ఇంగ్లీషు మూలం : సుప్రియ దేవరకొండ
స్వేచ్ఛానువాదం : హేలీ ఖెవిన్
ఏదో ఒక చిన్న కదలిక నాలో కనిపించింది!
నాలో ఒక బిడ్డ! నాతో ఒక బిడ్డ!
ఎంత గొప్ప భరోసాగా వుందీ…!
అబ్బా!…ఎంత అద్భుతంగా, ఎంత అపురూపంగా వుంది…
ఒక శిశువు, ఒక కొత్త ప్రాణం నాలో వుండడం!
నేను ఈ బిడ్డకి ఉన్నంత దగ్గరగా ఎప్పుడూ
ఎవరితోనూ ఉన్నట్టు అన్పించడం లేదు!
అసలు ఇలా ఇంతకు ముందెప్పుడూ లేను కదా…!
… … …
‘‘చిన్ని తల్లీ! నేను ఎవరో నీకు తెలుసా..?!
నేను మీ అమ్మ కమలని!
మన కుటుంబంలో ఉన్న అందర్ని ఇప్పుడు నీకు
పరిచయం చేస్తాను!
చిట్టిపాపా! నువ్వు ఇంకా అమ్మ పొట్టలోనే ఉన్నావు కదా…
మరి వీళ్ళెవరూ కనిపించరు కదా… అయినా
పర్వాలేదు. నేను చెబుతూ వుంటాను…
నా మాటల్లోనే నువ్వు వాళ్ళందర్నీ చూడవచ్చు!
క్యారేజి బాక్స్ కోసం అరుస్తూన్నారు చూడూ
అతనే మీ నాన్న సుందర్!
అదిగో, అక్కడ
పొయ్యిగదిలో కూర్చోని
చుట్టూ నాలుగు కూరగాయలు తరగుతూ వుందే `
ఆమే మీ నానమ్మ! చాలా బాగా వంట చేస్తుంది.
మంచి మంచి పదార్థాలు రుచికరంగా వండి వారుస్తుంది.
ఇక… అక్కడ వాలు కుర్చీలో కూర్చొని
పేపరు చదువుతూ రేడియో వింటున్నారే `
ఆయనే మీ తాతయ్య! మీ తాతయ్యకి రేడియో వినడం అంటే చాలా ఇష్టం. గంటల తరబడి అలా వింటూనే వుంటాడు.
అమ్మ చెప్పేదంతా వింటున్నావుగా…
వీళ్లంతా ` నీ కళ్ల ముందు కన్పిస్తారులే!
నువ్వు నా రాకుమారివో ` రాకుమారుడువో
నాకు తెలియదు. నాకు మాత్రం ఇద్దరిలో
ఎవరైనా ఒక్కటే!
కానీ మన కుటుంబం
మాత్రం నువ్వు ఒక బుల్లి రాకుమారుడివి
కావాలని కోరుకుంటుంది.
నువ్వొక చిన్నికృష్ణుడిలా
రావాలని ఎదురు చూస్తూ వుంది.’’
… … …
నాకు తెలుసు…
మా అత్తగారు తన ఈ కోరిక నెరవేరడానికి
అన్ని గుడులు, గోపురాలు తిరుగుతున్నారనీ!
కానీ, మగపిల్లవాడు కాకుండా, ఒకవేళ
ఆడపిల్ల పుడితే…!! ఏమో…! ఏం జరుగుతుందో తెలియదు…!
భగవంతుడా! వాళ్లు కోరినట్లుగా రాకుమారుడినే పుట్టించు!
***
ఇప్పుడు నేనున్న మా అత్తగారి గ్రామం పట్టణానికి దూరంగా వుంది. దాదాపు ఇరవై మైళ్ల దూరంలో ఉంటుంది. మా పుట్టింటికి దగ్గర అన్నమాట!
అందుకని కాన్పు కోసం అంత దూరం పుట్టింటికి వెళ్లొద్దు అనుకొని మంత్రసాని సహాయంతో అత్తగారి ఇంట్లో ప్రసవించాలనుకున్నా! మంత్రసాని చాలా అనుభవజ్ఞురాలని, బాగా కాన్పు చేస్తుందని పేరు. ఇప్పటికి దాదాపు ముప్ఫై నలభై ప్రసవాలు చేసింది.
***
నా చిన్నారి బయటకు వచ్చేరోజు రానే వచ్చింది. తల్లిగర్భం అనే ఒక సురక్షితమైన స్థానం నుంచి బిడ్డ బయటకు వచ్చే సమయం వచ్చింది.
అమ్మా…! ఈ పురిటినొప్పులు అసలు భరించలేనివిగా ఉన్నాయి. ఎవరినైనా గట్టిగా తిట్టాలని కొట్టాలని అనిపించింది. ఈ నొప్పి ` ‘భరించ గలిగే నొప్పి’ అని ఎవరైనా అంటే వాళ్లు ఈ నొప్పిని ఎప్పుడూ అనుభవించలేదని అర్థం!
చివరికి బిడ్డ ఈ లోకంలోకి వచ్చింది. ‘కేర్… కేర్’! బిడ్డ ఏడుపు వినగానే నాకు కొంచెం ఉపశమనం దొరికింది.
మంత్రసాని నాకు బిడ్డను అందించింది. ఎంత అందంగా వుందీ! బిడ్డ నా చేతిలోకి వచ్చిన మరుక్షణం అప్పటి వరకూ నేను అనుభవించిన ప్రసవ వేదనంతా మటుమాయం అయింది. నా గుండెలో ‘ఇవీ’ అని చెప్పలేని ఏవో భావోద్వేగాలు పొంగుతున్నాయి.
నేనిప్పుడు అమ్మని!
ఈ పసిగుడ్డు నా బిడ్డ!
ఈ సరికొత్త భావం నన్ను నిలువెల్ల ముంచేసింది.
బిడ్డ ఏడుపు వినగానే నా భర్త సుందర్ ఒక్కసారిగా తలుపు తోసుకొని లోపలికి వచ్చాడు. నేను ఆత్రుతతో అతనికి అపురూపమైన మా బిడ్డని నా రెండు చేతులతో పైకి ఎత్తి చూపించాను.
కానీ… అతను మొదట అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? ‘మగ బిడ్డ పుట్టాడా? ఆడబిడ్డ పుట్టిందా?’ అని! మంత్రసాని తల అడ్డంగా ఊపి ‘ఆడపిల్ల పుట్టింది’ చెప్పింది.
అంతే…! అది వినడంతో అతడు ఒక్కసారిగా కోపంతో రగిలి పోయాడు… తిట్టుకుంటూ, పెద్దపెద్ద అడుగులు వేసుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు.
బయట బిడ్డ పుట్టినందుకు జరుగుతున్న వేడుకలన్నీ ఆపేశాడు. చాలా దురుసుగా అందర్ని అక్కడ నుండి వెళ్ళగొట్టాడు. నాకు చాలా దుఃఖం వచ్చింది. ‘ఎందుకు ఇతను తనకు కొడుకే పుట్టాలని అనుకుంటున్నాడు? అమాయకమైన ఈ పాపని ఎందుకు అతను స్వాగతించాలనుకోలేదు? ఈ బిడ్డ తన కూతురే కదా..! ఎందుకు ఈ పాపని ప్రేమించలేకపోతున్నాడు?’ నా గుండె కలుక్కుమంది. తీవ్రమైన బాధ మొదలైంది.
***
కుటుంబంలో ఎవరూ కనీసం పాప ముఖమైనా చూడలేదు. మెల్లగా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం కాస్తా ఆవిరైపోయింది. ఆ స్థానాన్ని దిగులు ఆక్రమించింది. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకంటే ఆ కుటుంబంలో మగ బిడ్డ పుట్టలేదని! ఆడబిడ్డ పుట్టిందని!! నేను నా మనసులో ఒక్కటే అనుకున్నాను. వాళ్లలా నేను దిగులు చెందకూడదని! నా పాప కోసం సంతోషంగా ఉండాలీ అని.
