చిలువలు పలువలుగా చిక్కులు పడ్డ ముళ్ళ తీగల మాదిరిగా సంక్లిష్టంగా విస్తరించిన ఈ జీవితం వేర్లు బాల్యానికి అనుసంధానించబడి ఉంటాయి. ఈ క్రూరమైన ప్రపంచంలో మనం తలదాచుకునే చోటు బాల్యం మాత్రమే. దుఃఖం కలిగినప్పుడల్లా మనం తిరిగి తిరిగి బాల్యానికి వెళుతూ ఉంటాం. బాల్యమే మన అంతఃస్సారం. ఆది అంతం లేని ఈ సాకారనిరాకార విశ్వంలో మనం ఆశ్రయం పొందే ఒకే ఒక చోటు బాల్యం. నిజానికి అది భ్రమాత్మకమైనదే కావచ్చు. అంత ప్రేమాస్పదమైన భ్రమ మనకి మరొకచోట దొరకదు. ఈ వాస్తవ సృష్టి కూడా సృష్టికర్త యొక్క ఘనీభవించిన భ్రమయే కదా! సృష్టికర్త ఈ అసంగతమైన లోకాన్ని ఎలా సృష్టించుకున్నాడో అలా మనం మనసులో మన స్వంత లోకాన్ని ఎందుకు సృష్టించుకోకూడదు? మరి ఇప్పుడు బాల్యం నిజంగా ఉందా? మనకు మిగిలిన కొన్నిపాటి బాల్యపు జ్ఞాపకాలనే దాచుకుని మనం వాటిని అసహాయంగా పదేపదే తలుస్తున్నాం లేదా నమ్ముతున్నాం అనుకోవాలా? ఎప్పుడో గతించిపోయిన ఘటనల్లోకి పారిపోయి, అక్కడే పదేపదే సంచరిస్తూ, వర్తమానంలోని కటువైన ముతక జీవత వాస్తవికత యొక్క నొప్పి నుండి తప్పించుకోవాలని వ్యర్థంగా ప్రయత్నిస్తున్నామా?
ఏరు దాటి, గుర్రం ఎక్కి, వెనక్కి తిరిగి చూస్తే ఏటికి అవతల సోనీ వీడ్కోలు చెబుతూ నిలుచునేది. అది ఆ ఏరును దాటి నేను పుస్తకాల కోసం వెళ్ళే ఆ చిన్న పట్టణం వైపుకి రావటానికి ఇష్టపడేది కాదు. కానీ ఎంత కష్టమైనా అడవుల్లోనూ, పర్వతాల్లోనూ నాతో తిరగడానికి ఇష్టపడేది. ఏరు దాని సరిహద్దు.
సోనీ నల్లని సింహం పిల్లలా గంభీరంగానూ, అలాగే ప్రేమగానూ ఉండేది. అది తన తోటి అడవి జాతి కుక్కలకు భిన్నంగా ఉండేది. దాని అందాన్ని చూసి చుట్టు పక్కల గ్రామాల వారు అసూయపడేవారు. ఎలాగయినా దాన్ని ఎత్తుకుపోయి పెంచుకోవాలని ఆశ పడేవారు. కానీ అది నన్ను యజమానిగా ఎంచుకుంది. ఎందుకో నాకు తెలియదు. గొప్ప సంస్కారం, అర్థం చేసుకునే గుణం దానివి. ఎంత రుచికరమైన ఆహారం ఎదురుగా పెట్టినా, తినమని చెబితే మాత్రమే తినేది. అయితే ప్రెసిడెంట్ లింగయ్య గారు – ఆయన గ్రామంలోని మనుషులతో పాటూ సకల జీవరాశినీ తండ్రిలా చూసుకునేవారు – పెద్ద మానును నరికి దాని కాండాన్ని తొలిచి దొన్నెలా చేసి గ్రామంలోని కుక్కలన్నిటికీ అందులో రోజుకి మూడుసార్లు జావ వండించి వేసేటప్పుడు ఆ అడవి కుక్కలన్నీ ఆత్రంగా, ఆబగా ఆ జావను తింటుంటే సోనీ వాటి పౌనఃపున్యంలోకి వెళ్ళి పోయి, అంతే ఆత్రంగా దాని అసలు కుటుంబంతో కలిసి జావ తాగేది. దాని మౌలిక సహజాతాలను అనుసరించడానికి నాన్న గారు సోనీకి కూడా స్వేచ్ఛను ఇచ్చేవారు. దానిని సంస్కరించాలని కానీ, కృత్రిమమైన నాగరికత నేర్పించాలని కానీ ఆయన అనుకోలేదు. అంటువల్ల అది గొప్ప సున్నితత్వంతో, ప్రేమాస్పదమైన జీవిగా ఎదిగింది. జీవితానికి సంబంధించి ఆయన అవగాహన గొప్పది. ఎన్నో కష్టాలు పడి ఆయన దానిని తెలుసుకున్నారు.
