భార్యని గట్టిగా వాటేసుకోని ముద్దు పెట్టుకున్నాడు చంద్రం.
బలవంతంగా వదిలించుకుంటూ, “ఈ మోటు సరసాలకేం తక్కువ లేదు. నువ్వెన్ని వేషాలేసినా, ఇల్లు మాత్రం మారేది లేదు”, తెగేసి చెప్పింది ప్రమీల.
“నువ్వే అన్నావుగా నేను సుకుమారుడినని. అంతలోనే మోటు సరసం అంటావేంటోయ్”, అంటూ ప్రమీలని మళ్లీ దగ్గరకి లాక్కున్నాడు చంద్రం. భర్తకి పిచ్చి పట్టిందేమోననే అనుమానం మొదలైంది ప్రమీలలో. అదే నిజం అయ్యుండాలి. లేకపోతే, చెప్పాపెట్టకుండా కొత్తిల్లు అద్దెకి మాట్లాడుకోని రావడమేంటి. రెండు నిముషాల క్రితం వరకూ గొడవ పడిన సంగతి మర్చిపోయి, యీ వాటేసుకోవడాలేంటి!
*****
“ప్రశాంతి మేడమ్ కాలింగ్” అని మొబైల్ స్క్రీన్ మీద చూడగానే ప్రాణం లేచొచ్చింది చంద్రానికి. తన బాధ, బరువు ఎవరితోనూ పంచుకోలేడు. హరిగాడి గురించి ఎవరికి చెబుదామన్నా, అనవసరంగా కొడుకుని బదనాం చేసినట్టు అవుతుందేమో అనే భయం వుంది అతనికి.
“నమస్తే సర్. బావున్నారా? నేను ప్రశాంతిని”, అవతలినుండీ చల్లని గొంతు ప్రేమగా పలకరిస్తోంది.
“నమస్తే మేడమ్. సారీ, హరిగాడి విషయంలో నేనేమీ చేయలేకపోయాను. మేబీ వాడిని సైకాలజిస్టుకి చూపిస్తే మంచిదేమో అనిపిస్తోంది”.
“ఏం అవసరం లేదు. నేను మీతో చెప్పిందంతా మర్చిపోండి. ప్రాబ్లెమ్ సాల్వ్ అయిపోయినట్లే” నవ్వుతూ చెపుతోంది.
“అవునా. ఎలా మేడమ్?” అడిగాడు చంద్రం.
“ఇందాకే యింటర్వెల్లో హరి నా దగ్గరికొచ్చాడు. ‘మేగ్జిమమ్ ఏ వయసు వరకూ సెక్సు కోరికలు బలంగా వుంటాయి, సంతృప్తికరమైన సెక్స్ లైఫ్ లేనివారికి ఎలాంటి సమస్యలు వస్తాయి’ యిలా ఏవేవో అడిగాడు. ఇక లాభం లేదని, ‘అసలు నీ వుద్దేశం ఏంటిరా’ అని డైరెక్టుగా నిలదీశాను. వాడేం చెప్పాడో తెలుసా?”, ప్రమీల మేడమ్ యింకా నవ్వుతూనే వుంది. చంద్రానికి మాత్రం గొంతులో తడారిపోయింది. ‘ఏం చెప్పాడు’ అని కూడా అడగలేకపోయాడు.
“వాడు నాతో చాలా వివరంగా మాట్లాడాడు. అదంతా యిప్పుడు అనవసరం. క్లుప్తంగా రెండుముక్కల్లో చెప్తాను వినండి. మీ యిద్దరూ.. ఐ మీన్ మీరూ మీ ఆవిడా అంటే వాడికి ప్రాణం. నైట్ పడుకోవడం కూడా మీ యిద్దరి మధ్యే పడుకుంటాడట కదా! మీ భార్యాభర్తల రొమాంటిక్ లైఫ్ కి అడ్డం వస్తున్నట్టు ఫీలవుతున్నాడు వాడు. కాలేజీకని మిమ్మల్నొదిలి వేరే వూరు పోవడం వాడికి యిష్టం లేదు. కానీ, వాడు వుంటే మీరిద్దరూ ఫిజికల్ గా దూరంగా వుండాల్సి వస్తుందనీ, దాని వల్ల మీకు రకరకాల యిబ్బందులు వస్తాయనీ ఏదేదో వూహించుకుంటున్నాడు వాడు. స్ట్రిక్ట్ లీ స్పీకింగ్, వాడి కన్సర్న్ మరీ కొట్టి పారేయాల్సింది కూడా కాదు. వాడు శాటిస్ఫై అవ్వడానికి ఏం చేస్తారో మీ యిష్టం. అతిగా చనువు తీసుకుంటున్నానని అనుకోకపోతే, నాదొక సలహా. ఏదో వొక రీజన్ చెప్పి, మీ సింగిల్ బెడ్రూమ్ నుండీ కాస్త పెద్ద యింట్లోకి మూవ్ అవ్వండి. మీ భార్యాభర్తలిద్దరూ హ్యాపీగా వున్నారని వాడికి నమ్మకం కలిగేలా చేయండి. ఇంతకు మించి నేనేం చెప్పలేను”.
****
ఇల్లు మారడానికి వేరే కారణాలేవో వున్నాయని హరిగాడు అనుకోవాలని తాను భావించినట్టు, తమ సంభాషణ వాడి చెవిన పడాలనే వాదనకి దిగినట్టు ప్రమీలకి కూడా చెప్పలేదు చంద్రం.
భర్తకి పిచ్చి పట్టిందేమోననే అనుమానం మొదలైంది ప్రమీలలో. అదే నిజం అయ్యుండాలి. లేకపోతే, చెప్పాపెట్టకుండా కొత్తిల్లు అద్దెకి మాట్లాడుకోని రావడమేంటి. రెండు నిముషాల క్రితం వరకూ గొడవ పడిన సంగతి మర్చిపోయి, యీ వాటేసుకోవడాలేంటి! ఏ మాటకా మాటే, ప్రమీలకీ అతని కౌగిలింత హాయిగానే వుంది. తొక్కలో గొడవ. తర్వాత తేల్చుకోవొచ్చు.
*
సున్నితమైన కధనం…..
Thank you. Hope I can take it as a compliment 🙏☺🙏
హహహ.. తొక్కలో గొడవ తరువాత తేల్చుకోవచ్చు😛
మంచి పాయింట్ తీసుకున్నారు సర్
మలచిన తీరూ సూపర్బ్ గా వుంది 👌👌👌
చాలా సంతోషం మేడమ్. ధన్యవాదాలు 🙏
Positive thinking solves so many cyclones in our life. Chandran n teacher diluted the problem with their common sense. Feel-good story….
Thank you 🙏
ఎంతో మంది వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి వొక సారి కథలోని సన్నివేశాన్ని , వాళ్ళ అనుభవాలతో పోల్చుకుని ఉంటారు.🤭🤣
☺☺☺
అతి సున్నితమైనా అయినా అత్యంత అవసరమైన అంశం.. బాగా రాశారు కుడోస్👌నేను కూడా తిరుపతిలో వున్నప్పుడు సింగిల్ బెడ్రూం లో బాడుగకు ఉండి డబల్ బెడ్రూం కొని ఈ సున్నిత సమస్యను అధిగమించి న వాణ్ణే🤣అయితే ఈ వెసులుబాటు చిన్న పట్టణాలకే పరిమితం ! బొంబాయిలో ఫ్లాట్స్ లో మంచాలు పైనోటి కిందోటి గోడకి కొట్టేసి ఉంటారు. రాత్రిళ్ళు దించుకోడం పైనో జంట కిందో జంట..సౌండ్ ప్రూఫ్ సంసారాలు🤣ఫ్రిజ్ డోర్ కూడా ఉన్న స్థలాన్ని బట్టీ ఎడమ వైవుకు లేక కుడివైపుకు తెరుచుకునేవి తయారీ చేస్తారు🤣🤣శుభాకాంక్షలు మీకు👍👌
కథ మీకు నచ్వినందుకు చాలా సంతోషం.. మీరు చెప్పింది కరెక్టే. ముంబైలో స్లమ్స్ ఎలా ఉంటాయో స్వయంగా నా కళ్లతో చూశాను. 😔
బాగుంది sir…..
Thank you sir 🙏
Avg. Story but Good last suspense.
Thank you 🙏