అది 1930వ సంవత్సరం. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మిజ్వాన్ అనే గ్రామం. ఒక పదకొండేళ్ల బాలుడు బడినుండి ఇంటికి చేరేటప్పటికి కుటుంబసభ్యులు, వారి మిత్రగణం చేరి ఒక చిన్న మెహ్ఫిల్ వాతావరణంలో ఎవరి కవితలు వారు చెబుతున్నారు. ఈ బాలుడు కూడా ముందుకొచ్చి ఒక గజల్ చెప్పాడు. గజల్ ఎంత బాగున్నప్పటికీ అది ఆ అబ్బాయే వ్రాసాడంటే ఎవ్వరూ నమ్మలేదు. ఆ గజల్:
ఇత్నా తో జిందగీ మేఁ కిసీ కీ ఖలల్ పడే
హస్నే సే హో సుకూఁ న రోనే సే కల్ పడే
జీవితంలో ఎవరికైనా ఇంతమాత్రం దిగులంటూ ఉండాలి
నవ్వేస్తే మనఃశాంతి ఏడిస్తే ఊరట దొరకకుండా ఉండాలి
పదకొండేళ్ల వయసులో నాకు నా ఈడు వాళ్ళకెవరికైనా ‘బెంగ’ అంటూ ఉంటే లెఖ్ఖల పరీక్ష ఎలా పాస్ అవ్వాలన్నదే. లేదు మహా అయితే హాస్టల్లో ఉన్నాము కాబట్టి ఆదివారం నాన్న వస్తాడా రాడా అని, అంతే. ఈ గజల్ ఒక పదకొండేళ్లఅబ్బాయి వ్రాసాడని చదివినప్పుడు నాకు ఒళ్ళు గగుర్పొడిచింది. సినిమా భాషలో చెప్పాలంటే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. మాటలకందని ఒక awe, ఒకసారి గట్టిగా కౌగిలించుకోవాలి అనిపించే దగ్గరితనం, ఒక అత్యంత అరుదైన ప్రతిభ పట్ల కలిగే అపారమైన గౌరవం అన్నీ కలిసికట్టుగా నాలో కలిగాయి.
తరువాతి రోజుల్లో ఇదే గజల్ బేగం అఖ్తర్ నోట అవిభాజ్య భరతఖండమంతా మారుమ్రోగింది. అలా పుట్టగానే పరిమళించిన మరుమల్లెతీగ అథర్ హుస్సేన్ రిజ్ వీ – అంచెలంచెలుగా ఎదిగి ఉర్దూ సాహితీనందనవనంలో ఒక వటవృక్షంగా నిలిచిన కైఫీ ఆజ్మీ(సినీరంగంలో ఆప్యాయం గా పిలుచుకున్నట్టయితే కైఫీ సాబ్).
***
50-70 దశకాల్లో వచ్చిన హిందీ సినిమా సంగీతాన్ని ఆరాధించే వారందరికీ కైఫీ సాబ్ రచనలు, వారు వ్రాసినవి అని తెలిసినా తెలియకపోయినా, సుపరిచితమే! సినిమాకు వ్రాసినా సాహితీప్రమా ణాలు లేశమాత్రమైనా తగ్గిపోకుండా కైఫీ సాబ్ వ్రాసిన ఆణిముత్యాల్లాంటి పాటలు అనేకం ఉన్నాయి. ఎన్నని తలచుకోగలం! మదన్ మోహన్(ఇంకో నరరూపరాక్షసుడు!) స్వరపరచిన నాకు ఎంతెంతో ప్రియమైన రెండు పాటలు చూద్దాం.
ఆజ్ సోచా తో ఆఁసూ భర్ ఆయే
ముద్దతేఁ హోగయీ ముస్కురాయే
(ఇప్పుడు తలచుకుంటే దుఃఖం ముంచుకొస్తోంది
చిరునవ్వు నవ్వి కొన్నియుగాలు కావస్తోంది)
హర్ కదం పర్ ఉధర్ ముఢ్ కే దేఖా
ఉన్ కీ మెహ్ఫిల్ సే హమ్ ఉఠ్ తో ఆయే
(అడుగడుగునా వెనుదిరిగి అటే చూ శాను
తన విందు నుండీ రావడమైతే వచ్చేశాను)
రెహ్ గయీ జిందగీ దర్ద్ బన్ కే
దర్ద్ దిల్ మేఁ ఛుపాయే ఛుపాయే
(హృదయంలో బాధను దాచీ దాచీ
జీవితమే బాధగా మిగిలిపోయింది)
దిల్ కి నాజుక్ రగేఁ టూట్తీ హై
యాద్ ఇత్నా భీ కోయీ న ఆయే
(సన్నని హృదయతంత్రులు తెగిపోతాయి
ఇంతగా ఎవరూ గుర్తుకు రాకూడదు)
కైఫీ సాబ్ ఒక ఇంద్రజాలికుడు. అలతి అలతి పదాలతో గుండెను మెలితిప్పగల మాటల మాంత్రికుడు. తన కవనపరిభాషలో అనవసరమైన ఆర్నమెంటేషన్ కనబడదు. చర్వితచర్వణాలైన ప్రతీకలు, పదగుచ్ఛాలు కనబడవు. కవి అని పిలవబడే ఎవరైనా తమ రచనల్లో సాధించాలనుకునే లక్షణాలు ఇవి: Economy of words, lucidity of thought, elegance of expression and permanence of impact. ఇవి కైఫీ సాబ్ కవిత్వంలో ప్రతి అక్షరంలో ప్రతిబింబిస్తాయి. పై గజల్ లోనూ కనిపిస్తాయి. ఒక్కోసారి కవిత్వం రాయడం ఇంత సులువా అనిపించేంత సరళంగా వ్రాస్తారు. సచిన్ బాటింగ్ చేస్తుండగా ఎన్నో సార్లు వ్యాఖ్యాతలు ‘He makes it look so easy’ అని అనడం వినే ఉంటాము. కానీ అలా ఆడగలిగిన ఆటగాళ్లను వేళ్ళమీద లె క్కించగలం. అలాగే కైఫీ సాబ్ కవిత్వమూనూ! ఇక ఇంతటి నాణ్యమైన సాహిత్యానికి మదన్ మోహన్ వంటి స్వరస్రష్ట, లత వంటి గానకోకిల తమతమ కళను జోడిస్తే ఆ పాట కలకాలం రసజ్ఞుల హృదయదిగంతాలలో ప్రతిధ్వనించకుండా ఎలా ఉంటుంది. అమరత్వాన్ని పొందుతుంది!
***
ఉర్దూ సాహిత్యంలో గజల్ కాకుండా కతా, రుబాయి, మస్నవీ, కాసీదా మొదలగు సాహితీప్రక్రియలు ఉన్నాయి. అన్నిటిలోకి నజ్మ్ ప్రాథమికమైనది. నేను స్వతహాగా గజల్ నే ఎక్కువ ఇష్టపడతాను. అయితే కైఫీ సాబ్ వ్రాసిన ఒక నజ్మ్ ‘హాకీకత్’ అనే సినిమాలో వాడుకున్నారు. దీనికీ మదన్ మోహనే బాణీ కట్టారు.
మై యే సోచ్ కర్ ఉస్కె దర్ సే ఉఠా థా
కె వో రోక్ లేగి మనాలేగి ముఝ్ కో
హవావోఁ మే లెహ్రాతా ఆతా థా దామన్
కె దామన్ పకడ్ కర్ బిఠా లేగి ముఝ్ కో
కదమ్ ఐసె అందాజ్ సే ఉఠ్ రహే థే
కె ఆవాజ్ దే కె బులా లేగి ముఝ్ కో
మగర్ ఉస్ నే రోకా న ఉస్ నే మనాయా
న దామన్ హీ పక్డా న ముఝ్ కో బిఠాయా
న ఆవాజ్ హీ దీ న వాపస్ బులాయా
మై ఆహిస్తా ఆహిస్తా బఢ్తా హీ ఆయా
యహాఁ తక్ కె ఉస్ సే జుదా హోగయా మై
జుదా హోగయా మై జుదా హోగయా మై
స్థూలంగా భావం:
తాను వెళ్లకుండా ఆపి బుజ్జగిస్తుంది అనుకుని బయలుదేరాను. గాలుల్లో ఎగిరే పైటతో కట్టేస్తుందనుకున్నాను. బిగ్గరగా వెనక్కి రమ్మని పిలుస్తుందనుకుని ఒక్కో అడుగూ వేస్తూ వచ్చాను. తాను ఆపలేదు, బుజ్జగించలేదు, వెనక్కి రమ్మని అరవలేదు. నేను నెమ్మది నెమ్మదిగా ఎంత దూరం వచ్చానో చూసుకుంటే నేను తనకి శాశ్వతంగా దూరమైపోయాను. దూరమైపోయాను, నేను దూరమైపోయాను.
రఫీ సాబ్ ని తలచుకుంటూ ఒక బాత్రూం సింగర్ గా ఈ పాటని ఏడవకుండా పాడాలని ఎన్ని విఫలయత్నాలు చేసానో గుర్తులేదు. మనకు అనుభవపూర్వకమైతే అప్పటివరకూ కేవలం లిటరల్ రిలవెన్సు ఉన్న కొన్ని వ్యక్తీకరణలు మరింత గాఢతని సంతరించుకుంటాయి. ఈ పాట విన్నప్పుడే నాకు ‘గుండెలు పిండేసినట్టు’ అంటే ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. కైఫీ సాబ్ అభివ్యక్తికి అప్పుడే ఫిదా అయిపోయాను. ఇదే permanence of impact.
**
కైఫీ సాబ్ స్వాతంత్రసమరంలో పోరాడారు. కమ్యూనిస్ట్ పార్టీలో, ప్రగతివాద రచయితల సంఘంలో సభ్యులు. ఆ నేపథ్యం కూడా వారి రచనల్లో తరచుగా ఒక మెరుపు మెరుస్తుంది. ఈ రోజుకీ హిందీ దేశభక్తి గీతాలు, అందులోనూ భద్రతా దళాల ధైర్యత్యాగాలను కొనియాడుతూ, ఎవరినైనా పాడమంటే ఖచ్చితంగా మొదట గుర్తొచ్చే పాట:
కర్ చలే హమ్ ఫిదా జాన్-ఓ-తన్ సాథియో
అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో
జవజీవాలని అర్పించి మేము వెళుతున్నాము
ఇక దేశాన్ని మీ చేతుల్లో పెట్టి వెళుతున్నాము
కైఫీ సాబ్ కి తన స్వగ్రామం మిజ్వాన్ అంటే ఎనలేని అభిమానం. ఒకచోట అంటారు:
మేరా బచ్పన్ బీ సాథ్ లే ఆయా
గాఁవ్ సే జబ్ భీ ఆ గయా కోయీ
ఊరి నుండీ ఎవరు వచ్చినా
నా బాల్యాన్నీ వెంట తెచ్చారు
కైఫీ సాబ్ స్థాపించిన మిజ్వాన్ సంక్షేమ సంస్థ ఈ రోజుకీ ఆయన కుమార్తె షబానా ఆజ్మీ నిర్వహణలో ఆ ఊరి బాలికల కోసం పాఠశాల, కళాశాల నడుపుతోంది.
ఇంకో చోట ఆ నాటికే భారతదేశంలో ఉన్న విశాలమైన ఎకనామిక్ స్పెక్ట్రమ్ ని ఎద్దేవా చేస్తూ ఈ షేర్ చెప్పారు:
ఐసా లాగా గరీబీ కీ రేఖా సే హూఁ బులంద్
పూఛా కిసీ నే హాల్ కుఛ్ ఐసీ అదా కే సాథ్
ఎవరో కుశలప్రశ్నలు అడిగిన తీరు చూస్తే
దారిద్య్రరేఖకి ఎగువన ఉన్నాననిపించింది
చిట్టచివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ రాజ్యభ్రష్టుడై అజ్ఞాతంలో వ్రాసిన ఒక ప్రశస్తమైన గజల్ లో ఒక షేర్:
కిత్నా హై బద్-నసీబ్ జఫర్ దఫన్ కే లియే
దో గజ్ జమీఁ భీ న మిలీ కూ-ఎ-యార్ మేఁ
కైఫీ సాబ్ చమత్కారంగా ఈ షేర్ ని ఉపయోగించుకుని మానవనైజమైన దురాశని నిరసిస్తూ చెప్పిన షేర్:
ఇన్సాన్ కీ ఖ్వాయిషోఁ కా కొయీ ఇన్తిహా నహీ
దో గజ్ జమీఁ భీ చాహియే దో గజ్ కఫన్ కే బాద్
మనిషి ఆశలకు ఏ హద్దులూ లేవు
రెండు గజాల కఫన్ తర్వాత రెండు గజాల నేల కూడా కావాలి
‘కఫన్’ అంటే మృతదేహాలపై కప్పే వస్త్రం. మనిషి ఆశలు మరణంతో తీరిపోవు అని చెప్పడం అన్నమాట.
**
యూట్యూబ్ లో అభిరుచి కారణంగా అనేకమైన పాత, కొత్త ముషాయిరాలు చూసాను. అప్పుడప్పుడే కవులుగా మారిన వారి దగ్గరి నుండీ తలపండిన వారి వరకూ వారు కవితలు చదివేటప్పుడు శ్రోతలు వాహ్వాకారాలతో అభినందించకపోతే నొచ్చుకుంటారు. ముక్కుసూటిగానో అన్యాపదేశంగానో అడిగి మరీ అభినందనలు పొందుతారు. నేను చూసినంతవరకూ కైఫీ సాబ్ కి అటువంటి అవసరం ఎప్పుడూ రాలేదు. అందరూ ఆయన చదువుతున్నంత సేపూ కురిసే కవనాధారలో తడిసి తరించే వారే. ఒక రాజ్ కపూర్ పాటలో చెప్పినట్టు ‘దిల్ కా హాల్ సునే దిల్ వాలా, సీధీ సీ బాత్ న మిర్చి మసాలా, కెహ్ కె రహేగా కెహెనే వాలా’, కైఫీ సాబ్ ఒక సచ్చా దిల్ వాలా, ఒక జిందా-దిల్ వాలా!
*
ఒక జిందా-దిల్ వాలా గురించి రాసిన మీకు..అభివందనలు సర్..💐.గజల్ తప్పించి, ఏమి తెలియని ఉర్దూ సాహిత్యం లో మాకు,nazmi దూరం అయిపోయాను.పాట,..విపరీతంగా నచ్చింది.. 👌👌మరొక్కమారు ధన్యవాదాలు.!సర్
ఒకసచ్చాదిల్ వాలా ఒకజిందా దిల్ వాలా గురించి తెలియచేసిన, మీకు ప్రణాములు సర్!👌💐.
ధన్యవాదాలు పద్మ గారు!
అద్భుతం.. ఆటో బియోగ్రఫీ లాగా సాగిన సంగీత పాఠం. ప్రతి లైన్ కోట్ చేసుకునేలా అనిపించింది. కవిత్వం అన్నా…కైఫ్ సాబ్ అన్నా మీకున్న ఎనలేని వ్యామోహం మాకూ పంచారు..
దీన్నుండి నే అయితే బయటకు రాలేను..కైఫ్ సాబ్ గజల్స్..పాటలు అయితే యు ట్యూబ్ లోనో..ఇంకో చోటో దొరుకుతాయి..ఆస్వాదిస్తాను..
కానీ, మళ్లీ మళ్లీ చదవాలని అనిపించిన మీ వ్యాసాలు మరిన్ని మేము కోరుకోవడం లో అత్యాశ లేదనే భావిస్తాను
..హృదయం లో మెత్తగా పాకిన మీ వ్యాస సంగ్రహం ..ఇతర కవుల ప్రపంచం తో పంచుకోవాలని అనిపించింది..
మీకు నమస్సులు…Waiting for some more art pieces!
ధన్యవాదాలు సురేష్ గారు!
Glad you were enraptured in the magic of Kaifi Saab’s poetry.
ఇంతకు ముందు అహ్మద్ ఫరాజ్ నీ, జూన్ సంచికలో రాజేష్ రెడ్డి గారినీ పరిచయం చేశాను. మీ ప్రోత్సాహవచనాలు నాకు ఈ వ్యాసరచన పట్ల ఆసక్తిని ఇనుమడింపజేశాయి. మరికొందరు కవులను పరిచయం చేసేందుకు ధైర్యాన్నిచ్చాయి. Thank you again!