ఒక విషయంలో సోనీని నిలువరించడం అసాధ్యంగా ఉండేది. అది వేట. గిరిజనులు విల్లంబులు పట్టుకుని వేటకు బయలుదేరినప్పుడు వింత శబ్దాలు చేస్తూ ఊరిలోని కుక్కల్ని పిలిచేవారు. ఆ శబ్దాలు వినగానే సోనిలోని ఆదిమ ప్రవృత్తి, మృగలక్షణం, లక్షల సంవత్సరాలుగా అడవిజాతి కుక్కల రక్తంలో ప్రవహిస్తూ వస్తున్న దాని జన్యువులలోని సహజాతాలు దాన్ని విపరీతంగా ఉద్రేకపరిచేవి. ఆ సమయంలో మాత్రమే దానిని తాడుతో కట్టే వాడిని. కాని అది ఆ తాడును తెంపుకుని తోటి కుక్కలతో అడవికి వెళ్ళిపోయేది. అది సాయంత్రం తిరిగి వచ్చే వరకూ నాకు ఆందోళనే.
గీరుకుపోయిన గాయాలతో, మట్టి కొట్టుకుపోయిన దేహంతో, అలసిపోయి అది వచ్చాకా, దాని బొచ్చులో చిక్కుకున్న ముళ్ళ కాయల్ని ఏరి పారేసి, ఏటికి తీసుకెళ్ళి లైఫ్ బయ్ సబ్బుతో బాగా ఒళ్ళు తోమి శుభ్రం చెయ్యడం నాకు అదనపు శ్రమను అయ్యేది. చిక్కని నలుపు రంగులో దాని దేహం నిగారింపుగా మెరుస్తూ ఉండడాన్ని చూడ్డానికి నేను ఇష్టపడేవాడిని.
మసక చీకట్లో దాని ఒంటిని శుభ్రంగా తుడిచి ఇంటికి తీసుకు వస్తున్నప్పుడు అది ఎంతో సున్నితంగా మారిపోయేది. ఉదయం నా మాటను ధిక్కరించిన విషయం దానికి గుర్తుండి ఉంటుంది. అది మరింత ప్రేమను నా పట్ల చూపేది. పశ్చాత్తాపం దాని ప్రవర్తనలో కనిపించేది. క్షమించమని అడుగుతున్నట్టుగా మృదువుగా మూలిగేది. అటువంటి సున్నితత్వం దాని సోదరుల్లో ఉండేది కాదు. అవి చాలా మొరటుగా ఉండేవి.
ఏ ఋణం ఎంత వరకో!
నేను ఏటి పై ఉన్న కల్వర్టు దాటి ముందుకు వెళ్ళాను. కొంత దూరం వెళ్ళాకా బాగా నిట్రంగా ఉండే మొదటి కొండ వచ్చింది. నా బైక్ ఈ కొండను ఎక్కగలదా అని సందేహం కలిగింది. ఆఫ్ రోడ్ బైక్ కాకపోయినా కొంత దూరం బాగానే ఎక్కగలిగింది. కొండ సగం ఎక్కాక అక్కడ ఉండే ఒక గూడెం మాయమైపోయిన విషయం గమనించాను. ఆ గూడెం ప్రజలు తెలుగు మాట్లాడేవారు కాదు. వాళ్ళని సామంతులు అంటారు. వారు ఆ గ్రామాన్ని ఖాళీ చేసి ఎటో తరలిపోయారు. బహుశా ఆధునిక నాగరికత యొక్క విషపు నీడ ఆ గ్రామాన్ని ఆక్రమిస్తోందని గ్రహించి వారు తమ సనాతనమైన జీవలక్షణాన్ని కాపాడుకోవడానికి మరింత లోతట్టు పర్వతాలలోకి తరలిపోయి ఉంటారు.
ఆ గ్రామంలో వారు చాలా నిశ్శబ్దంగా గడిపేవారు. మౌనంగా తమ పనులు చేసుకునేవారు. కష్ట జీవులు. ఇతర తెగల గిరిజనులతో వారికి సంబంధాలు ఉండేవి కాదు. కొండ వాలు మీద మొక్క జొన్నలు, తృణ ధాన్యాలు పండించుకుని వాటిని తింటూ బ్రతికేవారు. వారికి ఎక్కువ అవసరాలు ఉండేవి కాదు. సంతలో బట్టలు కొనుక్కోవడానికి తమ పంటలో కొంత భాగాన్ని అమ్ముకునేవారు. ఆ బట్టలు తప్ప బయటి సమాజంతో వారికి ఏ సంబంధాలు ఉండేవి కావు. నేను గుర్రం పై ఆ గూడెంకి వెళ్లగానే నన్ను మౌనంగా ఒకసారి చూసి తిరిగి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు.
అటువంటి నిశ్శబ్దమైన గ్రామాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. అక్కడ ఎంతో శాంతి ఉండేది. కట్టెలు కొడుతున్న శబ్దాలు, గిన్నెలు దొర్లిన శబ్దాలు, హఠాత్తుగా గుక్కపెట్టే ఏ శిశువు ఏడుపో అప్పుడప్పుడూ వినిపించేది.
ఎవరి మీదా ఆధారపడని గుణం వారిని స్వేచ్ఛాపరుల్ని చేసింది. అటువంటి నాణ్యత నా జీవితంలోనూ ఉండాలని కోరుకుంటాను.
ఆ గూడెం దాటి ముందుకు వెళితే కొండ మరింత నిటారుగా మారిపోయేది. దురదృష్టవశాత్తూ ఆ వాలులో బురద ఉండేది. ఆ బురద గుండా ఎక్కుతుంటే గుర్రం గిట్టలు పట్టుదొరకక జారిపోయేవి. నాకు చాలా భయం వేసేది. అప్పుడే గుర్రం తన తెలివిని ఉపయోగించేది. అది దాని సహజజ్ఞానం కావచ్చు. ఒక్కసారిగా పట్టుతప్పి కొండ పై నుండి యాబై లేదా వంద అడుగులు బురదలో కిందకి జారిపోతూ ఉన్నప్పుడు తన నాలుగు గిట్టల్ని ఒక చోటకు చేర్చి నేను పడిపోకుండా చూడడం కోసం తనని తాను నిభాయించుకుని ఎంతో నేర్పుగా సమన్వయం చేసుకుంటూ జారేది. నా విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించేది. అటువంటి టెక్నిక్ ఇతర గుర్రాలకు తెలుసో లేదో నాకు తెలియదు. ఆ గుర్రం గిట్టల్ని దగ్గరకు చేర్చి కొండ పై నుండి కిందకు జారిపోతుంటే నా గుండెలు కూడా జారిపోయేవి. దాని బ్యాలన్స్ తప్పితే గుర్రంతో పాటూ నేనూ కొండ పై నుండి కిందకు పడిపోతాము. గుర్రాలు ఎంత అద్భుతమైన జీవులో వాటితో కలిసి ప్రయాణించిన వారికి మాత్రమే తెలుస్తుంది. అవి కుక్కల కంటే తెలివైనవి. అయితే అంతర్ముఖ జీవులు. వాటి ఆలోచనల్ని, తెలివిని, ప్రేమని కుక్కల్లా బాహాటంగా ప్రదర్శించవు. యజమానిని రక్షించాల్సిన సందర్భం వచ్చినప్పుడు వారి పరిణత మనకు అర్థమవుతుంది.
నేను సాహసాలు చేసాను కానీ దుస్సాహసాలు ఎప్పుడూ చెయ్యలేదు. కానీ మొదటి కొండ పై నున్న ఈ భాగాన్ని దాటడం మాత్రం ఎప్పుడూ దుస్సాహసంగానే ఉండేది.
నాకు మితిమీరిన స్వేచ్ఛను ఇస్తున్నారని ఎంతోమంది నాన్న గారితో అంటుంటే “వాడి హద్దులు వాడికి తెలుసు. వాడి తెలివి మీద నాకు నమ్మకం ఉంది. వాడెప్పుడూ సరియైన నిర్ణయాలే తీసుకుంటాడు” అని వారితో చెప్పేవారు. నేను పెద్దయ్యే వరకూ కూడా వారు నాన్న గారి పెంపకాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. అయినా ఆయన నాకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం మానలేదు.
సరిగ్గా ఈ బురద ఉన్న చోటుకి వచ్చేసరికి నా బైక్ ఇక నా వల్ల కాదని మొరాయించింది. రెండవ గేరు కూడా విఫలమయ్యింది. ఒకటవ గేరులో అతి కష్టం మీద ముందుకు వెళుతున్నాను. బైక్ అప్పటి నా గుర్రంలా వెనక్కి జారిపోతోంది. అదృష్టం ఏమిటంటే ఇప్పుడు అంత బురద లేదు. అతి కష్టం మీద శిఖరం వరకూ చేరుకున్నాను. ఆ కొండ దిగాక చిన్న గ్రామం. వర్షంలో గొడుగు వేసుకుని నిలుచున్న పాతికేళ్ల గిరిజన యువకుని అడిగాను “చింతపల్లి వరకూ ఈ దారిలో బండి మీద వెళ్ళడం అవుతుందా?” అని. ఆ కుర్రాడు అసాధ్యం అని చెప్పాడు.
వెళుతూ వెళుతూ “చాలా సంవత్సరాల క్రితం నేను ఇక్కడే ఉండేవాడిని. ఇప్పుడు చూడాలనిపించి వచ్చాను” అని అతడితో నేను చెప్పగానే ఆ యువకుడు చాలా ఎమోషన్ అయ్యాడు. అరుదైన ఉద్వేగాలు ఉన్న వ్యక్తులు మనం ఊహించని చోట తారసపడుతూ ఉంటారు. ఒక్కసారిగా పొంగిన ప్రేమ వల్ల కలిగే దుఃఖం లాంటిది అతడిలో కలిగినట్టు అనిపించింది. తూర్పు గోదావరిలోని జి. మేడపాడు గ్రామంలో మా అమ్మమ్మ గారి ఇంటికి చాలా కాలం తరువాత నేను వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలు ఉద్వేగంతో, అపేక్షతో నన్ను చూసి కన్నీరు పెట్టుకోవడం నాకు అనుభవమే.
ఇటువంటి సున్నితమైన సంవేదనలను పట్టణ వాతావరణంలోని వేగం హరించివేస్తుంది. అతడి ముఖం ఆశ్చర్యం, ఆనందం, ఆప్యాయత, దుఃఖం లాంటి భావాలతో కూడిన ఒక వింత ప్రేమతో మెరిసింది. నిజానికి అది ఏ భావమో చెప్పడం కష్టం. అతడి ముఖంలో వ్యక్తమైన ఆ భావాన్ని మాటల్లో పెట్టడం కష్టం. కొంత దూరం వెళ్ళి బైక్ ఆపి మళ్ళీ వెనక్కి చూసాను. అతడి ముఖంలో అదే భావం, కనీకనిపించని ఏదో ఆర్తితో కూడిన భావం. అతడి హృదయంలో ఏదో దివ్యానుభూతి కలిగింది. అది నాకు తెలుస్తోంది. నేను అలా చెప్పినప్పుడు అతడు లోలోనే ఒక ఆత్మీయతతో కదిలిపోయాడు. నేను దానిని గుర్తించాను. అదే ప్రేమ. మనిషికి మనిషికి నడుమ ఉండాల్సినది. అతడి హృదయం స్వచ్ఛంగా ఉండడం వల్ల అతడికి అటువంటి ప్రేమాస్పదమైన అనుభూతి కలిగింది. దానిని నేను చూసాను. ఆ చలిలో ఆ అనుభూతి నా హృదయాన్ని ఆత్మీయమైన వెచ్చదనంతో తడిమింది. అలా అనుభూతి చెందుతూ వర్షంలో ముందుకు సాగాను.
రెండవ కొండ ఎక్కాను. వర్షంలో ఆ శిఖరాన ఎదురుగా ఉన్న లోయలో పరచుకున్న అలౌకిక ప్రకృతి సౌందర్యానికి వివశుడినై ఒక రాతిపై కూర్చుని ఉండిపోయాను. అలా ఎంతసేపు ఉండిపోయానో తెలియదు.
”The woods are lovely, dark and deep.
But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep.”
అనుకుంటూ ముందుకు పోవడానికి నేను Robert Frost అంత క్రమశిక్షణ గల వ్యక్తిని కాను. కొన్ని విషయాల్లో చాలా పట్టుదల గల మనిషిని కూడా.
చిన్నతనంలో ఈ ఎదురుగా కనిపిస్తున్న లోయలో ఎత్తైన మొక్కజొన్న తోటల నడుమ నుండి గుర్రం పై వెళుతున్నప్పుడు, ఆ రెండు కొండల నడుమ ఉన్న ఇరుకైన జొన్న చేను వెనక ఎక్కడో అడవిలో నుండి ఆవు మెడలోని చెక్క డోలు శబ్దం వినిపించి కాలాతీతమైన అనుభవం కలిగిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ శబ్దం సుదూర ప్రాంతపు బలహీనపడిన భేరీనాదంలా మంద్రంగా, ఇప్పటికీ నాకు మనసులో సుస్పష్టంగా వినిపిస్తూనే ఉంటుంది. అటువంటి శబ్దం ఎక్కడ విన్నా అది నన్ను బాల్యానికి తీసుకుపోతుంది.
చాలా ఏళ్ళ తరువాత హైదరాబాద్ లోని నాకు ఇష్టమైన స్కైలైన్ ధియేటర్ లో నేను చూసిన luc besson దర్శకత్వం వహించిన The Messenger: The Story of Joan of Arc చిత్రంలో మొక్కజొన్న తోటలో ఆనందమయ స్థితిలో పడుకున్న బాల జోన్ ఆఫ్ ఆర్క్ కు చర్చి గంటల శబ్దం వినిపించినప్పుడు ఆధ్యాత్మిక అనుభవం కలగడం చూసినప్పుడు నా దేహం గగుర్పాటుతో కంపించింది. అది అచ్చంగా నా అనుభవమే. ఆవు మెడలోని డోలు, చర్చి గంటల కంటే ఏ విధంగానూ తక్కువ ఆధ్యాత్మికం కాదు.
వర్షంలో చాలాసేపు కూర్చున్న తర్వాత నా చేతనలో ఇంకిపోయిన అదే డోలు శబ్దం వినిపించి లోయలోకి దృష్టి సారించాను. అక్కడ దూరంగా ఒక యువకుడు పశువులను కాస్తున్నాడు. అతడు నాలాగే ఒక రాయిపై కూర్చుని గొడుగు వేసుకుని ప్రకృతిని చూస్తున్నాడు. నేను ఒక గంటసేపు అక్కడ అలాగే ఉండిపోయాను. అతడూ అలాగే ఉండిపోయాడు. అతడి చేతిలో మొబైల్ లేదు. జీవితం నుండి పారిపోవడానికి అవసరమైన ఏ సాధనమూ, ఏర్పాటూ అతడి వద్ద లేదు. ఒక గంట అతడు ఊరికే అలా నిశ్చలంగా, ప్రశాంతంగా ఉండగలిగాడంటే అతడు సహజధ్యానంలో ఉన్నాడని అర్థమైంది.
చూడగలిగితే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులను సాధారణ ప్రజల్లోనూ మనం చూడవచ్చు. ఆ సాధారణ ప్రజలకు వారు ఉన్న ఉన్నత చేతనాస్థితికి సంబంధించి పుస్తకాలలో రాసిన గంభీరమైన వివరాలు తెలియకపోవచ్చు. తెలియాల్సిన అవసరమూ లేదు. ఎవరి హృదయంలో అమాయకత్వం, నమ్రత ఉంటాయో అతడికి ఆధ్యాత్మిక అనుభవం అందుబాటులో ఉంటుంది. ఈ విషయం చెప్పడానికే లియో టాల్ స్టాయ్ కి ‘స్వామి సేర్గీ’’ కథను రాయాల్సి వచ్చింది.జర్మన్ రచయిత హెర్మన్ హెస్ నవల ‘సిద్ధార్థ’ లోని చివరి సన్నివేశాలు గుర్తుకు వస్తున్నాయి. సిద్ధార్థ, పడవ నడిపే వాసుదేవుడు పక్క పక్కన కూర్చుని రోజులకు రోజులు నదిని చూస్తూ గడిపిన సన్నివేశాలు! వారిద్దరూ ఆ విధంగా అలా నదిని చూస్తూ నిర్వాణ స్థితిని చేరుకునే సన్నివేశాలు! స్టోన్ చలన చిత్రంలో ఇరుకైన జైలు గది కిటికిలో నుండి లోపలికి వస్తున్న వర్షం శబ్దం, పక్షుల శబ్దాలు, పిల్లలు ఆడుకునే శబ్దాలను వింటూ ఖైదీ అయిన కథానాయకుడు ఎలా నిర్వాణ స్థితిని పొందాడు!
మనం చదువులు, తత్వం, సాహిత్యం, కళలు, వ్యాపారాలు, యుద్ధాలు, నీతులు, సంప్రదాయాలు, దేవుళ్ళు, దయ్యాలు – ఎన్నెన్నో సృష్టించుకున్నాం. ప్రతిదీ అసహజమే. ఆలోచన సృష్టించిన ప్రతీదీ అబద్దమే. అందమైనవి అయితేనేమి, అద్భుతమైనవి అయితేనేమి మనసు సృష్టించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ అసత్యాలే. అవన్నీ జీవితానికి దూరమైనవే. సత్యం ప్రత్యక్షానుభవంలో మాత్రమే సాధ్యం. పర్వతం, దాని నీడ ఎప్పటికీ ఒకటి కావు.
మనమంతా అసహజత్వం అనే చెరసాలలో బంధీలమైపోయాం. మనం ఆ లోయలో, వర్షంలో, గొడుగు వేసుకుని కూర్చుని ఉన్న యువకుడి హృదయంలో ఉన్న దేనిలో మనం పోగొట్టుకున్నాం.
(సశేషం)








Add comment