కొండంత వెలుగు కోసం చిగురంత ఆశ!

వయసు పిల్లలకైనా వారి ప్రపంచంలో తమవైన బోలెడన్ని ఊహలుంటాయి. సృజనాత్మకత వుంటుంది.  ఆశలుంటాయి. సంతోషాలుంటాయి. అలాగే పెద్దల వల్ల, సమాజ వ్యవహార శైలి వల్ల వారిలో ఏర్పడే నిరాశలుంటాయి.  అణచివేయబడుతున్న దుఃఖముంటుంది.  అధిగమించాల్సిన సవాళ్లుంటాయి.  వీటన్నినిటినీ ప్రభావవంతంగా ప్రతిబింబింప చేయగల మాధ్యమం పిల్లల సినిమా.

సామాన్యంగా పిల్లల సినిమాలంటే మనం పిల్లల ఆనందం కోసం తీసే సినిమా అనుకుంటాం.  అది నిజమే కొంతవరకు. పిల్లలే పిల్లల సినిమాల్లో ముఖ్య పాత్రధారులైనప్పటికీ అవి కేవలం పిల్లల్ని రంజింప చేయడం కోసం మాత్రమే తీయరు.  ప్రతి పిల్లల సినిమాలో పిల్లలకి ఈ ప్రపంచాన్ని పరిచయం చేసే కథాంశంతో పాటు పెద్దలకి ఖచ్చితంగా ఏదో ఒక సందేశం కూడా వుంటుంది.  ఆ రకంగా పిల్లల ప్రపంచాన్ని పెద్దలకి పరిచయం చేస్తాయి పిల్లల సినిమాలు.   వీక్షకులైన పిల్లలకి కొత్త మనో ద్వారాలు తెరుచుకునేలా చేయడంతో పాటు అవి పిల్లల తరపున పెద్దలతో సంభాషిస్తాయి. పిల్లలని అర్ధం చేసుకోవడంలో పెద్దలకి సహాయ పడుతాయి.  పిల్లల కాల్పనిక, సృజనాత్మక శక్తిని పెద్దలకి అర్ధం చేయించి వారు పిల్లల ఎదుగుదలకి దోహదపడేలా చేస్తాయి.

అలాంటి 25 గొప్ప సినిమాల్ని మనకు రచయిత్రీ, సినీ విమర్శకురాలు శివలక్ష్మి గారు “చిగురంత ఆశ” అనే పుస్తకం ద్వారా పరిచయం చేశారు.  ఆవిడ అనేక బాలల జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు హాజరై ఈ 25 సినిమాల గురించి ఎంతో వివరంగా రాశారు.  ఆమె ప్రతి సినిమా ఏ వయసు పిల్లలను ఉద్దేశించి తీసినదో కేటగరైజ్ చేస్తూ ఆయా సినిమాల సామాజిక నేపథ్యం, కథ, రచనా సంవిధానం, దర్శకత్వం, ఫోటోగ్రఫీ వంటి అంశాలను క్షుణ్ణంగా వివరించడమే కాక ఆయా బాల నటుల ప్రతిభ గురించి మంచి విషయ పరిజ్ఞానంతో మనకి తెలియచేశారు.

శివలక్ష్మిగారు ఎంచుకున్న 25 సినిమాలు వేటికవే ప్రత్యేకంగా అనిపిస్తాయి.  మొత్తం ఆరుగురు మహిళా దర్శకుల సినిమాలున్నాయి ఇందులో.  రెండు మూడు యానిమేషన్ సినిమాలు మినహా మిగతా అన్నీ ఫీచర్ ఫిలంసే.  దాదాపు అన్ని సినిమాల్లోనూ పిల్లలు తాము జీవించే వాతావరణంలోని పరిస్థితులు విసిరే సవాళ్లను స్వీకరించే వారుగానే వుంటారు.   ఒక బాలల సినిమా చూస్తే బాలలు ఏ విధంగా సానుకూల స్ఫూర్తిని పొందుతారో, పెద్దలు ఏ విధంగా తమని తాము కరెక్ట్ చేసుకోగలుగుతారో ఆ విధంగా ఎంచుకున్న సినిమాలున్నాయి.  వీటిలో వివిధ దేశాలలోని సామాజిక, గృహ, తరగతి గది వాతావరణం, పిల్లలతో తలిదండ్రులు, టీచర్లు వ్యవహరించే తీరు స్పష్టంగా కనిపిస్తుంది.  కొన్ని సినిమాల్లో రాజ్య హింస ఏ విధంగా వారి జీవితాల్ని కల్లోలం చేస్తుందో చూపించడం జరిగింది.  ఆయా సందర్భాలలో సినిమా దర్శకుడు/దర్శకురాలు చూపించిన అపార ప్రజ్ఞ, సినిమాటోగ్రఫర్ నైపుణ్యం, శబ్దగ్రాహణం…వీటన్నింటి గురించి స్పష్టంగా వివరిస్తారు.  పిల్లల సినిమాలు తీయాలనుకునే వారే కాదు, ఏ సినిమాలు తీయాలనుకునే వారికైనా ఈ పుస్తకం ఒక గైడెన్స్ లా ఉపకరిస్తుందనడంలో సందేహం లేదు.  ఈ సినిమాలనన్నింటినీ లిస్టు రాసి ఒక్కొక్కటిగా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా వుంది.

