కదిలే సందిగ్ధం
ఏం పట్టనట్టుగా
ప్రయాణించే
కాలపు కఠినత్వం
ఉల్లిపొరల మసక తెర
కంటిరెప్పలపై పరిచి ఉంది!
గుర్తించలేని విముఖతో
కరుణలేని సమయసందర్భాల పరాయితనమో..
ఏమిటో
ఇదంతా
కొత్తకాలపు
సంభాషణ..
కొత్త లోకపు
సంఘర్షణ..
ఐనా
నువ్ చూడనిదా..
నీకు తెలియనిదా.. ఇది
కాలుతున్న కాలపు గుండెకు
కట్టుగట్టగల సోపతి గదా నువ్వు..
తెలిసీ..
ఈ మౌనపు ఉక్కపోతలో
వీడలేనంతగా
తప్పుకుంటూ
ఉండలేనంతగా
తొలగిపోతూ
కాలపు మసకతెరల్ని
మోసినంత దూరం
నైరుతి తీరపు గాలిలా చుట్టుముట్టే.. ఉంటావు
నన్ను అంటుకట్టుకున్న మేఘమై..
నన్నీడ్చుకెళ్ళే ఋతుచక్ర గమనమై..
*
కాలుతున్న కాలపు గుండెకి కట్టు గట్ట గల సోపతి గదా నీవు