***
కొన్ని రోజులు గడిచాయి. నేను పాపని ఒడిలో పెట్టుకొని పాలిస్తూ తల నిమురుతున్నాను. పాప ముఖం హాయిగా నిశ్చింతగా వుంది. పక్క గదిలో నుంచి సుందర్ గొంతు వినిపించింది. వాళ్ల అమ్మానాన్నలతో మాట్లాడుతున్నాడు. అది పాప గురించే! అతనికి తలమీద ఒక బండరాయి వచ్చి కూర్చుందని అది కూతురు రూపంలో వచ్చిందని అన్నాడు. ఆడపిల్లను కన్నందుకు అతని స్నేహితులు, బంధువులు అవహేళనలు చేస్తూన్నారని, వాటిని తను పడలేక పోతున్నానని అన్నాడు. ఆ అవమానాలు భరించలేక కూతుర్ని చంపెయ్యాలనిపిస్తుందని అన్నాడు. ఆ మాటలతో నేను చాలా భయపడి పోయాను. నిలువునా వణికి పోయాను!
మా అత్తగారు మాత్రం హఠాత్తుగా చాలా ఉత్సాహ భరితమయ్యారు. ఆమె గొంతు తగ్గించి రహస్యంగా ‘‘కమలకి తెలియకుండా పాపను తీసుకొని, ఒక ప్లాస్టిక్ కవరులో పాప తలని కుక్కి, చెత్త కుప్పలో పారేద్దాం… అప్పుడు ఊపిరి ఆడక పాప చనిపోతుంది!’’ అన్నారు.
ఇది విన్న ఆ ఇద్దరి మగవాళ్ళు ‘‘ఈ పథకం బాగుంది అలాగే చేద్దాం…! అలాగే చేద్దాం..!’’ అన్నారు.
అదంతా విని నాకు ఊపిరి ఆగినంత పనైంది. నా నెత్తి మీద పిడుగు పడ్డట్టు అన్పించింది! నిలువునా కంపించి పోయాను. వెంటనే పాపని నా హృదయానికి హత్తుకున్నాను.
ఆ రాత్రంతా తెల్లవారటం కోసం ఎదురు చూశాను. తెల్లవారక ముందే చీకటితో లేచి నిశ్శబ్దంగా పాపని ఎత్తుకొని, ఆ ఇంట్లో ఎవరికి తెలియకుండా మా పుట్టింటికి బయలుదేరాను.
దారిలో ఉన్న ఆసుపత్రి వరకు నడిచేసరికి తెల్లవారి పోయింది. అల్లంత దూరంలో ఆసుపత్రి గేటు దగ్గర ఇంచుమించు ఏడాది వయసున్న పాప ఒక్కతే ఏడుస్తూ కనిపించింది. నేను ఆ బిడ్డ దగ్గరకు వెళ్ళేలోపే సెక్యూరిటీ గార్డుతోపాటు ఆసుపత్రి లోపల నుంచి వచ్చిన నర్సులు, డాక్టరు ఆ బిడ్డను ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్ళారు. అసలు ఏం జరిగిందో తెలిసుకోవాలని నేను అక్కడే వున్న సెక్యూరిటి గార్డును అడిగాను. అతను చాలా మంచి వాడిలా ఉన్నాడు. ఓర్పు, సహనంతో ఉన్నాడు. ‘‘ఒంటరిగా కనిపించిన ఆ బిడ్డని ఒక సామాజిక కార్యకర్తకి ఇస్తారు. ఆ కార్యకర్తతో కలిసి పోలీసులు ఆ బిడ్డ తల్లిదండ్రులను వెదుకుతారు’’ అని అన్నాడు. ‘‘ఒక వేళ తల్లిదండ్రులను కనిపెట్టలేకపోతే?’’ అని అడిగాను. ‘‘అప్పుడు ఆ బిడ్డని పిల్లలు కావాలనుకొని, పిల్లల్ని ప్రేమించే మంచి కుటుంబాలకు దత్తత ఇస్తార’’ని చెప్పాడు.
అతను చెప్పింది విని ఆలోచిస్తూ మెల్లగా మళ్ళీ పుట్టింటి వైపు అడుగులు వేశాను. సూర్యుడి వెలుగు ప్రకాశవంతంగా మారింది!
***
నేను చేరగానే మా అమ్మ ` నాన్న, నన్ను ` పాపని చూసి చాలా ఆనందించారు. కానీ ఇంటి నుండి పాపతో పారిపోయి వచ్చాను అని చెప్పగానే భయపడ్డారు. వెంటనే తిరిగి వెళ్ళిపొమ్మని చెప్పారు. ‘‘నువ్వు, నీ కాపురాన్ని సవ్యంగా చేసుకోవటానికి ఈ పాప భారం అయితే పాప చనిపోయినా పర్వాలేదు’’ అని చెప్పారు. వాళ్ళ మాటలకు నేను ఆశ్చర్యపోయాను. చాలా నిరాశగా అనిపించింది. ఏం చేయాలో పాలు పోలేదు. ‘‘దీనికి నన్ను నేను సిద్ధం చేసుకోవటానికి ఒకటి ` రెండు రోజులు ఇక్కడే వుంటాను’’ అని చెప్పాను.
నా చిట్టితల్లిని చూస్తుంటే, తన అమాయకమైన పసిమొఖాన్ని చూస్తుంటే ` ‘చూస్తూ, చూస్తూ ఈ బిడ్డని ఆ ఆడబిడ్డల హంతకుల చేతుల్లో పెట్టాల్సిందేనా..?’ అనిపించింది.
మరుసటి రోజు ‘అత్తగారింటికి వెళుతున్నాను’ అని అమ్మనాన్నలతో చెప్పి, బయలుదేరాను. హాస్పిటల్ గేటు దగ్గర వరకూ నడిచాను. ఆ రోజు హాస్పిటల్ గేటు దగ్గర జరిగింది గుర్తుకొచ్చింది. బహుశా నా బిడ్డ విషయంలో కూడా దేవుడి చిత్తం ఇదే… అనుకొని గుండె నిబ్బరం చేసుకొని నా భుజం మీద నుంచి ఏడుస్తున్న నా బంగార పాపని నా చేతులతో గేటు ముందు పడుకోబెట్టాను. నా కళ్ళలోనించి నీరు దారాపాతంగా కారిపోతున్నాయి. పాప అరికాలితో నా మొహాన్ని తడుముకొని, గాఢంగా ముద్దుపెట్టుకొని పాపను అక్కడే వదిలేసి వచ్చేశాను. నన్ను ఎవరూ చూడక ముందే అక్కడ నుండి పరిగెత్తుకుంటూ గుండె దడదడలాడుతుండగా ఎలాగోలా అత్తగారి ఇల్లు చేరాను.
మా అత్తగారు నన్ను వాకిట్లో చూసి బిడ్డ నాతో లేకపోవడం గమనించి అయోమయంలో పడ్డారు. తలవాల్చుకొని ‘నేను బిడ్డను వదిలించుకున్నాను’ అని చెప్పాను. ఇదేగా వాళ్లకి కావాల్సింది… అదే నేను చేశాను! వాళ్లు చాలా సంతోషించారు. ఊళ్లో అందరికి బిడ్డ చనిపోయిందని అర్ధరాత్రి సమాధి చేయటం జరిగిందని చెప్పారు.
నా భర్త, అత్త మామలు ఆరోజు చాలా సంతోషంగా గడిపారు. రెండురోజుల తరువాత నా భర్త సంతోషంగా ఈల వేసుకుంటూ జిలేబీలు తెచ్చారు. అవి ఒక వార్తా పత్రికలో కట్టి ఉన్నాయి. జిలేబీలు ఇంట్లో అందరికి పంచమని చెప్పి ఆ పొట్లం నా చేతికి ఇచ్చారు. అందరికీ పంచిన తరువాత నా చేతిలో వార్తాపత్రిక మిగిలింది. అందులో… నా చిన్నారి బిడ్డ ఫోటో కనిపించింది. నేను వెంటనే దానిని నా జాకెట్‌లో దాచిపెట్టి, పశువుల శాలలోకి వెళ్ళాను. నా భర్త కానీ, నా అత్తమామలు కానీ కనీసం పాపని ఒక్కసారి కూడా చూడకపోవడంతో పాపని ఎవరూ గుర్తుపట్టలేదు. నా బిడ్డ ఫోటో ఉన్న ఆ వార్తా పత్రికను గుండెలకు హత్తుకొని గట్టిగా ఏడ్చాను…!!
***
ఈ కథ విన్న తరువాత నేను నా బంగారు తల్లిని వదిలేసి వచ్చినందుకు మీరంతా నన్ను ‘క్రూరమైనది’ అనుకుంటున్నారు కదూ…! అయితే అలా అనుకుంటున్న వారందర్నీ నేను ఒకటి అడగాలి –
మీరంతా నీతిసంరక్షకులు…!
‘‘నా భర్త, నా అత్తమామలు నా బిడ్డని
చంపాలని చూసినప్పుడు మీరంతా
ఏమయ్యారు?’’
‘‘పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అని
తెలిస్తే ఆ బిడ్డ ఈ లోకంలోకి రాకముందే
తల్లిగర్భంలోనే చంపేసినప్పుడు మీరంతా
ఎక్కడ ఉన్నారు?’’
‘‘పుట్టింది ఆడపిల్ల అని తెలియగానే
బిడ్డ ఉమ్మనీటి తడి ఆరక ముందే
ఆ బిడ్డ ప్రాణం తీస్తున్నప్పుడు మీరంతా
ఎటు పోయారు?’’
‘‘బిడ్డల్ని కనలేని స్త్రీలని ఈ సమాజం `
‘వాడిన పాతగుడ్డ’ లా విసిరి అవతలకు పారేసినప్పుడు
మీరు ఏమయిపోయారు?’’
ఇంతకి మించి మిమ్మల్ని అడగడానికి ఏమిలేదు!
***
నేను క్రూరురాలిని కాదు. నా కూతురు ప్రాణంతో ఉండాలని, అనుక్షణం ప్రాణ భయంతో ఉండకూడదని, అవమానాలతో, అవహేళనలతో పెరగకూడదని, తన భవిష్యత్తు బాగుండాలని తను ఒక రాజకుమారిలా బతకాలి అని, నిశ్చింతగా భరోసాగా జీవించాలి అని, తన తల్లిదండ్రులు తనని ఆడపిల్ల అనే ఒకే ఒక కారణంతో తీసిపారేయకుండా తనని ప్రేమించాలని… కోరుకునే ఒక అమ్మని మాత్రమే!
* **
ఇప్పుడు నా బంగారు తల్లితో ఒక మాట చెప్పాలని నా గుండె కొట్టుకుంటుంది. ‘‘చిన్ని తల్లీ! నువ్వు ` నిన్ను ప్రేమించే కుటుంబంలో సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను. ‘మంచి కుటుంబం’ అనే రక్షణ కవచంలో భద్రంగా ఉన్నావని నమ్ముతున్నాను. అపురూపంగా, అల్లారుముద్దుగా పెరుగుతున్నావని విశ్వసిస్తున్నాను.
నువ్వు పెద్దాయ్యాక ఒక రోజు మీ అమ్మ చేసిన పనిని అర్థం చేసుకొని క్షమిస్తావని కోరుకుంటున్నాను.
అప్పటి నీ ఫోటోని ముద్రించిన ఆ వార్తా పత్రికని ఈ ప్రపంచంలో అన్నిటి కన్నా గొప్పదిగా, నా ప్రాణాధికమైన అపూర్వ సంపదగా దాచుకున్నా.
ప్రతిరోజు నిద్రలేవగానే పెట్టె తెరచి నీ మొహమే చూస్తాను.
ప్రతిరోజు నిద్రపోయే ముందు నా గుండెలకు హత్తుకొని కన్నీళ్ళు కార్చకుండా మెల్లగా జోల పాట పాడుతున్నాను…”
(అయిపోయింది)
పైన చెప్పిన కథ ` నేను విన్న చాలా సంఘటనల ఆధారంగా రాసిన కల్పిత కథ. ఈ కథ వాస్తవానికి దూరం కాదు. చాలామంది స్త్రీలు పేదరికం వలన కానీ, పెళ్ళికాని తల్లిగా సమాజాన్ని ఎదుర్కోలేక కానీ, ఆడపిల్లకు జన్మనివ్వటం వలన కానీ ఇలా చేయాల్సి వస్తుంది.
నేను ఒక సంఘటన విన్నాను. ఒక పద్నాలుగేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. తరువాత ఆ బాలిక గర్భవతి అయింది. నెలలునిండి బిడ్డను ప్రసవించింది. తరువాత ఆ కుటుంబంలోని పెద్దవాళ్లు ఆ బిడ్డను అనాథ శరణాలయంలో వదిలేశారు.
ఎవరైతే బిడ్డని వదిలేయటాన్ని ఖండిస్తున్నారో వాళ్ళకి నా ప్రశ్న ఏమిటంటే ` ఇలాంటి పరిస్థితిలో ఒక చిన్నపిల్ల ఇంకొక చిన్నపిల్లని ఎలా పెంచుతుంది? దీనిని కదా అర్థం చేసుకోవాలి. ఆడపిల్లల మీద దుర్మార్గంగా అత్యాచారాలు చేసే ఇలాంటి క్రూరమైన స్థితిని కదా ఖండించాలి. ఆ బిడ్డల కోసం, పిల్లల అక్రమ రవాణాని నిరోధించడం కోసం, ఆ పిల్లల మంచికోసం, వారి మంచి భవిష్యత్తు కోసం మనం పోరాడవచ్చు కదా!
నేనూ బిడ్డని దత్తత తీసుకున్న తల్లినే! నా కూతురు ‘మానస్వి’, నవంబర్ 2012లో ఒక ఆసుపత్రి దగ్గర కనిపించింది. ఒక ఏజన్సీవారు అక్కున చేర్చుకొని మాకు ఇచ్చారు.
అయినా నా అపురూపమయిన బిడ్డకు జన్మనిచ్చిన తల్లి గురించి మాట్లాడటానికి నేను ఎవరిని? నా బిడ్డ కూడా మెల్లగా పరిస్థితులను అర్థం చేసుకొని జీవితం కొనసాగిస్తుందని, తన కంటూ మంచి స్థానం ఏర్పరచుకుంటుందని ఆశిస్తున్నాను.
*
చాలా కదిలించే పరిస్థితులను, విలువైన ప్రశ్నలను వివరించారు. బాగా రాశారు సుప్రియ మీరు.
హేలీ కెవిన్ కూడా చిన్న వయసు అయినప్పటికీ ఎంతో పరిణితి తో అనువాదం చేసింది.
Hugs & love for both if you.
సుప్రియ ఈ కథ మా స్వయంసిద్ధ లో రావాల్సిన కథ. మేం translate చేసి పంపితే ఏసుకుంటామని సుబ్రహ్మణ్యం( మీ నాన్న) గారికి చెప్పాను. ఆయన translate చేసేవారు ఎవరూ లేరు నేనైనా చేసి పంపుతాను అన్నారు. ఆ తర్వాత మీ నుండి సమాధానం రాలేదు. ఇప్పుడిలా చదవడం చాలా బాగుంది. మంచి translation అభినందనలు మీకు మీ నాన్న గారికి
విజయగారూ నమస్తే. క్షమించాలి నేను మా అమ్మాయి రాసిన దానిని నేను అనువాదం చేయలేదు. హేలీ ఖెవిన్ అని సెకండ్ ఇంటర్ చదువుతున్న అమ్మాయి స్వేచ్చానువాదం చేసింది.
మన దేశంలో ఒక దౌర్భాగ్య పరిస్థితిని కళ్లకు కట్టినట్లు రాశారు సుప్రియ గారూ..మీ కలం నుంచి ఇలాంటి రచనలు ఇంకా రావాలి.
ఈ కథలో కొత్తదనం లేకపోయినా కథనం గొప్పగా ఉంది. రచయిత్రికి అభినందనలు.
చాలా బాగా రాశారు. గుండె పట్టేసింది. ఇలాంటి అత్యాచారాలు ఆడపిల్లల మీద జాతుగుతూనే ఉన్నాయి. పూర్వం చదువులు లేక ఇలాంటివి జరుగుతున్నాయని అనుకునే వాళ్ళం. ఇప్పుడు అందరూ చఫువుకుంటున్నారు. అయినా సంస్కారం, మానవత్వం పెరగడం లేదు.
సుప్రియ ను చూసి నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను, ఈ పిల్ల ఎంత ఎదిగింది అని. నిజంగా చెయ్యేత్తి దణ్ణం పెట్టాలి.
నిండైన మనస్వితతో అల్లిన హృద్యమైన కథనం. అందంగా అనువాదం చేసిన అమ్మాయికి హార్దికశుభాభినందనలు.
మీరు సంధించిన ప్రశ్నలకు సమాజం ఏ విధంగా పరిష్కారమార్గాలను అన్వేషిస్తుందో తెలియదు కాని, సుప్రియ గారూ! మీరింకా వ్రాస్తుండాలి.
చిట్టచివరను మీరు వ్రాసిన వాక్యాన్ని గురించే ఇంకా ఆలోచిస్తున్నాను. మీరు మనస్సులో నింపిన మంచితనంతో, మానవీయతతో, చదువుసాముల సంస్కారంతో ఆ చిన్నారి మానస్వి దేశాభ్యుదయ దోహదకారిణి కావాలి!
శక్తివంతమైన కథ. వాస్తవ సంఘటనాధారిత అల్లిక. లోతైన ప్రశ్నలు- మనందరికీ!
సుప్రియ గారు
మీ కథ బాగుంది. పితృస్వామ్య వ్యవస్థలో ఆడపిల్లల పట్ల వివక్షను బాగా చెప్పారు.ఆలోచనలను రేకెత్తించిన కథ.ప్రశ్నలనులేవనెత్తిన కథ.
అద్భుతమైన శైలి. ఇది కధ కాదు. నిజం.సుప్రియ గారికి ధన్యవాదములు.. ఆడపిల్ల అంటే గుండెల మీద కుంపటి అనుకునే పరిస్థితి. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ నుంచి ఆడపిల్ల జీవితం అలానే వుంది. సమాజం లో వచ్చిన మార్పులు ఆడపిల్ల విషయం లో రాలేదు. అందరూ ఆలోచించ దగ్గ రచన.
అద్భుతమైన శైలి. ఇది కధ కాదు. నిజం.సుప్రియ గారికి ధన్యవాదములు.. ఆడపిల్ల అంటే గుండెల మీద కుంపటి అనుకునే పరిస్థితి. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ నుంచి ఆడపిల్ల జీవితం అలానే వుంది. సమాజం లో వచ్చిన మార్పులు ఆడపిల్ల విషయం లో రాలేదు. అందరూ ఆలోచించ దగ్గ రచన.
ఇలాంటి సంఘటన కథ చేస్తే, అతి సాధారణంగా జరిగిన సంఘటన అనిపించటం మన సమాజస్థితి తాలూకు నైచ్యం. ఇంకా ఎన్నాళ్లో ఈ స్థితి .. అంతవరకు ఇలాంటి కథలు వస్తూనే ఉంటాయి. రావాలి. కథనం బాగుంది.
సుప్రియ గారు, ఏదైనా విషయం స్వానుభవం తో ఇంకా ఉన్నతంగా ఆలోచించవచ్చు అన్నదిmee కథ లో మీరు నిరూపించారు. మీరు వేసిన ప్రశ్నలు కొందరికి ఆ క్షణం గుచ్చుకొని నిజమే కదా అనిపించొచ్చు. కానీ మీరు ఆలోచించినట్లు ఆలోచిస్తే ఆడపిల్లలకు చెత్త బుట్టలు కాదు చెదరని చిత్తాలు అంటే సంఘం కోసం భయపడకుండా ఉండే ఉత్తమమైన తల్లిదండ్రుల్ని , కన్నవారికంటే ఎక్కువగా చూసుకునేవారిని పొందుతారు అనడం లో సంశయం లేదు. కథ మనసుని కదిలించివేసింది.