రచయిత్రి ఎంచుకున్న ప్రతి సినిమాలోని బాల కళాకారులు అద్భుతంగా చేసినట్లు పేర్కొన్నారు.  పిల్లలు సహజ కళాకారులు.  పెద్దల కంటే పిల్లలు మరింత భావోద్వేగ జీవులు.  జీవితాన్ని ప్రతిబింబించ్చడం కళైతే వారిని మించిన కళాకారులుండరు.  వారు గొప్ప కాల్పనిక జీవులు.  కాల్పనికత వేరు, కృత్రిమత వేరు.  సహజ కాల్పనికతతో వారు అద్భుతంగా మమేకం కాగలరు.  వారికి కావల్సిందల్లా తగినంత ప్రోత్సాహం.

మహిళా దర్శకులు తీసిన ఆరు సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిందే. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో రొజానె స్వాట్మన్ దర్శకత్వంలో తీసిన ‘తైనా” స్నేహం, సాహసం, ప్రకృతి అనే ఈ మూడు మానవీయ అంశాల మేళవింపుగా కనబడుతుందంటారు. రష్యా దేశస్థురాలైన నతాలియా మిర్జోయన్ దర్శకత్వం వహించిన 8 నిమిషాల యానిమేషన్ ఫిల్మ్ “చింటి” సినిమా గురించి చదువుతుంటే ఈ సినిమా చూసిన 7 సంవత్సరాలు, ఆ పై వయసు పిల్లలు ఏదైనా లక్ష్యం పెట్టుకున్నప్పుడు తాము చూపించవలసిన క్రమశిక్షణ, పట్టుదల గురించి అర్ధం చేసుకుంటారనిపిస్తుంది.  రెండు దేశాల మధ్య యుద్ధ ఫలితంగా ఒక తరగతి గదిలోని పిల్లల మధ్య ఏ రకమైన వైషమ్యాలు చోటు చేసుకుంటాయో జర్మన్ భాషలో దర్శకురాలు ఎకా పపియాష్ వలి తీసిన 14 నిమిషాల సినిమా “ద గర్ల్ ఫ్రం గోరి” తెలియచేస్తుంది. అతి చిన్న దేశమైన ఎస్టోనియా నుండి కాట్రైన్ లార్ దర్శకత్వంలో వచ్చిన “గ్రేవ్ యార్డ్ కీపర్స్ డాటర్” పేదరికం ఏ విధంగా పిల్లల ప్రవర్తనని, క్రమశిక్షణని ప్రభావితం చేస్తుందో తెలియచేస్తుంది.

అంత చిన్న దేశంలో పిల్లల పెంపకంలో విద్యా వ్యవస్థ, ప్రభుత్వాల కన్సర్న్ ఆశ్చర్యపరుస్తుంది.  తరగతి గది వాతావరణాన్ని వినోదాత్మకంగా, ఉల్లాసంగా వుంచడం ద్వారా పిల్లలతో కలిసిపోయిన ట్రెయినీ టీచర్ కథని నెదర్లాండ్స్ దర్శకురాలు బార్బరా బ్రెడెరో రూపొందించిన “క్లాస్ ఆఫ్ ఫన్” చెబుతుంది.  జర్మనీకి చెందిన దర్శకురాలు కత్జవాన్ గార్నియర్ దర్శకత్వంలో వచ్చిన “ఆస్విండ్” (తూర్పు గాలి) గుర్రానికి మనిషికి వున్న అనివార్య అనుబంధం గురించి తీసిన సినిమా.  ఇందులోని బాల కథానాయకి మిక పిల్లలకి తామిష్స్టమొచ్చిన హాబీని కొనసాగించడానికి అవకాశమిస్తే అద్భుతంగా రాణిస్తారని నిరూపిస్తుంది.

పురుష దర్శకులు తీసిన సినిమాల్లోనూ గొప్ప సినిమాలున్నాయి.  తండ్రి కూతుళ్ల బంధంలోని గాఢతను, ఒకరి కోసం ఒకరు పడే తపనను చూపించిన చిత్రం నెదర్లాండ్స్ కి చెందిన మిఖేల్ వాన్ దర్శకత్వం వహించిన “పాపాస్ టాంగో”.  కాశ్మీర్లోని పరిస్థితుల్ని, అవి పిల్లల ఆలోచనల మీద, జీవితాల మీద చూపించే ప్రభావాన్ని ఎంతో ఆర్ద్రంగా చూపించిన సినిమా “నూరే”.  ఆఫ్ఘన్, క్యూబా, పాలస్తీన నుండి వచ్చిన సినిమాలు ఆయా సంక్షుభిత సమాజాలలోని పిల్లల కడగండ్లను వివరిస్తాయి.   “ఒసామా” చిత్రం గురించి చదివినప్పుడు మనసు చలీంచిపోతుంది.  ఆఫ్ఘన్ నేపధ్యంలో మహిళలపై అమలవుతున్న వ్యవస్థీకృతమైన అసంబద్ధ, ఛాందస, క్రూరమైన హింసని చిత్రిస్తుంది ఈ సినిమా.

ఇవాళ పిల్లల సినిమాలంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చే దేశం ఇరాన్.  సహజంగా ఇరాన్ కి చెందిన దర్శకుల సినిమాలు ఈ పుస్తకంలో మిగతా అన్ని దేశాల కంటే ఎక్కువగా చోటు చేసుకున్నాయి.  ఒక పిల్లవాడు పొరపాటున తనతో పాటుగా పొరపాటుగా తరగతి గది నుండి తీసుకొచ్చిన మిత్రుని హోంవర్క్ పుస్తకం ఇవ్వడానికి చేసిన హడావిడి, ఉరుకుల పరుగుల యాత్ర అబ్బాస్ కియరోస్తమి దర్శకత్వం వహించిన “వెరీజ్ మై ఫ్రెండ్స్ హోం?”లో చిత్రితమైంది. అన్నా చెల్లెళ్ల అనురాగ బంధం గురించి ‘చిల్డ్రెన్ ఆఫ్ హెవెన్”లో గొప్పగా చూపిస్తాడు ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు మాజిద్ మజిది.  “ఇరాన్ ప్రభుత్వం సంక్షోభాల బారిన పడుతున్న అట్టడుగు జీవితాల చిత్రీకరణల్ని ఒప్పుకోదు.  అందువల్ల ఇరాన్ దర్శకులు బాలల సినిమాల నేపధ్యంలో సమాజ స్వరూపాన్ని కళ్లకు కట్టినట్లు తీస్తారు” అనే ఆసక్తికరమైన గమనిక చేస్తారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సినిమా గురించి రాయాల్సి వుంటుంది.  సామ్యవాద మానవ విలువలు ఎత్తి చూపించిన సినిమాలు, తమ కలలు నిజం చేసుకున్న  ధీరోదాతా బలలు ప్రధాన పాత్రలుగా తీసిన సినిమాలు, తల్లిదండ్రుల విడాకులు కలిగించే గందరగోళంతో మానసికంగా వేదన చెదే పిల్లల కథల్ని చూపించిన సినిమాలు, వలసలు పసి మనసుల్లో సృష్టించే సంక్షోభాన్ని చిత్రించే సినిమాలు, టీనేజ్ లోకి వచ్చె ముందటి సమస్యల్ని హైలైట్ చేసిన సినిమాలు, …ఇలా వివిధ రకాలైన సినిమాల్ని ఆవిడ ఎంచుకున్నారు.  ఏ సినిమా ఎందుకు బాగున్నది, ఏ కారణం చేత అది గొప్పదైందో వివరిస్తారు.

పిల్లల్ని ప్రేమించే ముగ్గురు అమ్మలు డా. నళిని, ఆర్టిస్ట్ పల్లవి, శివలక్ష్మి రూపకల్పన చేసిన ఈ పుస్తకం చాలా విలువైనది.  అమూల్యమైన ఈ పుస్తకానికి ధర 150 రూపాయిలు తక్కువే.

(“చిగురంత ఆశ” – పిల్లల సినిమాలు 25. రచన శివలక్ష్మి.  ప్రతులకు రచయిత్రి. మొబైల్ నంబర్ 9441883949.)

 

అరణ్య కృష్ణ

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “ఇరాన్ ప్రభుత్వం సంక్షోభాల బారిన పడుతున్న అట్టడుగు జీవితాల చిత్రీకరణల్ని ఒప్పుకోదు. అందువల్ల ఇరాన్ దర్శకులు బాలల సినిమాల నేపధ్యంలో సమాజ స్వరూపాన్ని కళ్లకు కట్టినట్లు తీస్తారు” అనే ఆసక్తికరమైన గమనిక చేస్తారు…..మంచి పరిశీలన … అందరికీ అభినందనలు.

  • చాలా గొప్ప పరిచయం. కవి గారికి నెనరులు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు